సమస్యను పక్కదారి పట్టించడానికే...
posted on Mar 28, 2011 @ 11:36AM
హైదరాబాద్: భూములకు సంబంధించిన సమస్యను పక్కదారి పట్టించడానికే మంత్రి రఘువీరారెడ్డి, జగన్ వర్గం ఎమ్మెల్యేలు దాడి చేశారని సిపిఎం శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. హౌస్ కమిటీగానీ, జెఎల్పీ వేయకుండా కొందరు ఇలాంటి నాటకాలు ఆడుతున్నారన్నారు. మంత్రి హోదాలో ఉండి తోటి సభ్యులపై చేయి చేసుకోవడం విచారకరమన్నారు. సదరు మంత్రిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాల కారణంగా భూకేటాయింపులపై చర్చకు రాకుండా చేస్తున్నారన్నారు. జెఎల్పీ వేయకపోవడం అక్రమాలనుండి తప్పించుకోవడానికే అన్నారు. ఇలాంటి వారిని ప్రజలు క్షమించరన్నారు. అసెంబ్లీ పట్ల ప్రజాప్రతినిధులకు గౌరవం తగ్గిపోయినట్లుగా కనిపిస్తోందని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అసెంబ్లీలో దాడి చేసే శాసనసభ్యులపై క్రిమినల్ కేసు పెట్టాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అరాచకానికి పాల్పడ్డవారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన పక్షంలో సభ్యులను సభనుండి సస్పెండ్ చేయాలన్నారు.