తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు అవమానం
posted on Dec 16, 2012 @ 12:07PM
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో ఘోర పరాభవం జరిగింది. పాసులు లేవంటూ పోలీసులు ఎంపీలను సదస్సుకు అనుమతించలేదు. దీంతో ఎంపీలు పోలీసుల తీరుమీద మండిపడ్డారు. పాసుల్లేక పోవడంతో కార్యకర్తలు కూర్చున్న చోటే ఎంపీలు కూడా కూర్చున్నారు. పోలీసుల తీరుపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గొడవ పెద్దది కాకుండా మంత్రి జానారెడ్డి వచ్చి పోలీసులకు, ఎంపీలకు నచ్చజెప్పి ఎంపీలను వేదిక మీదకు తీసుకెళ్లారు.
తెలంగాణ ప్రాంత ఎంపీలు జై తెలంగాణ నినాదాలతో సమావేశాన్ని హోరెత్తించారు. తమ చొక్కాలకు తెలంగాణ బ్యాడ్జీలు ధరించి వారు సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ, సమైక్యాంధ్ర వివాదాలు సదస్సులో తేవొద్దని పీసీసీ చెప్పినా ఎంపీలు మాత్రం వాటిని పక్కకు పెట్టారు. ఈ నేపథ్యంలో ఎవరు ఎలా స్పందిస్తారో అన్న ఉత్కంఠ సదస్సులో నెలకొంది. నేతలంతా సదస్సుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సదస్సుకు హాజరయ్యారు. 11 అంశాల మీద ఈ సదస్సు ఈ సాయంత్రం నాలుగు గంటల వరకు జరగనుంది.