చాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా శుభారంభం.. తొలి మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన శుభమన్ గిల్
posted on Feb 21, 2025 8:57AM
చాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా శుభారంభం చేసింది. బంగ్లాదేశ్ లో గురువారం జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా సునాయాస విజయం సాధించింది. చాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ లోనే అలవోక విజయాన్ని అందిపుచ్చుని టీమ్ ఇండియా ఆత్మ విశ్వాసాన్ని ప్రోది చేసుకుని ఆదివారం (ఫిబ్రవరి 23) పాకిస్థాన్ తో మ్యాచ్ కు రెడీ అయిపోయింది.
ఇక బంగ్లాదేశ్ తో జరిగి మ్యాచ్ లో టీమ్ ఇండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బాల్ తో మహ్మద్ షమీ అమోఘంగా రాణిస్తే, బ్యాటింగ్ లో శుభమన్ గిల్ అజేయ సెంచరీ సాధించి టీమ్ ఇండియాను గెలిపించాడు. శుభమన్ గిల్ కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గురించి చెప్పుకోవలసిందేమైనా ఉంటే అది హిద్రోయ్ బ్యాటింగ్ గురించి మాత్రమే. కేవలం 35 పరుగులకే సగం జట్టు పెవిలియన్ కు చేరిన తరుణంలో హిద్రోయ్ అద్భుతంగా ఆడి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. 35 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి బంగ్లాదేశ్ 228 పరుగుల స్కోరు చేయగలిగిందంటే అది హ్రిదోయ్ పుణ్యమే.
తొలుత ఆచి తూచి ఆడిన హ్రిదోయ్ సింగిల్స్ తో స్కోరు బోర్డును నెమ్మదిగా కదిలిస్తూ, అవకాశం వచ్చినప్పుడు బౌండరీలతో చెలరేగుతూ ఇన్నింగ్స్ ను నిర్మించాడు. హ్రిదోయ్ 118 బంతుల్లో వంద పరుగులు చేశాడు. అతడికి జకీర్ అలీ సహకారం అందించాడు. జకీర్ అలీ 114 బంతుల్లో 68 పరుగులు చేశాడు. చివరికి బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఐదు వికెట్లతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ వెన్ను విరిచాడు. హర్షిత్ రాణా మూడు వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు.
ఇక 229 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా 46.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు చెరో 41 పరుగులు చేశారు. శుభమన్ గిల్ అజేయ సెంచరీ సాధించాడు. కోహ్లీ మరో సారి విఫలమయ్యాడు.