శ్రీకృష్ణ ను దొంగతో పోల్చిన కేటీఆర్

హైదరాబాద్: రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనం జరిపిన జస్టీస్ శ్రీకృష్ణను తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కె తారక రామారావు ఒక దొంగతో పోల్చారు. ఈ దొంగ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మరో దొంగ ఇంటికి వెళ్లి నివేదికను తయారు చేశారని ఆయన ఆరోపించారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ శ్రీకృష్ణ కమిటీ తయారు చేసిన నివేదిక అష్టవక్రాలుగా ఉందన్నారు. అందులో పేర్కొన్న అంశాలు ఏ ఒక్కటి నిజం కాదన్నారు. ముఖ్యంగా, తెలంగాణ ప్రాంతంలో సేకరించిన అంశాలకు నివేదికలో పొందుపరిచిన అశాలకు భిన్నంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల మనోభావాలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఇలాంటి కమిటీల వల్ల ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అందుకే జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికపై జాతీయ స్థాయిలో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్టు కేటీఆర్ వెల్లడించారు.

మేం సిద్దం..మీరు సిద్దమా?

హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల నిర్ణయాలు బాగున్నాయని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. శనివారం ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ కోసం తమ పార్టీ తెలంగాణ ప్రాంత శానససభ్యులు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెబుతూ కాంగ్రెసు శాసనసభ్యులు సిద్ధంగా ఉన్నారా అని ఆయన అడిగారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వంటి నివేదికను తాను చూడలేదని ఆయన అన్నారు. తెలంగాణ రాజకీయ నాయకులు సంతలో సరుకులా అని ఆయన అడిగారు. శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణలోని ఆత్మబలిదానాలు కనిపించలేదా అని ఆయన అడిగారు. తెలంగాణ సాధన కోసం అందరూ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను చూసిన తర్వాత తాము ఎందుకు కమిటీ ముందు వాదనలు వినిపించామా అని సిగ్గుతో తల వంచుకుంటున్నానని ఆయన అన్నారు. గంటల తరబడి గ్రంథాలయంలో కూర్చుని చదివి నివేదిక తయారు చేసి శ్రీకృష్ణ కమిటీకి సమర్పించామని, అందులోని ఒక్క అంశాన్ని కూడా శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ప్రస్తావించలేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులను శ్రీకృష్ణ కమిటీ అవమానించిందని ఆయన విమర్శించారు. శ్రీకృష్ణ కమిటీపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రతిపాదిస్తామని ఆయన చెప్పారు. కాగా, శ్రీకృష్ణ కమిటీ నివేదికను తిరస్కరించాలని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ పిలుపునిచ్చారు. నివేదిక తన పరిధి దాటి అణచివేతకు సూచనలు చేసిందని, ఫాసిస్టు చర్యలను సూచించిందని ఆయన అన్నారు. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 8వ అధ్యాయం సిఫార్సులను అమలు చేస్తున్నట్లు అనిపిస్తోందని ఆయన అన్నారు.

బాబు తెలంగాణకు అనుకూలమే

హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు కట్టుబడి ఉన్నారని తె లుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. పార్టీ, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి చంద్రబాబుపై విమర్శలు చేయడం సరి కాదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలుగుదేశం పార్టీ వల్ల పోచారం శ్రీనివాస్ రెడ్డి అనేక పదవులు పొందారని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీని విమర్శించడం సరి కాదని ఆయన అన్నారు. అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు రాజీనామాలు చేసి తెలంగాణ జెఎసి కింద పోటీ చేయాలని తాను ప్రతిపాదిస్తూ వస్తున్నానని, దీనికి తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు అంగీకరించాయని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మాత్రమే అంగీకరించడం లేదని ఆయన అన్నారు. పార్టీల తరఫున పోటీ చేస్తే స్వార్థం పెరుగుతుందని, పార్టీరహితంగా పోటీ చేయడం వల్ల ఆ స్వార్థం ఉండదని ఆయన అన్నారు. అప్పుడే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు.

