ఫార్ములా ఈ రేస్ కేసు.. ఎఫ్ఈవో సీఈవోను విచారించిన ఏసీబీ

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కీలక నిందితుడిగా ఉన్న ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తు సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ ను ఈడీ, ఏసీబీలు విచారించాయి. అవసరమైతే మరో సారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పాయి. అలాగే ఇదే కేసులో సీసియర్ ఐఏఎస్ అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని కూడా ఈడీ, ఏసీబీలు విచారించాయి.  ఆ తరువాత కొద్ది రోజుల పాటు ఈ కేసులో ఎటువంటి పురోగతీ కనిపించలేదు. అయితే ఇప్పడు మళ్లీ ఈ కేసు దర్యాప్తులో ఏసీబీ వేగం పెంచింది. ఈ కేసులో సొమ్ములు అందుకున్నట్లు చెబుతున్న ఒక విదేశీ సంస్థకు ఏసీబీ నోటీసులు పంపింది. ఎఫ్ ఈఓకు పంపిన నోటీసులలో వర్చువల్ గా విచారణకు రావాలని ఆదేశించింది. ఏసీబీ నోటీసుల మేరకు ఎఫ్ఈవో సంస్థ సీఈవో సోమవారం (ఫిబ్రవరి 17)న వర్చువల్ గా ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీబీ ఎఫ్ఈవో సీఈవో  ఆల్బర్టోను సుదీర్ఘంగా విచారించింది. పలు కీలక అంశాలపై ఏసీబీ అధికారులు ప్రశ్నలు గుప్పించారు.  ఫార్ములా ఈ-కార్ రేసు సీజన్ 9 చెల్లింపులు, లెటర్ ఆఫ్ ఇంటెంట్, లాంగ్ ఫార్మ్ అగ్రిమెంట్ వంటి అంశాలపై అల్బర్టోను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్లు తెలిసింది. 

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్.. నిజమేనా?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అవుతున్నారా? ఈ సారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరౌతారా? ప్రతిపక్ష నేతగా తన గళం వినిపిస్తారా? అన్న ప్రశ్నలకు బీఆర్ఎస్ వర్గాలు ఔననే అంటున్నాయి. తెలంగాణ ఆవిర్భావం నుంచి వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న కేసీఆర్..అహంకారపూరిత వ్యవహార శైలి కారణంగానే 2023 ఎన్నికలలో అధికారాన్ని కోల్పోయారు. జనం ఆయన అహంకారాన్ని భరించలేక బీఆర్ఎస్ పార్టీని ఓడించి సాగనంపారు.   దారుణమైన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, ఆత్మ విమర్శ చేసుకుని, పద్ధతులలో మార్పులు చేసుకోకుంటే మీ సేవలు మాకిక అవసరం లేదని ఓటు ద్వారా కుండబద్దలు కొట్టారు. అయితే ఓటమి తరువాత కూడా కేసీఆర్ లో మార్పు రాలేదు. బీఆర్ఎస్ ను ఓడించి ప్రజలు తప్పు చేశారంటూ ఓటమి తరువాత ఒకటి రెండు సందర్భాలలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.  కేసీఆర్ ఇప్పటికీ తనను తాను హిమాలయాలంత ఎత్తున ఉన్నట్టుగానే ఊహించుకుంటున్నారు. తాను పదేళ్ళపాటు అద్భుతమైన పరిపాలన అందించాననీ, తాను తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన విధానాలు అద్భుతమైనవనీ చెప్పుకుంటున్నారు. మేడిగడ్డ కుంగుబాటు చాలా చాలా చిన్న విషయమని చెబుతున్నారు. జనం శుష్కవాగ్దానాలకు లొంగిపోయి.. బీఆర్ఎస్ ను ఓడించి తప్పు చేశారని అంటున్నారు. అందుకు ఇప్పుడు బాధపడుతున్నారనీ, మళ్లీ తనవైపు, బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే ప్రజలలో ఈ పరివర్తన వచ్చింది కనుకే ఇప్పుడు తాను మళ్లీ రాజకీయాలలోకి వస్తున్నానని చెప్పకనే చెబుతున్నారు. ఇప్పుడు ఇక తానేమిటో చూపిస్తాననీ, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరై రేవంత్ సర్కార్ ను నిలదీస్తాననీ అంటున్నారు.   అంతే కాదు పార్టీ ఎమ్మెల్యేలకూ, మాజీ మంత్రులకు స్వయంగా ఫోన్ చేసి మరీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మిస్ కాకుండా హాజరు కమ్మడి ఆదేశిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తాను కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరౌతాననీ, ప్రభుత్వాన్ని సభ వేదికగా ఎండగడతాననీ చెబుతున్నారు.  2023 ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత ప్రజలకు ముఖం చాటేసిన కేసీఆర్ ఇప్పుడు ఏడాది తరువాత ఇక చూస్తోండి నా తడాఖా అంటున్నారంటూ నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. ఓటమి తరువాత రాజీనామాను సైతం స్వయంగా గవర్నర్ కు ఇవ్వకుండా తన పీఏతో పంపించి, రాత్రికి రాత్రి క్యాంప్ ఆఫీస్ ఖాళీ చేసి ఫామ్ హౌస్ కు పారిపోయిన కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో    శాసనసభ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు పక్కాగా వ్యూహరచన చేసుకున్నట్లు తెలుస్తోంది.   కెసిఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పదేపదే సవాల్ చేస్తున్నా ఇంత కాలం మౌనమే సమాధానం అన్నట్లుగా వ్యవహరించిన కేసీఆర్.. ఇఫ్పుడు  అసెంబ్లీ వేదికగా తన గళాన్ని వినిపించడానికి రెడీ అవుతున్నారు.  

