ఏపీ సీఎం చంద్రబాబుతో డాక్టర్ సునీత భేటీ
posted on Aug 7, 2024 @ 3:04PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత భేటీ అయ్యారు. బుధవారం (ఆగస్టు 7)న జరిగిన ఈ భేటీ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకు ముందు అంటే చంద్రబాబుతో భేటీకి ముందు డాక్టర్ సునీత ఏపీ హోంమంత్రి వంగల పూడి అనితతో భేటీ అయ్యారు.
ఈ భేటీలో డాక్టర్ సునీత తన తండ్రి వైఎస్ వివేకానంద హత్య కేసుపై చర్చించారు. కేసు వివరాలను హోంమంత్రికి వవరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత సునీతకు భరోసా ఇచ్చారు. సీబీఐ విచారణలో ఉన్న కేసు సత్వరమే పూర్తయ్యేలా చూస్తానని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి సునీతకు సంపూర్ణ సహకారం అందిస్తామని కూడా చెప్పారు.
వివేకా హత్య తదనంతర పరిణామాలను హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారనీ, వారిపై చర్యలు తీసుకోవాలని సునీత కోరారు. కేసు విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు సాక్ష్యుల్ని బెదిరించి పోలీసులు కేసును నీరుగార్చే విధంగా వ్యవహరించారని తెలిపారు. దీనిపై అనిత దోషులకు శిక్షపడేలా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్న హామీ ఇచ్చారు.