తెలంగాణావాదాన్ని అమ్మేసిన కేసీఆర్

హైదరాబాద్: ఇటీవల ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణావాదాన్ని తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు విక్రయించారని హైదరాబాద్ నగర తెదేపా అధ్యక్షుడు తీగల కృష్ణారెడ్డి ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణావాదాన్ని కేసీఆర్ ఢిల్లీలోనూ, ఆ పార్టీ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనూ అమ్మేశారన్నారు. కౌన్సిల్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడడం ద్వారా తెరాస బండారం బయటపడిందన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన వందలాది మంది విద్యార్థుల ఆత్మలు దీంతో క్షోభిస్తాయని ఆయన అన్నారు. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా ఆరోపించిన కేసీఆర్.. ఇపుడు ఆ పార్టీ చెంతనే ఎలా చేరుతారని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లేముందు మిలియన్ మార్చ్ గురించి భీషణ ప్రతిజ్ఞలు చేసిన కేసీఆర్ ఢిల్లీకి నుంచి తిరిగివచ్చాక ఆ కార్యక్రమాన్ని రద్దు చేయాలని ప్రయత్నించడం నిజంకాదా? అని ప్రశ్నించారు. అందుకుదారితీసిన కారణాలను, రహస్య ఒప్పందాలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

జగన్ వర్గం భుజాలు తడుముకుంటోంది

హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులపై తెలుగుదేశం పార్టీ శానససభ్యుడు పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. గుమ్మడి కాయల దొంగ అంటే వైయస్ జగన్ వర్గం భుజాలు తడుముకుంటోందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశం వ్యాఖ్యానించారు. భూ కేటాయింపుల్లో దొంగ ఎవరో జగన్ వర్గం శాసనసభ్యుల చర్య వల్ల తేలిపోయిందని ఆయన అన్నారు. పదవి పోతుందనే భయంతోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భూ కేటాయింపులపై సభా సంఘానికి అంగీకరించడం లేదని ఆయన అన్నారు. వైయస్ హయాంలో జరిగిన భూ కేటాయింపులపై సభా సంఘం వేయాలని డిమాండ్ చేస్తూ శాసనసభా సమావేశాలను అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ సభ్యులకు వ్యతిరేకంగా జగన్ వర్గం ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.

చిత్తూరుకు వంద సంవత్సరాలు

హైదరాబాద్: చిత్తూరు జిల్లా ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకలకు పెద్ద యెత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి రఘువీరా రెడ్డి శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఏప్రిల్ 1వ తేదీకి చిత్తూరు జిల్లా ఏర్పడి వందేళ్లు పూర్తవుతోందని, ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా వందేళ్ల ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు. చిత్తూరు జిల్లా ముఖ్యమంత్రులను, రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి వంటివారిని అందించిందని ఆయన చెప్పారు. ఈ వేడుకలు మూడు రోజుల పాటు జరుగుతాయని ఆయన చెప్పారు. ఈ నెల 30వ తేదీన గవర్నర్ నరసింహన్ ఉత్సవాలను ప్రారంభిస్తారని చెప్పారు. ఏప్రిల్ 1వ తేదీన ముగింపు ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొంటాన్నున్నట్లు ఆయన తెలియచేసారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాకు చెందినవారేనని, ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ జిల్లాకు చెందినవారేనని ఆయన చెప్పారు. ఉత్సవాలకు చంద్రబాబుతో పాటు తిరుపతి నుంచి శాసనసభకు ఎన్నికైన చిరంజీవిని కూడా ప్రభుత్వం ఆహ్వానిస్తుందని ఆయన చెప్పారు. మాజీ మంత్రులను, అధికారులను, కళాకారులను, తదితరులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు.

గ్రామాల్లో అసెంబ్లీ పెడదాం

హైదరాబాద్: మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వినూత్నమైన ఆలోచనను ముందుకు తెచ్చారు. శాసనసభా సమావేశాలను ఆరు నెలల పాటు గ్రామాల్లో నిర్వహించాలని ఆయన ప్రతిపాదించారు. తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లోని మారు మూల గ్రామాల్లో ఆరు నెలలపాటు, హైదరాబాదులో ఆరు నెలల పాటు శాసనసభా సమావేశాలు నిర్వంచాలని ఆయన అన్నారు. దానివల్ల గ్రామాల సమస్యలు అర్థమవుతాయని అన్నారు. కొండవీడులో శాసనసభా సమావేశాలు నిర్వహించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడికి లేఖలు రాస్తున్నట్లు తెలిపారు.

'సత్యం' బ్యాంకు లావాదేవీలకు బ్రేక్

హైదరాబాద్: ప్రముఖ ఐటి సంస్థ "మహీంద్రా సత్యం" కంపెనీకు చెందిన వివిధ బ్యాంకు ఖాతాలలో లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేయాలని రాష్ట్ర హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సదరు బ్యాంకు ఖాతాలలో మహీంద్రా సత్యం కంపెనీ అధికారులు గానీ మరియు ఆదాయపుపన్ను శాఖ అధికారులు గానీ మార్చి 31వ తేదీ వరకూ ఎలాంటి లావాదేవీలు నిర్వహించకూడదని హైకోర్టు ఆదేశించింది. గడచిన 2004 నుంచి 2009 వరకు వచ్చిన ఆదాయంపై రూ. 616 కోట్ల పన్ను బకాయిలను చెల్లించాలంటూ ఆదాయపు పన్ను శాఖ మహీంద్రా సత్యంకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై మహీంద్రా సత్యం కంపెనీ వ్యక్తం చేసిన అభ్యంతరాలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తోసిపుచ్చింది. దీంతో కంపెనీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్ వి.వి.ఎస్ రావు, జస్టిస్ రమేశ్ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఆదాయపు పన్ను శాఖకు చెల్లించాల్సిన మొత్తం రూ. 616 కోట్లని, కానీ.. ఇలా బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడం వలన రూ. 1,300 కోట్లు బ్యాంకులోనే ఉండిపోతాయని, ఫలితంగా కంపెనీ కార్యకలాపాలకు ఆటంకం వాటిళ్లే అవకాశం ఉందని కంపెనీ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. అవసరమైతే.. ఐటి శాఖకు చెల్లించాల్సిన రూ. 616 కోట్ల సొమ్మును బ్యాంకు ఖాతాలోనే ఉంచి, మిగిలిన మొత్తాలను వాడుకునేందుకు అనుమతినివ్వాలని ఆయన కోరారు. ఇరువర్గాల వాదనలను విన్న ధర్మాసనం ఈ నెలాఖరు వరకు కంపెనీ బ్యాంకు ఖాతాల్లో ఎలాంటి లావాదేవీలు నిర్వహించరాదని ఆదేశించింది. కాగా.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రభావం రోజువారీ కార్యకలాపాలపై ఏమీ ఉండదని, ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని మహీంద్రా సత్యం తమ ఉద్యోగులతో తెలిపింది.