కోర్టులో లొంగిపోయిన నందిగం సురేశ్ 

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్  సత్తెనపల్లి కోర్టులో లొంగిపోయారు. నందిగం సురేశ్  వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరియమ్మ అనే మహిళ కేసులో ఆయన 145 రోజుల జైలు జీవితం గడిపారు. అనారోగ్య కారణాలతో ఆయనకు బెయిల్ లభించింది.  అమరావతి ఉద్యమం సమయంలో అమరావతి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న కేసులో ఆయన సత్తెనపల్లి  కోర్టుకు వచ్చారు.  ఈ కేసులో ఆయన తప్పించుకుతిరుగుతున్నారు. . ఈ కేసు కూటమి ప్రభుత్వం వచ్చాక కదలిక వచ్చింది ఈ నేపథ్యంలోనే నందిగం సురేశ్ కోర్టులోనే  లొంగిపోయారు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం సురేశ్ తరపు న్యాయవాదులు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.  

గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి కేసులో లొంగిపోయిన ఇద్దరు

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో ఇద్దరు నిందితులు సరెండర్ అయ్యారు. టీడీపీ ఆఫీసుపైదాడికేసులో మొత్తం 88 మంది నిందితులు  ఉన్నారు. వారిలో జానీ, కలామ్ అనే వ్యక్తులు సోమవారం  గన్నవరం పోలీసులు ఎదుట లొంగిపోయారు.  వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా 2023లో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ఘటన  జరిగింది.  కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాక కేసును రీఓపెన్ చేశారు.  ఈ కేసులో ఏ71గా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఇటీవలె ఎపి పోలీసులు హైద్రాబాద్ లో అరెస్ట్ చేశారు. టిడిపి కార్యాలయంపై దాడి కేసులో కాకుండా   కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేశారు.  

ప్రయాగ్ రాజ్ లో నారా లోకేష్.. త్రివేణి సంగమంలో పుణ్య స్నానం

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ప్రయాగ్ రాజ్ లోని పవిత్ర త్రివేణి సంగమంలో ఆయన తన సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్ తో కలిసి పుణ్య స్నానం ఆచరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ఫొటోను ఎక్స్ లో పోస్టు చేసి రియల్లి బ్లెస్డ్ అని ట్యాగ్ ఇచ్చారు. కాగా ప్రయాగ్ రాజ్ కు వెళ్లిన నారా లోకేష్ తో పాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం రఘురామకృష్ణం రాజు, మంత్రులు గొట్టిపాటి రవి, డోలా వీరాంజనేయ స్వామి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి,  కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు ఉన్నారు. వీరంతా  పవిత్ర సంగమం వరకూ నదిలో పడవలపై ప్రయాణించారు. అనంతరం కాశీ విశ్వనాథుని ఆలయాన్ని సందర్శించారు. కాగా ఈ పర్యటనలో భాగంగా నారా లోకేష్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.   

వంశీ కనుసన్నలలోనే సత్యవర్థన్ కిడ్నాప్.. పోలీసుల వద్ద పక్కా ఆధారాలు?!

వంశీ కనుసన్నలలోనే టీటీడీ కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్ కిడ్నాప్ జరిగిందనడానికి పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారా? ఆయన కిడ్నాప్ నకు సంబంధించి సీసీ ఫుటేజీల ఆధారంగా వంశీ ప్రమేయాన్ని నిర్థారించుకున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తోంది. ఇప్పటికే పోలీసులు సత్యవర్థన్ ను రాయదుర్గంలోని వల్లభనేని వంశీ నివాసానికి తీసుకువెళ్లన సంఘటనకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజీని సేకరించారని చెబుతున్నారు. రాయదుర్గంలోని వల్లభనేని వంశీ నివాసం నుంచి సత్యవర్థన్ ను విశాఖ తరలించడం, అక్కడ నుంచి విజయవాడ కోర్టుకు తీసుకురావడం వరకూ పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉందని అంటున్నారు. వంశీ అనుచరులు సత్యవర్థన్ ను విశాఖ నుంచి విజయవాడ కోర్టుకు తీసుకురావడం, సత్యవర్థన్ కారు దిగి కోర్టులోకి వెళ్లి.. తిరిగి రావడం, అతడు వచ్చే వరకూ కోర్టు ఆవరణలోనే వంశీ అనుచరులు వేచి ఉండటానికి సంబంధించి సీసీ ఫుటేజీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో వల్లభనేని వంశీ ప్రమేయానికి సంబంధించిన లింకుల గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  వల్లభనేని వంశీని అరెస్టు చేసినప్పటికీ అతడి ఫోన్ ఇంకా పోలీసులకు చిక్కలేదు. అటు రాయదుర్గంలోని వంశీ నివాసంలోనూ, ఇటు వంశీ వద్దా ఆ ఫోన్ లేదు. రాయదుర్గంలోని వంశీ నివాసం నుంచి అతడిని అదుపులోనికి తీసుకోవడానికి ముందు వంశీ ఫోన్ లో చాలా సేపు మాట్లాడారు. ఆ తరువాత ఆ ఫోన్ మాయం అయ్యింది. దీంతో ఈ కేసులో అత్యంత కీలకమైన రంగా, కొట్లు, రాము అనే వ్యక్తుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ కేసులో 12 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం రెండు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. మరీ ముఖ్యంగా రంగా, కొట్లు, రాము అనే వ్యక్తులను దొరకబుచ్చుకంటే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. వీళ్లందరి ఫోన్లూ స్విచ్ఛఫ్ అయ్యి ఉండటంతో.. పోలీసులు వారి బంధువులు, స్నేహితులకు వచ్చే కాల్స్ పై నిఘా పెట్టారు.  ఇలా ఉండగా సత్యవర్థన్ తన కిడ్నాప్ నకు సంబంధించి ప్రతి  విషయాన్నీ పూసగుచ్చినట్లు పోలీసులు వివరించాడు. ఈ నేపథ్యంలో ఈ కేసులో వంశీ పూర్తిగా ఇరుక్కున్నట్లేనని న్యాయ నిపుణులు అంటున్నారు. అన్ని విషయాలనూ శాస్త్రీయంగా విశ్లేషించి, పక్కా ఆధారాలతోనే వంశీని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారని చెబుతున్నారు.  

టీమ్ జేఎన్‌జేకే కాంగ్రెస్  సంపూర్ణ మ‌ద్ద‌తు 

జెఎన్జె హౌసింగ్ సొసైటీకి జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో కాగ్రెస్ పార్టీ టీమ్ జేఎన్‌జేకు సంపూర్ణ‌ మ‌ద్ద‌తునిస్తోంద‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు బి.మ‌హేష్‌కుమార్‌గౌడ్ చెప్పారు.  గ‌తంలో బీఆర్ఎస్‌కు చెందిన వ్య‌క్తులు జ‌ర్న‌లిస్టుల‌ స్థ‌లాల‌ను ఆక్ర‌మించుకోవ‌డానికి ప్ర‌య‌త్నించార‌ని, దాన్ని తిప్పికొట్టేందుకు పోరాడిన టీమ్‌జేఎన్‌జేకు... నాడు టీపీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి గారు పూర్తి మ‌ద్ద‌తునిచ్చార‌ని ఆయ‌న గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే సీఎం రేవంత్‌రెడ్డి టీమ్‌జేఎన్‌జేకు ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నార‌న్నారు.  ఈసారి జ‌రగ‌నున్న సొసైటీ ఎన్నిక‌ల్లో టీమ్‌జేఎన్‌జే అభ్య‌ర్థుల‌ను అఖండ మెజార్టీతో గెలిపించాల‌ని పాత్రికేయ మిత్రుల‌కు ఆయ‌న‌ విజ్ఞ‌ప్తి చేశారు

కౌన్ బనేగా ఢిల్లీ సిఎం? 20న ప్రమాణ స్వీకారం

ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఎవరు ముఖ్యమంత్రి అనే ఉత్కంఠం నెలకొంది. ఢిల్లీ సిఎం రేసులో అనేక పేర్లు వినిపిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రిని ఓడించిన పర్వేశ్  వర్మ  పేరు ప్రముఖం వినిపిస్తుంది. ఈ నెల 19న శాసనసభాపక్షనేత ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపినడ్డా అధ్యక్షతన ఈ శానససభా పక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ చివరిక్షణంలో వాయిదాపడింది. 20న ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇద్దరు ఉపముఖ్యమంత్రుల పేర్లు వెల్లడించే అవకాశం ఉంది. ఢిల్లీ రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుంది. ముఖ్యమంత్రి పేరు ఇంకా  బిజెపి ప్రకటించకపోవడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

కేశినేని నానికి కమలం కండువా అంత వీజీ కాదు!

