పారిస్ ఒలింపిక్స్ నుంచి వినేష్ ఫోగట్ ఔట్.. కుట్ర కోణంపై అనుమానాలు
posted on Aug 7, 2024 @ 1:32PM
పారిస్ ఒలింపిక్స్ లో పతకం ఖాయం చేసుకున్న భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. పారిస్ ఒలింపిక్స్ లో ఆమె 50 కిలోల విభాగంలో పోటీ పడి ఫైనల్స్ కు చేరింది. స్వర్ణం లేదా రజత పతకం ఖాయం చేసుకుంది. ఇంతలోనే ఆమెపై ఒలింపిక్స్ సంఘం అనర్హత వేటు వేసింది. దీంతో ఆమె రిక్త హస్తంతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకే ఒలింపిక్స్ సంఘం ఆమెపై అనర్హత వేటు వేయడానికి కారణమేంటంటే ఆమె ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాముల బరువు ఎక్కువ ఉండటమే.
వినేశ్ పోగట్ అసలీ ఒలింపిక్స్ కు అర్హత సాధిస్తుందా? అన్న అనుమానాల నుంచి అతి గొప్ప పోరాట పటిమ చూపి ముందుకు సాగింది. తన క్యాటగరీని మార్చుకుని మరీ కఠోర శ్రమకు ఓర్చి అర్హత సాధించింది. అమోఘ ప్రదర్శనతో ఫైనల్ కు చేరింది. చివరికి కేవలం 100 గ్రామలు బరువు ఎక్కువ ఉందంటూ ఒలింపిక్స్ సంఘం ఆమెపై అనర్హత వేటు వేసింది.
గత ఏడాది బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో వినేష్ ఫోగట్ పోరాడారు. పోలీసు దెబ్బలతో పాటు అవమానాలు ఓర్చుకొని, దాదాపు ఏడాదిన్నర ఆటకు దూరమైనా… ఎంతో కష్టపడి ఒలంపిక్స్ కు అర్హత సాధించి, పట్టుదలగా ఆడి ఫలితం దక్కుతుందనుకుంటున్న దశలో ఒలింపిక్స్ అంతే పట్టుదలగా ఆడి… తన కష్టానికి ఫలితం దక్కుతుందనుకుంటున్న దశలో ఒలింపిక్స్ బరి నుంచి బయటకు రావాల్సి రావడం విషాదం.
కాగా వినేష్ పోగట్ పై అనర్హత వేటు వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అన్న అనుమానాలు కూడా క్రీడా వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. గత ఏడాది భారత రెజ్లర్స్ అసోసియేషన్ అప్పటి అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో వినేష్ ఫొగాట్ చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు.
రోజుల తరబడి రోడ్లపై ఉద్యమించి చివరకు ఆయన ఆ పదవి నుంచి వైదొలగడానికి కారణమయ్యారు. అప్పట్లో రెజ్లర్ల ఆందోళనను భారత ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయడానికి శతథా ప్రయత్నించింది. కానీ రెజ్లర్ల పట్టుదలకు తలవొంచక తప్పలేదు. ఇప్పుడు అనూహ్యంగా వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడటంతో దీని వెనుక ఏమైనా కుట్ర కోణం ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వినేష్ ఫోగట్ అస్వస్థతకు గురి కావడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు.