మేడిగడ్డ బ్యారేజీపై డ్రోన్.. కేటీఆర్ పై ఎఫ్ఐఆర్!
posted on Aug 7, 2024 @ 10:22AM
ఇటీవలి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో పరాజయం తరువాత బీఆర్ఎస్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పదేళ్ల పాటు తెలంగాణలో తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ వీడి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత లిక్కర్ కుంభకోణంలో అరెస్టై తీహార్ జైలులో ఉన్నారు. ఈ కష్టాలు చాలవన్నట్లు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి నిగ్గు తేల్చాలంటూ దాఖలైన పిటిషన్ విచారణకు స్వీకరించిన భూపాలపల్లి జిల్లా కోర్టు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావులకు నోటీసులు జారీ చేసి, విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. ఇక ఇప్పుడు తాజాగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుపై ఎఫ్ ఐఆర్ నమోదైంది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేసినందుకు కేటీఆర్, మరికొందరు బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత నెల 26న అంబట్ పల్లి గ్రామంలో మేడిగడ్డ బ్యారేజి వద్ద కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు అనుమతి లేకుండా డ్రోన్ ఉపయోగించారని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వలి షేక్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఆ ఫిర్యాదులో కేటీఆర్, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరామణారెడ్డి, బాల్కసుమన్ మేడిగడ్డ బ్యారేజీ వద్ద డ్రోన్ కెమేరాను ఉపయోగించి ఫొటోలు తీశారని వలి షేక్ పేర్కొన్నారు. అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ వద్ద డ్రోన్ల వినియోగంపై నిషేధం ఉందని పేర్కొన్న ఆయన కేటీఆర్ తదితరులు డ్రోన్ కెమేరాలతో తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయని పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు మేరకు భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ పోలీసులు కేటీఆర్, గండ్ర, బాల్క తదితరులపై కేసు నమోదు చేశారు.
2020లో ప్రస్తుత సీఎం, అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డిపై దాదాపు ఇలాంటి కేసునే బీఆర్ఎస్ ప్రభుత్వం నమోదు చేసింది. అప్పట్లో మంత్రి కేటీఆర్ నివాసంపై డ్రోన్ కెమేరాతో ఫొటోలు తీశారంటూ రేవంత్ పై కేసు నమోదైంది. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీపై అనుమతి లేకుండా డ్రోన్ ఉపయోగించి ఫొటోలు తీశారంటూ కేటీర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. దీంతో టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా అప్పుడు కేటీఆర్ తనపై కేసు నమోదు చేసినందున రేంవత్ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.