వర్గీకరణతో అందరికీ మేలు జరగాలి!
(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్)
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై మానవ హక్కుల కార్యకర్త బాలగోపాల్ గతంలో ఈ విధంగా వ్యాఖ్యానించారు. ‘‘ఇది దోపిడీ, అణచివేతలకు సంబంధించిన అంశం కాదు. ఇది అణచి వేయబడ్డ సమూహంలోనే అసమానతలకు సంబంధించిన అంశం. దీనికి మూలాలు హిందూ వర్ణ వ్యవస్థలో, దానిలో ప్రధాన భాగమైన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఉన్నాయి’’ అని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు వర్గీకరణపై ఇచ్చిన దాదాపు 500 పేజీల తీర్పులో బాలగోపాల్ వ్యాఖ్యల సారం ఉందనే చెప్పాలి. ఒకే సామాజిక వర్గంలోని ఉప కులాలకు సమ న్యాయం జరగడం లేదంటూ దాదాపు దశాబ్దాల క్రితం వారిలో అంతరాలకు బీజం పడింది. అన్నదమ్ముల్లా మెలిగే వారిలో అంతరాలు తొలగించి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల అమలును సరిచేసి, వాటి ఫలాలు అందుకోవాలని ఐదు దశాబ్దాల క్రితం విజ్ఞాపనలతో మొదలైంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ చేయాల్సిందేనంటూ దశాబ్దాల క్రితం ఉద్యమం మొదలైంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అటు, ఇటు సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
అసలీ వర్గీకరణ ఏమిటి? ఎక్కడ తేడా వస్తోంది? భావోద్వేగాలను పురిగొల్పేలా ఉద్యమం ఎందుకు జరిగింది? వంటి అనేక ప్రశ్నలకు బదులు దొరకాలంటే దశాబ్దాల పరిణామాలను ఒకసారి పరికించాల్సిందే. ఎస్సీ రిజర్వేషన్లలో న్యాయమైన వాటా దక్కడం లేదని, రిజర్వేషన్ల ఫలాలు అందుకోవడంలో ఎస్సీ కులాల్లో అసమానతలు పొడచూపడంతోనే వర్గీకరణ అంశం ఉద్యమానికి దారి తీసిందని అనేక మంది సామాజిక కార్యకర్తలు, మేధావులు పలుమార్లు స్పష్టం చేశారు. ఎస్సీల్లోని 59 ఉప కులాలకు రిజర్వేషన్ ఫలాలు జనాభా నిష్పత్తి ప్రకారం అందడం లేదని ఎస్సీ రిజర్వేషన్లపై 1965లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం నియమించిన లోకూర్ కమిషన్ నివేదించింది. ఇదే అంశంపై 1972 నుంచి మొదలుకుని ఉమ్మడి ఏపీలో మారిన ప్రతి సీఎంకు విజ్ఞప్తుల వెల్లువ మొదలైంది. ఎస్సీని ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరించి విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో న్యాయం చేయాలనే డిమాండ్‌తో 1994లో మొదలైన ఉద్యమం రాష్ట్రమంతటా విస్తరించింది.
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 1994 జూలై 7న వర్గీకరణ ప్రధాన డిమాండ్‌గా సభ జరిపి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 1996లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నివేదిక ఆధారంగా ఏబీసీడీ వర్గీకరణ చేస్తూ నాటి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15 శాతం ఎస్సీ కోటాను విభజిస్తూ 1997 జూన్ 6న తెలుగుదేశం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ‘ఏ’ గ్రూపులో రెల్లి, దాని అనుబంధ కులాలతో సహా మొత్తం 12 కులాలను అట్టడుగు స్థానంలో ఉన్న కులాలుగా గుర్తించి ఒక శాతం కోటాను కేటాయించారు. ‘బీ’ గ్రూపులో మాదిగ, దాని ఉప కులాలతో సహా మొత్తం 18 కులాలను చేరుస్తూ వారికి 7 శాతం కోటాను కేటాయించారు. 'సీ'లో మాల, దాని ఉప కులాలతో సహా మొత్తం 25 కులాలను చేరుస్తూ వారికి 6 శాతం కోటా ఇచ్చా రు. 'డీ'లో ఆదివాసి ఆంధ్రులతో పాటు మొత్తం 4 కులాలను చేర్చి 1 శాతం కోటా నిర్ణయిస్తూ నాడు చంద్రబాబు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణ చేసే రాష్ట్ర అధికారం లేదని మాల మహానాడు కోర్టును ఆశ్రయించింది. ఈ జీవో రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధికి మించిందని ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. దాంతో వర్గీకరణ రద్దయ్యింది.
పీవీ రావు ఆధ్వర్యంలో ఏర్పాటైన మాల మహానాడు వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టింది. మాదిగల వర్గీకరణ డిమాండ్‌పై మాలలు అభ్యంతరం చెప్పారు. సబ్-కేటగిరైజేషన్ సామాజిక వైషమ్యాలకు దారి తీస్తుంది. ఇది ప్రాంతీయ వ్యత్యాసమే తప్ప మాదిగలకు అన్యాయం ఏమీ జరగలేదనే వాదనను పీవీ రావు తెరమీదకు తెచ్చారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్సీల ఐక్యతను దెబ్బతీసే కుట్రతో సృష్టించిందే వర్గీకరణ ఉద్యమం అని ఆరోపించారు. అప్పట్లో రాష్ట్రంలో మాలలు ఎక్కువగా కాంగ్రెస్ వైపు ఉన్నారు కాబట్టి, మాదిగల్ని తన వైపు తిప్పుకొనే వ్యూహంతోనే చంద్రబాబు వర్గీకరణ చిచ్చు పెట్టారనే విమర్శలు చేశారు. ఎస్సీలను వర్గీకరిస్తూ 2000లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి చంద్రబాబు ప్రభుత్వం రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ అనే చట్టాన్ని అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఆమోదంతో అమల్లోకి వచ్చిన ఆ చట్టంలో ఎస్సీలను ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరిస్తూ.. వెనుకబాటుతనం, జనాభా నిష్పత్తి ప్రకారం ఆ కులాలకు కోటాలను నిర్ణయించారు. 2004 నవంబర్‌లో సుప్రీంకోర్టు ఆ చట్టాన్ని కొట్టి వేసింది. ఎస్సీ కులాల జాబితాలో జోక్యం, పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని ప్రకటించారు. దీంతో వర్గీకరణ వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. 2000 నుండి 2004 మధ్య దాదాపు ఐదేళ్లపాటు చంద్రబాబు పాలనలో రిజర్వేషన్ల అమలు కారణంగా మాదిగలకు దాదాపు 22 వేల వరకు ఉద్యోగాలు వచ్చాయి అని నాడు మందకృష్ణ ప్రకటించారు. సమాజంలో అసమానతలు, అంతరాలు, కుల, వర్గ, ప్రాంత, మత వైషమ్యాలు లేని ఆరోగ్యకరమైన భారతదేశ సమాజాన్ని కాంక్షించే స్వాప్నికుడిగా అందరూ బాగుండాలి అని కోరుకుందాం..!