కేశినేని నాని రాజకీయ సన్యాసం పుచ్చుకున్న తరువాత ఇప్పుడు మళ్లీ ఆయన మనసు పాలిటిక్స్ వైపు మళ్లినట్లు కనిపిస్తున్నది. వరుసగా రెండు సార్లు విజయవాడ లోక్ సభ స్థానం నుంచి తెలుగుదేశం ఎంపీగా విజయం సాధించిన కేశినేని నాని, ఆ తరువాత అహం తలకెక్కి సొంత పార్టీపైనే తిరుగుబావుటా ఎగుర వేశారు. కేశినేని ట్రావెల్స్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న నాని రాజకీయ అరంగేట్రం తెలుగుదేశం పార్టీ ద్వారా జరిగింది. 2014, 2019 ఎన్నికలలో ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా విజయవాడ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు.  తెలుగుదేశంలో ఆయనకు సముచిత ప్రాధాన్యం కూడా లభించింది. అయితే 2024 ఎన్నికల ముందు ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ గూటికి చేరారు. ఆయన తెలుగుదేశం పార్టీని వీడారనడం కంటే తెలుగుదేశం పార్టీయే ఆయనను వద్దనుకుందని అనడం కరెక్ట్. కేశినేని నాని వ్యవహార శైలి, వైసీపీ నేతలతో రాసుకుపూసుకు తిరగడం ద్వారా తన ఉద్దేశాలను చాటిన నానిని ఇక పార్టీకి నీ సేవలు చాలు అని చంద్రబాబు మర్యాదగా చెప్పారు. ఆ విషయాన్ని స్వయంగా నానియే అప్పట్లో చెప్పారు కూడా. సరే ఏది ఏమైతేనేం.. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన కేశినేని నానికి ఆయన సొంత సోదరుడు, తెలుగుదేశం అభ్యర్థి కేశినేని చిన్ని చేతిలో ఘోర పరాభవం ఎదురైంది.   ఆ పరాజయ పరాభవాన్ని జీర్ణించుకోలేకపోయిన నాని రాజకీయ సన్యాసం ప్రకటించారు. ప్రకటించినట్లుగానే రాజకీయాలకు దూరంగా ఇంత కాలం ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన చూపు మళ్లీ రాజకీయాల వైపు మళ్లంది. ఎంపీగా ఉండగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలతో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని ఇప్పుడు ఆయన కమలం పార్టీకి చేరువ కావడానికి ప్రయత్నిస్తున్నారు. తరచూ బీజేపీ నేతలతో రహస్య భేటీలు నిర్వహిస్తున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. తాజాగా ఇటీవల కేశినేని నాని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో భేటీ అయినట్లు వెల్లడి కావడంతో ఆయన కమలం గూటికి చేరబోతున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. కేశినేని నాని వాటిని ఖండించారు. అయితే తన వర్గీయులతో నిర్వహించిన భేటీలో తాను రాజకీయాలకు మాత్రమే దూరం అయ్యాననీ, ప్రజాసేవకు కాదని చెప్పడం ద్వారా.. తన రాజకీయ జీవితం ముగిసినట్లు కాదని సంకేతాలు ఇచ్చారు.  అయితే ఆయన బీజేపీ గూటికి చేరడానికి చేస్తున్న ప్రయత్నాలే  ఆయన అడుగులు ముందుకు సాగుతాయా అన్న అనుమానాలు వ్యక్తం కావడానికి కారణమౌతున్నాయి. తెలుగుదేశంతో రాష్ట్రంలో బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతోంది. అటు కేంద్రంలో  బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వ మనుగడ దాదాపుగా తెలుగుదేశం మద్దతుపైనే ఆధారపడి ఉంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ కేశినేని నానికి తలుపులు తెరుస్తుందా? తెరిచినా ఆయనకు సముచిత స్థానం ఇవ్వగలుగుతుందా? అన్నిటికీ మించి తెలుగుదేశం ఎంపీ కేశినేని చిన్ని ఉండగా, విజయవాడ నియోజకవర్గంలో కేశినేని నాని రాజకీయాలు చేయడానికి అనుమతిస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  తెలుగుదేశంతో కేశినేని నాని పొలిటికల్ జర్నీ ముగిసినట్లే.. ఆయన ఎంత గట్టిగా తట్టినా ఆ పార్టీ తలుపులు తెరుచుకునే అవకాశాలు ఇసుమంతైనా లేవన్నది వాస్తవం. ఈ పరిస్థితుల్లో కమలం ఆయనకు కండువా కప్పి అక్కున చేర్చుకునే అవకాశాలు లేవనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

కేటీఆర్ అరెస్టు.. ఇక అంతే సంగతులా?

ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్టు  అంటే నెల రోజుల కిందటి వరకూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ కేసులో కేటీఆర్ నిండా ఇరుక్కున్నారనీ, ఇహనో ఇప్పుడో  ఆయన అరెస్టు ఖాయమని రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ, ఏసీబీ కూడా ఆయనను విచారించాయి. కోర్టు కూడా ఆయనకు అరెస్టు నుంచి పూర్తి రక్షణ కల్పించలేదు. ఈ కేసులో ఈడీ విచారణలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇరువురు కేటీఆర్ కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారని కూడా వార్తలు వచ్చాయి. దీంతో సంక్రాంతి తరువాత ఏ క్షణంలోనైనా కేటీఆర్ అరెస్టు అవుతారని పరిశీలకులు కూడా విశ్లేషించారు. కేటీఆర్ కూడా తన అరెస్టు లాంఛనమేనన్న భావనకు వచ్చేశారనీ, అందుకే అరెస్టు అయితే ఫిట్ నెస్ పెంచుకుని జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత పాదయాత్ర చేస్తానని ప్రకటించారు కూడా. అయితే సంక్రాంతి వచ్చింది, వెళ్లిపోయింది కూడా. సంక్రాంతి వెళ్లి నెల రోజులు దాటిపోయింది. అయినా కేసీఆర్ అరెస్టు కాదు కదా, అసలు ఈ ఫార్ములా రేసు కేసు దర్యాప్తు పరోగతి కూడా ఏమీ లేకుండా పోయింది. అసలు ఈడీ, ఏసీబీలు ఆ కేసు దర్యాప్తు సంగతే మరచిపోయాయా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ కూడా ఏమీ మాట్లాడటం లేదు.  ఈ కేసుకు సంబంధించి తెరవెనుక ఏదైనా జరిగిందా అన్న అనుమానాలు జనబాహుల్యంలో వ్యక్తం అవుతున్నాయి. కేటీఆర్ ఇటీవల హస్తినలో పర్యటించారు. కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఏమైనా జరిగి ఈ కేసు దర్యాప్తు వెనక్కు వెళ్లిందా అంటూ రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  హస్తిన ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి తరువాత.. అవినీతి కేసులో అరెస్టైతే ప్రజల సానుభూతి ఉండదన్న విషయం తేటతెల్లమైపోయిందనీ, సో ఇక కేటీఆర్ ను అరెస్టు చేస్తే సానుభూతి వెల్లువెత్తుతుందన్న భరోసా లేకపోవడంతో రేవంత్ సర్కార్ కేటీఆర్ అరెస్టు విషయంలో మరింత దూకుడుగా ముందుకు వెడుతుందనీ పరిశీలకులు అంచనా వేశారు. అయితే అందుకు భిన్నంగా ఈ కేసు గురించి  దర్యాప్తు సంస్థలు, అధికార కాంగ్రెస్ కూడా పూర్తిగా మౌనం వహించడంతో ఈ ఫార్ములా రేసు కేసు ఇక అంతే సంగతులా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు మాజీ పీఏ అరెస్టు.. నెక్స్ట్ ఎవరు?

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు పీఏను అరెస్టు చేశారు.  హరీష్ రావు పిఏ వంశీకృష్ణను పోలీసులు శనివారం (ఫిబ్రవరి 15) అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు మాజీ మంత్రి హరీష్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, మరి కొందరిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం ఈ కేసులో తొడుపునూరి సంతోష్ కుమార్, బండి పరశురాములు, వంశీ కృష్ణలను అరెస్టు చేశారు. వీరిలో వంశీ కృష్ణ గతంలో అప్పటి మంత్రి హరీష్ రావు పేషీలో పీఏగా పని చేశారు. వంశీకృష్ణ స్వస్థలం సిద్దిపేట కావడం గమనార్హం. నల్గొండ జిల్లా ఆరోగ్య శ్రీ మేనేజర్ గా కూడా పని చేశారు.  కాగా పోలీసులు వంశీ కృష్ణను అరెస్టు చేయడంతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనకు సహకరించిన పరుశురాములు, సంతోష్ కుమార్ లను కూడా అదుపులోనికి తీసుకుని కోర్టులో ప్రవేశ పెట్టగా కోర్టు వారికి ఈ నెల 28 వరకూ రిమాండ్ విధించింది. దీంతో వారిని చంచలగూడ జైలుకు తరలించారు.  ఈ కేసులో హరీష్ రావును కూడా అరెస్టు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఎందుకంటే ఈ కేసులో హరీష్ రావు ఏ1గా ఉన్నారు. ఇప్పుడు ఆయన మాజీ పీఏను పోలీసులు అరెస్టు చేయడంతో ఇక హరీష్ రావును కూడా అరెస్టు చేసే దిశగా అడుగులు పడుతున్నాయని అంటున్నారు. 

ఏపీలో స్కూలు పిల్లలకు విజ్ణాన విహార యాత్రలు!

