ఏమిటీ కాలయాపన.. జగన్ అక్రమాస్తుల కేసుపై సుప్రీం ఆగ్రహం
posted on Aug 7, 2024 @ 2:25PM
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలు షాకింగ్ కలిగిస్తున్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. ఉండి ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం (ఆగస్టు 7) విచారణ చేపట్టింది. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. ట్రయల్ ప్రారంభం కాకుండానే ఇన్ని కేసులు ఎలా ఫైల్ చేశారంటూ సీబీఐని న్యాయమూర్తి సూటిగా ప్రశ్నించారు.
కేసులు నమోదు అయిన నాటి నుంచి ఆరుగురు జడ్జిలు మారిపోయారని, రిటైర్ అయ్యారని, గత పదేళ్లుగా కాలయాపన చేస్తున్నారంటూ రఘురామ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. దీనికి జస్టిస్ సంజీవ్ ఖన్నా అసహనం వ్యక్తం చేశారు. ఒక కోర్టు ఇచ్చిన ఆదేశాలు తప్పంటూ మరో కోర్టుకు ఆ కోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా తప్పంటూ మరో కోర్టుకు వెళ్తూ కాలయాపన చేస్తున్నారని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుల ఉత్తర్వులు తప్పు అని చేస్తున్న వాదనకు, కేసు ట్రయల్‌కి సంబంధం లేదని జస్టిస్ ఖన్నా అన్నారు.
జగన్ అక్రమాస్తుల కేసు విచారణను వేగవంతం చేయాలని, విచారణ తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ తరఫు న్యాయవాది కోరారు. తెలంగాణ నుంచి డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని, కోర్టు సాధారణ కార్యకలాపాలకు ఇది అడ్డంకిగా మారుతోందని రఘురామ తరఫు న్యాయవాది ధర్మాసనం ఎదుట చెప్పారు. సీబీఐ తరఫు వాదనలు వినిపించడానికి ఎ.ఎస్.జి.రాజు అందుబాటులో లేరని ఇతర న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. ఎ.ఎస్.జి. రాజును వెంటనే పిలిపించాలంటూ విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.