గుండెపోటుతో కుప్పకూలిన టెన్త్ విద్యార్థిని
posted on Feb 21, 2025 @ 2:41PM
14 ఏళ్ల బాలిక గుండెపోటుతో కుప్పకూలింది. ఈ ఘటన కామారెడ్డిలో శుక్రవారం (ఫిబ్రవరి 20) జరిగింది. టెన్త్ విద్యార్థిని అయిన శ్రీనిథి కామారెడ్డి లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతోంది. రామారెడ్డి మండలం సింగరాయిపల్లి గ్రామానికి చెందిన శ్రీనిధి పెద్ద నాన్న కామారెడ్డి పట్టణంలోని కల్కినగర్ కాలనిలో నివాసం ఉండగా అప్పుడప్పుడు పెద్దనాన్న ఇంటి వద్దే ఉండి పాఠశాలకు వస్తుంటుంది.
ఎప్పటిలాగే కల్కినగర్ నుంచి నడుచుకుంటూ పాఠశాలకు వస్తుండగా స్కూల్ వద్ద ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయింది. పాఠశాల యాజమాన్యం, కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే శ్రీనిథి హార్ట్ బీట్ ఆగిపోయింది.
అయినా వైద్యులు సీపీఆర్ చేసి కాపాడే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. శ్రీనిధి మృతితో కామారెడ్డి పట్టణంలో పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదువు విషయంలో శ్రీనిధి ముందంజలో ఉండేదని, మంచి విద్యార్థినిని కోల్పోయామని పాఠశాల ప్రిన్సిపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.