రఘువీరాపై నిప్పులుచేరిగిన జేసీ

హైదరాబాద్: రాష్ట్ర మంత్రి రఘువీరా రెడ్డిపై మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. భారతీయ జనతా పార్టీ కోవర్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకుని ఉన్నారని ధ్వజమెత్తారు. నేను విషపు పురుగునైతే ఇలాంటి వారంతా ఎమ్మెల్యేలు అయ్యేవారు కాదని దివాకర్ రెడ్డి అన్నారు. ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఓ పెద్దమనిషి తనను విషపుపురుగా అభివర్ణించడమే కాకుండా, మంత్రిపదవి రాకుండా అడ్డుకున్నారన్నారు. నేనే లేకపోతే రఘువీరా రెడ్డి కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసే వారేకాదన్నారు. అలాగే మంత్రి శైలజానాథ్ గెలుపు వెనుకా తన కృషి ఉందన్నారు. వైఎస్ఆర్ దగ్గర తన గురించి చాలా దుష్ప్రచారం చేసి మంత్రిపదవి రాకుండా అడ్డుకున్నారన్నారు. అంతేకాకుండా, వైఎస్ఆర్‌ మరణానంతరం ఆయన తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని తొలిసారి ప్రతిపాదన చేసిన ఘనుడు రఘువీరా రెడ్డి అని అన్నారు. జగన్‌ బుర్రకు ఈ ఆలోచనా వచ్చిందో లేదో తెలియదు గానీ రఘువీరా రెడ్డి మాత్రం తొలి ప్రతిపాదన చేశారన్నారు. అలాగే, రోశయ్య మంత్రివర్గంలో చేరబోనని ప్రకటించి.. చివర నిమిషంలో ఉరుకులు పరుగుల మీద వెళ్లి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి తనపై విమర్శలు చేయడమా అని జేసీ ప్రశ్నించారు. అంతేకాకుండా తాను కాంగ్రెస్ పార్టీలో పుట్టిపెరిగానన్నారు. నెహ్రూ గాంధీ కుటుంబాలకు విధేయుడిగానే ఉంటానన్నారు. తాను చచ్చిపోయేంత వరకు కాంగ్రెస్ వాదిగానే ఉంటానని జేసీ స్పష్టం చేశారు. పార్టీ నుంచి తనను ఎవరూ బయటకు పంపలేరన్నారు. తనకు పదవులు ఇచ్చినా ఇవ్వక పోయినా గుర్తింపు ఉన్నా లేకపోయినా కాంగ్రెస్‌లోనే ఉండిపోతానని మరో పార్టీలో చేరే ప్రసక్తే లేదన్నారు.

నకిలీ పైలట్ లైసెన్స్‌ల స్కామ్

న్యూఢిల్లీ: పైలట్ల నకిలీ లైసెన్స్‌ల కుంభకోణంలో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో పౌర విమాన యానాల డైరెక్టరేట్ జనరల్ (డిజిసిఎ) సినియర్ అధికారి ఉన్నాడు. అరెస్టయిన సీనియర్ అధికారి ప్రదీప్ కుమార్ డిజిసిఎలో అదనపు డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. అతను పరీక్షల మార్కు షీట్ల ఫోర్జరీకి, ఇతర పత్రాల తారుమారుకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. నకిలీ మార్కు షీట్లను కమర్షియల్ పైలట్ లైసెన్స్‌ల పరీక్షలకు ఉపయోగించినట్లు అధికారిక రహస్య సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అందుకు ప్రతిగా ప్రవీణ్ కుమార్ పెద్ద యెత్తున ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అరెస్టయిన మిగతా ముగ్గురు టూర్ ఆపరేటర్స్. వీరు ప్రవీణ్ కుమార్‌కు సహకరిస్తూ వచ్చారు. అరెస్టయిన ముగ్గురు టూర్ ఆపరేటర్స్‌లో ఇద్దరు లలిత్ పంకజ్, ప్రదీప్. మరో 9 మంది అనుమానితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను, అచ్చుయంత్రాలను, స్కానర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

భూ కేటాయింపులపై జగన్ ప్రతివ్యూహం

హైదరాబాద్: తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన భూ కేటాయింపులపై సభా సంఘాన్ని వేసే విషయంలో, భూకేటాయింపులపై శాసనసభలో చర్చకు అనుతిచ్చే సందర్భంలోనూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్ ప్రతివ్యూహాన్ని రచించింది. భూ కేటాయింపులపై ఉప సభాపతి శాసనసభా పక్ష నేతలతో సమావేశమై భూకేటాయింపులపై వేసే సభా సంఘం పరిధిలో చేర్చే అంశాలపై చర్చించారు.   ఈ నేపథ్యంలో వైయస్ జగన్ తన వర్గానికి చెందిన శాసనసభ్యులతో సమావేశమై తాము అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. భూ కేటాయింపులపై శాసనసభలో చర్చ వచ్చే సందర్భంలో దాన్ని అడ్డుకునేందుకు వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు సమాయత్తమవుతున్నారు. వైయస్ హయాంలో అక్రమాలు జరిగాయనే విషయం ప్రస్తావనకు వస్తే గందరగోళం సృష్టించడానికి సిద్ధపడుతున్నారు. ప్లకార్డులు ప్రదర్శించాలని, సభా కార్యక్రమాలను అడ్డుకోవాలని వారు యోచిస్తున్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్, రహేజా వంటి పలు అంశాలు చర్చకు వస్తే, ప్రధానంగా వైయస్‌పై ఆరోపణలు వస్తాయని వైయస్ జగన్ భావిస్తున్నారు. దీంతో దాన్ని అడ్డుకోవడం అవసరమని భావించి తన వర్గం ఎమ్మెల్యేలను సమాయత్తం చేశారు.   భూకేటాయంపులపై చర్చ జరిగిన తర్వాత అవసరమనిపిస్తే సభా సంఘం వేస్తామని ప్రభుత్వం ప్రతిపక్షాలకు చెబుతోంది. వైయస్ హయాంలో జరిగిన భూకేటాయింపులపై సభా సంఘం వేయాలని తెలుగుదేశం పార్టీ సభ్యులు కొద్ది రోజులుగా సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు.

రఘువీరాపై జెసి కంప్లైంట్

న్యూఢిల్లీ: మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి శుక్రవారం అధిష్టానానికి మంత్రి రఘువీరారెడ్డిపై ఫిర్యాదు చేశారు. జెసి మధ్యాహ్నం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి అహ్మద్ పటేల్‌తో సమావేశమయ్యారు. ఆయనకు రఘువీరారెడ్డిపై ఫిర్యాదు చేశారు. అనంతరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో అనంతపురం జిల్లాలో కాంగ్రెసు అభ్యర్థి ఓటమిపై వివరణ ఇచ్చారు. ఇటీవల జరిగిన స్థానిక శాసనమండలి ఎన్నికలలో అనంతపురం జిల్లాలో జెసి దివాకర్ రెడ్డి వర్గం ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చర్యలు తీసుకోకుంటే కాంగ్రెసుకే నష్టం అని చెప్పారు. ఈ నేపథ్యంలో జెసి దివాకర్ రెడ్డి అనంతపురంలో కాంగ్రెసు ఓటమికి కారణాలు, తనపై ముఖ్యమంత్రి కిరణ్ చేసిన ఫిర్యాదుకు వివరణ ఇచ్చారు.

‘శ్రీకృష్ణ’ కాంగ్రెస్ బ్రోకర్ : నాగం

హైదరాబాద్: ఎనిమిదో చాప్టర్‌లో తెలంగాణ ప్రజలను కించపరిచేట్లు వ్యవహరించారంటూ జస్టిస్ శ్రీకృష్ణపై టీడీపీ తెలంగాణ ఫోరం నేత నాగం జనార్దన్‌రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. రాజకీయ నాయకుల్ని ‘మేనేజ్’ చేసుకుంటే సరిపోతుందని ఆయన పేర్కొన్న అంశాన్ని ఉటంకిస్తూ కాంగ్రెస్‌కు బ్రోకర్‌లా శ్రీకృష్ణ పనిచేస్తున్నాడని దుయ్యబట్టారు. అమ్ముడుపోయేందుకు తాము అంగడి సరుకు కాదని, ఆ సలహా ఇచ్చేందుకు వాడెవడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదో చాప్టర్‌పై చర్చించేందుకు తెలంగాణ ప్రాంత తెలుగుదేశం నేతల భేటీ టీడీఎల్పీలో జరిగింది. ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌రెడ్డి, ఎల్.రమణ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. అనంతరం వారితో కలిసి అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద నాగం మీడియాతో మాట్లాడారు. అవాస్తవాలమయం, తెలంగాణ వ్యతిరేకంగా ఉన్న ఎనిమిదో చాప్టర్‌ను బహిర్గతం చేయాలన్న హైకోర్టు తీర్పును సీమాంధ్రులు జీర్ణించుకోలేక పోతున్నారని పేర్కొన్నారు. ‘మమ్మల్ని కొనుగోలు చేయాలని చెప్పేందుకు శ్రీకృష్ణ ఎవడు? కాంగ్రెస్‌కు చేస్తున్న బ్రోకర్ పనుల్లో భాగమే ఇలాంటి సలహాలు. ప్రజల చేతుల్లో ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని నాయకులే అనుసరించాలి తప్ప ఎవరినో కొనుగోలు చేస్తే అది సమసిపోదు’’ అని అన్నారు. ప్రకటనలు ఆపేసి పత్రికలను లొంగ తీసుకోవాలన్న శ్రీకృష్ణ సూచన పత్రికా స్వేచ ్ఛను హరించడమేనని తెలిపారు. ఎనిమిదో చాప్టర్‌ను బహిర్గతం చేసిన హైకోర్టు జడ్జి పనిని స్వాగతిస్తున్నామన్నారు.

