దేశంలో బాబాలు పడ్డారు! నాయకులు సాష్టాంగ పడ్డారు!
(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్)
2024 జులై 2న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో 123 మంది మరణించారు. ఎనభై వేల మందికి పర్మిషన్ తీసుకుని, రెండున్నర లక్షల మందిని అనుమతించడం వల్ల తొక్కిసలాట జరిగింది. తనను తాను దైవాంశ సంభూతుడిగా ప్రకటించుకున్న భోలే బాబా అసలు పేరు అక నారాయణ శంకర్ హరి, ఉరఫ్ సూరజ్ పాల్ జాతవ్. అతను గతంలో పోలీసు కానిస్టేబుల్, రేప్ కేసులో ఇరుక్కున్నందువల్ల ఉద్యోగం ఊడిపోయిందని చెపుతారు. అయితే, తనమీద కేసులేవీ లేవని ఉత్తరప్రదేశ్ ప్రభుత్యోద్యోగం నుంచి వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నానని ఈ భోలే బాబా చెప్పుకుంటాడు. దళితుడిగా ఉద్యోగంలో చేరినా, ఇక ఇప్పుడు ఆ విషయం ఎక్కడా ఎత్తడు. అలిఘర్ గ్రాండ్ ట్రంక్ రోడ్డులో సువిశాలమైన స్థలంలో విలాసవంతమైన ‘ప్రవాస్ ఆశ్రమం’ ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఉండే వసతులన్నీ అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఆస్తి వందల కోట్లు ఉంటుందని అంచనా. తన ఆస్తిపాస్తుల వ్యవహారాలు చూసుకోవడానికి, లీగల్ కేసుల్ని పరిష్కరించడానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాడు. దాని పేరు శ్రీ నారాయణ హరి సకర్ ఛారిటబుల్ ట్రస్ట్. భోలే బాబా తెల్లని సూట్ వేసుకుని, టై కట్టుకుని, నల్ల కళ్ళద్దాలతో సినిమా హీరోలాగా స్టైలిష్‌గా అభిమానులకి దర్శనమిస్తుంటాడు. ఆయనకు పెళ్లికాని యువతులు స్నానం చేయిస్తారు. అన్నం తినిపిస్తారు. మిగతా అన్ని పనులు చేస్తారు. టయోటా ఫార్చునర్‌లో బయలుదేరాడంటే వెంట మోటార్ సైకిళ్ల మీద కమెండోలు అనుసరిస్తారు. ఒక వివిఐపి వెళుతున్నట్టుగా వాళ్లు రోడ్డు ఆక్రమిస్తారు. ఏ అధికారం లేకపోయినా, ప్రజల మూర్ఖత్వమే తన బలం అన్నట్టు-అతని ప్రోటోకాల్ ఉంటుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ ఈ విషయం ఏ మాత్రమూ పట్టించుకోవు. జన సామాన్యానికి అసౌకర్యం కలుగుతోందని పోలీసులు అడ్డగించరు. వివేకం నశించిన వారు ప్రభుత్వంలో, ప్రభుత్వ సంస్థల్లో ఉన్నారు కాబట్టి, ఈ దేశంలో ఇలాంటి దొంగ బాబాల, సన్యాసుల ఆటలు సాగుతున్నాయి. హత్రాస్ తొక్కిసలాట మరణాలకు సంబంధించి-ఎఫ్.ఐ.ఆర్‌లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న కార్యనిర్వహకుల పేర్లు చేర్చారు కానీ, అసలైన భోలే బాబా పేరు చేర్చలేదు. అంటే భోలే బాబాకు పరిపాలకులకు ఉన్న మైత్రీ బంధం స్పష్టంగా కనిపిస్తోంది కదా? రాజ్యాంగంలోని ఆర్టికల్ ‘51ఎ’కి వ్యతిరేకంగా పాలకులు ప్రవర్తిస్తున్నట్లే కదా?
ఈ దొంగ బాబా అభిమానులు, ఆరాధకులు మాత్రం పేద కుటుంబాలకు చెందినవారు, నిమ్న కులాల వారు, వెనుకబడిన జాతుల వారు.ఈ బోలే బాబాకు అతీంద్రియ శక్తులున్నాయని, చనిపోయిన వారిని బతికిస్తాడని, అతని పాదాల కింద మట్టిని తీసుకుపోయి తమ దగ్గర ఉంచుకుంటే సుఖసంతోషాలు, భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని నమ్మే ప్రజలకు అసలు ఇంగిత జ్ఞానం ఉందా? అదే నిజమైతే బోలేబాబా తన అద్భుత, అతీంద్రియ శక్తులతో తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రాణం పోయాలి కదా? మరణించిన వారికి ఎందుకు అలా వదిలేశారూ? భోలే బాబా దర్శనం చేసుకున్న వారికి, ఆయన సత్సంగ్‌లో పాల్గొన్న వారికి ఆయురారోగ్యాలు లభించాలి కదా? ఐశ్వర్యవంతులు కావాలి కదా? మరి ఇన్నేళ్లుగా జనానికి ఇవి ఎందుకు లభ్యం కావడం లేదూ? దారిద్య్రం వారిని ఇంకా ఎందుకు వెంటాడుతూ ఉంది? ఆలోచించే పనే లేదా? బాబాలందరూ అతి సామాన్యమైన నేపథ్యంలోంచి వస్తారు. కానీ, సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదుగుతారు. ప్రయివేటు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటారు. రాజకీయ నాయకులతో సత్సంబంధాలు పెట్టుకుని, తమ దురాగతాలు బయటపడకుండా జాగ్రత్త పడతారు.
ఆశారాం బాపూ కావొచ్చు, గురుమీత్ రామ్ రహీమ్ కావొచ్చు, ఇచ్ఛాధారి భీమానంద్ చిత్రకూట్ వాలే కావచ్చు, చంద్రస్వామి కావచ్చు, స్వామి అమృత చైతన్య కావొచ్చు, స్వామి సదాచారి కావచ్చు, కృపాలూ కావొచ్చు, జగ్గీ వాస్‌దేవ్ కావొచ్చు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ కావొచ్చు, నిత్యానంద్ కైలాస్ కావొచ్చు, దేవ నాథన్ కావొచ్చు, వీళ్లందరి మీద అత్యాచారం కేసులున్నాయి. లేదా ఆదివాసుల, పేదల భూములు ఆక్రమించిన కేసులున్నాయి. లేదా పర్యావరణానికి తీవ్రంగా నష్టం కలిగించిన కేసులున్నాయి. మరి పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ, షాలు ఏం చేస్తున్నట్టూ?దేశ నాయకులకు దొంగబాబాలకు తేడాయే లేకుండా పోయింది. ఇంకా వీరిని జైలుకు పంపేదెవరూ? స్వయాన భార్యను చంపినవాడు సద్గురుగా చలామణి అవుతున్నాడు. అతని యోగా సెంటరు నుంచి మాయమైన ఆరుగురి ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు.ఆదివాసుల భూములాక్రమించి ఈశా(ఈశ్వరా) ఫౌండేషన్ స్థాపించిన వాడికి ఈ పరిపాలకులు శిక్ష విధించగలరా? విధించలేరు. కారణం ఏమిటంటే వారు చేస్తున్న దురాగతాలు అలాంటివే కాబట్టి! జస్టిస్ లోయను చంపించారనే ఆరోపణలున్న వారికి దేశంలో శిక్షే లేదు. ఒక ఫేక్ డిగ్రీతో చలామణి అవుతున్న వారి దగ్గర మన విద్వార్థిలోకం ‘నీట్’ పేపర్ లీకయ్యిందని మొరపెట్టుకుంటున్నారు. ఎలా ఉన్న దేశం! ఎలా అయిపోయిందీ?
దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నవారే ప్రజా స్వామ్య పరిరక్షణ గూర్చి మాట్లాడుతున్నారు. దొంగ సర్టిఫికెట్లు, దొంగ డిగ్రీలు సమర్పించి ఐఏఎస్‌లైన వారి మీద మీడియా తెగ ఉత్సాహం ప్రదర్శిస్తోంది. అది చేయాల్సిన పనే, దేశ ప్రజలు సంతోషిస్తున్నారు కూడా! మరి ప్రధాని మోడీ, అతని అనుచరుల సర్టిఫికెట్ల మీద ఈ మీడియా ఎందుకు ప్రశ్నించదూ? ఇలాంటి ఎన్నో విషయాల గూర్చి విసుగెత్తి ఈ దేశ ప్రజలు ప్రధాన మీడియాకు దూరమయ్యారు. విదేశీ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్లలో వాస్తవాలు ఏరుకొంటున్నారు. ఓటర్లను అంధ విశ్వాసంలో ముంచి, జనాన్ని తమ భక్తులుగా/ అనుచరులుగా/ బాబాలు మార్చుకుంటూ ఉంటే- అంధ విశ్వాసంలో మునిగిన ఆ భక్తుల్నే ఈ దేశ నాయకులు తమ ఓటర్లుగా మార్చుకుంటున్నారు. వివేకం, విజ్ఞత లేని గొర్రెల్లాంటి జనమే వీరిరువురికీ అవసరం! బాబాలు ప్రజల్లో పుణ్యం, పాపం లాంటి భయాల్ని కలిగించి, ధన ప్రాప్తి లాంటి ఆశలు కల్పిస్తారు. దేశ నాయకులు అదే పని చేస్తున్నారు కదా? పుల్వామా అంటారు. పాకిస్థాన్ అంటారు. మెజారిటీ హిందువులకు మైనార్టీలయిన ముస్లింల వల్ల భద్రత లేదంటారు. భారత్‌లోకి చైనా, ఎన్నికిలో మీటర్లు చొచ్చుకుని వచ్చిందో, ఎంత భూమి ఆక్రమించిందో చెప్పండంటే మాత్రం నోరువిప్పరు. ఈ దేశ స్థాయిని ఇంతగా దిగజార్చిన నేటి ఈ ‘దేశభక్తి’ దేశ పాలకులకు-ఈ దేశ ప్రజలు ఏ విధమైన శిక్ష విధించాలి? ఒకరు జాతీయ స్థాయిలో, మరొకరు ప్రాంతీయ స్థాయిలో ఉన్నారు కానీ-మోసం చేయడంలో, ప్రజల ప్రాణాలు హరించడంలో భోలే బాబా అయినా, వేరే బాబా అయినా… అందరూ ఒకటే! భోలే బాబా అక్కడ నిలబడి, మరణించిన వారి కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సింది పోయి దొంగ దారిన పారిపోయాడు. పదిహేను రోజుల తర్వాత తన ఆశ్రమానికి తిరిగివచ్చి, చనిపోయిన వారికి సంతాపం/ నివాళి వంటివి ప్రకటించకుండా ‘‘చేసిన ఖర్మలకు ఎలాంటి వారైనా ఫలితం అనుభవిస్తారని, దాన్ని ఎవరూ తప్పించలేరన్’’ మెట్ట వేదాంతం వల్లించాడు. అంటే, ప్రజలు వారి ఖర్మానుసారమే తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారన్నమాట!
సంప్రదాయ వాదులకు నచ్చే ఒక అభూత కల్పన గురించి చూద్దాం- వాళ్లు పురాణాల్లో రాసుకున్నట్టు – సముద్ర మథనం జరిగింది, ఫలితంగా అమృతం, కామధేనువు, గరళం, అవినీతి వంటివి బయట పడ్డాయి. మొదటి రెండు మంచివి, దేవతలు తీసుకుపోయారు. మిగిలిన రెండింటిని ఈశ్వరుని ముందు పెట్టారు. ‘ఈ రెండిండినీ నేను స్వీకరించ లేను. ఒక్కటే స్వీకరిస్తాను. అయితే ఉన్న రెండింటిలో గరళాన్ని ఎవరూ భరించలేరు గనక, లోక కళ్యాణం కోసం నేను గరళం తాగుతున్నాను’ – అని శివుడు తాగేశాడు. మిగిలిన ‘అవినీతిని’ కొందరు భూ మండలం మీదున్న భారతదేశానికి తీసుకొచ్చారు. అక్కడ ఉన్న అతి పెద్ద రాజకీయ పార్టీ ఆ అవినీతిని మనసారా ఆహ్వానించి, స్వీకరించింది. తమ దగ్గర వాషింగ్ మిషన్ ఉందనీ అందులో ఎంతటి అవినీతినైనా ఉతికి శుభ్రపరుచుకుంటామనీ ప్రకటించింది. అప్పటి నుండి అవినీతి పరులైన రాజకీయ నాయకులు ఎక్కడ ఉన్నా వారిని ఆ పార్టీ ఆకర్షిస్తోంది. ఆ రకంగా దేశాన్ని అవినీతి రహిత దేశంగా మార్చేస్తోంది. ఎంతటి అవినీతి జరిగినా, ఏమీ జరగనట్టు – తమ మూర్ఖత్వానికి అందమైన మేకప్ వేసి ఆ పార్టీ వారు దేశ ప్రజల ముందుకు తేగలుగుతున్నారు. ఎన్నికల బాండ్లు ఒక స్కామ్, రామాలయం ఒక స్కామ్, విదేశీ బొగ్గు అదానీ నుండి కొనాలనడం ఒక స్కామ్. బహిరంగంగా అందరికీ కనిపిస్తున్న విషయాలివి. ఈ దేశంలోని యువకులు మాత్రం పకోడీలు అమ్ముకోవాలని, పంచర్‌షాప్‌లు తెరుచుకోవాలని బీజేపీ నాయకులు ఉద్భోదిస్తున్నారు. డిగ్రీలు తీసుకోవడం దండగ అని కూడా చెపుతున్నారు. నిజమే దండగే! చరిత్రను వక్రీకరించి మొఘలుల కాలాన్ని తీసెయ్యడం, న్యాయ శాస్త్ర విద్యార్థులు ‘మనుస్మృతి’ చదవాలనడం చేస్తున్నప్పుడు ఇక ఆ చదువుకు ఏ విలువ ఉంటుందీ?