వంశీ కస్టడీ పిటిషన్ పై విచారణ వాయిదా
posted on Feb 20, 2025 @ 3:42PM
గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో అరెస్టై విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కస్టడీకి కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను కోర్టు శుక్రవారానికి (ఫిబ్రవరి 21) వాయిదా వేసింది.
వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్న వంశీని పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై పోలీసుల తరపున రాజేంద్రప్రసాద్, నిందితుడు వంశీ తరపున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. నిందితుడు వంశీ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవాలని, అందులో కీలకమైన ఆధారాలు ఉన్నాయని, దీంతో పాటుగా కిడ్నాప్‌కు ఉపయోగించిన కార్‌ను కూడా సీజ్ చేయాలని, ఈ నేపథ్యంలో విచారణ చేపట్టేందుకు నిందితుడు వంశీని పోలీసుల కస్టడీకి ఇవ్వాలని, రాజేంద్రప్రసాద్ వాదించారు. మరోవైపు నిందితుడు వల్లభనేని వంశీ తరఫు న్యాయవాది పొన్నవోలు తన వాదన వినిపిస్తూ వంశీని పోలీసు కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించారు. ఇరు పక్షాల వాదనలూ విన్న న్యాయమూర్తి విచారణకు శుక్రవారానికి వాయిదా వేశారు.