ఢిల్లీ సిఎంగా రేఖా గుప్తా ప్రమాణం

27 ఏళ్ల తర్వాత  ఢిల్లీలో బిజెపి అధికారంలో వచ్చింది. ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె తో బాటు ఆరుగురు మంత్రులుగా  ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సేనా  వారి చేత ప్ర‌మాణం చేయించారు.  మంత్రులుగా ప‌ర్వేశ్ శ‌ర్మ‌, సాహిబ్ సింగ్‌, అశీశ్ సూద్‌, మంజీంద‌ర్ సింగ్‌, ర‌వీంద‌ర్ ఇంద్ర‌జ్ సింగ్, క‌పిల్ మిశ్రా, పంక‌జ్ కుమార్ సింగ్ ప్ర‌మాణం చేశారు.  ఈ వేడుకకు  ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా,  ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్, ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు హాజ‌ర‌య్యారు. 

ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. జగన్ పై కేసు

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఆంక్షలను ఉల్లంఘించి, నియమావళిని పట్టించుకోకుండా జగన్ బుధవారం (ఫిబ్రవరి 19) గుంటూరు మిర్చియార్డ్ లో పర్యటించిన సంగతి విదితమే. ఎన్నికల కోడ్ అమలులో ఉంది కనుక మిర్చియార్డ్ పర్యటనకు అనుమతి లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసినా, పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించినా జగన్ లేక్క చేయకుండా మిర్చియార్డు ను సందర్శించి అక్కడ ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్ పై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది.  ఈసీ, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు బేఖాతరు చేస్తూ మిర్చి యార్డులో కార్యక్రమం నిర్వహించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ తో పాటు అంబటి రాంబాబు, కొడాలి నాని, లేళ్ల అప్పిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితరులపై కూడా కేసు నమోదైంది.  

విపత్తు నిధులలో ఏపీకి సింహ భాగం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి మాటకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తున్నది. ఆయన విజ్ణప్తుల పట్ల సానుకూలంగా స్పందిస్తున్నది. బడ్జెట్ కేటాయింపులలోనూ, అమరావతి, పోలవరం లకు సహకారం విషయంలోనూ ఈ విషయం ఇప్పటికే ధృవపడింది. తాజాగా కేంద్రం విడుదల చేసిన విపత్తు, వరదల సహాయం నిధుల విషయంలోనూ ఏపీకి సింహభాగం దక్కింది. కేంద్రం తాజాగా ఐదు రాష్ట్రాలకు కలిపి విపత్తు, వరదల సహాయం కింద1,554.99 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ నిధులలో అత్యధికంగా ఏపీకి 608.08 కోట్ల రూపాయలు కేటాయించింది.  ఇక మిగిలిన రాష్ట్రాలలో తెలంగాణకు  231 కోట్ల రూపాయలు, త్రిపురకు  288.93 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అలాగే ఒడిశాకు 255.24, నాగాల్యాండ్ కు 170.99 కోట్ల రూపాయల చొప్పున విడుదల చేసింది. 

ముడా కేసులో పీచేముఢ్.. కర్నాటక సీఎంకు లోకాయుక్త క్లీన్ చిట్

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ  (ముడా) స్థల కేటాయింపుల వ్యవహారంలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లోకాయయుక్త క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో  కర్ణాటక ముఖ్యమంత్రి   సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతిపై వచ్చిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని లోకాయుక్త పేర్కొంది. ఈ మేరకు పోలీసుల ఇప్పటికే హైకోర్టుకు తిది నివేదిక సమర్పించినట్లు లోకాయుక్త పోలీసులు తెలిపారు. త ఈ కేసులో సిద్ధరామయ్య  , ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, భూ యజమాని దేవరాజు నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే.   ఈ కేసులో సిద్ధరామయ్య భార్య పార్వతికి ముడా అధిక విలువ ఉన్న ప్రాంతంలో స్ధలాలు కేటాయించిందన్న ఆరోపణలు ఉన్నాయి.   ప్రస్తుత నివేదికలో.. పార్వతికి కేటాయించిన స్థలంపై అనుమానాలు ఉన్నా.. ఆమె వద్ద 3.16 ఎకరాల భూమికి చట్టపరమైన హక్కులున్నాయా? లేదా? అనే అంశంపై ఇంకా విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.  లోకాయుక్త క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ ఈడీ మాత్రం ఈ కేసులో దర్యాప్తు కొనసాగించనుంది.  

టీటీడీ ఉద్యోగుల ఆందోళన వెనుక రాజకీయ హస్తంపై అనుమానాలు!

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు.   ఇటీవల వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీ సమయంలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మరణించారు. ఇందుకు టీటీడీ పాలకమండలి, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల మధ్య సమన్వయ లోపమే కారణమన్నవిమర్శలు వెల్లువెత్తాయి. ఆ వివాదం ఇంకా పూర్తిగా మరుగున పడకుండానే టీటీడీ పాలకమండలి సభ్యులు, ఉద్యోగుల మధ్య సమన్వయ లోపం మరోసారి ప్రస్ఫుటంగా వెలుగులోకి వచ్చింది.   కర్ణాటక నుంచి టీటీడీ బోర్డులో సభ్యుడుగా ప్రాతినిధ్యం వహిస్తున్నసురేష్ కుమార్ సహనం కోల్పోయి ఆలయ మహద్వారా వద్ద దూషించారు. దీనిపై అధికారులు, బోర్డు పెద్దలు నోరు మెదపడం లేదు. ఈ సంఘటనపై టీటీడీ ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి.   ఉద్యోగిపై దూషణల పర్వానికి దిగిన బోర్డు సభ్యుడిపై చర్యలు తీసుకోవాలంటూ ఉద్యోగులు టీటీడీ పరిపాలనా భవన్ వద్ద నిరసనకు దిగారు.   తిరుమలలో టీటీడీ ఉద్యోగిని దుర్భాషలాడి దౌర్జన్యానికి పూనుకున్న బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ ను బోర్డు నుండి తొలగించి, ఆయనపై కేసు నమోదు చేయాలని  ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.  బాధ్యతాయుతంగా ఉండాల్సిన బోర్డు సభ్యుడు సురేశ్ కుమార్ సంయమనం కోల్పోయి ఉద్యోగిని దూషించడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు పవిత్రమైన వెంకన్న స్వామి దేవాలయ మహాద్వారం వద్ద అమర్యాదగా ప్రవర్తించిన సురేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలి.లేకుంటే ఆయనను బోర్డు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.   జగన్ హయాంలో తిరుమల  పవిత్రతకు భంగం కలిగేలా పలు సంఘటనలు చోటు చేసుకున్నా కిమ్మనని ఉద్యోగులు ఇప్పడు ఒక బోర్డు మెంబర్ పై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన బాట పట్టడం వెనుక రాజకీయ ప్రమేయం ఉన్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   జగన్ హయాంలో టీటీడీలో జరిగిన  ఆర్థిక వ్యవహారాలపై అవక తవకలపై ఎన్నడూ  నోరెత్తని ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ఆందోళన బాటపట్టడం వెనుక ఏదో కుట్ర ఉందని అంటున్నారు.  బోర్డు సభ్యుడు ఉద్యోగిపై దూషణల పర్వానికి దిగడం ఏ విధంగా చూసినా తప్పే. దీనిపై సమగ్ర విచారణ జరిపి సదరు సభ్యుడిపై చర్య తీసుకోవాలి డిమాండ్ చేయడాన్ని కూడా ఎవరూ తప్పుపట్టరు. అయితే ఏకంగా విధులు మానేసి టీటీడీ పరిపాలనా విభాగం వద్ద ధర్నాకు దిగడమే దీని వెనుక రాజకీయం ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేస్తున్నాయి. 

కేసీఆర్ పై కేసు వేసిన రాజలింగమూర్తి దారుణ హత్య.. రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై కేసు వేసిన సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగ మూర్తి హత్యకు గురయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్, హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారంటూ నాగవెళ్లి రాజలింగమూర్తి గతంలో కేసు వేసిన సంగతి విదితమే. ఆ కేసు  హైకోర్టులో గురువారం (ఫిబ్రవరి 20)విచారణకు వస్తున్న తరుణంలో ఈ హత్య జరిగింది. కాగా తన భర్తను హత్య చేయించింది బీఆర్ఎస్ నేతలేనని నాగవెళ్లి రాజలింగ మూర్తి భార్య ఆరోపిస్తున్నారు. తన భర్త హత్య వెనుక బీఆర్ఎస్ నేత గండ్ర  వెంకటరమణా రెడ్డి ఉన్నారని ఆమె ఆరోపించారు.  కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్​ ప్రభుత్వమే కారణమని కేసు వేసిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి(47)  బుధవారం రాత్రి 7.15 గంటల సమయంలో  దారుణ హత్య కు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు.  రాజలింగమూర్తి తన స్వగ్రామం జంగేడు శివారు పక్కీరుగడ్డలో సోదరుల ఇంట్లో బుధవారం (ఫిబ్రవరి 19) జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి బైక్​పై భూపాలపల్లికి తిరిగి వస్తుండగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వద్ద నలుగురైదుగురు వ్యక్తులు చుట్టుముట్టి కత్తులు, గొడ్డళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాజలింగమూర్తిని స్థానికులు సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించారు.   కాగా తన భర్త హత్యకు బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచ్​ బుర్ర చంద్రయ్య,   మాజీ కౌన్సిలర్‌ కొత్త హరిబాబు కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని రాజలింగమూర్తి భార్య సరళ డిమాండ్ చేశారు. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలోని అంబేడ్కర్‌ కూడలిలో నేషనల్​ హైవేపై బుధవారం(డిసెంబర్ 19) రాత్రి  బైఠాయించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు డిమాండ్‌ చేశారు. కాగా రాజలింగమూర్తి హత్య ఘటనపై రేవంత్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. ఈ హత్య ఎలా జరిగింది?  ఎవరు చేశారు? అన్న వివరాలను తనకు 24 గంటలలో నివేదించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. 

వల్లభనేని వంశీకి హైకోర్టులో చుక్కెదురు

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిలు కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను  హైకోర్టు గురువారం (ఫిబ్రవరి 20) కొట్టివేసింది. ఇదే కేసులో ఫిర్యాదుదారుడి కిడ్నాప్ కేసులో పోలీసులు ఇప్పటికే వంశీని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వంశీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వంశీని వైసీపీ అధినేత జగన్ మంగళవారం (ఫిబ్రవరి 18) పరామర్శించారు కూడా.  కాగా ఆ కేసులో ముందస్తు బెయిలు పిటిషన్ ను కొట్టివేయడంతో ఇప్పుడు గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో కూడా వంశీని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇలా ఉండగా వంశీని కస్టడీకి కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ కూడా నేడు విచారణకు రానుంది.  

సాత్విక్ సాయిరాజ్ కు పిత్రువియోగం

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ తండ్రి రంకిరెడ్డి కాశీ  విశ్వనాధం గురువారం (ఫిబ్రవరి 20) ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు.  రంకిరెడ్డి కాశీగా క్రీడాలోకానికి చిరపరిచితుడైన కాశీ విశ్వనాధం వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైర్ అయ్యారు. బ్యాడ్మింటన్ క్రీడలో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి ఉన్నత శిఖరాలకు ఎదగడంలో  కాశీ కృషి అనన్యసామాన్యం.  స్వయంగా రంకిరెడ్డి కాశీ కూడా రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ ప్లేయర్.  యన హఠాన్మరణం పట్ల పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి చెందారు. రంకిరెడ్డి కాశీ విశ్వనాథ్ మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం.. ఆరుగురు మంత్రులు కూడా

ఢిల్లీలో కొత్త ప్రభుత్వం బుధవారంకొలువుదీరనుంది. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీలో పాతికేళ్లు దాటిన తరువాత తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఢిల్లీ సీఎం అభ్యర్థిపై భారీ కసరత్తు చేసిన కమలం పార్టీ అధిష్ఠానం ఎట్టకేలకు రేఖా గుప్తాను ఆ పదవికి ఎంపిక చేసింది. దీంతో ఆమె గురువారం (ఫిబ్రవరి 20) ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెతో పాటు ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరిగే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి  ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భారతీయ జనతా పార్టీ  అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు.  రేఖా గుప్తా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ఇదే తొలిసారి. తొలి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఆమెకు ముఖ్యమంత్రి పీఠం దక్కింది.    అంతకు ముందు ఎన్నికలలో బీజేపీ విజయం సాధించిన క్షణం నుంచీ ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుందన్నదానిపై చర్చోపచర్చలు నడిచాయి. సీఎం పదవి రేసులో పలువురు సీనియర్ నాయకుల పేర్లు వినిపించినప్పటికీ.. బీజేపీ అధిష్ఠానం మాత్రం తొలి సారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తా వైపే మొగ్గు చూపింది. ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో రేఖాగుప్తా శాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విజయం సాధించారు.  తీవ్ర కసరత్తు తరువాత బీజేపీ పరిశీలకులు రవిశంకర్ ప్రసాద్, ఓపీ దన్ ఖడ్  సమక్షంలో బీజేపీ శాసనసభాపక్షం సమావేశమై రేఖా గుప్తాను నేతగా ఎన్నుకున్నారు.  బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం రేఖా గుప్తా బుధవారం (ఫిబ్రవరి 19) ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధతను తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఆ తరువాత ప్రభఉత్వ ఏర్పాటుకు రేఖా గుప్తాకు ఆహ్వానం పలుకుతూ లెఫ్టినెంట్ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు.  

గుంటూరు మిర్చియార్డులో వైసీపీ దొంగలు పడ్డారు!

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లడం రైతుల‌కు శాపంగా మారింది. ఐదేళ్ల వైసీపీ హ‌యాంలో రైతుల క‌ష్టాలు ప‌ట్టించుకోని జ‌గ‌న్‌.. రైతులపై త‌న‌కు ఎన‌లేని ప్రేమ ఉన్న‌ట్లుగా న‌టిస్తూ మిర్చి యార్డుకు వెళ్లి నానా హ‌డావుడి చేశారు. జ‌గ‌న్ మిర్చి యార్డుకు వెళ్ల‌డం వల్ల రైతుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరడం అటుంచి  రైతుల‌పైనే వైసీపీ నేత‌లు దాడి చేశారు. దీంతో కార్య‌క‌ర్త‌ల‌తో రైతుల‌ను కొట్టించ‌డానికి జ‌గ‌న్ మిర్చి యార్డుకు వెళ్లిన‌ట్లయింది.  మ‌రోవైపు ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉండ‌గా జ‌గ‌న్ మిర్చి యార్డుకు వెళ్లడం ప‌ట్ల విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ సమావేశాలు, సభలకు అనుమతి లేదని, జగన్‌ను మిర్చి యార్డులోకి అనుమతించవద్దని గుంటూరు జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలను పట్టించుకోకుండా జగన్ మిర్చియార్డులోకి వెళ్లి రైతులను కలిశారు. జగన్‌ను చూసి ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు జై జగన్ అంటూ నానా హంగామా సృష్టించారు. దీంతో పంట‌ను అమ్ముకునేందుకు వ‌చ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  జ‌గ‌న్‌కు రైతుల ప‌ట్ల నిజంగా ప్రేమ ఉండి ఉంటే,  త‌న‌తోపాటు కొద్ది మంది నేత‌ల‌ను  వెంట‌పెట్టుకొని యార్డులోకి వెళ్లి రైతుల‌తో మాట్లాడి వచ్చేవారు. కానీ, జ‌గ‌న్ మాత్రం మార్కెట్లో ర‌భ‌స సృష్టించేందుకు వైసీపీ నేత‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను స‌భ‌కు తీసుకెళ్లిన‌ట్లు యార్డులోకి తీసుకెళ్లాడు. అందులోనూ అనుమ‌తి లేకుండా దౌర్జ‌న్యంగా వెళ్లారు. దీంతో పంట‌ను అమ్ముకునేందుకు మార్కెట్‌కు వ‌చ్చిన‌ రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పైగా జ‌గ‌న్ మీడియాతో మాట్లాడుతూ.. అధికారులు, ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ప్రతిపక్ష నేతకు ప్రోటోకాల్ ఇవ్వటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వ్యాఖ్యలు చేశారు.  ఇక్క‌డ విచిత్ర‌మైన విష‌యం ఏమిటంటే, గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి ప్ర‌జ‌లు ప్ర‌తిప‌క్ష‌ హోదా ఇవ్వ‌లేదు, అందుకే జగన్ ప్రతిపక్ష నాయకుడు కాదు. ఒట్టి ఎమ్మెల్యే మాత్రమే. ఆ సంగతి తెలిసికూడా జగన్  జ‌గ‌న్ తాను ప్ర‌తిఫ‌క్ష నేత‌నే అని ప‌దేప‌దే చెప్పుకోవ‌టం ఆయ‌న మాన‌సిక స్థితిని తెలియ‌జేస్తున్నది. మ‌రోవైపు జ‌గ‌న్ మిర్చియార్డుకు వెళ్లిన స‌మ‌యంలో రైతుల మిర్చి బ‌స్తాల‌ను దొంగ‌లు దొంగిలించారు.. ఆ  దొంగలు ఎవరో కాదు.. వైసీపీ నేత‌లే.  గుంటూరు మిర్చి యార్డులో  రైతులకు చెందిన 14 మిర్చి టిక్కీలు మాయం అయ్యాయి. మిర్చి యార్డుకు వైఎస్ జగన్ వచ్చిన సమయంలో మిర్చి బస్తాలు మెట్టు కట్టిన చోట తోపులాట జరిగింది. భయంతో రైతులు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. కాసేపటికి  అక్క‌డికి వచ్చి చూసుకున్న రైతులు మిర్చి టిక్కీలు మాయమయ్యాయని గుర్తించారు. గుంటూరు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అనుచరుడు సానుగంటి చైతన్య మిర్చి టిక్కీలు దొంగిలించినట్లు యార్డ్ అధికారులు గుర్తించారు. చైతన్య ఇసుజు ట్రక్కులో మిర్చి టిక్కీలు తీసుకెళ్తున్నట్లు మార్కెట్ యార్డ్ సీసీ కెమేరాల్లో స్పష్టంగా కనిపించింది.   పల్నాడు జిల్లా వెల్దుర్దికి చెందిన నారాయణ, వెంకట సుబ్బయ్య అనే రైతులకు చెందిన న 14 మిర్చి టిక్కీలను వైసీపీ ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డి అనుచరుడు చైతన్య దొంగిలించాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా మిర్చియార్డు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు   పోలీసులు కేసు నమోదు చేసుకుని చైతన్య కోసం గాలిస్తున్నారు. దీంతో జ‌గ‌న్ తీరుపై రైతులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మా స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌టానికి వ‌చ్చావా.. మ‌మ్మ‌ల్ని ఇబ్బంది పెట్టేందుకు వ‌చ్చావా అంటూ రైతులు జ‌గ‌న్ పై మండిప‌డుతున్నారు.  అయితే  జ‌గ‌న్ ఎన్నడూ లేని విధంగా మిర్చిరైతులపై అంత ప్రేమ పుట్టుకురావడం,  ఉన్న‌ట్లుండి గుంటూరు మిర్చి యార్డుకు వ‌చ్చి హ‌డావుడి చేయ‌డం వెనుక పెద్ద క‌థే ఉంది.  న‌ర్స‌రావుపేట తెలుగుదేశం ఎంపీ కృష్ణ దేవ‌రాయులు  మిర్చికి మ‌ద్ద‌తు ధ‌ర‌పై పార్లమెంటులో ప్రశ్నించారు. అంతే కాకుండా స్వయంగా ప్రధాని మోడీకి మిర్చి రైతుల సమస్యపై రిప్రజంటేషన్ ఇచ్చారు. అంత‌ర్జాతీయంగా మార్కెట్ రేటు ప‌డిపోవ‌టంతో మిర్చి ధ‌ర త‌గ్గింద‌ని, దీని వ‌ల్ల రైతుల‌కు న‌ష్టం జ‌రుగుతోందనీ ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లారు. ఫండ్ క్రియేట్ చేసి మిర్చి రైతుల‌ను ఆదుకునేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని   విజ్ఞ‌ప్తి చేశారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ విషయంపై కేంద్రానికి లేఖ రాశారు.   దీంతో కేంద్ర ప్ర‌భుత్వం మిర్చి రైతుల‌ను ఆదుకునే ప్ర‌య‌త్నంలో ఉంది. ఈ విష‌యాన్ని తెలుసుకున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆ క్రెడిట్ ను త‌న‌ ఖాతాలో వేసుకో వాల‌న్న ఆరాటంతో హ‌డావుడిగా గుంటూరు మిర్చి యార్డుకు ప‌రుగు తీశారు. ఆయ‌న వెళ్లి మిర్చి రైతుల‌తో మాట్లాడితే రైతులు కూడా సంతోషించేవారు. కానీ, వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను వెంట‌పెట్టుకొని ఏదో యుద్ధానికి వెళ్లిన‌ట్లు యార్డులోకి వెళ్ల‌డం.. మార్కెట్ కు స‌రుకును తీసుకొచ్చిన రైతుల‌ను ఇబ్బందుల‌కు గురిచేయ‌డం, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మరీ మిర్చియార్డులో నానా రభస చేయడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  రైతులు జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   జగన్ తీరు పట్ల వైసీపీ నేతల్లోనే తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. 

రియల్ లీడర్ వర్సెస్ డమ్మీ లీడర్

రాజ‌కీయాల్లో త‌రాలు మారుతున్నాయి.. ఒక్కొ త‌రానికి కొంద‌రు నేత‌లు ప్ర‌జ‌ల అభిమానాన్ని చూర‌గొట్టూ చ‌రిత్ర పుట‌ల్లో నిలిచిపోతూ వ‌చ్చారు. అదేస‌మ‌యంలో యువ‌త‌కు టార్చ్ బేరర్ గానూ మారుతూ కొత్త రాజ‌కీయాల‌కు పునాదులు వేశారు. ఈ కోవ‌లో ప్ర‌ముఖంగా గుర్తుకొచ్చే పేర్లు ఎన్డీఆర్‌, చంద్ర‌బాబు నాయుడు. ఎన్డీఆర్ హ‌యాంలో బీసీ, ఎస్సీ వ‌ర్గాల ప్ర‌జ‌లు రాజ‌కీయాల్లో రాణించారు. అప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయాలంటే ఆమ‌డ‌దూరం ఉండే ఆ వ‌ర్గాల ప్ర‌జ‌లు.. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో గ్రామ‌ స్థాయి నుంచి రాష్ట్ర‌ స్థాయి, జాతీయ స్థాయిలో రాజ‌కీయాల్లో కీల‌క భూమిక పోషించ‌డం ప్రారంభమైంది. అదే ఒర‌వ‌డిని చంద్ర‌బాబు నాయుడుకూడా కొన‌సాగించారు. అంతేకాదు.. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఎలా రాజ‌కీయాలు చేయాలో చంద్ర‌బాబు నేర్పించారు. ఫ్యాక్ష‌న్ ప‌ల్లెల్లోనూ అభివృద్ధికి బాట‌లువేసి శాంతిని నెల‌కొల్పారు. ఐటీ రంగాన్ని అభివృద్ధిచేసి తెలుగు రాష్ట్రాల్లోని యువ‌త‌ ఇత‌ర దేశాల్లో ఐటీ రంగంలో అగ్ర‌గామిగా నిలిచేలా చేశారు. చంద్ర‌బాబు చూపిన మార్గంలో ప‌య‌ణించిన యువ‌త నేడు ఉన్న‌త స్థాయిల్లో ఉన్నారు. అయితే, గ‌డిచిన ఐదేళ్లు అధికారంలో కొన‌సాగిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం రాజ‌కీయాల అంటే కొట్టుకోవ‌టం, బూతులు తిట్ట‌డం అన్న‌ట్లుగా మార్చేశారు. వైసీపీ ఐదేళ్ల కాలంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న వ‌ల్ల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో  అభివృద్ధి ఆనవాలే లేకుండా చేశారు.  ఉన్న పరిశ్రమలను తరిమేసి.. ఏపీ అంటేనే పెట్టుబడి దారులు భయపడేలా చేశారు. అక్కడితో ఆగలేదు అక్ర‌మ కేసులుపెట్టి చంద్ర‌బాబుస‌హా అనేక మంది ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను జైళ్లకు పంపించారు. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన వారిపై దాడులు చేయించారు. జైళ్ల‌లో పెట్టించారు. ఒక‌ప‌క్క ఎన్టీఆర్ హ‌యాంనుంచి ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలు క్ర‌మంగా త‌గ్గుకుంటూ వ‌స్తున్న వేళ‌.. ఫ్యాక్ష‌న్ మూలాలు క‌లిగిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి హోదాలో మ‌ళ్లీ రాష్ట్రంలో హ‌త్య‌లు, గొడ‌వల‌కు కార‌ణం అయ్యాడు. దీంతో ప్ర‌జ‌లు విసిగిపోయి గ‌త ఎన్నిక‌ల్లో ఓటుద్వారా వైసీపీకి గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. అయినా, జ‌గ‌న్‌లో మార్పు రావ‌డం లేదు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఏపీ అన్ని రంగాల్లో అబివృద్ధి ప‌థంలో దూసుకెడుతోంది.  ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నారు. అయితే, రాష్ట్ర ప్ర‌జ‌లు సంతోషంగా ఉంటే  చూడ‌లేను అన్న‌ట్లుగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌శాంతంగా ఉన్న రాష్ట్రంలో మ‌ళ్లీ అల్ల‌ర్లు చెల‌రేగేలా కుట్ర‌లు చేస్తున్నారు. దీంతో ప్ర‌జ‌లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ నేత‌ల తీరుప‌ట్ల మ‌రింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వీళ్ల‌కు 11 సీట్లు ఇచ్చి త‌ప్పుచేశాం అంటూ బాధ‌ప‌డుతున్నారు. ఒక్కటి కూడా ఇవ్వకుండా ఉండాల్సిందని భావిస్తున్నారు.  కిడ్నాప్ కేసులో వైసీపీ నేత‌, గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించ‌డంతో విజ‌య‌వాడ‌లోని జిల్లా స‌బ్ జైలుకు త‌ర‌లించారు. మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ స‌బ్‌జైలుకు వెళ్లిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌ల్ల‌భ‌నేని వంశీతో ములాఖ‌త్ అయ్యాడు. అయితే, జైలు వ‌ద్ద సినిమా త‌ర‌హాలో ఓ సీన్ జ‌రిగింది. జ‌గ‌న్‌ను చూసేందుకు వ‌చ్చిన ఓ చిన్నారి కేక‌లు వేస్తూ జ‌గ‌న్ వ‌ద్ద‌కు వెళ్లేందుకు ప్ర‌య‌త్నించింది. దీంతో జ‌గ‌న్ ఆ అమ్మాయిని రా.. రా.. అంటూ ద‌గ్గ‌ర‌కు తీసుకున్నాడు. ఇదంతా ప్ర‌జ‌ల‌కు చూడ‌టానికి ఎమోష‌న‌ల్ సీన్‌లా అనిపించొచ్చు. ఎమోష‌న‌ల్ సీన్ల‌ను పండించి ప్ర‌జ‌ల సానుభూతిని పొంద‌డంలో జ‌గ‌న్ దిట్ట అని ఏపీలో ఏ చిన్న‌పిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు. అంత‌లా కోడికత్తి, బాబాయ్ హ‌త్య‌, గుల‌క రాయిల‌తో జ‌గ‌న్ ఫేమ‌స్ అయ్యారు. అయితే, ఇక్క‌డ విష‌యం ఏమిటంటే.. వంద‌ల మంది జ‌నం జ‌గ‌న్ కాన్వాయ్ చుట్టూ గుమ్మికూడారు. ఓ వ్య‌క్తి చిన్న‌పాప‌ను తీసుకొని స‌రిగ్గా జ‌గ‌న్ వాహ‌నం ముందుకే రావ‌డం.. ఆ చిన్నారి కూడా కేక‌లు వేస్తూ, ఏడ్చుకుంటూ జ‌గ‌న్ జ‌గ‌న్ అంటూ అర‌వ‌టం.. ఆ వెంట‌నే జ‌గ‌న్ ఆ అమ్మాయిని ద‌గ్గ‌ర‌కు తీసుకొని ముద్దుపెట్టడాన్ని చూసిన ప్ర‌జలు ఇదంతా వైసీపీ నాయ‌క‌త్వం ముందుగానే క్రియేట్ చేసిన డ్రామా అంటూ ఈజీగా చెప్పేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇదేక్ర‌మంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి.. మంత్రి నారా లోకేశ్ కు తేడాఇదే అంటూ ప‌లు  వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.  మంత్రి నారా లోకేశ్ తాత ఎన్టీఆర్‌, తండ్రి చంద్ర‌బాబు రాజ‌కీయ ల‌క్ష‌ణాల‌ను పుణికిపుచ్చుకొని క్ర‌మ శిక్ష‌ణ క‌లిగిన రాజ‌కీయాలు చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. ఈ తరానికి నారా లోకేష్ టార్చ్ బేరర్ గా కనిపిస్తున్నారు. లోకేశ్ పాల్గొన్న స‌భ‌లో అత‌నికి ద‌గ్గ‌రిగా ప‌దిహేనేళ్ల‌లోపు పిల్ల‌లు పార్టీ కండువా వేసుకొని, పార్టీ గుర్తుతో ఉన్న చొక్కా వేసుకొని క‌నిపిస్తే వాటిని వెంట‌నే తీయించి వేయిస్తారు. అవ‌స‌ర‌మైతే, వారి వ‌ద్ద‌కు వెళ్లి తానే స్వ‌యంగా తీసేస్తాడు. ఎందుకంటే.. చిన్న‌పిల్ల‌లు చ‌దువు, ఆట‌ల మీద‌నే   దృష్టిని కేంద్రీక‌రించాలి. లోకేష్ ప్రజాగళం పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఓ చిన్నారి తెలుగుదేశం జెండా పట్టుకుని, తెలుగుదేశం నేతల బొమ్మలున్న పసుపుపచ్చ చొక్కా ధరించి లోకేష్ దృష్టిలో పడ్డాడు. వెంటనే లోకేష్ ఆ పిల్లవాడి చేతిలోని తెలుగుదేశం జెండాను తీసేశారు. ఆ చిన్నారి ధరించిన తెలుగుదేశం గుర్తులున్న షర్టునూ విప్పేశారు. బుద్ధిగా చదువుకో, పెద్ద అయిన తరువాత రాజకీయాలలోకి వద్దువుగానీ అంటూ బుజ్జగించి, హితవు చెప్పారు. చిన్న‌త‌నంలోనే పిల్లలపై రాజ‌కీయాల‌ను ర‌ద్దొద్ద‌న్నది లోకేశ్ ఆలోచ‌న‌. కానీ, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం చిన్న పిల్ల‌లైనా, పెద్ద‌వారైనా ఫ్యాక్ష‌న్ త‌ర‌హా రాజ‌కీయాలు, ఓవ‌రాక్ష‌న్ రాజ‌కీయాలు చేస్తే చాలు.. ప్రోత్స‌హిస్తుంటారు. చ‌దువు లేకుండా యువ‌త ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల్లో మ‌గ్గిపోవాల‌ని జ‌గ‌న్ ఆలోచ‌న‌. దీంతో సోష‌ల్ మీడియాలో లోకేశ్ కు సంబంధించిన వీడియోల‌ను పోస్టుచేసి  లోకేశ్‌ను చూసి రాజ‌కీయాలు ఎలా చేయాలో నేర్చుకో జ‌గ‌న్ అంటూ నెటిజ‌న్లు సూచిస్తున్నారు. అప్ప‌ట్లో ఎన్టీఆర్‌, నిన్న‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు.. ఇప్పుడు నారా లోకేశ్ చిన్నారులు, యువ‌త‌కు టార్చ్ బేర‌ర్‌గా మారుతున్నాడని ప్ర‌జ‌లు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

జగన్ వ్యాఖ్యలతో  పోలీసు అధికారుల్లో నైరాశ్యం 

విజయవాడ్ సబ్ జైలులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేనిని పరామర్శించడానికి వచ్చిన వైకాపా అధినేత , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలీసు అధికారులను బెదిరించిన తీరు చర్చనీయాంశమయ్యాయి. ఐదేళ్ల పాలనలో జగన్ అధికార దుర్వినియోగం చేసిన తీరు ప్రతీ పోలీసు అధికారికి తెలుసు.  వైసీపీ  ఎంపిగా ఉన్న సమయంలో రఘురామకృష్ణ రాజును పోలీస్ టార్చర్ పెట్టిన ఘటన బహుషా ఎవరూ మర్చిపోరు. తాము అధికారంలో రాగానే అన్యాయం చేసిన పోలీసు అధికారుల బట్టలూడదీస్తామని జగన్ వ్యాఖ్యలు చేశారు. పోలీసుటోపిపై ఉన్న సింహాలకు సెల్యూట్ చేయాలని వైకాపా నేత హెచ్చరించారు. చట్టాలను గౌరవిస్తూ కూటమి ప్రభుత్వం దళితుడైన సత్యవర్దన్ ను కిడ్నాప్ చేసిన  కేసులో వంశీని అరెస్ట్ చేశారు. పరామర్శకు వచ్చిన జగన్ పరామర్శించి వెళ్లిపోయి ఉంటే ఇంత రచ్చ జరిగేదికాదు. పోలీసులను పరుష పదజాలంతో దూషించినప్పటికీ జగన్ పై  కేసు నమోదు కాకపోవడం పోలీసుల ఆత్మస్తైర్యం దెబ్బతీసింది. జగన్ వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం తప్పు పట్టింది.  అధికారం కోల్పోయిన జగన్ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించడం తప్పుడు సంకేతాలు వెళ్తాయని సర్వత్రా వ్యక్తమైంది. ఎన్నికల కోడ్ ఉండగానే  గుంటూరు మిర్చియార్డు కు  జగన్ వచ్చినప్పుడు కూడా  ఎన్నికల అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ చూసి చూడనట్టు వ్యవహరించారు. ఈ అలుసే కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుంది. జగన్ పర్యటకు జిల్లా పోలీసులు నిరాకరించారు. అయినా జగన్ మిర్చియార్డకు వచ్చి నానా హంగామా చేశాడు.  ఎన్నికల అధికారి  ప్రేక్షకపాత్ర వహించడం టిడిపి శ్రేణుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. వైకాపా హాయంలో అరాచకాలపై చట్టపరంగా చర్యలు తీసుకునే సాహసం పోలీసు అధికారులు తీసుకోవాలంటే కూటమి ప్రభుత్వం జగన్ పట్ల మెతకవైఖరి వీడాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు  కూడా చం ద్రబాబు మెతక వైఖరి ఉన్నారని, ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే వైఖరి అవలంబిస్తే  తప్పుడు సంకేతాలు అధికారులకు వెళ్లే ప్రమాదం ఉంది.   

ఏపీ కేబినెట్ భేటీ వాయిదా.. కారణమేంటంటే?

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన మేరకు గురువారం (ఫిబ్రవరి 20)న ఏపీ కేబినెట్ భేటీ జరగాల్సి ఉంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందు జరగాల్సిన ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అయితే అనూహ్యంగా కేబినెట్ భేటీ వాయిదా పడటంతో ఇందుకు కారణమేంటా అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అయితే ఈ భేటీకి అధ్యక్షత వహించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన కారణంగా కేబినెట్ భేటీ వాయిదా పడింది. గురువారం (ఫిబ్రవరి 20) న ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కానున్నారు. దీంతో అనివార్యంగా ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడింది.  

బీఆర్ఎస్ లో నూతనోత్సాహం.. ఎందుకంటే?

బీఆర్ఎస్ శ్రేణులలో చాలా రోజుల తరువాత కొత్త ఉత్తేజం, ఉత్సాహం కనిపించింది. ఇందుకు కారణం సుదీర్ఘ కాలం ఫామ్ హౌస్ కే పరమితమైన ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ కార్యాలయం తెలంగణ భవన్ కు రావడమే. బుధవారం (ఫిబ్రవరి 19)మధ్యాహ్నం ఆయన తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. తెలంగాణ భవన్ లో  బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ, ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండటానికి కారణాలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు తదితర అంశాలపై ఆయన క్యాడర్ కు దిశా నిర్దేశం చేశారు. అంతకు ముందు ఆయన తెలంగాణ భవన్ కు చేరుకోగానే స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. సీఎం, సీఎం అని పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకు తోసుకు వచ్చారు. ఆ సందర్భంగా కేసీఆర్ వారిని మందలించారు. ఒర్లకండిరా బాబూ అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ అధ్యక్షతన  జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ జిల్లాల అధ్యక్షులు,  ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, నియోజకవర్గ ఇన్ చార్జ్ లు హాజరయ్యారు.  

ఎన్నికల కోడ్ కు అంబటి కొత్త భాష్యం.. అజ్ణానమా? అతి తెలివా?

మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. తన అమోఖమైన వాదనా పటిమతో జగన్ గుంటూరు మిర్చియార్డ్ పర్యటనను సమర్ధించుకున్నారు. ఇందు కోసం ఆయన ఎన్నికల నియమావళికి సైతం కొత్త భాష్యం చెప్పారు. ఎన్నికల కోడ్ అనేది కేవలం ఎన్నికలలో పోటీ చేసే పార్టీలూ, అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తుందని సెలవిచ్చారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా ఆ ఎన్నికలలో పోటీలో లేని వైసీపీకి ఆ కోడ్ వర్తించదని అంబటి రాంబాబు వాదిస్తున్నారు.  వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. కృష్ణా గుంటూరు గ్రడ్యుయూట్ కాన్సిట్యుయెన్సీ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలులో ఉంది.  ఆ కారణంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం వైసీపీ అధినేత జగన్ గుంటూరు మిర్చియార్డ్ సందర్శనకు అనుమతి నిరాకరించింది. అయినా ఆయన ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి వేలాది మందితో ప్రదర్శనగా మిర్చియార్డ్ కు వెళ్లి హల్ చల్ చేశారు. రాజకీయ ప్రసంగం చేశారు. చంద్రబాబు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేశారు. అలా నియమావళిని ఉల్లంఘించి జగన్ గుంటూరులో పర్యటించడానికి ఎన్నికల కోడ్ కు సంబంధం లేదంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు. ఎక్కడైనా సరే ఎన్నికల కోడ్ అనేది ఎన్నికలలో పోటీ చేసే పార్టీలకే వర్తిస్తుందనీ, పోటీకి దూరంగా ఉన్న పార్టీలకు కాదనీ భాష్యం చెప్పి తన అజ్ణానాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతం మొత్తానికి ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. ఫలానా రాజకీయ పార్టీ పోటీలో లేదు కనుక ఆ పార్టీకీ, ఆ పార్టీ వ్యక్తులకు అది వర్తించకుండా మినహాయింపు లేదు. సభలూ, సమావేశాలు నిర్వహించకూడదు, బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టకూడదు. అనుమతి లేకుండా ప్రదర్శనలు నిర్వహించకూడదు. ఈ విషయం కూడా తెలియకుండానే అంబటి రాంబాబు గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారా? అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.   

చట్టాలపై జగన్ కు ఖాతరీ లేదు.. ఇదిగో మరో రుజువు!

చట్టాల పట్లా, నిబంధనల పట్లా, రాజ్యాంగం పట్ల  తనకు ఖాతరీ లేదని జగన్ మరోసారి రుజువుచేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున గుంటూరులో మిర్చియార్డు పర్యటనకు జగన్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది. పోలీసు శాఖ కూడా అనుమతి లేదని స్పష్టం చేసింది. అయినా జగన్ లెక్క చేయలేదు. వేలాది మందిని వెంటేసుకుని మిర్చి యార్డుకు వెళ్లారు. ఆ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు అతి చేశారు. వాస్తవానికి అనుమతి లేదు అని చెప్పిన పోలీసులు జగన్ భారీ ప్రదర్శనగా మిర్చియార్డుకు వెడుతుంటే ఎందుకు అడ్డుకోలేదు. అనుమతి లేని ప్రదర్శన చేసినందుకు ఎన్నికల సంఘం ఎలాగా కేసు పెడుతుంది అప్పుడు చూసుకుందాం అని వదిలేశారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా కృష్ణా, గుంటూరు జిల్లాలలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడం ఎంత నేరమో తెలియదనుకోలేం.    అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న మిర్చియార్డులో మిర్చి రైతుల కష్టాలను చంద్రబాబు పట్టించుకోవడం లేదంటూ జగన్ ఆరోపణలు గుప్పించారు.  అదే సమయంలో రైతుల కష్టాలను గాలికొదిలేసి.. చంద్రబాబు తన దృష్టినంతా వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ రాజకీయ కక్ష సాధింపు చర్యలపైనే కేంద్రీకరించారని విమర్శించారు.  దీంతో ఇప్పడు జగన్ సీఎంగా ఉన్న సమయంలో అమరావతి రైతులను ఎంత క్షోభపెట్టారో గుర్తు చేస్తూ నెటిజనులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. అమరావతి రైతులపై అక్రమ కేసులు బనాయించిన సంగతిని గుర్తు చేస్తున్నారు. అమరావతి రైతుల పాదయాత్రపై అప్పట్లో అడుగడుగునా దాడులు చేయించిన వైనాన్ని ప్రస్తావిస్తూ అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ముందు వాటికి బదులిచ్చి ఆ తరువాత మిర్చిరైతుల గురించి మాట్లాడమని నిలదీస్తున్నారు.  ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్ష హోదా లేకపోయినా, ఒిక రాజకీయ పార్టీ అధినేతగా జగన్ పోరాడడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ అందుకోసం ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడాన్నీ, చట్టాలను ధిక్కరించడాన్ని ఎవరూ సమర్ధించరు. అలా చేస్తున్న జగన్ పై చర్యలు తీసుకోకుండా కూటమి ప్రభుత్వం మిన్నకుండటం సరికాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.   

ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోంది ఉండవల్లీ!

రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రంగులు మార్చడంలో ఊసరవెల్లిని మరపిస్తారు. వైఎస్ కు నమ్మిన బంటుగా ఉండవల్లి రాజకీయాలలో గుర్తింపు పొందారు. ఆయన ఆశీస్సులతో రాజమహేంద్రవరం నుంచి రెండు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. లోక్ సభ సభ్యుడిగా  ఆయన రాజమహేంద్రవరం అభివృద్ధికి ఏం చేశారో తెలియదు కానీ, రాష్ట్ర విభజన తరువాత రాజకీయ సన్యాసం ప్రకటించి.. తన గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహనరెడ్డి శ్రేయోభిలాషిగా మిగిలిపోయారు. ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా భ్రష్టుపట్టిపోయినా, అవినీతి, అరాచకత్వం రాజ్యమేలినా.. ఉండవల్లికి చీమకూడా కుట్టలేదు. కానీ జగన్ ఇబ్బందుల్లో ఉన్న ప్రతి సారీ.. ఆయనకు మద్దతుగా మీడియా ముందుకు వచ్చి తనకు మాత్రమే సాధ్యమైన హేతురహిత వ్యాఖ్యానాలతో జగన్ తరఫున మాట్లాడే వారు. సీనియర్ రాజకీయ నాయకుడు అయి ఉండీ వాస్తవాలను గుర్తించకుండా జగన్కు అనుకూలంగా ఆయన చేసిన విశ్లేషణలూ, వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలూ నవ్వుల పాలైన సందర్భా లెన్నో ఉన్నాయి. ఆయన ప్రతిష్ట పూర్తిగా మసకబారి జనంలో క్రెడిబులిటీ కోల్పోయారు.   తన రాజకీయ గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ కు మద్దతుగా నిలవడం కోసం వాస్తవాలను  ఆయన వక్రీకరించిన విధానంపై వైసీపీయులు కూడా ఒకింత అసహనానికి లోనైన సందర్భాలు కూడా ఉన్నాయి.  రాష్ట్ర విభజనను వ్యతిరేకించి రాజకీయ సన్యాసం పుచ్చుకున్న ఆయన బుద్ధిగా రాజకీయాలు మాట్లాడకుండా తన పని తాను చూసుకోకుండా తగుదునమ్మా అంటూ జగన్ కోసం వాస్తవాలను వక్రీకరించిన వైనంపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ఆయనతో పాటే రాష్ట్ర విభజనను వ్యతిరేకించి రాజకీయాలకు దూరమైన లగడపాటి.. ఆ తరువాత ఎన్నడూ రాజకీయాలపై మాట్లాడలేదు. విశ్లేషణలు చేయలేదు. కానీ ఉండవల్లి మాత్రం అందుకు భిన్నంగా జగన్ కోసం వంకర రాజకీయాలు చేస్తూనే వస్తు న్నారు. గత ఏడాది ఎన్నికలలో  వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని, జగన్ మాజీ ముఖ్యమంత్రి అయిన తరువాత   ఉండవల్లి మరింత చురుకుగా జగన్ కు మద్దతుగా మాట్లాడటం మొదలు పెట్టారు. ఇటీవలి కాలంలో ఆయన రాజకీయ సన్యాసానికి గుడ్ బై చెప్పి జగన్ కోసం వైసీపీ తీర్థం పుచ్చుకుని పొలిటికల్ గా యాక్టివ్ అవుతారన్న వార్తలు వచ్చాయి. అయితే  నేరుగా జగన్ పార్టీలో చేరి తాను చేసేదేం లేదని గ్రహించిన ఉండవల్లి రాజకీయ సన్యాసాన్ని కంటిన్యూ చేస్తానంటూ బహిరంగ ప్రకటన ఇచ్చి జగన్ కు తన పరోక్ష మద్దతు కొనసాగుతుందన్న సంకేతాలిచ్చారు. అదే సమయంలో జగన్ కు ప్రయోజనం చేకూర్చడం కోసం ఇతర పార్టీల మధ్య సఖ్యతకు బీటలు వారే వ్యాఖ్యలకు తెరలేపారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఉండవల్లి కూటమి పార్టీల్లో విభేదాలున్నాయన్న అనుమానాలు జనబాహుల్యంలో కలిగించేలా వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలతో తన వంతు ప్రయత్నం చేశారు. జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఆంధ్ర ప్రదేశ్ కు ఆశాజ్యోతిగా పవన్ కల్యాణ్ను అభివర్ణిస్తూ మునగచెట్టు ఎక్కించే ప్రయత్నం చేశారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడి అందర్నీ మెప్పిస్తున్న పవన్ కల్యాణ్ ను ఒక డిఫరెంట్ పొలిటీషియన్ గా పేర్కొంటూ ఉండవల్లి తనకు మాత్రమే సాధ్యమైన లౌక్యాన్ని ప్రదర్శించారు. చంద్రబాబు కంటే పవన్ కల్యాణే మంచి నాయకుడని   చెప్పడం ద్వారా తెలుగుదేశం, జనసేనల మధ్య గ్యాప్ సృష్టించి తద్వారా జగన్ కు ఏదో మేరకు రాజకీయ ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం చేశారు.  పవన్ కల్యాణ్ వల్ల మాత్రమే రాష్ట్ర‌ విభజన సమస్యలు పరిష్కారం అవుతాయ‌ని ప్రజలు నమ్ముతున్నారనీ , విభ‌జ‌న హామీల సాధ‌న‌ కోసైం ఏం చేయాలో తాను పవన్ కు లేఖ రాశాననీ పేర్కొన్నారు. దీనిపై నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఆయన కొత్తగా మొదలు పెట్టిన పవన్ భజన వల్ల జగన్ కు ఇసుమంతైనా ప్రయోజనం చేకూరదని అంటున్నారు. జగన్, వైసీపీ పవన్ ను టార్గెట్ చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడినప్పుడు ఉండవల్లి స్పందింలేదని గుర్తు చేస్తున్నారు.