మన రెజ్లర్లపై కుట్ర జరిగింది.. విజేందర్ సింగ్
posted on Aug 7, 2024 @ 4:01PM
ఒలింపిక్స్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫైనల్స్ ముంగిట వినేష్ ఫోగట్ నిర్ణీత బరువు కంటే అధికంగా ఉందంటూ అనర్హత వేటు వేయడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వినేశ్ ఫోగట్ అనర్హత వెనుక కచ్చితంగా కుట్ర ఉందని ఒలింపిక్ మెడల్ గ్రహీత విజేందర్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు.
ఇండియన్ రెజ్లర్లపై కుట్ర జరుగుతోందన్న విజేందర్ సింగ్.. బీజేపీ ఎంపీ బ్రజేష్ కు వ్యతిరేకంగా రెజ్లర్ల ఆందోళనకు ఈ కుట్రకూ సంబంధం ఉందన్న సందేహం వ్యక్తం చేశారు. ఒక్క రాత్రిలోనే ఐదారు కిలోలు తగ్గుతుంటాం.. అలాంటిది 100 గ్రాములు పెద్ద సమస్య ఎందుకైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం మీద కుట్రపూరితంగానే వినేశ్ ఫోగట్ ను ఒలింపిక్స్ మెడల్ కు దూరం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక పార్లమెంటులో కూడా విపక్షాలు వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటుపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ అంశంపై పార్లమెంటులో చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో వినేష్ ఫోగట్ అనర్హతపై క్రీడా శాఖ మంత్రి ఒక ప్రకటన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. అంతకు ముందు కాంగ్రెస్ వినేశ్ ఫోగట్ పై ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో అప్పుడు ఢిల్లీ వీధుల్లో పోరాడింది.. ఇప్పుడు రెజ్లింగ్ మ్యాట్స్ పై పోరాడుతోందంటూ ప్రశంసలు గుప్పించింది. మొత్తం మీద వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటుపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం, అసంతృప్తి, నిరసన వ్యక్తం అవుతోంది.