వినేష్ ఫోగట్ కు పెరుగుతున్న మద్దతు!
posted on Aug 8, 2024 @ 9:59AM
అనర్హత వేటు పడిన వినేష్ ఫొగట్ కు ప్రధాని మోదీ సహా పలువురు అండగా నిలిచారు. ఆమె ఛాంపియన్లకు ఛాంపియన్ అంటూ కొనియాడారు. 'వినేశ్. మీరు భారత్ కు గర్వకారణం. ప్రతి భారతీయుడికి స్ఫూర్తి. ఈరోజు జరిగింది బాధిస్తోంది. నాకు కలిగిన నిరాశ మాటల్లో చెప్పలేకపోతున్నాను. అదే సమయంలో మీ పట్టుదల నాకు తెలుసు. సవాళ్లను ఎదుర్కోవడమే మీ సహజతత్వం. మళ్లీ బలంగా పుంజుకోండి. మీ గెలుపుకోసం చూస్తున్నాం' అని మోడీ ట్వీట్ చేశారు.
వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉందన్న కారణంగా ఒలింపిక్స్ లో డిస్క్వాలిఫై అయిన భారత రెజ్లర్ వినేశ్ పొగట్ కు సినీ, రాజకీయ ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే సమంత, సోనాక్షి సిన్హా, విక్కీ కౌశల్, తాప్సీ, హేమమాలిని ఆమెకు మద్దతుగా నిలిచారు. తాజాగా నటుడు మహేశ్ బాబుకూడా ఎక్స్ వేదికగా స్పందించారు. నేటి ఫలితాన్ని పట్టించుకోవద్దు ఫొగట్. మీరు నిజమైన ఛాంపియన్ అని నిరూపించారు. 1.4 బిలియన్ హృదయాలు మీతోనే ఉన్నాయి అని పేర్కొన్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో 50 కేజీల మహిళా రెజ్లింగ్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్ సుసాకిని ఓడించి ఫైనల్స్‌లోకి దూసుకు వచ్చిన భారత్ మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై ఒలింపిక్స్ కమిటీ అనర్హత వేటు వేయడంతో ఫైనల్స్‌లో ఆమె అమెరికా రెజ్లర్‌తో పోటీ పడేందుకు సిద్దమవుతుండగా, ఆమె 50 కేజీల కంటే 100 గ్రాములు అదనంగా బరువు ఉన్నారనే కారణంతో ఆమెపై ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ అనర్హత వేటు వేశాయి.
ఆమె ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరడంతో భారత్ ఆనందంతో ఉప్పొంగిపోతోంది. ఆమె తప్పక భారత్‌కు స్వర్ణ పతకం సాధిస్తుందని అందరూ ఆతృతగా ఎదురుచూస్తుంటే, ఈ కారణంతో ఒలింపిక్స్‌లో కమిటీ ఆమెపై అనర్హత వేటు వేయడం చూసి అందరూ దిగ్బ్రాంతి చెందుతున్నారు. సెమీస్ కు ముందు కూడా ఆమె బరువు పరీక్షించి 50 కేజీలున్నట్లు నిర్ధారించుకున్నాకనే పోటీకి అనుమతించారు. కానీ ఒక్కపూటలో ఆమె వందగ్రాముల బరువు పెరిగిందంటూ అనర్హత వేటు వేయడం వెనుక ఏదో కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె రాత్రి లేదా ఉదయం తీసుకున్న ఆహారం, నీళ్ళు, ఇతర పానీయాల కారణంగా కూడా ఆమాత్రం బరువు పెరిగి ఉండవచ్చు. ఆమె నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన జపాన్ రెజ్లర్ యూయి సుసాకిని ఓడించింది కనుక వినేష్ ఫోగట్ ఫైనల్స్‌లో పాల్గొంటే తప్పకుండా గెలిచి స్వర్ణ పతకం సాధించే అవకాశం ఉంది. బహుశ అందుకే ఈ వంకతో ఆమెను పోటీ నుంచి తప్పించేందుకే తెర వెనుక కుట్ర జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కాగా ఇండియన్ ఒలింపిక్ కమిటీ దీనిపై అభ్యంతరం తెలుపుతూ, ఈ నిర్ణయాన్ని పునః సమీక్షించాలని ఒలింపిక్స్ కమిటీకి విజ్ఞప్తి చేసింది. ఒకవేళ పునః సమీక్షించేందుకు అంగీకరిస్తేనే వినేష్ ఫోగట్ గురువారం రాత్రి ఫైనల్స్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. లేకుంటే ఆమె రిక్తహస్తాలతో స్వదేశానికి తిరిగి రాక తప్పదు. బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో వినేష్ ఫోగట్ క్రియాశీలంగా పోరాడింది, పోలీసు లాఠీ దెబ్బలను భరించింది. అవమానాలను ఎదుర్కొంది. ఈ కారణంగా దాదాపు ఏడాి పాలు రెజ్లింగ్ కు దూరమైనా.. ఆ తరువాత పట్టుదలతో సాధన చేసి ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. తన అసమాన ఆటతీరుతో రెజ్లింగ్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నారు. ఒలింపిక్స్ సెమీస్ లో ప్రపంచ ఛాంపియన్ ను మట్టికరిపించింది. ఫైనల్ లో ప్రత్యర్థిని ఓడించి స్వర్ణ పతకం సాధించడం ఖాయమనుకుంటున్న దశలో వంద గ్రాముల ఎక్కువ బరువు అంటూ ఆమెపై అనర్హత వేటు పడటం వెనుక కుట్ర కోణం ఉందన్న అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటమే ఇందుకు కారణమంటూ రాజకీయవర్గాలలో సైతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా వినేశ్ ఫోగట్ అసమాన పోరాట పటిమను యావద్దేశం గర్వంగా చెప్పు కుంటోంది.