కాంగ్రెస్ సమావేశంలో పొన్నం విసుర్లు
posted on Dec 16, 2012 @ 2:29PM
ఈ రోజు అనగా ఆదివారం హైదరాబాద్ యల్.బీ.నగర్ వద్ద జరుగుతున్న కాంగ్రేసు సమావేశాలలో తెలంగాణా కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు పొన్నంప్రభాకర్ తనదయిన శైలిలో మాట్లాడి సభలో కలకలం రేపారు. ఆయన ముందుగా, తెలంగాణాకోసం అమరులయిన యువకుల ఆత్మశాంతికి సభ రెండు నిమిషాలు మౌనం పాటించాలని కోరడంతో వేదిక మీద ఉన్న పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అందుకు అభ్యతరం చేప్పేసరికి సభలో ఒక్కసారిగా కలకలం మొదలయింది. తీవ్ర ఉద్రిక్తులయిన తెలంగాణా సభ్యులందరూ ఒక్కసారిగా నిల్చొని ‘జై తెలంగాణా’ అంటూ నినాదాలు చేసారు. అందుకు పోటీగా సీమాంద్ర ప్రాంతాలనుండి వచ్చినవారు కూడా ‘జై సమైక్యాంద్రా’ అంటూ నినాదాలు చేయడం మొదలు పెట్టేసరికి సభలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్ చార్జ్ గులాంనబీ ఆజాద్ కలుగ జేసుకొని సభని రెండు నిమిషాలు మౌనం పాటించమని ఆదేశించడంతో పరిస్తితి అదుపులోకి వచ్చింది.
తరువాత మళ్ళీ మాట్లాడిన పొన్నం ప్రభాకర్, వేదిక మీద ఆసీనులయిన పెద్దలందరికీ మరింత షాకులు తినిపిస్తూ “ప్రస్తుతం రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపటికీ, తెలంగాణాలో పార్టీ కార్యకర్తలెవరూ కూడా సంతృప్తిగా లేరని అన్నారు. సభలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని ఉద్దేశిస్తూ ‘మాజీ మంత్రి మోపిదేవి వెంకట రామనకో న్యాయం, మంత్రి ధర్మాన ప్రసాద రావుకొక న్యాయం ఎందుకు పాటిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణా సమస్యని వెంటనే పరిష్కరించాలని సభ ముఖంగా పార్టీకి ఆయన విజ్ఞప్తి చేసారు.