ఇవే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయాలు!
posted on Aug 7, 2024 @ 4:39PM
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం బుధవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చిన విషయాలు, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకి వెల్లడించారు.
* రెవెన్యూ శాఖలో మూడు నెలలపాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త పాస్ పుస్తకాలు ఇస్తారు.
* రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానాన్ని అమలు చేస్తారు.
* జగన్ బొమ్మ వున్న సర్వే రాళ్ళను ఏం చేయాలన్న దాని మీద చర్చ జరిగింది. జగన్ పేరు, బొమ్మ తొలగించాలని నిర్ణయించారు.
* భూముల రీ సర్వేని పక్కన పెట్టాలని నిర్ణయించారు.
* ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు వుంటే స్థానిక ఎన్నికలలో పోటీకి అనర్హులనే నిబంధనను ఎత్తివేయనున్నారు.
* మావోయిస్టులపై నిషేధాన్ని మరో ఏడాది పొడిగించారు.
* వైసీపీ ప్రభుత్వం, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అవలంబించిన మద్యం విధానంపై చర్చ జరిగింది.
* ఎక్సయిజ్ శాఖలో అక్రమాలు జరగకుండా ఏం చేయాలన్న అంశం మీద చర్చ జరిగింది.
* మత్స్యకారులకు ఇబ్బందికరంగా వున్న జీవో నంబర్ 217ని రద్దు చేయాలని కేబినెట్ తీర్మానించింది.
* నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు అనుగఉంగా విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 150 సీట్లతో నిర్మించిన కొత్త మెడికల్ కాలేజీల్లో గతంలో మంజూరైన పోస్టులకు అదనంగా మరో 380 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయం.
* పాడేరు, మార్కాపురం పులివెందుల, ఆదోని, మదనపల్లెలో నిర్మించిన మెడికల్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 100 సీట్లతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ కోర్సు ప్రారంభానికి ఆమోదం.
* సున్నిపెంట గ్రామ పంచాయితీకి 280 ఎకరాల భూమిని కేటాయిస్తూ జారీ చేసిన జీఓ నంబర్ 40ని రద్దు చేస్తూ, ఆ భూమిని తిరిగి జలవనరుల శాఖకు అప్పగించాలని నిర్ణయించారు.
* రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు తక్కువగా వుందన్న విషయం మీద చర్చ జరిగింది. రాష్ట్రంలో భవిష్యత్తులో యువతరం తగ్గిపోతుందన్నఆందోళన వ్యక్తమైంది.
* ఎక్సయిజ్ శాఖలో మెరుగైన విధానాలు ప్రవేశపెట్టడంలో భాగంగా ఇతర రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేయాలని నిర్ణయించారు.