తాడేపల్లి.. బెంగళూరు ప్యాలెస్ ల మధ్య జగన్ షటిల్ సర్వీస్.. ప్రయోజనమేంటి?
వైసీపీ ఘోర ఓటమి తరువాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ఒక్క రోజు స్థిమితంగా గడపలేకపోతున్నారు. ఓటమి తరువాత ఆయన తాడేపల్లి టూ బెంగళూర్ డైలీ సర్వీస్ చేస్తున్నట్లుగా ఆయన పర్యటనలు ఉన్నాయి.తెలుగుదేశం వాళ్లు వైసీపీ కార్యకర్తల మీద దాడులకు పాల్పడు తున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో లేదు. కూటమి సర్కార్ ను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలంటూ గగ్గోలు పెట్టడం. అలా పెడుతూ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు ప్యాలెస్ కు, బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు షటిల్ సర్వీస్ చేయడం వినా జగన్ మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తరువాత ఈ రెండు నెలలలో చేసిందేమీ లేదు. మధ్యలో ఒక సారి హస్తిన వెళ్లి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్ఖితిపై ధర్నా చేసి నవ్వుల పాలయ్యారు. ఆయన తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్లడానికి కారణమేమిటన్నది చెప్పకపోయినా, బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ వచ్చేందుకు మాత్రం కారణం చెబుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా చిన్న పాటి హింసాఘటన జరిగితే.. ఆ ఘటన వెనుక ఉన్న కారణంతో సంబంధం లేకుండా దానికి రాజకీయం ఆపాదించి, వైసీపీ శ్రేణులపై తెలుగుదేశం దాడులు అంటూ హడావుడి చేయడానికే ఆయన బెంగళూరు ప్యాలెస్ వీడి యబటకు వస్తున్నారు. ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఈ రెండు నెలలో జగన్ నాలుగుసార్లు బెంగళూర్ తాడేపల్లి ప్యాలస్ ల మధ్య షటిల్ సర్వీస్ చేశారు. రాష్ట్రంలో ఎదో జరిగిపోతుంది, తనకు తన పార్టీ నేతలకు కూటమి ప్రభుత్వంలో రక్షణ లేదు అంటూ కోర్టు మెట్లు ఎక్కడం ద్వారా రాష్ట్ర ఇమేజ్ ను దెబ్బతీయడమే లక్ష్యం అని చాటుకుంటున్నారు.
బాబాయ్ గొడ్డలి పోటును గుండె పాటుగా చిత్రీకరించి గత ఎన్నికలలో సానుభూతిని సంపాదించుకుని గద్దెనెక్కిన జగన్.. ఇప్పుడు కూడా అదే సానుభూతి కోసం వెంపర్లాడుతున్నారు. అయితే జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో సాగిన దౌర్జన్య, హింసాకాండలను ప్రత్యక్షంగా చూసిన, అనుభవించిన జనం ఆయన ఓదార్పు, పరామర్శ యాత్రలను లైట్ తీసుకుంటున్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకూ 36 మంది వైసీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారంటూ గుండెలు బాదుకుంటున్న జగన్, ఆ హతుల వివరాలు బయటపెట్టడానికి మాత్రం ముందుకు రావడం లేదు. వ్యక్తిగత కక్ష్యలను రాజకీయ హత్యలుగా, కుటుంబ గొడవలను పార్టీ గొడవలుగా చిత్రీకరించి రాజకీయ లబ్ధి కోసం వెంపర్లాడుతున్నారు.
జగన్ ఈ వైఖరి వైసీపీ నేతలలో అసంతృప్తికి కారణం అవుతోంది. కేతిరెడ్డి వంటి వారు బాహాటంగానే కూటమి ప్రభుత్వానికి నిలదొక్కుకోవడానిక సమయం ఇవ్వాలి, ఆ తరువాతే విమర్శలు అంటూ జగన్ కు బాహాటంగానే సూచిస్తున్నారు. పార్టీ సీనియర్లంతా సైలెంట్ మూడ్ లోకి వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో జగన్ బెంగళూరు, తాడేపల్లి మధ్య షటిల్ సర్వీసులను, శాంతి భద్రతల పరిస్థితిపై చేపడుతున్న ఆందోళన, పరామర్శ, సంతాప యాత్రలను ఆ పార్టీలోనే ఎవరూ పట్టించుకోవడం లేదు. నెటిజనులు జగన్ హడావుడిపై ఓ లెవల్ లో సెటైర్లు గుప్పిస్తున్నారు. అయితే తాను చెప్పడమే తప్ప వినే అలవాటు లేని జగన్ వాస్తవాలను గుర్తించకుండా చేస్తున్న హడావుడి వల్ల ఆయనకు కానీ, ఆయన పార్టీకి కానీ ఇసుమంతైనా ప్రయోజనం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.