బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్!
posted on Aug 7, 2024 @ 6:09PM
వెనుకబడిన కులాల వారికి చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేయనున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ తీర్మానం పార్లమెంట్‌లో చట్టంలా మారే వరకు పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ‘‘నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు న్యాయం చేస్తాం. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు, అసెంబ్లీ స్పీకర్ పదవులను బీసీలకే ఇచ్చాం. మంత్రివర్గంలోనూ బీసీలకే అగ్రస్థానం కల్పించాం. తెలుగుదేశం పార్టీకి బీసీలు మొదటి నుంచీ అండగా వున్నారు. స్థానిక సంస్థల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు తేవడానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి వుంది’’ అన్నారు.
చేనేత కార్మికుల గురించి మాట్లాడుతూ, ‘‘చేనేత రంగంలో సమగ్ర విధానం తీసుకురానున్నాం. చేనేతకారుల్లో నైపుణ్యం పెంచి, ఆధునిక శిక్షణ ఇప్పిస్తాం. ఆరోగ్య బీమా కల్పిస్తాం. చేనేత కార్మికులకు జీఎస్టీ తొలగించడానికి ప్రయత్నిస్తాం. ఒకవేళ కేంద్రం జీఎస్టీ తొలగించడం సాధ్యం కాకపోతే, రీఎంబర్స్.మెంట్ చేస్తాం. చేనేత కార్మికులకు 67 కోట్లు ఇస్తాం. నేత పని సామూహికంగా చేసే విధానాన్ని ప్రారంభిస్తాం. చేనేత మగ్గాల కోసం 50 వేల రూపాయలు సాయం చేస్తాం. ప్రజలంతా చేనేత బట్టలు ధరించాలి. చేనేత పరిశ్రమను కాపాడ్డం మన బాధ్యత. నెలకు ఒక్క రోజైనా చేనేత బట్టలు ధరించాలి. చేనేత వస్త్రాలకు ఆన్‌లైన్ మార్కెటింగ్‌ని ప్రోత్సహిస్తాం. చేనేత మరమగ్గాల కార్మికులకు సౌర విద్యుత్ ప్యానెళ్ళ ద్వారా ఉచిత విద్యుత్ అందజేస్తాం. చేనేత కుటుంబాలకు 2 వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేనేతలో సహజరంగుల వాడకాన్ని ప్రోత్సహిస్తాం’’ అని చంద్రబాబు అన్నారు.