అధికారం బాబుదే.. అధికారులు భయపడేది మాత్రం జగన్ కే
క్రమశిక్షణ కలిగిన రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ పెట్టింది పేరు. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత పార్టీలో గీత దాటి వ్యహరించిన నేతలను ఇసుమంతైనా ఉపేక్షించరు. ప్రతిపక్ష నేతలను విమర్శించే సమయంలోనూ అసభ్యపదజాలం వాడితే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోరు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారమే చంద్రబాబు ధ్యేయం. తెలుగుదేశం పార్టీ నేతల లక్ష్యం కూడా అలాగే ఉండాలని ఆశిస్తారు. అలాగే ఉండమని ఆదేశిస్తారు. చంద్రబాబు నాలుగు దశాబ్దాలు పైబడిన రాజకీయ జీవితమంతా ఇలాగే కొనసాగింది. చంద్రబాబు తన నిబద్ధతతో తెలుగుదేశం పార్టీని దేశంలోని ఇతర రాజకీయ పార్టీలకు ఆదర్శంగా నిలిపారనడంలో సందేహం లేదు. అయితే గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కోనన్ని ఇబ్బందులను చవిచూశాడు. ఒక్కచాన్స్ ప్లీజ్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తరువాత తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. టీడీపీ నేతలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. దాడుల చేయడంతోపాటు అక్రమ కేసులతో జైళ్లకు పంపించాడు. దీంతో చాలామంది టీడీపీ నేతలు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జైళ్లకే పరిమితం అయిన పరిస్థితి. చివరికి చంద్రబాబు నాయుడుపైనా అక్రమ కేసు పెట్టి జైలుకు పంపించారు.
జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది మేమే.. నాలో మరో చంద్రబాబును చూస్తారంటూ వైసీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. కొందరు అధికారుల, పోలీసుల తీరుపైనా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ముఖ్యమంత్రిని అవుతున్నా.. హద్దులు మీరి ప్రవర్తించిన వారికి తగిన శాస్త్రి జరుగుతుందని హెచ్చరించారు. స్వతహాగా చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలకు దూరం. అయితే, గత ఐదేళ్ల వైసీపీ హయాంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పడిన ఇబ్బందులను చూసి చంద్రబాబు ఆవేశం కట్టలుతెంచుకుంది. అందుకే వైసీపీ నేతలకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఐదేళ్లు జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి ఎనిమిది నెలలు అయ్యింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచీ ఆయన రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమంపైనే దృష్టి పెట్టారు. తనకు ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతే ముఖ్యం అని గట్టిగా చెబుతున్నారు. ఇది తెలుగుదేశం క్యాడర్ లో ఒకింత అసంతృప్తికి కారణమౌతోంది. వైసీపీ హయాంలో రెచ్చిపోయిన నేతలపై పార్టీ శ్రేణులు ఆశించిన స్థాయిలో చంద్రబాబు కొరడా ఝుళిపించడం లేదన్న ఆగ్రహం పార్టీ క్యాడర్ లో వ్యక్తం అవుతోంది.
చంద్రబాబు మంచితనాన్ని ఆసరాగా చేసుకుంటున్న వైసీపీ నేతలు.. ఇంకా తామే అధికారంలో ఉన్నామన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి అయితే.. తానకు తానే తనకు లేని ప్రతిపక్ష హోదా ప్రకటించేసుకుని నేను ఎటుపోయినా గట్టి భద్రత ఇవ్వాలి అంటూ దాదాపు హెచ్చరికలు చేస్తున్నాడు. తాజాగా గుంటూరు మార్కెట్ యార్డులో జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు చేసిన రచ్చ మామూలుగా లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ ఉంది. పర్యటనకు అనుమతి లేదు అని అధికారులు స్పష్టంగా చెప్పినా జగన్ లెక్క చేయలేదు. మిర్చి రైతులకు సంఘీభావం తెలిపేందుకు జగన్ యార్డులోకి వెళ్లాడు. తన వెంట వైసీపీ నేతలు, కార్యకర్తలను పెద్దసంఖ్యలో సభకు తీసుకెళ్లినట్లు తీసుకెళ్లాడు. దీంతో మార్కెట్ యార్డులో వైసీపీ నేతల అరాచకానికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు వైసీపీ నేతలు రైతుల మిర్చి బస్తాలను దొంగిలించుకు పోయారు. అంతకుముందు జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించేందుకు వెళ్లిన సమయంలోనూ జగన్, వైసీపీ నేతలు హద్దులు మీరి ప్రవర్తించారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీ అసభ్యకర భాషతో చంద్రబాబు కుటుంబ సభ్యులను విమర్శించిన విషయం అందరికీ తెలిసిందే. దీనికితోడు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ కీలక సూత్రదారి. అంతేకాక.. టీడీపీ కార్యాలయం దగ్గ కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి వంశీ అడ్డంగా దొరికిపోయాడు. కానీ, జగన్ మోహన్ రెడ్డి మాత్రం వంశీ అమాయకుడు, అక్రమంగా కూటమి ప్రభుత్వం కేసులు పెట్టిందని అబద్ధాలను తేలిగ్గా చెప్పేశారు. దీనికితోడు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే.. వైసీపీ నేతలు, కార్యకర్తల జోలికి వస్తే బట్టలు ఊడదీసి నిలబెడతా అంటూ అధికారులకు హెచ్చరికలు సైతం జారీ చేశారు.
జగన్ హెచ్చరికలతో అధికారులు, పోలీసులుసైతం భయపడుతున్నారు. దీంతో అధికారంలో ఉన్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే అయినా, అధికార యంత్రాంగం మాత్రం ఇప్పటికీ జగన్ చెప్పినట్లే నడుస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. జగన్ లా కక్ష సాధింపు చర్యలకు పాల్పడరన్న ధీమాయే అధికారుల తీరుకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
జగన్ ఎన్నికల నియమావళికి ఉల్లంఘించి మరీ గుంటూరు మిర్చియార్డుకు వెళ్లారు. అక్కడ రాజకీయ ప్రసంగాలు చేశారు. మళ్లీ ఎదురు తనకు సరైన భద్రత కల్పించలేదని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అసలు ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా జగన్ ను మార్కెట్ యార్డులోకి అధికారులు ఎలా వెళ్ల నిచ్చారు? అంటే ఆపితే జగన్ ఆగ్రహానికి గురి కావలసి వస్తుందన్న భయమే అధికారులు తమ విధులను పక్కన పెట్టేయడానికి కారణమని భావించాల్సి వస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఆ ఫలితాన్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పటికే తెలుగుదేశం క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. జగన్ అరాచకపాలనలో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుని పార్టీ కోసం నిలబడిన తమకు, పార్టీ అధికారంలో ఉన్నా.. అధికార యంత్రాంగం ఇంకా జగన్ కే వత్తాసు పలుకుతున్న పరిస్థితి శ్రేణులకు మింగుడు పడటం లేదు. దీంతో వారు చంద్రబాబు మరీ ఇంత మెతకా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు తిలోదకాలిచ్చి, అధికారులపై బెదరింపులకు పాల్పడుతున్న వారిని చట్ట ప్రకారం శిక్షించే విషయంలో చంద్రబాబు ఉదాశీనత వీడకుంటే.. పార్టీ క్యాడర్ దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.