రాష్ట్రంలో విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను విజ్ణాన విహార యాత్రలను పంపాలని నిర్ణయించింది. మనోవికాసం, స్కిల్ డెవలప్ మెంట్, సాంకేతిక అంశాలపై ఆసక్తి పెంపొందించడం కోసం ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదివే  విద్యార్థులను విజ్ణాన, విహార  యాత్రలకు పంపాలన్న నిర్ణయం తీసుకుంది. ఈ విజ్ణాన విహార యాత్రలు రాష్ట్రానికే పరిమితం కాదు, ఇతర రాష్ట్రాలలకు కూడా పంపి వారిలో ఉత్సాహాన్ని, ఉత్సుకతను పెంచాలని భావిస్తోంది. ఇందు కోసం అవసరమైన బడ్జెట్ ను కూడా కేటాయించనుంది.  రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7, 784 మంది విద్యార్థులను విజ్ణాన, విహార యాత్రలకు తీసుకువెళ్ల నుంది.  రాష్ట్ర పరిధిలో అయితే ఈ యాత్ర కోసం ఒక్కో విద్యార్థికి 200 రూపాయలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున ఖర్చు చేయనుంది. ఇందు కోసం విజ్ఞాన విహార యాత్రలకు సంబంధించి నిధుల కేటాయింపు, విద్యార్థులు, ఎస్కార్టు ఉపాధ్యాయుల ఎంపిక తదితర అంశాలపై ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఇప్పటికే ఇంటర్మీడియేట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు విద్యార్థులలో పరిశీలన, పఠనాశక్తి పెంచేందుకు విజ్ణాన విహార యాత్రలకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులలో మనో వికాసానికీ, నైపుణ్యాభివృద్ధికీ ఈ యాత్రలు ఎంతగానో దోహదం చేస్తాయని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. 

జగన్ హయాంలో గుంతల మయం.. ఇప్పడు అద్దంలా మెరుస్తున్న వైనం!

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రోడ్లు అద్దాల్లా మెరిసిపోతున్నాయ్. జగన్ హయాంలో అడుగుకో గుంత అన్నట్లుగా ఉండే రోడ్లు..  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువు దీరిన తరువాత  బాగుపడ్డాయి. జగన్ తన ఐదేళ్ల పాలనలో బటన్ నొక్కుడుకు తప్ప మరే విషయాన్నీ పట్టించుకోలేదు. ప్రజల  గుంతల రోడ్లపై ప్రయాణించలేక నరకయాతన అనుభవిస్తున్నా పట్టించుకోలేదు. ఉచితాలు పందేరం చేస్తున్నా.. నన్ను కాక ఇంకెవరిని ఎన్నుకుంటారు అన్నట్లుగా వ్యవహరించారు. అయితే కేవలం బటన్ నొక్కి సొమ్ములు పందేరం చేయడం ఒక్కటే పాలన అని ప్రజలు భావించలేదు. ఐదేళ్ల పాటు తమకు నరకాన్ని చూపించిన జగన్ కు గత ఏడాది జరిగిన ఎన్నికలలో గుణపాఠం చెప్పారు. జగన్ బాబూ మీకు పాలన చాతకాదు.. ఇక ఇంటికి దయచేయడం అని ఓటుతో గట్టి బుద్ధి చెప్పారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా వైసీపీని అసెంబ్లీలో కేవలం 11 అంటే 11 సీట్లకు పరిమితం చేశారు. జగన్ కు ఆయన సొంత నియోజకవర్గం అయిన పులివెందుల ప్రజల సైతం గట్టి షాక్ ఇచ్చారు. సొంత జిల్లా కడపలో మెజారిటీ సీట్లలో ఓడించిన జనం.. పులివెందులలో జగన్ మెజారిటీని గణనీయంగా తగ్గించేశారు.  ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపడుతూనే రోడ్ల మరమ్మతులపై దృష్టి సారించారు. నిర్దిష్ట సమయంలో రోడ్లపై గుంతలు కనిపించకుండా మరమ్మతులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో రోడ్లు అద్దాల్లా తయారయ్యాయి. మచ్చుకైనా ఒక్కటంటే ఒక్క గుంత కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాడు జగన్ హయాంలో రోడ్లపై ప్రయాణం అంటే నరకంలా ఉందనీ, ఇప్పుడు స్వర్గంలా మారిందని అంటున్నారు. ఇదే విషయాన్ని నెటిజనులు కూడా సాక్ష్యాలుగా అప్పటి ఫొటోలు, ఇప్పటి ఫోటోలు సామాజిక మాధ్యమంలో పోస్టు చేస్తూ జగన్ పాలన నరకం, బాబు పాలన స్వర్గం అంటూ కామెంట్లు పెడుతున్నారు. తాజాగా గుంటూరులోని  ఆగ్రహారం రోడ్లుకు సంబంధించి జగన్ పాలనలో ఆ రహదారి దుస్థితిని, ఇప్పుడు అద్దంలా మెరిసిపోతున్న పరిస్థితిని తెలియజేసేలా ఫొటోలు పోస్టు చేశారు. ఆ ఫొటోలు వెంటనే తెగ వైరల్ అయ్యాయి. జనం.. చంద్రబాబు సమర్ధతను, ప్రజల ప్రయోజనాలు, వారి సమస్యల పరిష్కారానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో చెప్పడానికి ఇదే నిదర్శనం అంటున్నారు.  ఇదే అగ్రహారం రోడ్డు జగన్ హయాంలో గుంతలతో నిండి, వర్షాకాలంలో స్విమ్మింగ్ పూల్ ను తలపించేలా ఉండేది. అప్పట్లో ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు సంభవించేవి. పలువురు మరణించగా, మరింత మంది ఆస్పత్రుల పాలయ్యారు. అదే రోడ్డు ఇప్పుడు  గుంతలనేవి లేకుండా, రోడ్డు మధ్య డివైడర్ తో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా మారిపోయింది. జనం ఈ రోడ్డు పై ప్రయాణిస్తూ నిత్యం జగన్ పాలనలో ఈ రోడ్డు పై ప్రయాణం అంటే నరకయాతనగా ఉందని, ఇప్పుడెంతో హాయిగా ఉందని వ్యాఖ్యలు చేస్తున్నారు.   