సెంటిమెంట్‌పై విడదీస్తే దేశం ముక్కలే: కావూరి

హైదరాబాద్: చిన్న రాష్ట్రాలకు తాము వ్యతిరేకం కాదని, అయితే దానికంటూ ఒక శాస్త్రీయమైన విధానం ఉండాలన్నదే తమ అభిప్రాయమని ఏలూరు ఎంపి కావూరి సాంబశివరావు అన్నారు. సెంటిమెంట్‌పై రాష్ట్రాలను విభజించుకుంటేపోతే దేశం ముక్కలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసేందుకు శుక్రవారం శాసనసభకు వచ్చిన కావూరి ఆయనతో అరగంటపాటు భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక సీమాంధ్ర నుంచి కనీసం ఇంటికి ఒక్కరైనా హైదరాబాద్‌లో స్థిరపడ్డారని, అలాగే హైదరాబాద్ తమదన్న నమ్మకంతో సీమాంధ్ర నుంచి ఎంతోమంది వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టారని పేర్కొన్నారు. తెలుగువారంతా ఒక్కటేనని అనుకున్నాం తప్పితే, తాము ఎప్పుడూ ప్రాంతాలవారిగా పక్షపాతం చూపలేదని పేర్కొన్నారు. ప్రధానిగా పివి నరసింహారావు, రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి అయితే తమ తెలుగువారనని గర్వపడ్డాం తప్పితే, తమకు ఎలాంటి భేదభావం లేదని అన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన రహస్య నివేదికపై స్పందిస్తూ, దానిపై హర్షంకానీ, వ్యతిరేకతకానీ లేదని అన్నారు. తెలంగాణవాదులు శ్రీకృష్ణ కమిటీని తప్పుపట్టడాన్ని ప్రస్తావిస్తూ, వారు ఎవరినీ వ్యతిరేకించలేదు, సోనియాగాంధీని తప్పుబట్టారు, ప్రధాని మన్మోహన్‌సింగ్‌నూ తప్పుబట్టారని వ్యాఖ్యానించారు.

అక్కడి నుండే స్టాట్ అయ్యింది

గుంటూరు: తమ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కార్యాలయంలోనే వ్యూహరచన జరిగిందని అంబటి రాంబాబు ఆరోపించారు. స్థానిక సంస్థల కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జగన్‌కు వ్యతిరేకంగా కుమ్మక్కయ్యారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఈ వ్యూహరచనకు ముఖ్యమంత్రి కార్యాలయంలోని రమేష్ మధ్యవర్తిత్వం నెరిపాడని ఆయన అన్నారు. వైయస్ జగన్‌కు మైదుకూరు శాసనసభా నియోజకవర్గంలో మెజారిటీ వస్తే మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి రాజీనామా చేస్తారా అని ఆయన అడిగారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, కన్నా లక్ష్మినారాయణలను ఆయన విషపు పురుగులుగా అభివర్ణించారు.