‘తెలంగాణా’ తప్పదంటున్న నేతలు
posted on Dec 15, 2012 @ 12:06PM
రేపు హైదరాబాద్ లో జరగనున్న కాంగ్రెస్ సదస్సులో తెలంగాణా అంశాన్ని ప్రస్తావించక తప్పదని తెలంగాణా కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ నెల 28 న ఢిల్లీ లో తెలంగాణా అంశంపై అఖిల పక్ష సమావేశం జరగనుంది కాబట్టి సదస్సు లో ఈ అంశం ప్రస్తావించవలసిన అవసరం లేదని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తన పార్టీ నేతలకు నచ్చ చెప్పడానికి అష్ట కష్టాలు పడుతున్నారు.
అయితే, పార్టీకి సంభందించిన ఇంత కీలక సమావేశంలో ఈ అంశం ప్రస్తావించకుండా ఎలా ఉంటామని ఎంపి మధు యాష్కి గౌడ్ అంటున్నారు. ఒక వేళ ఈ అంశాన్ని లేవనేత్తకపోతే, ఈ అంశాన్ని చిన్న చూపు చూసినట్లవుతుందని అయన అన్నారు. ఈ అంశాన్ని ప్రస్తావించ వద్దని అంటున్న బొత్స ఫై తెలంగాణా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క రోజు సమావేశం సరిగా జరుగుతుందా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. సదస్సులో అనుకోని పరిణామాలు జరిగే అవకాశం ఉందని భావించిన నేతలు మీడియా ను కూడా దూరంగా ఉంచాలని నిర్ణయించారు.
కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ అజాద్ ముఖ్య అతిదిగా జరిగే ఈ సమావేశంలో ఎన్ని వివాదాలు జరుగుతాయోనని కొంత మంది పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కష్టాల్లో ఉందని, అందువల్ల తెలంగాణా అంశాన్ని సదస్సులో లేవేనేత్తవద్దని పాలడుగు వంటి నేతలు సూచిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పధకాలు, పార్టీకి సంభందించిన 15 అంశాల ఫై ఈ సదస్సు లో చర్చించనున్నారు.