వైసీపీ వితండ వాదం.. పైత్యం పీక్స్ కెళ్లినట్లేనా?

అధికారం కోల్పోయిన తరువాత వైసీపీ రాజకీయం పేర చేస్తున్న రచ్చ ఇంతా అంతా కాదు. ఓటమికి కుంటి సాకులు వెతకడం దగ్గర నుంచీ.. జనం ఛీ కొట్టి నిరాకరించిన ప్రతిపక్ష హోదా కోసం పేచీ పెట్టడం దాకా ఆ పార్టీ రోడ్డెక్కి తన పరువుతానే తీసుకుంటోంది.   2019 ఎన్నికలలో ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ జనాలను వేడుకుని, కోడి కత్తి దాడి, బాబాయ్ పై గొడ్డలి పోటు అంటూ సానుభూతి డ్రామాలతో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఐదేళ్ల పాటు నమ్మి ఓటేసిన జనాలకు నరకం చూపించారు. పాలన అంటే దోచుకోవడం, దాచుకోవడం, వ్యతిరేకులపై కక్షసాధింపులు అన్నట్లుగానే జగన్ ఐదేళ్ల పాలన సాగింది. పర్యవశానం.. జనం ఏ ఓటుతో అయితే గద్దెనక్కించారో, అదే ఓటుతో గద్దె దింపేశారు.  అయితే  వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ నేతలు  అన్ని హద్దులూ దాటేశారు. సోషల్ మీడియాలో  అసభ్య పదజాలంతో ప్రత్యర్థి పార్టీల నేతలను దూషించారు. వారి కుటుంబంలోని స్త్రీలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.  చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, లోకేశ్ స‌హా వారి కుటుంబ స‌భ్యుల‌పైనా ఇష్టారీతిగా అనుచిత పోస్టులు పెట్టారు. అలాంటి  వారిలో  వ‌ల్ల‌భ‌నేని వంశీ, కొడాలి నాని, రోజా , పోసాని కృష్ణ మురళి వంటి వారు ముందు వరుసలో ఉన్నారు. వీళ్లలో ఎవరైనా మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారంటే జనం ఇళ్లల్లో టీవీలు బంద్ చేసేసుకునే వారు. అలా ఉండేది వీరి భాషా సౌందర్యం.  జ‌గ‌న్ క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కుతోడు వైసీపీ నేత‌ల అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌ల‌ను జీర్ణించుకోలేక‌పోయిన‌ ఏపీ ప్ర‌జ‌లు గ‌త ఎన్నిక‌ల్లో ఓటు ద్వారా గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. ప్ర‌తిప‌క్ష హోదాకూడా వైసీపీకి ఇవ్వ‌లేదు. సరే ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్ హయాంలో  అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన , ప్రత్యర్థులపై ఇష్టారీతిగా అనుచిత వ్యాఖ్యలతో నోరు పారేసుకున్న నేతల పైనా, హద్దులన్నీ దాటి అరాచత్వంలో చెలరేగిన వారిపైనా ఇప్పడు వరుసగా కేసులు నమోదౌ తున్నాయి. ఈ క్ర‌మంలోనే  జోగి ర‌మేశ్‌, నందిగం సురేశ్‌, పేర్ని నానిల‌పై కేసులు నమోద‌య్యాయి. జోగి ర‌మేశ్‌, నందిగం సురేశ్ లు జైలుకెళ్లి బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇప్పుడు వంశీ జైల్లో ఉన్నారు. అయితే,   జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జైలుకు వెళ్లి. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ జైలు కెళ్లి వంశీని పరామర్శించి వచ్చారు.  వంశీ త‌ప్పు చేసిన‌ట్లు ఆధారాల‌తోస‌హా పోలీసులు నిరూపిస్తున్నారు. కిడ్నాప్, బెదరింపుల కేసులో అరెస్టైన వ్యక్తిని జైలుకెళ్లి మరీ పరామర్శించి రావడాన్ని జగన్ నిస్సుగ్గుగా సమర్ధించుకున్నారు.   వైసీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో వంశీ, కొడాలి నాని, రోజాలు చంద్ర‌బాబు, ప‌వ‌న్, లోకేశ్ పైనా, వారి కుటుంబాల‌పై చేసిన అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌ల‌తోనే అధికారాన్ని కోల్పోవాల్సి వ‌చ్చింద‌ని,  ఇప్పుడు వంశీ లాంటి నేత‌ను ప‌రామ‌ర్శించడంపార్టీ పరువును మరింత మంటగలిపిందనడంలో సందేహం లేదు.  ఇప్పుడు తాజాగా అదే అనుచిత భాషా ప్రయోగం కారణంగా పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేశారు. పోసాని పార్టీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారు. ఆ సందర్భంగా నాకు జ్ణానోదయం అయ్యింది. ఇంక మళ్లీ రాజకీయాల జోలికి రాను అని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే చేసిన తప్పులు దండంతో సరిపెట్టేయడానికి చట్టాలు ఒప్పుకోవుకదా? అందుకే పోలీసులు అరెస్టు చేశారు. సరే పార్టీలో ఉన్నా లేకపోయినా పోసానిని పరామర్శించి, ఆ సందర్భాన్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడానికి వాడుకుంటారు సందేహం లేదు. ఇలా  వైసీపీ ఓటమి తరువాత జగన్ జనంలోకి వస్తున్న ప్రతి సందర్భమూ ఓక రాంగ్ ఇండికేషన్ నే ఇస్తోంది. ప్రత్యర్థులపై బూతు పురాణంతో విరుచుకుపడిన నేతలు, ఇష్టారీతిగా కబ్జాలు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన వారికే వైసీపీలో రెడ్ కార్పెట్ వేస్తారనీ, పెద్ద పీట లభిస్తుందని చాటుతున్నారు.    జగన్ 2.0 అంటూ ఇటీవల తెగ చెబుతున్న జగన్ ఈసారి అధికారంలోకి వస్తే మూడు దశాబ్ధాలు తమదే అధికారం అని చెప్పుకుంటూ.. మళ్లీ అధికారంలోకి వస్తే జనం కోసం కాదు.. కార్యకర్తల కోసం నిలబడతానని చెప్పుకుంటున్నారు. కానీ ఆయన ఎవరి కోసం నిలబడతారో ఆయన జైలు యాత్రలు తేటతెల్లం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వంశీ లాంటి నేత‌ల కోసం జైలు యాత్రలు చేయడం పట్ల వైసీపీ శ్రేణుల్లో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.  ఇది చాలదన్నట్లు ఇప్పుడు గత ఎన్నికలలో జనసేనకు వచ్చిన ఓట్ల శాతం, వైసీపీకి వచ్చిన ఓట్ల శాతాన్ని పోల్చి చూపుతూ ఆ పార్టీ మేధావులు? వితండ వాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. 2024 ఎన్నికలలో కేవలం 6 శాతం ఓట్లు వచ్చిన జనసేన పార్టీ అధినేతకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడు.. 40 శాతం ఓట్లు వచ్చిన వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరంటూ ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. ఇందులో ఇసుమంతైనా లాజిక్ లేదు.  లాజిక్ సంగతి తరువాత చెప్పుకుందాం. ముందుగా భారత దేశంలో ఓట్ల శాతాన్ని బట్టి కాకుండా పార్టీకి వచ్చిన సీట్ల సంఖ్యను బట్టే ప్రతిపక్ష హోదాను నిర్ణయిస్తారు. ఇది కొత్తగా  వైసీపీ విషయంలో అమలు చేస్తున్న విధానం ఎంత మాత్రం కాదు. గతంలో అంటే వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో అప్పట్లో తెలుగుదేశం పార్టీకి ఉన్న 23 స్థానాలను ప్రస్తావిస్తూ ఓ నలుగురిని మా వైపు లాక్కుంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని పలు మార్లు శాసనసభ వేదికగానే జగన్ మాట్లాడారు. ఇప్పుడు తన కన్వీనియెన్స్ కోసం ఆ విషయం మరిచిపోయి 11 స్థానాలున్న తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ గగ్గోలు పెడుతున్నారు. హోదా ఇచ్చే వరకూ సభకు వచ్చేది లేదని భీష్మిస్తున్నారు.  ఇక ఇప్పుడు జనసేన ఓట్ల శాతంతో తమ ఓట్ల శాతాన్ని పోలుస్తూ వైసీపీ చేస్తున్న వితండ వాదం విషయానికి వస్తే.. 2024 ఎన్నికలలో వైసీపీ మొత్తం 175 స్థానాలలోనూ పోటీ చేసింది. దగ్గరదగ్గర 40 శాతం ఓట్లు సాధించుకుంది. 11 స్థానాలలో విజయం సాధించింది. కానీ జనసేన కేవలం 21 స్థానాలలోనే పోటీ చేసింది. 21 స్థానాలనూ గెలుచుకుంది. అంటే వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. మరలాంటప్పుడు జనసేనకు 6 శాతం ఓట్లే వచ్చాయి.. మాకు 40 శాతం ఓట్లు అంటూ వైసీపీ చెప్పుకోవడంలో అసలు అర్ధం లేదు. నిజంగా జనసేన, వైసీపీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని పోల్చాలనుకుంటే.. జనసేన విజయం సాధించిన 21 స్థానాలలోనూ జనసేనకు వచ్చిన ఓట్ల శాతం పోల్చాలంటే ఆ రెండు పార్టీలూ పోటీ పడిన 21 స్థానాలలో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయో చూడాల్సి ఉంటుంది. అలా చూస్తే వైసీపీ వాదనలోని డొల్ల తనం ఇట్టే బయటపడిపోతుంది. జనసేన గెలిచిన 21 స్థానాలలో ఆ పార్టీకి  50 నుంచి 60 శాతం ఓట్లు వచ్చాయి. దానిని విస్మరించి జనసేనకు కేవలం 6 శాతం ఓట్ల స్టేక్ మాత్రమే ఉందని మాట్లాడటం అంటే వైసీపీ తనను తాను  పలుచన చేసుకోవడమే అవుతుంది. 

రేపే ఎపి అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ 

ఏపీలో  వార్షిక బడ్జెట్ ను శుక్ర వారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. తొమ్మిది నెలల  కూటమి ప్రభుత్వం ఈ సారి పూర్తి స్థాయి లో ప్రవేశ పెడుతున్న బడ్జెట్ పైన భారీ అంచనాలు ఉన్నాయి. బడ్జెట్ పైన చంద్రబాబు పలు దఫాలు  సమీక్ష చేసారు. సంక్షేమం - అభివృద్ధి కి పెద్దపీట  ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక, సూపర్ సిక్స్ పథకాలకు ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేయనున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ను 3.35 లక్షల కోట్ల అంచనాతో ప్రవేవపెట్టనున్నట్లు సమాచారం.  వ్యవసాయమంత్రి అచ్చెనాయుడు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ను ప్రతిపాదించనున్నారు. 

ఆ ఎనిమిది మందీ మరణించారు.. జేసీ అసోసియేట్స్ ఓనర్

ఎస్సెల్బీసీ  సోరంగంలో చిక్కుకున్న ఎనమండుగురు కార్మికుల వ్యవహారం విషాదాంతమైంది. వారెవరూ బతికి లేరని ఆ టన్నల్ కాంట్రాక్టర్ పనులు చేస్తున్న జేసీ అసోసియేట్స్ ఓటర్ ప్రకాష్ చెప్పారు. గురువారం (ఫిబ్రవరి 27) మీడియాతో మాట్లాడిన ఆయన  ఈ ప్రమాదం జరిగిన సమయంలో టన్నెల్లో 50 మందికి పైగా పని చేస్తున్నారు. వారిలో ఎనిమిది మంది వినా మిగిలిన అందరూ సురక్షితంగా బయటపడ్డారన్నారు. టన్నెల్ లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గత ఆరురోజులుగా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయనీ, వారు బతికి ఉండే అవకాశాలు లేవనీ చెప్పారు. టన్నల్ లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గత ఆరు రోజులుగా చేసిన, చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. గురువారం  రెస్క్యూ బృందాలు టన్నెల్ చివరి వరకు వెళ్లగలిగారు. అయినా వారి ఆచూకీ లభించకపోవడంతో వారెవరూ ప్రాణాలతో లేరని నిర్ధారణ అయ్యిందని కాంట్రాక్టర్ చెప్పాడు. వారంతా బురదలో కూరుకుపోయి మరణించి ఉంటారని అన్నారు. ఇక ఇప్పుడు వారి మృతదేహాలను వెలికితీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని  కాంట్రాక్టర్ అన్నారు.  ప్రమాదం జరిగిన తరువాత రోజులు గడుస్తున్న కొద్దీ వారు ప్రాణాలతో ఉండే అవకాశం లేదన్న అభిప్రాయమే వ్యక్తం అవుతూ వస్తోంది. అయినా ఎక్కడో ఏదో చిన్న ఆశ. అదృష్టం కలిసి వచ్చి వారు ప్రాణాలతో ఉంటారన్నఅంతా భావించారు. రెండు రోజుల కిందటే రెస్క్యూటీమ్ వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు మృగ్యమని చెప్పేశారు. ఇప్పుడు అదే విషయాన్ని టన్నెల్ కాంట్రాక్టర్ ప్రకాష్ మీడియా ముఖంగా చెప్పారు.   సొరంగంలో చిక్కుకుపోయిన ఎనమండుగురు కార్మికులను రక్షించేందుకు గత ఆరు రోజులుగా ఆర్మీ,ఎస్టీఆర్ఎఫ్,ఎన్డీఆర్ఎఫ్ శతథా  ప్రయత్నించాయి.   ర్యాట్ హోల్ మైనర్లు రంగంలోకి దిగారు. బండరాళ్లు,బురద నీరు,శిథిలాల కారణంగా రెస్క్యూ ఆపరేషన్ కు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడటంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి.    

కొనసాగుతున్న  కాళేశ్వరం కమిషన్ విచారణ 

కాళేశ్వరం కమిషన్ విచారణ గురువారం నుంచి  తిరిగి ప్రారంభమైంది. గతంలో కమిషన్ ఎదుట హాజరైన వారిని కూడా  మళ్లీ విచారణ చేయాలని కమిషన్ నిర్ణయించింది.  కాగా కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా రివర్  మేనేజ్ మెంట్ బోర్డుసమావేశం కానున్నట్టు సమాచారం. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జలాల పంపిణీపై ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య  విభేధాలు తలెత్తే అవకాశముందని వార్తలు వెలువడుతున్నాయి.  తెలంగాణకు 63 టిఎంసీ అవసరమని, ఆంధ్రప్రదేశ్ కు 55 టిఎంసీలు అవసరమని అభిప్రాయపడింది.  గత సమావేశంలో ఆంధ్రప్రదేశ్ 23 టీఎంసీలకు అంగీకరించినప్పటికీ కృష్ణా రివర్ బోర్డు  సమావేశానికి ఎపి హాజరు కాకపోవడంతో మరో మారు సమావేశమయ్యే అయ్యే అవకాశాలున్నాయి. 

వివాదంలో చిక్కుక్కున్న స్టార్ కపుల్స్  సావిటీ బురా, దీపక్ హుడా

అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ కపుల్స్ ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. అంతర్జాతీయ మహిళా బాక్సర్ అయిన సావిటీ బురా తన భర్త, మాజీ కబడ్డీ ప్లేయర్  దీపక్ హుడాపై కేసు నమోదు చేశారు. వరకట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.   దీపక్ హుడా మరో వైపు  తన భార్య సావిటీ బురా కుటుంబంపై బెదిరింపులు ఆర్థిక మోసం ఆరోపణలు చేస్తూ రోహ్తక్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న ఈ క్రీడాకారులు పెళ్లి చేసుకుని జంటగా మారారు. కొన్ని రోజుల  క్రితం ఈ జంట మధ్య విభేధాలు తలెత్తాయి. సోషల్ మీడియాలో  ఒకరిపై ఒకరు విపరీతంగా ట్రోలింగ్ చేసుకున్నారు. తాజాగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి కేసులు నమోదు చేసుకున్నారు. అంతర్జాతీయ మ‌హిళా బాక్సర్ సావీటీ బురా, ఆమె భ‌ర్త‌, భారత కబడ్డీ జట్టు మాజీ ఆటగాడు దీపక్ హుడా  మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. హుడాపై సావీటీ గృహ హింస, వ‌ర‌క‌ట్న వేధింపుల‌ ఆరోపణలు చేయగా, ఆమె కుటుంబం త‌న‌ను ఆర్థికంగా మోసం చేసిందని  భర్త హుడా ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో ఈ స్టార్ క‌పుల్ ఒక‌రిపై ఒక‌రు హిసార్, రోహ్తక్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకున్నారు. మన దేశానికి చెందిన  ప్రముఖ క్రీడాకారులుగా పేరు తెచ్చుకున్న అంతర్జాతీయ మహిళా బాక్సర్ సావీటీ బురా, భారత కబడ్డీ జట్టు మాజీ ఆటగాడు దీపక్ హుడా మధ్య వివాదం క్రమంగా ఉగ్ర రూపం దాల్చింది.   సావీటీ బురా తన భర్త దీపక్ హుడాపై గృహహింస, వరకట్న వేధింపులు వంటి ఆరోపణలు చేస్తూ హర్యానాలోని హిసార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

అపురూపమైన కానుక.. నేతన్నల బహుమతికి మురిసిపోయిన లోకేష్

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు మంగళగిరికి చెందిన చేనేత కళాకారుడు. మంగళగిరి అంటేనే చేనేతకు ప్రసిద్ధి. ఇక్కడి చేనేత కళాకారులు ఎన్నో కొత్త కళాకృతులను ఆవిష్కరించారు.  ఆవిష్కరిస్తున్నారు.  తాజాగా మంగళగిరికి చెందిన జంజనం మల్లేశ్వరరావు అనే చేనేతకారుడు తన కుమారుడు కార్తికేయులుతో కలిసి తమ అభిమాన నాయకుడు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ కు ఓ అరుదైన బహుమతి ఇచ్చారు.   స్వతహాగా తెలుగుదేశం అభిమానులైన వీరు లోకేష్ కుటుంబం మొత్తాన్ని చేనేత వస్త్రంపై చిత్రీక రించారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, అలాగే నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రహ్మణి, వారి కుమారుడు నారా దేవాన్ష్ చిత్రాలను నేతవస్త్రంపై దించేశారు.  తాము నేసిన ఈ వస్త్రాన్ని జంజనం మల్లేశ్వరరావు, కార్తికేయులు బుధవారం (ఫిబ్రవరి 26)న లోకేష్ కు బహూకరించారు.   అద్భుత నైపుణ్యంతో వారు నేసిన ఆ వస్త్రాన్ని… దానిపై తన   కుటుంబ సభ్యులను అచ్చుగుద్దినట్లు నేసిన వారి నైపుణ్యాన్ని లోకేష్ ప్రశంసించారు.  వారికి కృతజ్ణతలు తెలిపారు. ఇప్పుడు ఆ వస్త్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 

పోసాని సతీమణికి జగన్ ఫోన్ పరామర్శ

కేసుల భయంతో వైసీపీ  నేతలు వణికిపోతున్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మొదలైన అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై వరుసగా నమోదవుతున్న కేసులతో ఆయనకు ఇప్పట్లో బెయిల్ లభించే అవకాశం లేదంటున్నారు. తాజాగా.. సినీ న‌టుడు, వైసీపీ నేత‌, బూతుల సామ్రాట్ పోసాని కృష్ణముర‌ళిని పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఏపీఎఫ్‌టీవీడీసీ చైర్మ‌న్‌గా పోసాని కృష్ణ ముర‌ళి ప‌ని చేశారు. ఆ స‌మ‌యంలో చంద్రబాబు నాయుడు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పాటు నారా లోకేశ్ ను అస‌భ్యక‌రంగా దూషించారు. వారి ఇంట్లో పిల్లల్ని, తల్లిదండ్రుల్ని కూడా వదిలి పెట్టకుండా దూషించారు. దీంతో ఏపీలోని ప‌లు స్టేష‌న్‌ల‌లో ఆయ‌న‌పై కేసులు న‌మోద‌య్యాయి. కూట‌మి ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా ఆయ‌న ప‌లు సంద‌ర్భాల్లో అభ్యంత‌ర‌క‌ర భాష‌తో కూట‌మి నేత‌ల‌ను దూషించారు. ఇటీవ‌ల కాలంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయ‌న‌పై బాప‌ట్ల, అనంత‌పురం, ప‌ల్నాడు జిల్లా న‌ర‌స‌రావుపేట, చిత్తూరు జిల్లా యాద‌మ‌రి, తిరుప‌తి జిల్లా పుత్తూరులో పోలీసుల‌కు ఫిర్యాదులు అందాయి. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా ప‌లు అంశాల‌పై పోసానిపై 11 కేసులు న‌మోద‌య్యాయి. ఇదిలా ఉంటే.. రెండు నెల‌ల క్రితం పోసాని మీడియా స‌మావేశం పెట్టి తనకు జ్ఞానోద‌యం అయ్యిందనీ, ఇకపై రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని ప్రక‌టించారు. దీంతో కూట‌మి ప్రభుత్వం త‌న‌ను వ‌దిలేస్తుంద‌ని పోసాని భావించిన‌ట్లున్నారు. కానీ, బండ‌బూతులు తిట్టి రాజ‌కీయాలు వ‌దిలేశానంటే వ‌ద‌ల‌ర‌ని పోలీసులు ఆయనను అరెస్టు చేయడంతో క్లారిటీ వచ్చేసినట్లయింది.  అదలా ఉంటే పోసాని వైసీపీకి గుడ్ బై చెప్పినప్పటికీ జగన్ ఆయనపై ప్రేమ కనపరుస్తుండటం హాట్‌టాపిక్‌గా మారింది. పోసాని కృష్ణమురళి అరెస్ట్ ను ఖండించిన జగన్  హైదరాబాద్ లోని ఆయన భార్య పోసాని కుసుమలతతో గురువారం ఫోన్ లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోందని, ఈ అరెస్ట్ విషయంలో పోసాని కృష్ణమురళికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ తరుఫున న్యాయ పరంగా సహాయం అందిస్తామని, ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులకు ఈ వ్యవహారాన్ని అప్పగించామని తెలిపారు. మామూలుగా పార్టీలో ఉన్న వారికి కూడా జగన్ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. అలాంటిది వైసీపీకి రిజైన్ చేసిన పోసానిపై అంత ప్రేమ కనబరుస్తుండటం ఆ పార్టీ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోందట.

వల్లభనేని వంశీపై మరో మూడు కేసులు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో మూడు కేసులు నమోదయ్యాయి.  వైసీపీ హయాంలో వంశీపాల్పడిన భూదందాలు, కబ్జాలు, మోసాలు, దౌర్జన్యాలు, అన్యాయాలు, అక్రమాలు అన్నీ ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. జగన్ హయాంలో గన్నవరం నియోజకవర్గంలో వంశీ ఆదింది ఆట.. పాడింది పాట అన్నట్లుగా పెత్తనం చెలాయించారు. అప్పట్లో ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికే జనం భయపడే పరిస్థితి ఉండేది. ఒక వేళ ఎవరైనా ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు జగన్ అధికారం కోల్పోయిన తరువాత అప్పట్లో వంశీ అరాచకాలకు, అక్రమాలకు బాధితులైన వారు ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే  వంశీపై కృష్ణా జిల్లాలో మరో మూడు కేసులు నమోదయ్యాయి.  ఆత్మకూరు, వీరవల్లి పోలీస్ స్టేషన్ లతోపాటు   గన్నవరం పోలీస్ స్టేషన్ లో  ఈ కేసులు నమోదు అయ్యాయి.  ఆత్మకూరులో ఓ పొలం వివాదంలో వంశీ ఆదేశాలతో  ఆయన  అనుచరుల పేరుతో దౌర్జన్యంగా పొలం రిజిస్ట్రేషన్ చేయించారని,  ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారనీ బాధితుడు చేసిన ఫిర్ాయదు మేరకు ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే తన భూమి వంశీ కబ్జా చేశారంటూ ఓ న్యాయవాది ఫిర్యాదుపై కేసు నమోదైంది. అలాగే   గన్నవరం నియోజకవర్గంలోని మర్లపాలెం మండలంలోని పానకాల చెరువులో అక్రమంగా మైనింగ్ తవ్వకాలు చేశారని, ఇలా చేయడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరిగిందని అందిన ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు మరో కేసు నమోదు చేశారు.  ఇప్పటికే గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో వంశీని ఈనెల 13న  పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వంశీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. 

ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. గురువారం (ఫిబ్రవరి 27) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. గట్టి బందోబస్తు నడుమ పోలింగ్ జరుగుతోంది. మార్చి 3వ తేదీన   ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.ఆంధ్రప్రదేశ్ లో రెండు గ్రాడ్యుయేట్‌, ఒక టీచర్‌ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్‌ జరుగుతుండగా, తెలంగాణ లో రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్‌ స్థానానికి పోలింగ్‌ జరుగుతోంది.  గుంటూరు, కృష్ణా జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ  ఎన్నికలో ఉదయం ఎనిమిది గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలి వస్తున్నారు. ఈ ఎన్నికలో ప్రధాన అభ్యర్థులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, సిట్టింగ్ ఎమ్మెల్సీ లక్ష్మణ రావు గుంటూరులో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  మొత్తం 33 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో,3,47,116  మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. అయితే శివరాత్రి జాగారం ఎఫెక్ట్ తో, చాలా ప్రాంతాల్లో పోలింగ్ మందకొడి  సాగుతోంది.... మద్యాహ్నం నుండి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది ..

తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ పథకాల అమలు ఎప్పటి నుంచంటే?

ఐదేళ్ల జగన్ పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ కు గత ఎన్నికలలో విముక్తి లభించింది. ఆర్థికంగా, అభివృద్ధి పరంగా.. ఒకటనేమిటి.. అన్ని విధాలుగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వైసీపీ పాలనపై ఆంధ్రప్రదేశ్ జనం తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో తెలియజేశారు. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా గట్టి బుద్ధి చెప్పారు. అలాగే అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చెప్పే చంద్రబాబుకు పట్టం కట్టారు. ఆయన నాయకత్వంలోని తెలుగుదేశం కూటమికి అపూర్వ విజయాన్ని అందించారు.  దీంతో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచీ ఆయన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంపైనే దృష్టి పెట్టారు. జగన్ హయాంలో గుంతలమయంగా, అధ్వానంగా మారిన రహదారులను మెరుగుపరచడం, అస్తవ్యస్థం అయిపోయిన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం, రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు పెట్టుబడుల ఆకర్షణ వంటి విషయాలపైనే దృష్టి కేంద్రీకరించారు. ఎనిమిది నెలల కాలంలో రాష్ట్రంలో పరిస్థితులు ఓ మేరకు కుదుటపడ్డాయి అనుకున్న తరువాత ఆయన ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించారు. ముఖ్యంగా సూపర్ షిక్స్ హామీల అమలుకు దాదాపుగా షెడ్యూల్ ప్రకటించేశారు. ఇప్పటికే అంటే అధికార పగ్గాలు అందుకోగానే ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హీమీ మేరకు వృద్ధాప్య పింఛన్లను చెప్పినట్లుగా పెంచి మరీ ఇస్తున్నారు. అలాగే దీపం2 పథకం కూడా అమలులోకి వచ్చింది. అదే విధంగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకాన్ని ఈ ఉగాది నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు.  ఇక తాజాగా అసెంబ్లీ వేదికగా ఆయన మరో రెండు హామీల అమలును ప్రస్తావించారు. మే నెల నుంచీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద చదువుకుంటున్న పిల్లలు ఉన్న తల్లులందరికీ  ఎంత మంది పిల్లలు అన్న దానితో సంబంధం లేకుండా ప్రతి బిడ్డకూ 15 వేల రూపాయలు అందించనున్నారు.  అలాగే రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా ఈ మే నెల నుంచే ప్రారంభించనున్నట్లు అసెంబ్లీ వేదికగా స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని రైతులందరికీ ఏడాదికి 20 వేల రూపాయలు అందుతుంది. ఇందులో 14 వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇక ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద కేంద్రం అందించే 6వేల రూపాయలు కూడా కలిపి మొత్తం 20 వేలు అందుతాయి. ఈ సహాయాన్ని మూడు విడతలుగా అందిస్తారు. నగదు నేరుగా రైతు ఖాతాలోనే జమ అవుతుంది. ఇక రాష్ట్రంలో మత్స్య కారులకు ఆర్థిక మద్దతు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే అమలు చేస్తారు.    జగన్  హయాంలో ఆయన విధానాలు, ఆర్థిక అరాచకత్వం కారణంగా  రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలసిందే. బటన్ నొక్కడమే పాలన అన్నట్లుగా ఆయన సాగించిన అరాచక పాలన కారణంగా రాష్ట్రం అన్ని విధాలుగా వెనుకబడిపోయింది.  అయితే సంక్షోభాలలోనే అవకాశాలు వెతుక్కోవాలని చెప్పే చంద్రబాబు.. రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన తరవాత రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంపై మొదటిగా దృష్టి సారించారు. ఇక నుంచి రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమాన్ని జోడు గుర్రాళ్లా పరుగులెట్టించే దిశగా అడుగులు వేస్తున్నారు.  

శివరాత్రి రోజే శివాలయంలో శివలింగం చోరీ

ఓ వైపు దేశం అంతా శివరాత్రి ఉత్సవాలు జరుపుకుంటుంటే.. అదే అదునుగా ఓ దేవాలయంలో  శివలింగాన్ని చోరీ చేశాడో ప్రబుద్ధుడు. శైవక్షేత్రాలన్నిటా భక్తులు భక్తిశ్రద్ధలతో శివుడిని కొలుచుకునే మహా శివరాత్రి పర్వదినం రోజు గుడిలో ఉన్న శివలింగాన్ని ఎత్తుకు పోయిన ఘటన  గుజరాత్‌లోని  ద్వారక జిల్లాలో జరిగింది. ద్వారక జిల్లాలోని  కళ్యాణ్‌పూర్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన హర్సిద్ధి మాతాజీ ఆలయానికి సమీపంలో ఉన్న శ్రీ భిద్భంజన్ భవనీశ్వర్ మహాదేవ్ ఆలయంలో బుధవారం (ఫిబ్రవరి 26) తెల్లవారు జామున జరిగింది.  అత్యంత పురాతనమైన ఈ ఆలయంలో  శివలింగం చోరీకి గురికావడం సంచలనం సృష్టించింది. బుధవారం తెల్లవారు జామున పూజారి ఆలయం తలుపులు తెరవగా.. గుడిలో శివలింగం మాయమైనట్లు వెలుగులోకి వచ్చింది.  శతాబ్దాల నాటి ఆ ఆలయంలోని శివలింగం అతి పురాతనమైంది. ఈ శివలింగాన్ని  మహాదేవుడి విశ్వశక్తికి నిదర్శమని భక్తుల నమ్మకం. అలాంటి పురాతన రాతి శివలింగం చోరీకి గురికావడం భక్తులలో ఆందోళనను నింపింది. ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో గురువారం (ఫిబ్రవరి 27) భక్తుల రద్దీ సాధారణంగా  ఉంది.   శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఏడు కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల   సమయం పడుతోంది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతోంది.   300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం (ఫిబ్రవరి 26) శ్రీవారిని మొత్తం 62,323 మంది దర్శించుకున్నారు. వారిలో 20,460 మంది  తలనీలాలను సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ ఆదాయం 2.92 కోట్ల రూపాయలు వచ్చింది. 

పోసాని అరెస్ట్.. నెక్స్ట్ ఎవరు?.. జగన్ కు ఇక జైలు యాత్రలే!

వైసీపీ హ‌యాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో.. వారిని వదిలే ప్రసక్తే లేదు.. వెయిట్ అండ్‌ వాచ్.. మార్క్ మై వర్డ్స్‌.. టైం.. డేట్‌ కూడా రాసుకోండి అంటూ మంత్రి నారా లోకేశ్ మండ‌లిలో ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. త‌ద్వారా త్వ‌ర‌లో మ‌రికొంత మంది వైసీపీ నేత‌లు అరెస్టు కాబోతున్నార‌ని లోకేశ్ క్లియర్ కట్ గా చెప్పారు. దీంతో వైసీపీ నేత‌లు వ‌ణికిపోతున్నారు. ఎవ‌రు ఎప్పుడు క‌ట‌క‌టాల పాలుకావాల్సి వ‌స్తుందోన‌ని భ‌య‌ప‌డుతున్న ప‌రిస్థితి. ఇప్ప‌టికే వ‌ల్ల‌భ‌నేని వంశీపై వ‌రుస‌గా కేసుల మీద కేసులు నమోదౌతున్నాయి. సిట్ విచార‌ణ కొన‌సాగుతుంది. ఇప్ప‌ట్లో వంశీ బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. తాజాగా.. సినీ న‌టుడు, వైసీపీ నేత‌ పోసాని కృష్ణ‌ముర‌ళిని పోలీసులు అరెస్టు చేశారు.  పోసాని కృష్ణ ముర‌ళిని  రాయ‌చోటి పోలీసులు అరెస్టు చేశారు. బుధ‌వారం రాత్రి హైద‌రాబాద్ లోని రాయ‌దుర్గం మైహోం భూజా అపార్ట్ మెంట్స్ లో ఉంటున్న పోసానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   త‌రువాత ఆయ‌న్ను ఏపీకి త‌ర‌లించారు. అరెస్టు స‌మ‌యంలో పోలీసులతో పోసాని వాగ్వివాదానికి దిగారు. బనీన్, నిక్కర్ మీదనే హడావుడి చేశాడు. డ్రెస్ వేసుకుని రావాలని చెప్పినా వినకుండా ఆయన ఓవరాక్షన్ చేస్తుండ‌టంతో.. అతి క‌ష్టంమీద పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలిసింది. గురువారం (ఫిబ్రవరి 27) రాజంపేట కోర్టులో పోసానిని హాజ‌రుప‌రిచే అవ‌కాశం ఉంది.  పోసానిపై గ‌తంలో కేసులు న‌మోద‌య్యాయి. అన్న‌మ‌య్య జిల్లా ఓబుల‌వారిప‌ల్లె పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. చంద్ర‌బాబు, ప‌వ‌న్, లోకేశ్‌పై అనుచిత విమ‌ర్శ‌లు చేశార‌ని స్థానికుల ఫిర్యాదు మేర‌కు 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. గ‌తంలో వారెంట్ ఇచ్చిన‌ప్ప‌టికీ పోసాని స్పందించ‌లేదు. దీంతో బుధ‌వారం రాత్రి సంబేప‌ల్లి ఎస్ఐ రాయ‌దుర్గం చేరుకొని పోసానిని అరెస్టు చేశారు  వైసీపీ ప్ర‌భుత్వంలో ఏపీఎఫ్‌టీవీడీసీ చైర్మ‌న్‌గా పోసాని కృష్ణ ముర‌ళి ప‌నిచేశారు. ఆ స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌తోపాటు నారా లోకేశ్ ను అస‌భ్య‌క‌రంగా దూషించారు. వారి ఇంట్లో పిల్లల్ని, తల్లిదండ్రుల్ని కూడా వదిలి పెట్టకుండా దూషించాడు. దీంతో ఏపీలోని ప‌లు స్టేష‌న్‌ల‌లో ఆయ‌న‌పై కేసులు న‌మోద‌య్యాయి. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా ఆయ‌న ప‌లు సంద‌ర్భాల్లో అభ్యంత‌ర‌క‌ర భాష‌తో కూట‌మి నేత‌ల‌ను దూషించారు. ఇటీవ‌ల కాలంలో టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడిపైనా అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఆయ‌న‌పై బాప‌ట్ల‌, అనంత‌పురం, ప‌ల్నాడు జిల్లా న‌ర‌స‌రావుపేట, చిత్తూరు జిల్లా యాద‌మ‌రి, తిరుప‌తి జిల్లా పుత్తూరులో పోలీసుల‌కు ఫిర్యాదులు అందాయి. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా ప‌లు అంశాల‌పై పోసానిపై 11 కేసులు న‌మోద‌య్యాయి. ఇదిలా ఉంటే.. రెండు నెల‌ల క్రితం పోసాని మీడియా స‌మావేశం పెట్టి తనకు జ్ఞానోద‌యం అయ్యిందనీ, ఇకపై రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. దీంతో కూట‌మి ప్ర‌భుత్వం త‌న‌ను వ‌దిలేస్తుంద‌ని పోసాని భావించిన‌ట్లున్నారు. కానీ, బండ‌బూతులు తిట్టి రాజ‌కీయాలు వ‌దిలేశానంటే వ‌ద‌ల‌ర‌ని పోలీసులు ఆయనను అరెస్టు చేయడంతో క్లారిటీ వచ్చేసినట్లయింది.  మండ‌లిలో లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్ త‌రువాత చాలా మంది వైసీపీ నేత‌లు ర‌హ‌స్య ప్రాంతాల‌కు వెళ్లి త‌ల‌దాచుకుంటున్నార‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. వంశీ అరెస్టు త‌రువాత ఎవ‌ర్ని అరెస్టు చేస్తారోన‌ని వైసీపీ నేత‌లు భ‌యంతో వ‌ణికిపోతున్నారు. అయితే ముందుగా పోసాని వంతు వ‌చ్చింది. పోసానిని అరెస్టు చేసిన త‌రువాత నెక్ట్స్ ఎవ‌రు..? అనే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో సాగుతోంది. అయితే, ఈసారి ప‌క్కాగా కొడాలి నాని అరెస్టు ఉంటుంద‌ని వైసీపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌టికే కొడాలి నానిపై పోలీసులు దృష్టిసారించిన‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో ఆయ‌న‌పై కేసులు, ప్ర‌స్తుతం ప‌లు స్టేష‌న్‌ల‌లో ఆయ‌న‌పై న‌మోదైన కేసుల వివ‌రాల‌ను సేక‌రిస్తున్నార‌ట‌. దీంతో కొడాలి నానిసైతం హైద‌రాబాద్ తోపాటు బెంగ‌ళూరు వంటి న‌గ‌రాల్లోనే ఎక్కువ‌గా ఉంటున్నార‌ని టాక్ న‌డుస్తోంది. ఇటీవ‌ల వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వంశీని ప‌రామ‌ర్శించేందుకు విజ‌య‌వాడ జైలుకు వెళ్లారు. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ వెంట కొడాలి నాని ఉన్నాడు. మ‌రుస‌టి రోజు గుంటూరు మిర్చి యార్డుకు జ‌గ‌న్ వెళ్లిన స‌మ‌యంలోనూ కొడాలి నాని ఉన్నాడు. ఆ వెంట‌నే కొడాలి నాని త‌న అనుచ‌రుల‌కు కూడా చెప్ప‌కుండా ర‌హ‌స్య ప్రాంతానికి వెళ్లిపోయిన‌ట్లు టాక్ న‌డుస్తోంది. వైసీపీ నేత‌లు సైతం అధిక‌ శాతం మంది పోసాని త‌రువాత కొడాలి నాని అరెస్టు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.  పోసాని కృష్ణముర‌ళి అరెస్టుతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌ళ్లీ బెంగ‌ళూరు నుంచి ఏపీకి రావాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది. అధికార మ‌దంతో హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించిన వైసీపీ నేత‌లను పోలీసులు అరెస్టులు చేసి జైళ్ల‌కు పంపిస్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ బెంగ‌ళూరు నుంచి నేరుగా జైలుకు వెళ్లి వైసీపీ నేత‌ల‌ను ప‌రామ‌ర్శిస్తున్నారు. ఇటీవ‌లే విజ‌య‌వాడ జైలుకెళ్లి వ‌ల్ల‌భ‌నేని వంశీతో జ‌గ‌న్ ములాఖ‌త్ అయ్యాడు. ప్ర‌స్తుతం పోసాని ముర‌ళీ కృష్ణ కోసం జ‌గ‌న్ మ‌ళ్లీ బెంగ‌ళూరు నుంచి నేరుగా జైలుకెళ్లి ప‌రామ‌ర్శించే అవ‌కాశం ఉంది. అంతే ముందు ముందు జగన్   మ‌రిన్ని జైలు యాత్రలు చేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌ని వైసీపీ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తున్నది.

దోషులపై జీవితకాల నిషేధం కుదరదన్న కేంద్రం

వివిధ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నేతలపై జీవిత కాల నిషేధాన్ని విధించాలన్న అభ్యర్థను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. దోషిగా తేలిన  వ్యక్తిపై ఆరేళ్ల పాటు నిషేధం విధిస్తే సరిపోతుందని తెలిపింది. ఓ వ్యక్తిపై జీవిత కాల నిషేధం అనేది కఠినతరమని పేర్కొంది. అయితే రాజకీయ నేతలపై జీవిత కాల నిషేధం ఎన్నేళ్లు అనే దానిపై నిర్ణయాధికారం పార్లమెంట్‌దేనని ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం ఖరాకండిగా తేల్చి చెప్పింది. దోషులుగా రుజువు అయితే జీవితకాల నిషేధాన్ని విధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కేంద్రం తన అభిప్రాయాన్ని వివరిస్తూ.. సుప్రీం కోర్టులో తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. దోషులుగా తేలిన నేతలపై జీవిత కాలం నిషేధం విధించాలంటూ న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ సుప్రీం కోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఆ క్రమంలో సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం తాజాగా తన అభిప్రాయాన్ని వివరిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

మోడీతో రేవంత్ భేటీ ...అభివృద్దిపై ఫోకస్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రధాని మోడీతో బుధవారం సమావేశమయ్యారు.  దాదాపు గంటకు పైగా వీరిరువురు సమావేశమయ్యారు. తెలంగాణ అభివృద్దికి దోహదపడే ఐదు అంశాలపై ఈ సమావేశంలో ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.  హైద్రాబాద్ మెట్రో రైళ్ల విస్తరణకు ,  రంగారెడ్డి రింగ్ రోడ్డుకు మద్దత్తు పలకాలని రేవంత్ రెడ్డి ప్రధానిని కోరారు. 55 కిలో మీటర్ల దూరం వరకు విస్తరించిన మూసీ నది పునరుద్దరణకు రేవంత్ రెడ్డి ప్రధానితో చర్చించారు.  తెలంగాణలో 29 ఐపిఎస్ పోప్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని వెంటనే భర్తీ చేయాలని  రేవంత్ రెడ్డి ప్రధానిని కోరారు.  సెమీ కండక్టర్ పరిశ్రమ అభివృద్దికి దోహదపడాలన్నారు.  పెండింగ్ ప్రాజెక్టులు, విభజన సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు.  గత పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను మోదీ రేవంత్ రెడ్డిని అడిగితెలుసుకున్నారు. ఎస్ ఎల్ బిసి ప్రమాదం గురించి మోడీ ఆరా తీశారు.  ఈ సమావేశంలో  ముఖ్యమంత్రి వెంట మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. 

మళ్లీ కవిత మెడకు లిక్కర్ ఉచ్చు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీగలాగితే డొంక కదులుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా అసెంబ్లీ వేదికగా కాగ్ రిపోర్ట్ ను బయటపెట్టారు. ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం అధికారంలో రాగానే  తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే  కాగ్ రిపోర్ట్ బయటపెట్టడంతో లిక్కర్ స్కాం మరో మారు చర్చకు దారి తీసింది.  ఈ స్కాంలో చిక్కుక్కున్నఢిల్లీ  మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ , మాజీ డిప్యూటి సిఎం మనీష్ సిసోడియా ఇప్పటికే బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి  కెసీఆర్ కూతురు కవిత ఈ లిక్కర్ స్కాంలో కింగ్ పిన్ . సౌత్ గ్రూప్ కు చెందిన  కవిత  అప్పటి ఆప్ ప్రభుత్వాన్ని ప్రభావితం చేశారు.  ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో  ఆప్ ఓడిపోవడానికి లిక్కర్ స్కాం ప్రధాన కారణం. ఢిల్లీ లిక్కర్ పాలసీపై 166 పేజీల కాగ్ రిపోర్ట్ లో రెండువేల  కోట్ల స్కాం జరిగినట్టు ముఖ్యమంత్రి రేఖా గుప్తా వెల్లడించారు.      నవంబర్ 2021 నుంచి  సెప్టెంబర్ 2022 వరకు  ఢిల్లీలో  నూతన మద్యం విధానం కొనసాగింది. ఈ స్కాం వెలుగులోకి రావడంతో ఢిల్లీ లిక్కర్ పాలసీ రద్దయ్యింది. అప్పటి నుంచి తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో లిక్కర్ స్కాం ప్రచార అంశంగా మారిపోయింది. తెలంగాణలో  వరుసగా మూడోసారి అధికారంలో  రావాలనుకున్న బిఆర్ఎస్ కుప్పకూలడానికి లిక్కర్ స్కాం ముఖ్య భూమిక వహించింది.  బిజెపి, బిఆర్ఎస్ దోస్తీ బలపడటానికి లిక్కర్ స్కాం ఓ టూల్ మాదిరిగా మారిపోయింది. ఎన్నికల ఫలితాల్లో  బిఆర్ఎస్ ఓడిపోవటంతో బిజెపి కూడా దూరమైంది.  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బిఆర్ ఎస్ కు  తగిన సంఖ్యాబలం కూడా లేదు. 10 మంది బిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అధికారానికి పదేళ్లు దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి   కవిత లిక్కర్ స్కాం రాజకీయ మైలేజీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి లిక్కర్ స్కాం ఓ కారణమనే చెప్పాలి. లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న కవితను రిలీజ్ చేయడానికి  బిజెపి కవితకు సపోర్ట్ చేయలేదు. బిఆర్ ఎస్ రాజకీయంగా దెబ్బతినడమే కారణమైంది. . అదే సమయంలో బిజెపి కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజారిటీతో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది.    పర్యవసనాంగా కవిత తీహార్ జైల్లో ఉచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.  కవితకు బెయిల్ లభించకపోవడంతో బిఆర్ఎస్ ను బిజెపి లో విలీనం దిశగా చర్చలు జరిగాయి. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ విలీన ప్రతిపాదనను ఆమోదం పలికినప్పటికీ బిఆర్ ఎస్ వ్యవస్థాపకులు కెసీఆర్ మాత్రం  వెనకడుగు వేయడంతో కవిత జైల్లో పర్మినెంట్ ఖైదీ అని ప్రచారం జరిగింది.  ఎట్టకేలకు కోర్టు బెయిల్ ఇవ్వడంతో కవిత బయటకొచ్చారు. గత దసరాకు ముందే ఆమె ఇంటికి వచ్చినప్పటికీ బతకమ్మ వేడుకలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన కవిత గైనకాలజీ సమస్యలతో ఇంటికే పరిమితమయ్యారు. తీహార్ జైలు నుంచి విడుదలయ్యాక కవిత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.  కార్ రేస్ స్కాంలో అన్న కెటీఆర్ అరెస్ట్ తప్పదని ప్రచారం జరగడంతో  కవిత మళ్లీ యాక్టివ్ అయ్యారు. రేవంత్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వచ్చారు.  కవిత ఆరోపణలతో బిజెపి బిఆర్ఎస్ బంధం మళ్లీ  బలపడిందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఎంఎల్ సి ఎన్నికల్లో బిజెపి లాభపడే విధంగా బిఆర్ ఎస్ పావులు కదిపింది. కాంగ్రెస్ ను మట్టికరిపించడానికి బిఆర్ఎస్ కీలకమైన ఎంఎల్ సి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.  బిఆర్ఎస్ తటస్థం కావడంతో బిజెపి రాజకీయ ప్రయోజాలు మరింత బలపడ్డాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి లాభపడే విధంగా బిఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఢిల్లీ బిజెపి బిఆర్ఎస్ ను శత్రువుగా పరిగణిస్తే కేంద్ర నాయకత్వం మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తుందని అర్థం చేసుకోవాలి. కవితను అడ్డు పెట్టుకుని బిజెపి తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకుంటోంది.