రైల్వే సేవలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంపై లోక్ సభలో కేశినేని చిన్ని ప్రశ్న
posted on Aug 8, 2024 @ 10:06AM
భారతీయ రైల్వే సేవల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయో గిస్తు న్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో బుధవారం విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ రైల్వే సేవలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమలుపై అడిగిన పలు ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను రైల్వే సేవల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి వాడుతున్నారా అని అడగటంతో పాటు...ఉపయోగిస్తున్న సాంకేతికత రైల్వే సేవల సామర్థ్యాన్ని ఎలా మెరుగుపరిచిందో ఆ వివరాలు ఇవ్వాల్సిందిగా కోరారు.
ఈ ప్రశ్నలకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మిషన్ లెర్నింగ్ , ఆల్గోరితమ్, నేచురల్ లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్స్ , నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, టిక్కెట్లు బుక్ చేయడం, పి.ఎన్. ఆర్. తనిఖీ, రైలు షెడ్యూల్ లను తెలుసుకోవడం, 'రైల్ మదద్' లో ఫిర్యాదుల నిర్వహణ వంటి రొటీన్ పనులను ఆటోమేటెడ్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
సాఫ్ట్‌వేర్ కోడింగ్ కోసం జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతలు రైల్వే ఐ.టి అప్లికేషన్ల అభివృద్ధి కోసం ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటంతో కొన్ని పనులు వేగవంతం చేయడం , ప్రయాణీకులకు చాలా తక్కువ సమయంలో సమాచారం అందించడం జరుగు తోందన్నారు.