అసెంబ్లీకి ముఖం చాటేసిన కేసీఆర్ పై హైకోర్టులో పిటిషన్
posted on Feb 21, 2025 @ 11:03AM
గజ్వేల్ నియోజకవర్గం నుంచి గెలుపొంది అసెంబ్లీకి రాని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్... అసెంబ్లీకి గైర్హాజరు అవుతున్నారు. కేసీఆర్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫార్మర్స్ ఫెడరేషన్ కు చెందిన విజయ్ పాల్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రజల పక్షాన అసెంబ్లీలో అడుగుపెట్టాలని, అసెంబ్లీకి గైర్హాజరైతే ఎమ్మెల్యే సభ్యత్వంపై వేటు వేయాలని విజయ్ పాల్ రెడ్డి కోరారు. కేసీఆర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహించాలని , ఆయన స్థానంలో వేరే అభ్యర్థిని పోటీ చేయించాలని పిటిషనర్ కోరారు.
కెసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొట్టడంపై గజ్వేల్ నియోజకవర్గ ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత ప్రారంభమైంది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమౌతుంది.
2023 డిసెంబర్ 16న ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. అప్పట్నుంచి కెసీఆర్ అసెంబ్లీకి రాలేదు. స్పీకర్ కార్యాలయం నుంచి కానీ, ఆయన కార్యాలయం కానీ ఎలాంటి ప్రొసీడింగ్స్ చేపట్టలేదు. ప్రజల గొంతుకను అసెంబ్లీలో వినిపించేందుకు ఎమ్మెల్యేల జీతాలు ఇస్తున్నారు. ఈ జీతాలు కూడా ఇటీవల పెంచారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతలను నిర్వహించలేకపోతే ఆయనను ఆ బాధ్యతల నుంచి తొలగించాలని అనే వాదన వినిపిస్తుంది. శాసన వ్యవస్థ, అధికారులు తీసుకునే రాజకీయ, ఆర్థిక నిర్ణయాలను సమీక్షించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంది.