జగన్ పార్టీలో కొత్తరకపు పోరు!
posted on Dec 19, 2012 @ 2:17PM
రోజు రోజుకూ అందరూ బలోపేతం అవుతోందని భావిస్తున్న జగన్ పార్టీలో అంతా బాగాలేదని ఇటీవల జరుగుతున్న ఓ కొత్తరకపు పరిణామం రుజువు చేస్తోంది. అధిక వలసలే దీనికి కారణం.
పార్టీ పెట్టినప్పటినుండి ఆయా నియోజకవర్గాల్లో ఆధిపత్యం చేలాయిస్తోన్న నాయకులకు, ఈ మధ్యే ఆ పార్టీలోకి వెళ్ళిన నాయకులకు మధ్య తీవ్రస్థాయిలో అంతర్గత విబేధాలు ప్రారంభమై, అవి పార్టీ అధినాయకత్వానికి తలనొప్పి తెచ్చిపెడుతున్నాయని సమాచారం. ఈ విషయంలో నెలకొన్న అసంతృప్తులు క్రమక్రంగా తీవ్రతరమవుతున్నాయి.
జగన్ పార్టీలో వలసలను అధికంగా ప్రోత్సహిస్తుండటం ఇలాంటి పరిణామాలకు కారణం. వచ్చే ఎన్నికల్లో తమకే టిక్కెట్ వస్తుందని భావించిన నాయకులు, కొత్తగా వచ్చిన వారినుండి రాష్ట్రంలోని కొన్ని నియోజక వర్గాల్లో గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు.
చిత్తూరు జిల్లాలోని తంబళ్ళపల్లె, పలమనేరు, కడపజిల్లా కమలాపురం, కర్నూలు జిల్లా డోన్, గుంటూరు వెస్ట్, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి లాంటి నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొని పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయి.