ప్రతి కుటుంబానికీ పాతిక లక్షలు ఆరోగ్య బీమా.. దటీజ్ బాబు!
posted on Feb 21, 2025 @ 2:46PM
తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిజమైన అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తారు. ముందు తరాల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పథకాలకు రూపకల్పన చేస్తారు. ఇదే ఆయనను మేధావులూ, ప్రగతి కాముకులు, ప్రజా ప్రయోజనాలే పరమార్ధంగా తమతమ రంగాలలో నిష్ణాతులైన వారిని సైతం ఆయన అభిమానులుగా మార్చేసింది. ఒక అబ్దుల్ కలామ్, ఒక బిల్ గేట్స్ వంటి వారు తాము చంద్రబాబు అభిమానులమని బాహాటంగా ప్రకటించడం వెనుక కారణం కూడా ఇదే. అటువంటి చంద్రబాబు ఇప్పడు ప్రజా ప్రయోజనాలు, ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మరో బృహత్తర పథకంతో ముందుకు వస్తున్నారు. అనారోగ్యం కారణంగా ఎవరూ ఆర్థిక ఇబ్బందులకు లోను కాకూడదన్న ఉద్దేశంతో ఆయన విప్లవాత్మక పథకానికి రూపకల్పన చేస్తున్నారు.
ఔను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరో విప్లవాత్మక పథకాన్ని అమలు చేసే యోచనలో ఉన్నారు. అందుతున్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి కుటుంబానికీ పాతిక లక్షల ఆరోగ్య బీమా కల్పించే పథకానికి రూపకల్పన చేస్తున్నారు. ఇదే కనుక నిజమైతే దేశంలోనే ఇదొక ఆరోగ్య విప్లవంగా నిలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అమలులో ఉంది. అయితే ఆ పథకం కొన్ని వర్గాల వారికి మాత్రమే పరిమితం. ఉదాహరణకు ఈ పథకం కిందకు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే అర్హులు. అంతే కాకుండా ఈ పథకం పూర్తిగా అసంఘటితంగా ఉంది. ఈ పథకం కింద వైద్య సేవలు అందించే ప్యానల్ ఆస్పత్రుల సంఖ్య చాలా చాలా స్వల్పం. ఆ ఆస్పత్రులు కూడా తరచూ పెండింగ్ బిల్లులంటూ సేవలు నిలిపివేస్తామని బెదరిస్తాయి. పలు ఆస్పత్రులైతే ఈ పథకం కింద చికిత్స అందించడానికి పెండింగ్ బిల్లులు సాకు చూపుతూ నిరాకరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకూ ఆరోగ్యబీమా కల్పించే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈ పథకం అమలులోకి వస్తే దేశంలోనే ఇది ఒక ఆరోగ్య విప్లవంగా అభివర్ణించవచ్చు.
ఒక అంచనా ప్రకారం ప్రతికుటుంబానికి ఆరోగ్య బీమా వర్తింప చేయడానికి కుటుంబానికి పాతిక వందల చొప్పున ప్రీమియం పడుతుంది. ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ లో బీమా రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇచ్చింది. దీంతో త్వరలోనే పలు అంతర్జాతీయ బీమా సంస్థలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. బీమా కంపెనీల మధ్య పోటీ కారణంగా ప్రీమియం మరింత తగ్గే అవకాశాలను కూడా కొట్టి పారేయలేము. దివంగత వైఎస్సార్ తొలి సారిగా ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథకానికి ప్రజల నుంచి గొప్ప స్పందన వచ్చింది. ఈ తరువాత వచ్చిన ప్రభుత్వాలు కూడా పేరు మార్పు వినా ఈ పథకాన్ని యథాతధంగా కొనసాగించాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈ పథకం ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో అమలు అవుతోంది. అయినప్పటికీ ప్రజలు దీనిని ఆరోగ్య శ్రీ పథకం అనే అంటున్నారు. ఆ క్రెడిట్ వైఎస్సార్ ఖాతాలోనే పడుతోంది. దానిని అలా ఉంచితే.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి పరిమితులూ లేకుండా ప్రతి కుటుంబానికి పాతిక లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఆరు గంటల్లో చికిత్సకు అనుమతి లభించడమే కాకుండా చెల్లింపులు సైతం వేగంగా జరుగుతాయి.
ఇది అమలులోకి వస్తే చంద్రబాబు పేరు చిరస్థాయిగా ప్రజల గుండెలలలో నిలిచిపోతుందని, అన్నిటికీ మించి ఇది చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి అతి పెద్ద రాజకీయ పెట్టుబడి అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక సారి ఈ పథకం ఏపీలో అమలులోకి వస్తూ ఆ వెంటనే పలు రాష్ట్రాలు కూడా దీనిని తమ తమ రాష్ట్రాలలో అమలు చేస్తాయి. ఇందుకు రాజకీయ ప్రయోజనాలు ఒక కారణమైతే.. బీమా రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం ఉండటం మరో కారణం. ఈ పథకాన్ని కనుక చంద్రబాబు రాష్ట్రంలో ముందుగా అమలులోకి తీసుకు వస్తే ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పరిశీలకులు అంటున్నారు.
కేంద్రం ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని అమలు చేస్తున్నది. అయితే ఆ పథకం కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా మాత్రమే కల్పిస్తున్నది. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రతిపాదిస్తున్న బీమా పథకం మాత్రం అంతకు ఐదింతలు ఎక్కువగా పాతిక లక్షల రూపాయల ఆరోగ్య బీమా కల్పిస్తుంది.