రాజధానిలో క్రికెట్ బుకీ అరెస్టు
posted on Mar 27, 2011 @ 5:08PM
హైదరాబాద్: వరల్డ్ కప్ క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఓ ప్రధాన బూకీని పోలీసులు అరెస్టు చేశారు. రాజధాని హైదరాబాదు కేంద్రంగా బెట్టింగులకు పాల్పడుతున్న విక్కీ అనే ముఖ్యమైన బూకీని పోలీసులు అరెస్టు చేశారు. విక్కీతో పాటు మరో నలుగురు ఫాంటర్లను, పదిమంది బెట్టింగుకు పాల్పడుతున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. విక్కీతో పాటు బెట్టింగుకు పాల్పడుతున్న సుదేశ్, సురేశ్, ప్రమోద్, వినోద్‌తో పాటు ఓ మాజీ నిర్మాత కుటుంబాన్ని అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. సదరు నిర్మాత కుటుంబం గత కొన్నాళ్లుగా బెట్టింగులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది.
అస్ట్రేలియాపై గెలిచి సెమీ ఫైనల్‌కు చేరిన భారత్ సెమీ ఫైనల్లో దాయాది జట్టు పాకిస్తాన్‌తో పోరుకు దిగుతున్నందున బెట్టింగుల జోరు అందుకుంది. భారత్-పాక్ జట్ల మధ్య పోరు కావడంతో బెట్టింగు చాలామంది పాల్పడే అవకాశముందని గుర్తించిన పోలీసులు ఓ కన్ను వేస్తున్నారు. దీనిలో భాగంగా విక్కీని అరెస్టు చేశారు. విక్కీ కింద నగరంలో సుమారు వందమంది ఫాంటర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా విక్కీకి నెట్ వర్క్ ఉందని పోలీసులు భావిస్తున్నారు. విక్కీ సుమారు రూ.5 కోట్లనుండి 10 కోట్ల రూపాయల మేరకు బెట్టింగులకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో విక్కీ ఓ రూంలో ఉండి లాప్‌టాప్ ద్వారా బెట్టింగులు నిర్వహించే వాడని తెలుస్తోంది. ఇప్పుడు ఫాంటర్లను నియమించుకొని నేరుగా బెట్టింగు చేసే వ్యక్తుల ఇళ్లకు పంపిస్తున్నారని సమాచారం.