మరో వికెట్ డౌన్.. వైసీపీ మరింత వీక్!
posted on Aug 7, 2024 @ 2:46PM
వైసీపీకి మరో నేత రాజీనామా చేశారు. పరాజయం తరువాత కూడా మారని జగన్ తీరుకు నిరసనగా వైసీపీ నుంచి ఒక్కరొక్కరుగా నేతలు రాజీనామాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు వైసీసీకి గుడ్ బై చెప్పేశారు. నియోజకవర్గ అభివృద్థి కోసం కూటమితో కలిసి నడుస్తానని ప్రకటించారు. ఈ మేరకు పిఠాపురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తాను ఏ పార్టీలో చేరతానన్న విషయాన్ని త్వరలో వెల్లడిస్తానని చెప్పారు.
కాగా దొరబాబు పిఠాపురం నియోజకవర్గం నుంచి 2004, 2019 ఎన్నికలలో విజయం సాధించారు. 2004లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా గెలుపొందారు. మధ్యలో 2014లో పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన జగన్ తనను కాదని 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా వంగా గీతను పిఠాపురం నుంచి పోటీకి నిలబెట్టడంతో ఆయన ఒకింత కినుక వహించినా తమాయించుకుని వైసీపీలోనే కొనసాగారు. ఎన్నికలలో వంగా గీతకు మద్దతుగా పని చేశారు. ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఓటమి తరువాత కూడా వైసీపీ అధినేత తీరు మారకపోవడం, పని చేసిన వారికి తగిన గుర్తింపు లేకపోవడంతో ఆయన పార్టీ మారాలనే నిర్ణయించుకున్నారు.
అదే సమయంలో తెలుగుదేశం కూటమి రాష్ట్ర ప్రగతికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుండటం, అలాగే అమరావతి, పోలవరం నిర్మాణాలను వేగవంతం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన దొరబాబు.. రాష్ట్ర ప్రగతికి తన వంతు సహకారం అందించాలన్న ఉద్దేశంతోనే కూటమితో కలిసి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మొత్తం మీద వైసీపీకి దొరబాబు రాజీనామా చేయడం ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేతకు బిగ్ షాక్ అనే చెప్పాలి. రోజురోజుకూ వైసీపీ బలహీనపడుతున్నదనడానికి మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతల వరుస రాజీనామాలే తార్కాణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.