ఢిల్లీలో భూకంపం

దేశ రాజధాని ఢిల్లీలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాలలోనూ ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంప కేంద్రం ఢిల్లీలో భూమి అడుగుల 5 కిలోమీటర్ల లోతులో  ఉందని సిస్మాలజీ అధికారులు తెలిపారు.   సోమవారం తెల్లవారు జామున ఒక్కసారిగా భూమి కంపించింది. ఢిల్లీ తో పాటు ఎన్సీఆర్ ప్రాంతంలోనూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.   ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో భూమి కంపించింది. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు. 

టీకాంగ్రెస్‌లో ఏం జ‌రుగుతోంది?

తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జ‌రుగుతోంది..? నేత‌లు వ‌ర్గాల వారిగా విడిపోయారా? త‌మ ఆధిప‌త్యం కోసం పార్టీకి, ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తెస్తున్నారా? క్ర‌మంగా ప్ర‌భుత్వానికి ప్ర‌జా మ‌ద్ద‌తు త‌గ్గిపోతోందా? ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సార‌థ్యంలో ఎన్నిక‌ల హామీల‌ను ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు ప్ర‌భుత్వం ప‌ట్ల వ్య‌తిరేక‌త‌ను వ్య‌క్తం చేస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. నెల రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఓ అంత‌ర్గ‌త స‌ర్వేలో ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త వ‌చ్చిద‌ని కాంగ్రెస్ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది. పార్టీకి, ప్ర‌భుత్వానికి మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేక‌పోవ‌టంతో ప్ర‌భుత్వానికి చెడ్డ‌ పేరు వ‌స్తుంద‌న్న విష‌యాన్ని పార్టీ అధిష్ఠానం పెద్ద‌లు గుర్తించారని అంటున్నారు‌. ఈ క్ర‌మంలోనే పార్టీలోనూ, ప్ర‌భుత్వంలోనూ కీల‌క మార్పులు చేసేందుకు రాహుల్ గాంధీ టీం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే మొద‌టి వేటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి దీపాదాస్ మున్షీపై ప‌డింద‌ని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. ఆమె స్థానంలో రాహుల్ గాంధీకి అత్యంత న‌మ్మ‌క‌స్తురాలైన‌ మీనాక్షి న‌ట‌రాజ‌న్ ను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా రాహుల్ గాంధీ నియ‌మించారు.   దీపాదాస్ మున్షీని ప‌క్క‌కు త‌ప్పించ‌డం ప‌ట్ల కాంగ్రెస్‌లోని మెజార్టీ నేత‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు‌.  తెలంగాణ ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతున్న వేళ‌.. త్వ‌ర‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతున్న వేళ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు రాజ‌కీయ వ‌ర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.  అయితే  పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేయడంలో దీపాదాస్ మున్షీ ఫెయిల్‌ అయ్యారన్న విమర్శలు కూడా ఉన్నాయి. పార్టీలో సీనియర్లను ఏ మాత్రం పట్టించుకోకుండా తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుని దీపాదాస్ మున్షీ ఏకపక్షంగా వ్యవహరించారని మెజార్టీ శాతం నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో కీలకంగా ఉన్నవారితో కూడా దీపాదాస్‌కు ఏ మాత్రం కోఆర్డినేషన్ లేదని కాంగ్రెస్ వ‌ర్గాల్లో టాక్ ఉంది. మ‌రోవైపు.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర‌ పార్టీ అధ్య‌క్షుడు మ‌హేశ్ కుమార్ గౌడ్ నిర్ణ‌యాల‌తో ప్ర‌మేయం లేకుండా ఆమె సొంత నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని.. పార్టీలోనే కాక ప్ర‌భుత్వంలోనూ ఆమె జోక్యం పెరిగింద‌న్న వాద‌న ఉంది. కొంత‌మంది అధికారుల‌ను త‌న ద‌గ్గ‌ర‌కు పిలిపించుకుని ప‌నులు చేయించుకున్నార‌న్న టాక్ ఉంది. అయితే గ‌తంలో ఈ విష‌యంపై మీడియా ప్ర‌శ్నించ‌గా రేవంత్ రెడ్డి, మ‌హేశ్ కుమార్ గౌడ్ లు అదేంలేద‌ని కొట్టిపారేశారు. కానీ, పార్టీలో ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌కు తోడు ప్ర‌భుత్వంలో జోక్యం పెర‌గ‌డంతో ఆమెపై రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పెద్ద‌ల‌కు రాష్ట్ర పార్టీ నేత‌లు ప‌లుసార్లు ఫిర్యాదులు సైతం చేశార‌ని తెలుస్తోంది. ముఖ్యంగా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో కాంగ్రెస్ నేత‌లు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేసేందుకు రేవంత్ స‌ర్కార్ అహ‌ర్నిశ‌లు కృషి చేస్తుంది. ఇప్ప‌టికే మ‌హిళ‌ల‌కు ఫ్రీ బ‌స్సుతోపాటు రైతు రుణ‌మాఫీ, రైతు భ‌రోసా నిధులు విడుద‌ల, ఇంధిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కం, ఇంధిరమ్మ ఆత్మీయ భ‌రోసా, కొత్త రేష‌న్ కార్డులు ఇలా అనేక ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తుంది. వీటిని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లడంలో కేత్ర‌స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు కాంగ్రెస్ నేత‌లు విఫ‌ల‌మ‌వుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి బాగాలేక‌పోయినా.. రైతు రుణ‌మాఫీని రేవంత్ స‌ర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని అమ‌లు చేసింది. కానీ, చివ‌రికి ప్ర‌భుత్వానికే చెడ్డ‌పేరు వ‌చ్చింది. దీనికి కార‌ణం.. రుణ‌మాఫీ అమ‌లును ప్ర‌జ‌ల్లోకి పార్టీ నేత‌లు బ‌లంగా తీసుకెళ్ల‌క‌పోవ‌ట‌మే. ఈ విష‌యంలో పార్టీని, ప్ర‌భుత్వాన్ని స‌మ‌న్వ‌య ప‌ర్చ‌డంలో దీపాదాస్ మున్షీ విఫ‌ల‌మ‌య్యార‌న్న వాద‌న బ‌లంగా ఉంది. దీనికితోడు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, ఆమెకు మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డింద‌న్న చ‌ర్చ‌కూడా కాంగ్రెస్ వ‌ర్గాల్లో ఉంది. దీంతో రాహుల్ గాంధీ టీం రంగంలోకిదిగి ఆమెను రాష్ట్ర పార్టీ ఇంచార్జి బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించార‌ని స‌మాచారం. కొత్త ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు. మున్షీ స్థానంలో ఆమె ఫుల్ టైం కార్యకలాపాలు కొనసాగించనున్నారు.  రాహుల్‌గాంధీ టీమ్‌లో కీ పర్సన్‌గా మీనాక్షికి పేరుంది. అయితే, ఆమె ముందు అనేక స‌వాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా పార్టీ నేత‌ల్లో ఐక్య‌త కోసం ఆమె ప్ర‌య‌త్నాలు చేయాల్సి ఉంది. పార్టీకి, ప్ర‌భుత్వానికి మ‌ధ్య స‌మ‌న్వ‌యం పెంచి ప్ర‌భుత్వ ప‌థ‌కాలకు గ్రామ స్థాయి నుంచి విస్తృత ప్ర‌చారం పొందేలా మీనాక్షి చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికితోడు త్వ‌ర‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల స‌మ‌యం నాటికి గ్రామ స్థాయిలో ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై నెల‌కొన్న వ్య‌తిరేక‌త‌ను తొల‌గించి, కాంగ్రెస్ ప్ర‌భుత్వం అద్భుత పాల‌న అందిస్తున్నద‌న్న భావన ప్రజలలో కలిగేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవ‌న్నీ స‌క్ర‌మంగా జ‌ర‌గాలంటే.. పార్టీ నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త‌తో పాటు.. పార్టీకి, ప్ర‌భుత్వానికి మ‌ధ్య స‌మ‌న్వ‌యం కొన‌సాగేలా చేయాలి. ఆమేర‌కు మీనాక్షి న‌ట‌రాజ‌న్ ఏ మేర‌కు విజ‌య‌వంతం అవుతార‌న్న అంశం కాంగ్రెస్ వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేపుతుంది. అయితే, మీనాక్షి న‌ట‌రాజ‌న్ రాహుల్ గాంధీకి విశ్వాసపాత్రురాలు. ఒక విధంగా చెప్పాలంటే ఆమె రాహుల్ కు న‌మ్మిన బంటు. ఈ ప‌రిస్థితుల్లో రాష్ట్రంలోని కాంగ్రెస్ నేత‌లు ఏ మాత్రం త‌ప్పుచేసినా నేరుగా రాహుల్ వ‌ద్ద‌కు ఫిర్యాదులు వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ నేత‌లు సైతం వ‌ర్గాలుగా విడిపోకుండా ఐక్య‌తారాగంతో పార్టీ బ‌లోపేతంపై దృష్టిసారిస్తూ.. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్తార‌ని కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు భావిస్తున్నారు.