వేడెక్కిన ఏపీ రాజకీయం...ఢిల్లీ లో గవర్నర్ బిజీ
posted on Dec 14, 2012 @ 11:32AM
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తన మూడు రోజుల ఢిల్లీ టూర్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 28 న ఢిల్లీ లో తెలంగాణా విషయం ఫై అఖిల పక్షం జరగనుండడం,వచ్చే నెలలో రాష్ట్రంలో నేతల మార్పు జరగనున్నాయని ప్రచారం జరుగుతున్న తరుణంలో జరిగిన గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకొంది.
నిన్న సాయంత్రం ఢిల్లీ లో గవర్నర్ సోనియా గాంధీ తో అరగంట పాటు సమావేశమయ్యారు. ముఖ్య మంత్రి పనితీరు, రాష్ట్రంలోని పరిస్థితులు, ధర్మాన ప్రసాద రావు ప్రాసిక్యూషన్ వంటి కీలక అంశాలను ఆయన సోనియా కు వివరించినట్లు తెలుస్తోంది. మొత్తం ఎనిమిది అంశాల ఫై గవర్నర్ కాంగ్రెస్ అధినేత్రికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. కొన్ని విషయాల్లో ముఖ్య మంత్రి వైఖరి గురించి ఆయన సోనియా కు వివరించినట్లు సమాచారం. జైలులో ఉంటూనే, జగన్ తన పార్టీని బలోపితం చేసుకుంటున్న తీరును ఆయన సోనియా కు వివరించినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబి అజాద్, మంత్రి వయలార్ రవి ని కూడా ఆయన కలిసినట్లు తెలిసింది. ఈ రోజు ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్, మంత్రులు అంటోనీ, చిదంబరం, సుశీల్ కుమార్ షిండే లను కలిసే అవకాశం ఉంది.
శనివారం ఉదయం గవర్నర్ తిరిగి హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది.