విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. ఆర్వో సమీక్ష
posted on Aug 7, 2024 @ 3:40PM
స్థానిక సంస్థల కోటాలో ఈ నెల 30వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహణకు సంబంధించి పటిష్ట ఏర్పాట్లు చేయాలని, శాంతిభద్రతల సమస్య రాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఉమ్మడి విశాఖ జిల్లా ఏఆర్వోలను, పోలీసు అధికారులను ఉమ్మడి జిల్లాల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ ఆదేశించారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికారులతో బుధవారం (ఆగస్టు 7) ఉదయం తన ఛాంబర్లో జేసీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నిక జరగనున్న క్రమంలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించి ఎన్నికను ప్రశాంతంగా జరిగేలా చూడాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, జాబితా రూపకల్పన, బ్యాలెట్ పేపరు తయారీ, గుర్తుల కేటాయింపు తదితర అంశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. సాంకేతికపరమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలని సూచించారు. అనుమతుల జారీకి సంబంధించి సింగిల్ విండో విధానం అమలు చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని దృష్టిలో ఉంచుకొని అన్ని కార్యకలాపాలు నిర్వహించాలని హితవు పలికారు. ఉమ్మడి జిల్లాల నుంచి సమావేశానికి హాజరైన ఏఆర్వోలు, పోలీసు అధికారులు అక్కడి పరిస్థితులను రిటర్నింగ్ అధికారికి వివరించారు. వారు చేపడుతున్న చర్యల గురించి తెలిపారు.