జగనన్నా..జనంలోకి రాకన్నా!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డికి సొంత పార్టీ నుంచే విజ్ణప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని పార్టీ వర్గాలే బాహాటంగా చెబుతున్నారు. వైసీపీ అధినేత జగన్ జనంలోకి రాకుండా ఉంటేనే పార్టీ ఆబోరు కొంచమైనా దక్కుతుందన్నది వైసీపీ శ్రేణులు, నాయకుల అభిప్రాయంగా కనిపిస్తోంది. అందుకో జగన్ జనంలోకి వస్తానంటే వద్దు బాబోయ్ అని గగ్గోలు పెడుతున్నారు. జగనన్నా.. జనంలోకి రావద్దన్నా.. అంటే విజ్ణప్తులు చేస్తున్నారు. వైసీపీ నేతలు, క్యాడర్ ఒత్తిడి కారణంగానే జగన్ తన జిల్లాల పర్యటన వాయిదా వేసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
జగన్ రాజకీయ అరంగేట్రం చేసి 15 సంవత్సరాలు అయినప్పటికీ, ఇప్పటికీ ఆయన రాజకీయ నేతగా కాకుండా, ఒక ఫ్యాక్టనిస్టుగానే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
అధికారంలో ఉన్న ఐదేళ్లూ జనానికి ముఖం చూపకుండా, జనం ముఖం చూడకుండా తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమై పాలన సాగించిన జగన్.. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరవాత జనంలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నాలకు జనం నుంచి విముఖత వ్యక్తం అవుతోందనీ, అందుకే ఆయన బయటకు వస్తున్నారంటే జనాలను సమీకరించడం ఎలా అన్న భయంతో వణికి పోతున్నామనీ వైసీపీ లీడర్లే చెబుతున్నారు. అధికారంలో ఉండగా నిత్యం తెలుగుదేశం, జనసేన నేతలూ, క్యాడర్ లపై వేధింపులు, తప్పుడు కేసులు అంటూ కక్ష సాధింపు చర్యలతో గడిపేసిన జగన్ ఎన్నడూ రాష్ట్ర ప్రగతి గురించి కానీ, ప్రజల సమస్యల గురించి కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. బటన్ లు నొక్కుతున్నాను కదా? లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు పడుతున్నాయి కదా? అది చాలు అన్నట్లుగా జగన్ తీరు ఉంది.
ఇక సీఎంగా తన ఐదేళ్ల పదవీ కాలంలో ఆయన ఎన్నడూ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ప్రెస్ నోట్లు పంపడం, లేదా మీడియా ముందుకు సకలశాఖల మంత్రి సజ్జలను పంపి తన మాట ఆయన నోట వినండి అన్నట్లుగా వ్యవహరించడంతోనే సరిపెట్టేశారు.
2019 ఎన్నికలలో వైసీపీ విజయానికి కర్తాకర్మాక్రియా తానేనని జగన్ బాహాటంగానే చెప్పుకున్నారు. అదే విధంగా 2024 ఎన్నికలలో కూడా తన ముఖారవిందమే చాలు జనం ఓట్లు వేయడానికి అన్నట్లుగానే వ్యవహరించారు. ఇష్టారీతిగా అభ్యర్థులను మార్చేశారు.
సరే అదంతా పక్కన పెడితే 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. 175 స్థానాలలో పోటీ చేసిన వైసీపీ కేవలం 11 స్థానాలలోనే విజయం సాధించింది. గెలుపునకు కర్తా, కర్మా, క్రియా అన్నీ తానేనని జగన్ ఎలా జభావించారో, ఓటమికి కూడా తానే కారణమని జగన్ భావించి ఉంటే.. పార్టీ పరాజయానికి కారణాలపై, అధికారంలో ఉండగా తాను చేసిన తప్పులపై సమీక్ష చేసుకునే వారు, ఆత్మ విమర్శ చేసుకుని, పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టేవారు. అయితే జగన్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే పరాజయం పాలయ్యామనీ, సింహంలా సింగిల్ గా వారడం వల్లే కూటమి విజయం సాధ్యమైందనీ, బటన్లు నొక్కి తాను పంచిన సొమ్ములు తీసుకున్న జనం ఓటు వేయకుండా మోసం చేశారనీ కారణాలు చెబుతూ.. ఇప్పటికీ తాను సుద్దపూసనేననీ, జనం తమ తప్పు తెలుసుకుని మళ్లీ తనను సీఎంను చేస్తారనీ భ్రమల్లోనే ఉన్నారు. పార్టీ నేతలూ, క్యాడర్ ను కూడా అలాగే భ్రమల్లో బతకమంటున్నారు.
ఇలా భ్రమల్లో ఉంటూ.. గతంలో వ్యవహరించిన తీరునే జగన్ వ్యవహారశైలి ఉండటం వల్ల వైసీపీకి తప్ప మరెవరికీ ఎటువంటి నష్టం లేదు. ఆ విషయం స్పష్టంగా తెలుసు కనుక.. వైసీపీ నేతలూ, శ్రేణులూ జగనన్నా జనంలోకి రావద్దన్నా, తాడేపల్లి ప్యాలెస్ కో, బెంగళూరు ప్యాలెస్ కో పరమితమైతే చాలన్నా అంటూ బతిమలాడుతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి మరీ గుంటూరు మిర్చియార్డు సందర్శన చేసిన జగన్ తనకు భద్రత కల్పించలేదంటూ చేసిన విమర్శలపై పార్టీ వర్గాలలోనే అసహనం వ్యక్తం అవుతోంది. ఇక వల్లభనేని వంశీని పరామర్శించేందుకు విజయవాడ జిల్లా జైలుకు వెళ్లిన జగన్ ఆ సందర్భంగా చేసిన ప్రసంగం సొంత పార్టీ నేతలే తలలు బాదుకునేలా ఉంది.
అమ్మ ఒడి అందడం లేదంటూ ఓ చిన్నారి చేత మాట్లాడించి పండిద్దామనుకున్న డ్రామా కూడా బూమరాంగ్ అయ్యింది. జగన్ హయాంలో అమలైన సంక్షేమ పథకాల లబ్ధిదారులమంటూ ఆ చిన్నారి చేసిన వ్యాఖ్యలు జగన్ ను నవ్వుల పాలు చేశాయి. అందుకే ఇక చాలు జగనన్నా.. మరింత పలుచన కావద్దు.. ప్యాలెస్ లోనే కాలం గడుపు అంటూ వైసీపీ క్యాడర్ ఆయనను వేడుకుంటోంది.