ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్నా... ఓకే!
posted on Aug 7, 2024 @ 5:50PM
ఇద్దరు పిల్లలకంటే ఎక్కువమంది పిల్లలున్నా నో ప్రాబ్లం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటోంది. ఎంతమంది పిల్లలుంటే అంత మంచిదని కూడా అంటోంది. గతంలో ప్రభుత్వాలు పాటించిన ‘ఒక్కరు ముద్దు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు వద్దు’ అనే రూల్‌ని సడలిస్తోంది. గతంలో కుటుంబ నియంత్రణని కఠినంగా అమలు చేయడంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయాలంటే ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలు వుండకూడదన్న నిబంధన ఏర్పాటు చేశారు. ఆ నిబంధనను ఇప్పుడు తొలగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎంతమంది పిల్లలు వున్నా, అది స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి అడ్డంకి కాకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అలాగే రాష్ట్రంలో పునరుత్పత్తి శాతం తగ్గిపోతోందని, ఇది ఇలా కొనసాగితే భవిష్యత్తులో రాష్ట్రంలో యువతరం సంఖ్య తగ్గిపోయే ప్రమాదం కూడా వుందని రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.