జంగిల్ రాజ్ పోయింది.. జంగిల్ క్లియరెన్స్ మొదలైంది!
posted on Aug 8, 2024 @ 10:25AM
జగన్ పాలనలో గత ఐదేళ్లుగా మూలన పడిన అమరావతి రాజధాని పనులు ఒక కొలిక్కి వస్తున్నాయి. రాజధాని ప్రాంతం మొత్తం అడవిని తలపించేలా మారడంతో ఏయే స్థలాలు ఎక్కడ ఉన్నాయో కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక రాజధాని నిర్మాణ పనులు జోరందుకుంటాయని జనం భావించారు. అందుకు తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి తీవ్రస్థా యిలో కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా ముందుగా జంగిల్ క్లియరెన్స్ చేయాలని సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
దీంతో బుధవారం (ఆగస్టు 7) నుంచీ జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభం అయ్యాయి. రాజధాని అమరావతి కేంద్రంగా అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమరావతిలో నిర్మాణాల పైన ఐఐటీ నిపుణులు అధ్యయనం చేశారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం భవిష్యత్ నిర్ణయాలు తీసుకోనుంది. ఇదే సమయంలో రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. మంత్రి నారాయణ పూజ చేసి మరీ జంగిల్ క్లియరెన్స్ పనులను స్వయంగా ప్రారంభించారు. దీంతో వాటిని శుభ్రం చేసే పనులు మొదలయ్యాయి. మొత్తం 58 వేల ఎకరాల్లో ఉన్న తుమ్మ చెట్లు, ముళ్ల కంపలను నెలరోజుల్లోగా తొలగించేలా ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా భూములు కేటాయించిన వారికి తమ స్థలంపై అవగాహన వస్తుంది. రాజధానిలో ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణాలు జరిపే చోట, ఇన్‌ఫ్రా జోన్లు, ట్రంక్ ఇన్‌ఫ్రా ప్రాంతాల్లో దట్టంగా అడవిలా పెరిగిపోయిన చెట్లను, ముళ్ల కంపలను తొలగించనున్నారు.
అయిదేళ్ల కాలంగా అమరావతిలో ఎలాంటి పనులు చేపట్టకపోవటంతో ఈ పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం అమరావతిలో పిచ్చి చెట్లు, కంపలు పెరిగిపోయి కనీసం వేసిన సీసీ రోడ్లు కూడా కనిపించే పరిస్థితి లేదు. ఇందు కోసం ప్రభుత్వం భారీగానే ఖర్చు చేయాల్సి ఉంది. వీటిని తొలగించటానికి సీఆర్‌డీఏ అధికారులు రూ.36.50 కోట్లతో టెండర్లు పిలవాల్సి వచ్చింది. ఆ టెండర్లు ఇటీవలే ఖరారు చేశారు. ఎన్‌సీసీఎల్ సంస్థ ఈ టెండర్లను దక్కించుకుంది. బుధవారం (ఆగస్టు 7) ఉదయం నుంచి ఎన్‌సీసీఎల్ సంస్థ పిచ్చి, తుమ్మ చెట్ల తొలగింపు పనులు చేపట్టింది. వెలగపూడి సచివాలయం వెనుక వైపున ఎన్ 9 రోడ్డు నుంచి ఈ పనులను ప్రారంభించారు. ఈ పనులపై మంత్రి నారాయణ సీఆర్‌డీఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాదారు.
జంగిల్ క్లియరెన్స్ యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామన్నారు, రాజధాని క్యాపిటల్ రీజియన్ పరిధిలోని మొత్తం 99 డివిజన్లలో ఒకేసారి పనులు మొదలుపెట్టనున్నట్టు చెప్పారు. నెల రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ పూర్తి చేస్తామన్నారు. నెల రోజుల్లో ఈ పనులు పూర్తయిన తరువాత ఐఐటీ టీం ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రస్తుతం నిలిచిన నిర్మాణాలు..కొత్త వాటి పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇదంతా పూర్తయ్యాక వర్షాకాలం ముగిశాక రాజధాని నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి.