కాంగ్రెస్ కుట్రల పార్టీ : చంద్రబాబు
posted on Dec 17, 2012 @ 4:14PM
కాంగ్రెస్ కుట్రల పార్టీయని, తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి చూస్తోందని చంద్రబాబునాయుడు ఆరోపించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గానీ, మంత్రులు గానీ గ్రామాల్లోని కనీస సమస్యలు కూడా పరిష్కరించడంలేదని అన్నారు. రైతు సమస్యలు పరిష్కరిస్తామంటే వెటకారం చేస్తున్నారని, తమని విమర్శించే హక్కు ముఖ్యమంత్రికి లేదని చంద్రబాబు పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'వస్తున్నా..మీకోసం' పాదయాత్ర 73వ రోజైన సోమవారం కరీంనగర్ జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలో మూడో రోజు యాత్ర జగిత్యాల నియోజక వర్గం, రాయికల్ మండలం, ఇటిక్యాల నుంచి చంద్రబాబు ఈ ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం అందరినీ విమర్శించడం తప్ప ప్రజలకు చేసేది ఏమీ లేదని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రజలు సమస్యలతో అల్లాడుతుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
దేశమంతా తిరిగినా టీడీపీ అధికారంలోకి రాదని అంటున్నారని, ఇది ఒక పనికిమాలిన ప్రభుత్వమని, దద్దమ్మ ప్రబుత్వమని చంద్రబాబు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి రెండేళ్ళయినా సమస్యలు పరిష్కరించలేదని అన్నారు.