జగన్ హయాంలో భూదందాల పరిష్కారానికి 90 డేస్ టార్గెట్!
జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టిన భూ వివాదాల చిచ్చుల పరిష్కారానికి చంద్రబాబు సర్కార్ సమాయత్తమైంది. ఇందు కోసం ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ఆగస్టు 15వ తేదీ నుంచి 45 రోజులపాటు ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించి, మరో 45 రోజులలో వీటి పరిష్కరించాలని నిర్ణయించింది. గత ఐదేళ్లలో భారీగా భూ అక్రమాలు జరిగాయి. పేదలు, బడుగువర్గాలు, అణగారిన వర్గాల భూములను వైసీపీ నేతలు దౌర్జన్యంగా ఆక్రమించుకొని రికార్డులను తారుమారు చేసి, ఇదేమిటని అడిగితే దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. కొత్త ప్రభుత్వం వచ్చాక స్వీకరిస్తున్న వినతి పత్రాల్లో సగానికిపైగా భూ వివాదాలపైనే ఉంటున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్, ఆయన అనుయాయులు చేసిన పాపాలు అరాచకాలను సరిదిద్దాలన్న కృత నిశ్చయంతో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. 45 రోజులపాటు ఊరూరు తిరిగి అధికార యంత్రాంగాన్ని మోహరించి ఎక్కడికక్కడే సమస్యలు తెలుసుకోవడం, ఆ తర్వాత 45 రోజుల్లో వాటికి పరిష్కారం చూపడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల 15న మంత్రులు లాంఛనంగా గ్రామ రెవెన్యూ సదస్సులు ప్రారంభిస్తారు. ఆ తర్వాత 16నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు అంటే 45 రోజుల పాటు గ్రామగ్రామాన రెవెన్యూ సదస్సులు జరుగుతాయి.
జిల్లాలు, మండలాల వారీగా గ్రామాల్లో సదస్సుల నిర్వహణ తేదీలను మంగళవారం (ఆగస్టు 13) నాటికే ఖరారు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లను ఆదేశించింది. సదస్సుల నిర్వహణ, పర్యవేక్షణ కోసం జిల్లాకు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమిస్తారు. జాయింట్ కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. ఈ సదస్సుల్లో జిల్లా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్, సభ్యులు, మండల, గ్రామ ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా పేర్కొన్నారు.
గ్రామ రెవెన్యూ సదస్సుకు రెండు రోజుల ముందే ప్రభుత్వం గ్రామ రెవెన్యూ మ్యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు భూముల మ్యాప్‌లను ప్రకటిస్తుంది. సదస్సులకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, అటవీ, దేవదాయ, వక్ఫ్ శాఖల మండల, గ్రామస్థాయి అధికారులు హాజరవుతారు. భూ కొలతల్లో తేడాలు, సర్వే నెంబర్లలో మార్పులు, వారసత్వ పేర్ల నమోదు, సరిహద్దు సమస్య, భూ విస్తీర్ణంలో తేడాలు, రీసర్వే జరిగిన గ్రామాల్లో రైతులకు ఇచ్చిన రికార్డుల్లో నమోదైన తప్పులు, ప్రజల నుంచి వైసీపీ నేతలు లాక్కున్న భూములు, భూ కబ్జాలు, భూ ఆక్రమణలు, అసైన్డ్, చుక్కల భూముల పరాధీనం వంటి వాటిపై బాధితుల నుంచి పిటిషన్లు తీసుకుంటారు. 2019కి ముందు భూమి రికార్డులు ఎలా ఉన్నాయి? ఇప్పుడెలా ఉన్నా యో పరిశీలిస్తారు. వాటిపై ప్రజల నుంచే వచ్చే ఫిర్యాదులను స్వీకరిస్తారు. తహసీల్దార్ల నేతృత్వంలో అవసరమైతే భూముల పరిశీలన చేస్తారు.
రీ సర్వే జరిగిన గ్రామాల్లో ఆర్‌ఓఆర్ రికార్డును ప్రజల సమక్షంలో చదివి వినిస్తారు. కొత్త పాస్‌పుస్తకాలు ఇచ్చేందుకు జగన్ బొమ్మలున్న పాస్‌పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని సూచించింది. జగన్ బొమ్మలున్న పాస్ పుస్తకాలను తహసీల్దార్లు ధ్వంసం చేయాలని రెవెన్యూ స్పెషల్ సీఎస్ సిసోడి యా మార్గదర్శకాల్లో పేర్కొంది. గ్రామంలో జగన్ పేర్లు, బొమ్మలతో సర్వేరాళ్లు ఉంటే, వాటిపై పేర్లను చెరిపివేయాలని నిర్దేశించింది. ఈ నెల 15నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి పిటిషన్లు స్వీకరిస్తారు. ఆ తర్వాత మరో 45 రోజుల్లో అంటే నవంబరు 15 నాటికి వాటిని పరిష్కరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది.