జమిలీతో జయం.. అసెంబ్లీకి రాంరాం.. జగన్ కొత్త రాగం..!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇకపై అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావద్దని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని తమ పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పారు. సోమవారం (ఫిబ్రవరి 24 ) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనర్హత వేటు భయమో, ఉప ఎన్నికలు వస్తే పులివెందుల సహా ఇప్పడు పార్టీకి ఉన్న 11 స్థానాలూ కూడా కోల్పోతామన్న బెదురో కానీ.. ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకూ అసెంబ్లీ గడప తొక్కను అన్న ప్రతిజ్ణను కాసేపు పక్కన పెట్టి అసెంబ్లీకి హాజరైన జగన్ గవర్నర్ ప్రసంగం పూర్తయ్యే వరకూ కూడా కూర్చో లేకపోయారు. తనతో సహా తన పార్టీ ఎమ్మెల్యేలకు 11వ బ్లాక్ లో సీట్లు కేటాయించడం ఆయనకు ఎన్నికల ఫలితాలను గుర్తు చేసినట్లున్నాయి. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలోనే విజయం సాధించింది. సరే కేటాయించిన 11వ బ్లాక్ సీట్లలోనైనా వైసీపీ ఎమ్మెల్యేలు కూర్చో లేదు. పదే పదే జగన్ ప్రతిజ్ణను గుర్తు చేస్తూ.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నానాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అది కూడా ఎక్కువ సేపు లేదు.  మళ్లీ మూడు సెషన్ల వరకూ లేదా అరవై సమావేశ దినాల వరకూ తమ సభ్యత్వానికి వచ్చే ముప్పేమీ లేదని అనుకున్నారో ఏమో.. సరిగ్గా 11 నిముషాల పాటు సభలో నినాదాలు చేసి గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి వచ్చేశారు.  బాయ్ కాట్ తరువాత జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో  సమావేశమయ్యారు. ఆ సమావేశంలో బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ణానోదయమైనట్లు.. తనకు అసెంబ్లీలో జ్ణానోదయమైందన్నట్లుగా మారిపోయారు. ఉప ఎన్నికలు వచ్చినా, ఉన్న స్థానాలు కూడా పోయినా, ఇక అసెంబ్లీకి మాత్రం హాజరయ్యే పరిస్థితి లేదన్నారు. ఇప్పటి నుంచే మనం తదుపరి ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పిలుపు నిచ్చారు. ఎలా చూసుకున్నా 2028లో జమిలి ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పిన జగన్.. అనర్హత వేటు గురించి మరిచిపోయి.. ఆ ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రిపేరౌదామని చెప్పుకొచ్చారు. తాను మరో 30 ఏళ్లు రాజకీయాలలో ఉంటాననీ, ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లినా వెళ్లకపోయినా మనకు వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. ప్రజా సమస్యలపై పోరాడతాం. 2028 ఎన్నికలలో గెలుద్దాం అని వారిలో ధైర్యం నింపడానికి ప్రయత్నించారు. చేసిన ప్రతిజ్ణను మరిచిపోయి.. అనర్హత వేటు భయంతో అసెంబ్లీలో అడుగుపెట్టిన జగన్ కు కేవలం 11 అంటే 11 నిముషాలలో ఈ జ్ణానోదయం ఎలా అయ్యిందబ్బా అని వైసీపీ నేతలే విస్తుపోతున్నారు. ఈ జ్ణానం ఏదో ఒక రోజు ముందు అయ్యి ఉంటే ప్రతిజ్ణను పక్కన పెట్టి అసెంబ్లీకి వెళ్లాల్సి వచ్చేది కాదు కదా? పరువు ఇంతగా పోయి ఉండేది కాదు కదా? అని వైసీపీ శ్రేణులే అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. నెటిజనులైతే.. మళ్లీ 60 రోజుల గడువు పూర్తి అవుతున్న సమయంలో జగన్ కు పులివెందుల భయం పట్టుకుంటుందేమో చూడాలి అని జోకులేస్తున్నారు.  

వల్లభనేనికి బిగ్ షాక్ 

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది. మూడు రోజుల కస్టడీకి ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించడం  వల్లభనేని వర్గీయులకు తీవ్ర నిరాశకు గురి చేసింది. కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టుకు విన్నవించారు. వాద ప్రతివాదనలు విన్న కోర్టు సోమవారం తాజాగా ఇచ్చిన తీర్పు ప్రకారం విజయవాడ పరిధిలోనే  పోలీసులు కస్టడీ తీసుకోనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలీసులు వంశీని ఇంటరాగేషన్ చేయనున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ ప్రధాన నిందితుడు. ఇదే కేసులో వంశీ రిమాండ్  ఖైదీగా ఉన్నారు. వంశీని10 రోజుల కస్టడీకి  ఇవ్వాలని పోలీసులు కోర్టుకు విన్నవిస్తే కోర్టు మాత్రం కేవలం మూడు రోజుల కస్టడీకి అప్పగించారు. 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. తెలంగాణలో అయిదు, ఆంధ్రప్రదేశ్‌లో అయిదుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం వచ్చే నెల 29తో ముగియనుంది. వాటి భర్తీకి ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది, మార్చి 3న నోటిఫికేషన్ రానుంది. మార్చి 20న పోలింగ్, అదేరోజున కౌంటింగ్ చేసి రిజల్ట్ విడుదల చేస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ నుంచి ముగ్గరు, కాంగ్రెస్‌తో ఉన్న మైత్రితో ఎంఐఎం నుంచి ఒకరు,  బీఆర్ఎస్ నుంచి ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశం దక్కనుంది ఇక కాంగ్రెస్ నుంచి చాలా మంది ఆశావహులు టికెట్ ఆశిస్తున్నారు. తెలంగాణలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, సుభాష్ రెడ్డి, యగ్గే మల్లేశం, మీర్జా రియాజుల్ హసన్ పదవీకాలం పూర్తి కానుంది ఇక ఏపీలో మొత్తం ఐదు స్థానాలు కూడా కూటమికే దక్కే అవకాశాలు ఉన్నాయి. జంగా కృష్ణమూర్తి, అశోక్ బాబు, దువ్వారపు రామారావు, తిరుమలనాయుడు, యనమల రామకృష్ణుడు వారి పదవీకాలం పూర్తి చేసుకుంటున్నారు. ఉప  ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. నాగబాబుని మంత్రివర్గంలోకి  తీసుకుంటారని ఇప్పటికే ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఆయన్ని శాసనమండలికి పంపిస్తారంటున్నారు. మిగిలిన స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది.

దుబాయ్‌లో ‘విరాట్‘ పర్వం

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ అలవోకగా పాకిస్థాన్ లెక్క సరిచేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై తమదే ఆధిపత్యమని విర్రవీగుతున్న పాక్‌కు విరాట్‌ కోహ్లీ బ్యాట్‌తో కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఫామ్‌ తాత్కాలికమని.. క్లాస్‌ శాశ్వతమని మరోసారి చాటి చెప్పాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అంటే చాలు, కింగ్‌ విరాట్ ఓ యుద్ధానికి సిద్ధమైనట్లు సాధన చేస్తాడు. తాజాగా జరిగిన మ్యాచ్‌కు ముందు దుబాయ్‌లో కూడా నెట్స్‌కు అందరికంటే రెండు మూడు గంటల ముందే వచ్చి సుదీర్ఘంగా ప్రాక్టీస్‌లో గడిపాడు. ఆ ఫలాన్ని మ్యాచ్‌లో అందుకొన్నాడు. ఇక విరాట్‌ మ్యాచ్‌ పరిస్థితులను అంచనా వేయడంలో దిట్ట. తాజా మ్యాచ్‌లో కూడా రోహిత్‌ తర్వాత మరో వికెట్‌ వెంటనే కోల్పోకుండా.. మెల్లగా స్ట్రైక్‌ను రొటేట్‌ చేస్తూ.. టాప్‌గేర్‌లోకి వెళ్లాడు. ఈ క్రమంలో పాక్‌ ఆటగాళ్లు ఎంత కవ్వించినా, తన సహనాన్ని కోల్పోకుండా స్థిమితంగా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఇది విరాట్‌ అసలైన స్టైల్‌కు పూర్తిగా భిన్నం. పాక్‌పై తన కెరీర్‌లో కింగ్‌ మొత్తం 17 వన్డేలు ఆడాడు. వాటిల్లో 4 శతకాలు, రెండు అర్ధశతకాలున్నాయి. దాయాదిపై 2015 నుంచి ఆడిన 8 మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు, 2 అర్ధశతకాలు ఉన్నాయి.   ఇక టీ-20 ఫార్మాట్‌లో కూడా అతడికి పాక్‌పై ఘనమైన రికార్డే ఉంది. 11 మ్యాచ్‌ల్లో ఐదు అర్ధ శతకాలు, 70 సగటుతో ఏకంగా 492 పరుగులు చేశాడు. రెండేళ్ల క్రితం మెల్‌బోర్న్‌లో టీ20 ప్రపంచకప్‌లో ఆ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి కోరల నుంచి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. పాక్‌తో జరిగే సమరం విషయంలో ఫ్యాన్స్ భావోద్వేగాలు అతడికి బాగా తెలుసు. అంతేకాదు.. ఇటీవల విరాట్‌ కవర్‌డ్రైవ్‌ కొడితే వికెట్‌ కోల్పోతున్నాడంటూ జరిగిన ప్రచారానికి ఈ మ్యాచ్‌తో ఫుల్‌స్టాప్‌ పెట్టాడు. హారిస్‌ రవూఫ్‌ ఈ మ్యాచ్‌లో విరాట్‌ను ఊరించేలా ఆఫ్‌స్టంప్‌ బయటకు బంతిని వేశాడు. కోహ్లీ తన ట్రేడ్‌మార్క్‌ కవర్‌ డ్రైవ్‌తో దానిని బౌండరీ లైన్‌ దాటించాడు. కొద్దిసేపటి తర్వాత మరోసారి కవర్‌ డ్రైవ్‌తో బౌండరీకి చేర్చాడు.  సాధారణంగా ఛేజింగ్‌ అంటే జట్లపై ఒత్తిడి ఉంటుంది. కానీ, విరాట్‌ దీనికి పూర్తిగా భిన్నం. లక్ష్యాన్ని వేటాడుతూ పరుగుల వరద పారించడం అతడి స్టైల్‌. తన కెరీర్‌లో 158 ఇన్నింగ్స్‌ల్లో ఛేజింగ్‌ చేశాడు. దాదాపు 7,975 పరుగులు ఈ క్రమంలో సాధించినవే. అంతే కాదు.. అతడు 27 శతకాలు.. 41 అర్ధశతకాలను కూడా ఆ సమయంలోనే పూర్తి చేశాడు. కెరీర్‌ బ్యాటింగ్‌ సగటు 58 కాగా.. ఛేజింగ్‌లో మాత్రం 64గా ఉంది. ఈ గణాంకాలు లక్ష్యసాధనలో విరాట్‌ ఎంతటి ప్రమాదకారో చెబుతున్నాయి.

అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ప్రసంగం పూర్తి పాఠం

మాన్యశ్రీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్తు, మాన్యశ్రీ సభాపతి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మరియు గౌరవ శాసనమండలి సభ్యులు: అందరికీ నా శుభాభినందనలు.  2025-26 బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ శాసనసభ ఉమ్మడి సమావేశంలో ప్రసంగించడం నిజంగా నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.  గౌరవ ముఖ్యమంత్రి   నారా చంద్రబాబు నాయుడు, గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్, గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారల నాయకత్వం పట్ల విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచుతూ, ఎన్డీయే ప్రభుత్వ సంకీర్ణం   సంపూర్ణ మద్దతును ప్రతిబింబిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు శాసనసభ ఎన్నికలలో నా ప్రభుత్వానికి ప్రజలు అపూర్వమైన తీర్పును ఇచ్చారు.       ఈ ప్రభుత్వానికి లభించిన అఖండ, చారిత్రాత్మక మెజారిటీ ప్రజా సంకల్పానికి నిదర్శనం మాత్రమే కాదు, గత ప్రభుత్వ దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా ప్రజలిచ్చిన బలమైన ప్రకటన కూడా. గత ప్రభుత్వంలో అన్నిరంగాల్లో జరిగిన దుర్వినియోగం వల్ల మనం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితి గురించి నేను ఈ సభలో గతంలో చేసిన ప్రసంగాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నాను. గత ఐదేళ్లలో (2019-24) జరిగిన దుర్మార్గపు పాలన రాష్ట్రాన్ని ఆర్థిక పతనం అంచుకు చేర్చింది. గత ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఏడు శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేశాను. ఈ శ్వేత పత్రాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దుర్వినియోగాన్ని బయటపెట్టాయి. రాష్ట్ర వనరుల మళ్లింపు, సహజవనరుల దోపిడీ, ఎక్సైజ్, ఇసుక తవ్వకాల్లో లోపభూయిష్ట విధానాలతో రాష్ట్ర ఆదాయానికి గండిపడటం, ప్రభుత్వ పన్నులను దారి మళ్లించడం ద్వారా 25 సంవత్సరాల భవిష్యత్తు ఆదాయాన్ని కోల్పోవడం, అధిక రుణ స్థాయి, అధిక వడ్డీ రేట్లకు రుణాలు తీసుకోవడం, భారత ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి రుణాలు తీసుకోవడం, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల మళ్లింపు, అన్ని ప్రాజెక్టులను స్తంభింపజేయడం ద్వారా నీటిపారుదల రంగం పతనం, ఇంధన రంగం విధ్వంసం, రూ.1.35 లక్షల కోట్ల మేర అప్పులు ఉన్నాయి.     అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే గౌరవనీయ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు గారు వారి దార్శనిక నాయకత్వంలో నా ప్రభుత్వం ఆరు హామీలను అమలు చేసేందుకు, ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర పునరుజ్జీవనం కోసం నిరంతరం కృషి చేస్తూ బ్రాండ్ ఆంధ్ర ప్రదేశ్ కుపూర్వ వైభవాన్ని పునరుద్ధరించడం ప్రారంభించాము. మొదటి కొద్ది రోజుల్లోనే, మేము మా వాగ్ధానాలను నెరవేర్చడానికి, అలాగే ప్రజల జీవితాలలో స్పష్టమైన మెరుగుదలలను తీసుకురావడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నాము.  , ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం, సామాజిక భద్రతా పింఛన్లను రూ.4,000/-లకు పెంచడం, విద్యా రంగాన్ని బలోపేతం చేయడం కోసం 16,347 మంది ఉపాధ్యాయుల నియామకానికి మెగా డిఎస్సీని ప్రకటించడం, ఉపాధి అవకాశాలను అంచనా వేయడానికి, పెంచడానికి నైపుణ్య గణనను నిర్వహించడం, 204 అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, గుంతలు లేని రోడ్ల కోసం మిషన్, ఉచిత ఇసుక పాలసీ విధానం అమలు వంటివి అందులో కొన్ని. గత దుర్భల పాలన, దుష్పరిపాలన నుంచి బాధ్యతాయుతమైన, సుపరిపాలన ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావడంలో గత ఎనిమిది నెలల్లో మా ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించింది. గత ప్రభుత్వం నిలిపివేసిన 93 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 74 పథకాలను పునరుద్ధరించి రూ.9,371 కోట్ల అప్పులు తీర్చాం. ఇది ప్రస్తుత, భవిష్యత్ సంవత్సరాలకు భారత ప్రభుత్వం నుండి మరిన్ని నిధులవిడుదలకు అవకాశం కల్పించింది. ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడానికి, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ పై విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి నీటిపారుదల, రోడ్లు, ఇతర పనులకు సంబంధించి రూ.10,125 కోట్ల బిల్లులను క్లియర్ చేశాం. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న రూ.2,488 కోట్ల ఆర్థిక సంఘం గ్రాంట్లను విడుదల చేయడం ద్వారా స్థానిక పాలనను బలోపేతం చేశాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి నిర్మిస్తామని ఇటీవల శాసనసభ ఎన్నికలలో ఎన్.డి.ఏ. హామీ ఇచ్చినట్లుగా పోలవరం  ప్రాజెక్టు, అ మరావతి రాజధాని ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించాం. విశాఖ ఉక్కు కర్మాగారం పునరుద్ధరణ, కొత్త రైల్వే జోన్ ఏర్పాటు హామీలను నెరవేర్చాలనే మా నిబద్ధతకు ఇది నిదర్శనం. సుస్థిర వృద్ధి, శ్రేయస్సుకు దోహదపడే 22 కొత్త విధానాలను ప్రారంభించడం ద్వారా బలమైన పునాది వేశాం.    మా ప్రయత్నాలు ఇప్పటికే ఫలితాలను ఇస్తున్నాయనే విషయాన్ని పంచుకోవడానికి నేను గర్విస్తున్నాను. భారీ పెట్టుబడుల కోసం గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ, టాటా పవర్, గ్రీన్ కో గ్రూప్, బిపిసిఎల్, టిసిఎస్ వంటి అనేక అంతర్జాతీయ దిగ్గజాలను ఆకర్షిస్తున్నాం. ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. 4 లక్షల మందికి ఉపాధి అవకాశాల కల్పనకు ఇది దోహదపడింది. 2024-25 మొదటి ముందస్తు అంచనాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గత సంవత్సరం రూ.14.22 లక్షల కోట్ల నుండి రూ.16 లక్షల కోట్లకు విస్తరించింది. ఇది 12.94% నామ మాత్రపు వృద్ధి రేటు. మన తలసరి ఆదాయం కూడా గత సంవత్సరంలోని రూ.2.37 లక్షల నుంచి రూ.2.68 లక్షలకు పెరిగింది.  వ్యవసాయం, అనుబంధ రంగాలు 15.86%, పరిశ్రమలు 6.71%, సేవల రంగం 11.70% చొప్పున వృద్ధి చెందాయి. ఈ ప్రగతి అన్ని కీలక రంగాలలో గణనీయమైన పనితీరు వల్ల సాధ్యమయింది.  గొప్ప సంఘ సంస్కర్త స్వర్గీయ శ్రీ కందుకూరి వీరేశలింగం గారు చెప్పినట్లు,  "అవకాశాలు ఇస్తే ప్రతీ మనిషిలో మేటి నైపుణ్యం వెలుగొందుతుంది."  అవకాశాలు ఇస్తే ప్రతి ఒక్కరిలోని ప్రతిభ ప్రకాశిస్తుంది. నా ప్రభుత్వం ఇప్పుడు స్వర్ణాంధ్ర @ 2047 దిశగా ప్రయాణిస్తోంది.  ఏ సమాజమైనా సుభిక్షంగా ఉండాలంటే సంక్షేమం, అభివృద్ధి కలిసి కట్టుగా సాగాలి. అవి ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు. ఒకటి లేకుండా, మరొకటి కుదుటపడదు. ఆర్థిక పురోగతి, సామాజిక సంక్షేమం పెనవేసుకుపోయేలా ఈ సమతుల్యతను సాధించడానికి ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉంది. ఈ విధానం కేవలం రోడ్లు లేదా పరిశ్రమల నిర్మాణానికి సంబంధించినది కాదు. జీవితాలను నిర్మించుకోవడం గురించి. రైతుల నుంచి విద్యార్థుల వరకు, మహిళల నుంచి అట్టడుగు వర్గాల వరకు అందరూ అభివృద్ధి చెందిన సమాజాన్ని సృష్టించడం.  అసమానతలను తగ్గించే, అవకాశాలను అందించే, వృద్ధికి ఊతమిచ్చే సమతుల్య విధానానికి ఈ ద్వంద్వ దృష్టి అవసరం. సంక్షేమం,  అభివృద్ధి కలిసికట్టుగా సమ్మిళిత ప్రగతి, సుస్థిర మరియు పరివర్తన చెందే ఒక ధర్మ చక్రాన్ని సృష్టిస్తాయి. భారతదేశంలో స్వయం సహాయక బృందాల ద్వారా మహిళా సాధికారత సాధించడంలో గౌరవనీయ ముఖ్యమంత్రి మార్గదర్శిగా ఉన్నారు. 1995లోనే స్వయం సహాయక బృందాలను రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాల్లో కీలక భాగంగా చేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచారు. స్వయం సహాయక బృందాలు లక్షలాది మంది మహిళలు, వారి కుటుంబాల జీవితాలను మారుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో స్వయం సహాయక బృందాల బ్యాంకు లింకేజీ వృద్ధి అమోఘం. గ్రామీణ ప్రాంతాల్లో ఏటా సుమారు రూ.35,000 కోట్ల బ్యాంకు లింకేజీ పంపిణీతో 30% జాతీయ వాటాతో స్వయం సహాయక బృందాల బ్యాంకు లింకేజీ కార్యక్రమం కింద 99.66% రికవరీతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.  అదే సమయంలో, గౌరవ ముఖ్యమంత్రిగారు ఐటీ విప్లవానికి నాయకత్వం వహించి, హైదరాబాద్ గ్లోబల్ టెక్నాలజీ హబ్ గా ఎదగడానికి పునాది వేశారు. ఐటిపై రాష్ట్రం ముందుగానే దృష్టి పెట్టడం వల్ల ప్రవాస తెలుగువారు ఈ పరివర్తనను ప్రత్యక్షంగా చూశారు, ప్రవాస తెలుగువారి తలసరి ఆదాయం అమెరికాలో అత్యధికంగా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరో విప్లవానికి నాయకత్వం వహిస్తోంది. ఐటి నుండి కృత్రిమ మేధ వరకు పరిపాలన, పరిశ్రమలు, ఆర్థిక వృద్ధి  భవిష్యత్తును రూపొందించడానికి కృత్రిమ మేధస్సు యొక్క శక్తిని ఉపయోగిస్తున్నది. నా ప్రభుత్వం స్వర్ణాంధ్ర @2047 సుభిక్ష భవిష్యత్తు కోసం మన దార్శనికతను నిర్వచించే పది మార్గదర్శక సూత్రాలను రూపొందించింది.   అవి... పూర్తిగా పేదరికం నిర్మూలన. మానవ వనరుల అభివృద్ధి & జనాభా నియంత్రణ.  నైపుణ్యం పెంపుదల, ఉపాధికల్పన నీటి భద్రత రైతు-అగ్రిటెక్  గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ వ్యయ నియంత్రణ, విద్యుత్ & ఇంధనం ఉత్పత్తి పరిపూర్ణత  స్వచ్ఛాంధ్ర విస్తృత సాంకేతికత ఏకీకరణ  వికసిత్ భారత్ దార్శనికతతో నా ప్రభుత్వం 'పీపుల్ ఫస్ట్' విధానంతో స్వర్ణాంధ్ర @2047 సాధించడానికి సమగ్ర రోడ్ మ్యాప్ ను అమలు చేస్తోంది. 15శాతం పైన వృద్ధి రేటుపై దృష్టి సారించడం ద్వారా 2047 నాటికి, 100 సంవత్సరాల స్వతంత్ర భారతదేశానికి గుర్తుగా 'సంపన్న, ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన' సుస్థిరమైన, అత్యంత నివాసయోగ్యమైన సమాజంగా మారడానికి మరియు రూ.58 లక్షల తలసరి ఆదాయంతో రూ.308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి రాష్ట్రం తన ప్రత్యేకమైన అంతర్గత బలాలను సద్వినియోగం చేసుకుంటున్నది.  వ్యక్తులు, కుటుంబాలకు సాధికారత కల్పించడం ద్వారా రాబోయే కొన్నేళ్లలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం స్వర్ణాంధ్ర @ 2047 ప్రయాణంలో ఒక ఆవశ్యకత. ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటి వద్దకే పింఛన్లు అందించేందుకు దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్¬టిఆర్ భరోసాకు శ్రీకారం చుట్టాం. మరే రాష్ట్రంలోనూ ఇంత భారీ డిబిటి సంక్షేమ పథకం లేదు. ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లకు నెలవారీ పెన్షన్ రూ.3,000 నుంచి రూ.4,000కు, దివ్యాంగులకు రూ.3,000 నుంచి రూ.6,000కు పెంచడమయింది. ఈ పథకం ద్వారా 8 లక్షల మంది దివ్యాంగులతో సహా సుమారు 64 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ఏడాదికి రూ.33,312 కోట్ల వ్యయాన్ని చేస్తూ ఇప్పటివరకు రూ.29,281 కోట్ల మొత్తాన్ని పంపిణీ చేయడమయింది. నిరుపేదలకు ఆహార భద్రత కల్పించేందుకు, మేము ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి, ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకుండా ఐదు రూపాయలకే  పౌష్టికాహారం అందించే 204 అన్న క్యాంటీన్లను పునరుద్ధరించడం జరిగింది. బలహీన వర్గాల విద్య, సామాజిక భద్రత, ఆర్థిక సాధికారతపై దృష్టి సారించి, మేము ఎస్¬సి, ఎస్¬టి, బిసి, మైనారిటీ విద్యార్థులకు ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్¬షిప్¬లను అమలు చేస్తున్నాం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, ఆదాయకల్పన కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారించి రూ.2000 కోట్లను కేటాయిస్తూ ఎస్¬సి, ఎస్¬టి, బిసి, మైనారిటీలకు ఆర్థిక మద్దతు పథకాలను పునరుద్ధరించడం జరిగింది, మేము ఎస్ సి, ఎస్ టి కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను కూడా అందిస్తున్నాం. ఎస్ సిల వర్గీకరణ కోసం, వర్గీకరణ విధివిధానాలను నిర్ణయించడానికి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది.  ముఖ్యంగా 4.93 లక్షల మంది బలహీన గిరిజన సమూహాలతో కలుపుకొని 27.39 లక్షల షెడ్యూల్డ్ తెగల సమగ్ర సామాజిక, ఆర్థిక అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఐటిడిఏ ప్రాంతాలలో గిరిజనుల విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, జీవనోపాధులు, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి వంటి వివిధ రంగాల్లో సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా దీనిని సాధించడమవుతున్నది. బిసిలు సమాజానికి వెన్నుముకగా ఉన్నారు. వారి ఆర్ధిక, సామాజిక, రాజకీయ సాధికారతకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. బిసి సామాజిక వర్గాల సంక్షేమం కోసం, స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు, ఆదాయం వచ్చే కార్యకలాపాల కోసం వివిధ కార్పొరేషన్లకు రూ.896 కోట్ల మొత్తాన్ని విడుదల చేయడంతో సహా పలు కీలక కార్యక్రమాలను మేము అమలు చేయడం జరిగింది. అదనంగా, రాష్ట్ర శాసనసభలో బిసిలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపించడమయింది. స్థానిక సంస్థలు మరియు నామినేటెడ్ పోస్టులలో 34 శాతం రిజర్వేషన్లను కల్పించే దిశగా మేము పనిచేస్తున్నాం. ఈ సామాజిక వర్గానికి దీర్ఘకాలిక సంక్షేమం మరియు హక్కులు కల్పించేలా చూస్తూ, ప్రత్యేక బిసి పరిరక్షణ చట్టాన్ని చేయడం కోసం మేము రోడ్ మ్యాప్¬ను రూపొందించాం.   మేము ఆలయ అర్చకుల గౌరవ వేతనాన్ని రూ.15,000/-లకు, నాయీబ్రాహ్మణుల గౌరవ వేతనాన్ని రూ.25,000/-లకు పెంచడం జరిగింది. నిరుద్యోగ వేద విద్యార్థులకు నెలకు రూ.3,000/-ల భత్యాన్ని ఇవ్వడమవుతున్నది. వరుసగా రూ.10,000/-, రూ.5,000/- చెల్లిస్తున్న ఇమామ్¬లు, మౌజాన్లకు పెండింగులో ఉన్న గౌరవ వేతనాలను ఇటీవల విడుదల చేయడం జరిగింది.  మహిళల సంక్షేమం కోసం, మా ప్రభుత్వం దీపం-2 పథకాన్ని ప్రవేశపెట్టింది, ఇది సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తుంది, ఇది అవసరమైన వంట ఇంధనం అందుబాటులో ఉండేలా చేస్తుంది మరియు జీవన నాణ్యతను పెంచుతుంది, ముఖ్యంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాల్లోని మహిళల జీవన నాణ్యతను పెంచుతుంది. ఇందువల్ల ఇప్పటివరకు రూ.686 కోట్ల మొత్తం పంపిణీతో ఇప్పటికే 86.50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరింది.  పేరిట అవసరమైనచోట ఇంటి స్థలాలను తగువిధంగా సమకూరుస్తూ సంతృప్తత విధానంలో 2029 చివరి నాటికి రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలన్నింటికీ శాశ్వత గృహాలను సమకూర్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గత 8 నెలల్లో రూ.642.38 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేసి, పిఎంఏవై అర్బన్ - బిఎల్¬సి : 76585 గృహాలు, పిఎంఏవై గ్రామీణ : 37746 గృహాలు మరియు పిఎం జన్¬మన్-305 గృహాల క్రింద 1.14 లక్షల గృహాలను పూర్తి చేయడమయింది. ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం, పక్కా ఇల్లు, మరుగుదొడ్డి, స్వచ్ఛమైన నీరు, వంటగ్యాస్, విద్యుత్, సుస్థిర ఇంధనం కోసం సోలార్ పైకప్పు కూడా అందుబాటులో ఉండేలా చూడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. భూమి లేని కుటుంబాలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమిని సమకూరుస్తూ  పెండింగ్¬లో ఉన్న 6.34 లక్షల ఇళ్లను పూర్తి చేసేందుకు మేము చురుగ్గా పనిచేస్తున్నాం. మా ప్రభుత్వం మొదటి సంవత్సరం పూర్తయ్యే నాటికి పట్టణ మరియు గ్రామీణ పేదల కోసం 4 నుండి 5 లక్షల ఇళ్ళను పూర్తి చేయనున్నాం.       ప్రతి కుటుంబం అవసరమైన సేవలు ,  మద్దతును సమర్థవంతంగా పొందేలా చూస్తూ పథకం ప్రయోజనాలు మరియు ఇతర సంక్షేమ చర్యల పంపిణీని క్రమబద్ధీకరించడానికి, నా ప్రభుత్వం ఫ్యామిలీ బెనిఫిట్ కార్డును ఆవిష్కరించాలని యోచిస్తోంది.  ఎవరైనా ఒక మనిషికి ఒక చేపను ఇస్తే, అది అతనికి ఒక రోజు తిండి పెట్టినట్లవుతుంది. అదే మనిషికి చేపలు పట్టడం నేర్పితే, జీవితాంతం తిండి పెట్టినట్లవుతుంది అనే సూక్తిని గౌరవ ముఖ్యమంత్రి  గట్టిగా సమర్థిస్తున్నారు. అర్హులైన పౌరులందరికీ అవసరమైన నైపుణ్యాలు, అవకాశాలను సమకూరుస్తూనే వారి ప్రయోజనాలను సకాలంలో పొందేలా వ్యవస్థను ప్రభుత్వం రూపొందిస్తున్నది.  సంప్రదాయ సంక్షేమ పథకాలతో పాటు, నా ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం ఒక ప్రత్యేకమైన విధానాన్ని రూపొందిస్తోంది, ఇక్కడ అధిక-నికర విలువ కలిగిన వ్యక్తులు  అవసరార్ధులకు, నిరుపేదలకు అండగా ఉంటారు. సమాజ అభ్యున్నతి యొక్క ఈ లక్ష్యాన్ని సాధించడానికి, మన ప్రజలను విలువైన ఆస్తులుగా గుర్తిస్తూ మరియు మెరుగైన జీవన ప్రమాణాలకు ప్రాధాన్యత ఇస్తూ మన గౌరవనీయ ముఖ్యమంత్రిగారిచే రూపొందించబడిన ప్రభుత్వ-ప్రైవేటు-ప్రజల భాగస్వామ్యం అనే ఒక వినూత్న పీ4 విధానానికి మేము నాంది పలుకుతున్నాం. అట్టడుగున ఉన్న ఇరవై శాతం మందికి మద్దతు ఇవ్వడానికి మన జనాభాలోని అగ్రస్థాయిలోని పది శాతం మందిని నిమగ్నం చేయడం ద్వారా, పేదరికం నుండి స్థిరమైన మార్గాలకు మార్గం సుగమం చేస్తూ సమాజంలోని అత్యంత బలహీన వర్గాలకు లక్షిత సహాయాన్ని అందించేలా చూస్తుంది.  ఈ విధంగా, సమష్టి దార్శనికత, ఆలోచనలు, అంకితభావంతో కూడిన కార్యక్రమాలు స్థూల స్థాయిలో ప్రణాళికలు రచించి, సూక్ష్మస్థాయిలో అమలు చేయడం ద్వారా ప్రతి పౌరుడికి సుసంపన్నమైన, స్వావలంబన, గౌరవప్రదమైన భవిష్యత్తును నిర్ధారిస్తూ పేదరికంలేని సమాజం దిశగా ఆంధ్రప్రదేశ్¬ను నడిపిస్తున్నాయి.  సుస్థిర ఆర్థిక వృద్ధికి మరియు మానవ వనరుల అభివృద్ధికి నైపుణ్యం, ఆరోగ్యకరమైన శ్రామిక శక్తి మూలస్తంభమని నా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుంది. ఈ దార్శనికతకు అనుగుణంగా విద్య, ఆరోగ్య రంగాలపై వ్యూహాత్మక దృష్టి సారించడం ద్వారా మానవ వనరుల సామర్థ్యాన్ని మేము బలోపేతం చేస్తున్నాం.  సృజనాత్మక   వ్యయ ప్రభావక పరిష్కారాలతో నివారణ మరియు నిర్మూలన అనే ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టితో డిజిటల్ పరిజ్ఞానం మరియు సృజనాత్మక జోక్యాలను ఉపయోగించడం ద్వారా నా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. సుమారు రూ.1770 కోట్ల మేర పెండింగ్ లో ఉన్న అప్పులను తీర్చి, ఎన్-టిఆర్ వైద్యసేవ, ఉద్యోగుల ఆరోగ్య పథకం వంటి కీలక పథకాలను పునరుద్ధరించడం జరిగింది. మా ఎన్ డిఏ ప్రభుత్వం హైబ్రిడ్ ఆరోగ్య బీమాను ప్రతిపాదిస్తున్నది. ఇందులో రూ.2.5 లక్షల క్లెయింలను ఇన్సూరెన్స్ పార్ట్ నర్ రీయింబర్స్ చేస్తారు. రూ.2.5 లక్షలకు మించి రూ.25 లక్షల వరకు గల క్లెయింలను ఎన్.టి.ఆర్ వైద్య సేవా ట్రస్టు రీయింబర్స్ చేస్తుంది. ప్రతి శానససభ నియోజకవర్గంలోనూ 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడం కోసం ఒక విధానాన్ని రూపొందించాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముందస్తు చొరవకు వీలు కల్పిస్తూ హైపర్ టెన్షన్, డయాబెటీస్ వంటి వేలాది కొత్త కేసులను మరియు సంభావ్య క్యాన్సర్ కేసులను గుర్తిస్తూ 92.4 లక్షల మంది వ్యక్తులకు ఇప్పటికే ఆరోగ్య పరీక్షలను నిర్వహించడమయింది.  వ్యవసాయం, ఆహారపు అలవాట్లు మరియు ఆరోగ్యం మధ్య అనుసంధానంపై దృష్టి పెట్టడం ద్వారా మన జనాభా యొక్క మారుతున్న ధోరణులను కూడా మేము పరిష్కరిస్తున్నాం. ప్రోటీన్ అధికంగా ఉండే గుడ్లు మరియు సేంద్రీయ ఉత్పత్తులు వంటి ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను ప్రజలు ఎక్కువగా ఎంచుకుంటున్నారు మరియు ఆంధ్రప్రదేశ్ ఈ మార్పులో అగ్రగామిగా ఉంది. సాంకేతికత, నివారక సంరక్షణ మరియు సంపూర్ణ ఆరోగ్య విధానాలను సమ్మిళితం చేయడం ద్వారా, మేము ఆరోగ్యకరమైన, మరింత సమర్ధవంతమైన సమాజాన్ని నిర్మిస్తున్నాం, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాం. మన సమాజ మూలాలను పటిష్టపరచడానికి ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర విద్యా సంస్కరణలను నా ప్రభుత్వం అమలు చేస్తున్నది. సామాజిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా మేము దేశంలోనే మొట్టమొదటి మెగా పేరెంట్-టీచర్ మీటింగ్¬ను నిర్వహించాం. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు 'డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం' అనే మధ్యాహ్న భోజన కార్యక్రమానికి మేము తిరిగి రూపకల్పన చేశాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కార్యక్రమం ద్వారా 35.94 లక్షల మంది విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించనున్నాం. 'మనబడి – మన భవిష్యతు' వంటి కార్యక్రమాల ద్వారా మేము మౌలిక సదుపాయాలను ఆధునీకరిస్తున్నాం. జాతీయంగా, అంతర్జాతీయంగా వేగంగా మారుతున్న సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపొందించేలా చూస్తూ ఉన్నత విద్యలో అంతర్జాతీయ స్థాయి సంస్కరణలను ప్రవేశపెట్టాం. ఈ సంస్కరణలకు అనుగుణంగా ఉన్నత ప్రమాణాలను పెంపొందించేందుకు కొత్త దృక్పథాలను, నాయకత్వాన్ని తీసుకువస్తూ ఉన్నత విద్యను క్రమబద్ధీకరించడానికి, సుస్థిర కార్యవిధానాలను అనుసరించి, పూర్తిగా ప్రతిభ ఆధారంగా మేము 9 విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమించాం.   ఆంధ్రప్రదేశ్ గణనీయమైన జనాభా పరివర్తనలకు లోనవుతోంది, వీటిలో సంతాన సాఫల్యత రేటు (టిఎఫ్ఆర్) లో తీవ్రమైన క్షీణత మరియు వృద్ధాప్య జనాభా వేగంగా పెరగడం, సాంప్రదాయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థల క్షీణత చేరి ఉన్నాయి, ప్రతి ఒక్కటి దీర్ఘకాలంలో ప్రభావం చూపే అంశమే.   'డెమోగ్రాఫిక్ మేనేజ్ మెంట్' పై ఒక విధానాన్ని ప్రారంభించడం ద్వారా తగ్గుతున్న శ్రామిక శక్తి, వృద్ధాప్య జనాభా, మారుతున్న కుటుంబ ధోరణుల పర్యవసానాల పరిష్కారానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇద్దరు పిల్లలు మించకూడదు అనే నిబంధనను మేము  రద్దు చేశాం. అంతేకాకుండా, మా హామీలకు అనుగుణంగా పిల్లల చదువులు కుటుంబానికి భారంగా మారకుండా తల్లులకు ఆర్థిక చేయూతనిస్తూ 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేయబోతున్నాం. దూరదృష్టి, లక్ష్యసాధనతో, సుస్థిర ఆర్థికాభివృద్ధికి పునాది వేస్తూ ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధిశాఖ సమర్థవంతమైన జనాభా నిర్వహణను ప్రోత్సహిస్తున్నది. విద్య, నైపుణ్యాల పెంపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వ్యూహానికి కేంద్ర బిందువులు. నైపుణ్యాల ఆఫ్ లైన్, ఆన్ లైన్ అప్ గ్రేడేషన్ పై దృష్టిసారిస్తూ స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రజల నైపుణ్యాలను గుర్తించడానికి రాష్ట్రం మొట్టమొదటిసారిగా నైపుణ్య గణనను నిర్వహిస్తోంది.  అభివృద్ధికి 'ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త' అనే అంశంపై దృష్టిసారిస్తూ ఉపాధికల్పనకు బలమైన పునాది వేయడమే మా ప్రభుత్వ సమగ్ర విధానం. ఆత్మగౌరవం, ఆర్థిక స్థిరత్వం రెండింటినీ తీసుకొచ్చే వృత్తులకు విలువనిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎల్లప్పుడూ స్వీయ సంతృప్తికరమైన పనిని స్వీకరించడం జరిగింది. వారి వ్యవస్థాపక స్ఫూర్తి వారిని అవకాశాలను చురుకుగా ఉపయోగిం చుకో వడానికి ప్రేరేపిస్తుంది, నైపుణ్యాలను స్థిరమైన జీవనోపాధిగా మారుస్తుంది.  నైపుణ్యాలను పెంపొందించడానికి, మేము నైపుణ్య బదిలీ నమూనాను అనుసరిస్తున్నాం. దీని కింద స్థానిక పరిశ్రమ అవసరాలను తీర్చడానికి  నిరుద్యోగ యువత, కళాశాల డ్రాపవుట్ లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వ ఐటీఐలు, పాలిటెక్నిక్ లు, డిగ్రీ కళాశాలల్లో 200 స్కిల్ హబ్ లను ఏర్పాటు చేశాం. మనం ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రిగారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి సారించారు. ఈ కార్యక్రమం క్రింద, 4,700 ఎకరాల్లో 800పైగా భూ కేటాయింపులను విజయవంతంగా నిర్వహించి, రూ.78,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 48,789 ఉద్యోగాలను కల్పించడం జరిగింది.  కీలక ఉపాధికల్పన రంగంగా ఉన్న పర్యాటకం అభివృద్ధిలో సాధికారత తీసుకురావడంలో, సుస్థిర వృద్ధిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ 2024-29 రాష్ట్రం  సాంస్కృతిక వారసత్వం, సహజ సౌందర్యం, వైద్యం,  ఎకో టూరిజం సామర్థ్యాలను ఉపయోగిం చుకోవడం ద్వారా రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా మార్చాలని భావిస్తున్నది. పర్యావరణ ప్రభావాన్ని తగ్గించేందుకు గ్రీనరైజేషన్ కార్యకలాపాలను ఏకీకృతం చేస్తూ సుస్థిర పర్యాటకంపై రాష్ట్రం దృష్టిసారిస్తున్నది. ఎంఎస్ఎంఈలు, టెక్స్ టైల్స్, పర్యాటకం వంటి అధిక వృద్ధి రంగాలపై దృష్టిసారిస్తూ బ్లూ, వైట్ కాలర్ ఉద్యోగాలతో సహా అన్ని కేటగిరీల్లో ఉపాధిని కల్పించడం ఆంధ్రప్రదేశ్ సమగ్ర వ్యూహంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ టెక్స్ టైల్స్, అపెరల్ అండ్ గార్మెంట్ పాలసీ 2024 ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో ఐదు టెక్స్ టైల్ పార్కుల ద్వారా ఐదేళ్లలో రూ.10,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం,  2 లక్షల ఉద్యోగాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.  అట్టడుగున ఉన్న సంప్రదాయ వృత్తులకు మద్దతును అందించే మా చర్యలలో భాగంగా  మా ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నది.  గీత కులాల వారి కోసం మా సర్కార్  10 శాతం దుకాణాలను రిజర్వు చేసి, రాయితీతో కూడిన 50 శాతం వార్షిక రిటైల్ ఎక్సైజ్ పన్ను   అందించాం. నైపుణ్యం కలిగిన ప్రతి కార్మికుడు, పారిశ్రామికవేత్త తాము ఎంచుకున్న రంగంలో అభివృద్ధి చెందడానికి అవసరమైన మద్దతును పొందేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది.  ఆంధ్రప్రదేశ్ ఐటి ,  జిసిసి పాలసీ (2024–2029) ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణ మరియు సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా  ఐటి రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకుంది.  డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, వర్క్ ఫ్రమ్ హోమ్, కో-వర్కింగ్ స్పేసెస్, డేటా ఆధారిత గవర్నెన్స్ కి ఈ విధానం ప్రాధాన్యత ఇస్తుంది. ఇలాంటి వ్యూహాత్మక చొరవలు, అచంచలమైన నిబద్ధత ద్వారా, ఆంధ్రప్రదేశ్ ఉపాధి, అధునాతన నైపుణ్యానికి కేంద్రంగా రూపాంతరం చెందుతున్నది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్ యువతకు ఉపాధి కల్పించడానికి లేదా ఉపాధి భత్యం ఇవ్వడానికి మేము కట్టుబడి  ఉన్నాం. ప్రతి ఇంటికి తాగునీరు అందించడం, సమాన పంపిణీ, వ్యవసాయ స్థితిస్థాపకత కోసం నదుల అనుసంధానం, సంరక్షణ చర్యల ద్వారా అన్ని రంగాల్లో నీటి వినియోగాన్ని గరిష్టతరం చేయడాన్ని కట్టుదిట్టం చేస్తూ నీటి సురక్షితకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.  ఇందు కోసం కొత్త రాష్ట్ర జల విధానాన్ని రూపొందించనుంది. గత ప్రభుత్వం సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. సాగునీటి ప్రాజెక్టులు , మౌలిక సదుపాయాలను పూర్తిగా ఉపేక్షించింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలలోని ప్రాజెక్టులన్నీ గత ప్రభుత్వ హయాంలో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీనిపై మా ప్రభుత్వం తిరిగి దృష్టిసారించి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పోలవరానికి అనుసంధానం చేస్తున్నది. జగన్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కింది.  2027 నాటికి   పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో  మా ప్రభుత్వం ఉంది.  కరవు రహిత రాష్ట్ర లక్ష్యాన్ని సాధించే దిశగా, మా ప్రభుత్వం పోలవరం నుండి  బనకచెర్ల నది అనుసంధాన ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్టు లింక్ కాలువ ద్వారా గోదావరి నది నుండి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ కు నీటిని బదిలీ చేస్తుంది.  అమృత్  అండ్ జల్ జీవన్ మిషన్ (జెజెఎం) అమలు గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయింది.  దీనిని ఇప్పుడు   మా  ప్రభుత్వం పునరుద్ధరించింది. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో, ప్రతీ కుటుంబానికి కుళాయి నీరు అందేటట్లు చేయడానికి గానూ, నిధులను వినియోగించుకోవాలనీ, 95.44 లక్షల గ్రామీణ కుటుంబాలన్నింటికీ వర్తింప చేయాలని మా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. రాయలసీమకు కీలకమైన హంద్రీనీవా సుజల స్రవంతి వంటి ఇతర కీలక ప్రాజెక్టులు 1వ దశలో 94 శాతం, 2వ దశలో 82 శాతానికి చేరుకున్నాయి, ఇవి సుమారు 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు, 437 గ్రామాల్లోని సుమారు 33 లక్షల మందికి తాగునీరు అందిస్తాయి.  జలహారతి కార్యక్రమం ద్వారా, ప్రతి ఎకరానికీ సాగునీరు అందిస్తూ, దానిని భూమాతకు అర్పణగా పరిగణిస్తూ రైతుల శ్రేయస్సుకు, ఆశలకు ప్రతీకగా నిలుస్తూ, మేము నదులు, జలాశయాలకు పూజలు చేస్తున్నాము.  నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, పద్ధతులను అవలంబించాలనే తపనతో ఉన్న  అభ్యుదయ రైతులకు ఆంధ్రప్రదేశ్ ఎల్లప్పుడూ నిలయంగా ఉంది. అయితే, గత ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా రైతులు కష్టాల పాలయ్యారు. ఇప్పుడు మా ప్రభుత్వ హయాంలో   ఏ రైతు కూడా కష్టాల్లో లేరని చెప్పడానికి   గర్విస్తున్నాము. రుతుపవనాలకు ముందు, తరువాత నీటి లోతు స్థాయిలపై దృష్టి సారించి భూగర్భ జలాల రీఛార్జ్ కు తగిన ప్రణాళిక లు రూపొందించి అమలు చేయడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించడానికి మా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.     ఆంధ్రప్రదేశ్ లో గంజాయి మరియు మాదకద్రవ్యాల స్మగ్లింగ్¬ను అరికట్టేందుకు ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్¬ఫోర్స్¬మెంట్ (ఈఎజిఎల్ఇ), విద్యాసంస్థలు మరియు యువతపై దృష్టిని సారిస్తోంది. మా ప్రభుత్వం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, గంజాయి అక్రమ రవాణా మరియు మహిళలపై నేరాలు వంటి సంఘ విద్రోహ శక్తులను ముందస్తుగా నియంత్రించడం మరియు అటువంటి దుర్మార్గపు చర్యలను నిర్మూలించడానికి తగిన పద్దతులను తీసుకురావడం ద్వారా వాటిని పరిష్కరిస్తోంది.   కలిసికట్టుగా పనిచేద్దాం, కలిసి నిర్మించుకుందాం, కలిసి ఎదుగుదాం, ఆంధ్రప్రదేశ్ ను భారతదేశానికే కాదు, ప్రపంచానికే ఒక అభివృద్ధి మార్గదర్శిగా నిలిచేలా చేద్దాం. జై హింద్! జై ఆంధ్ర! జై జై స్వర్ణాంధ్ర!

వంశీ కస్టడీ కోరుతూ పిటిషన్ తీర్పు పై ఉత్కంఠ

గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న దళిత యువకుడు సత్యవర్ధన్ అనే యువకుడిని కిడ్నాప్ చేసిన కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ విజయవాడ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. రేపటితో ఆయన రిమాండ్ ముగుస్తోంది. ఈ కేసుకు సంబంధించి వంశీని విచారించేందుకు 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని  పోలీసులు విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈరోజు కోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇప్పటికే పిటిషన్ పై విచారణ  దాదాపు ముగిసింది. కోర్టు ఎలాంటి తీర్పును వెలువరిస్తుందో ఆసక్తికరంగా మారింది.  ఇదిలావుండగా  గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీపై సీఐడీ అధికారులు పీటీ వారెంట్ జారీ చేశారు. దీనికి సంబంధించి రేపు వంశీని కోర్టులో హాజరుపరచాలని థర్డ్ ఏసీఎం కోర్టు ఆదేశించింది. ఇదే కేసులో వంశీ పెట్టుకున్న యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో వంశీపై తదుపరి చర్యలు తీసుకునేందుకు సీఐడీ అధికారులు సంసిద్దంగా ఉన్నారు.  

కూటమి ప్రభుత్వ చొరవతో  గిరిజనులకు తొలగిన డోలి బాధలు 

శ్రీకాకుళం జిల్లా హిర మండల పరిధిలోని పెద్దగూడ పంచాయతీ గిరిజన గ్రామస్తులకు  డోలీ బాధలు తొలగిపోయాయి. పెద్దగూడ పంచాయతీలో తొమ్మిది గిరిజన గ్రామాలు ఉండగా, అవన్నీ ఎత్తయిన కొండ ప్రాంతంలో ఉంటాయి. దీంతో అనారోగ్యంతో బాధపడేవారిని, గర్బిణులను డోలీల్లో నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉన్న కొత్తూరు మండలం గొట్టిపల్లి గ్రామానికి చేర్చేవారు. సమస్య శాశ్వత పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం .. పెద్దగూడ పంచాయతీ కేంద్రానికి పక్కా రహదారి ఏర్పాటుకు రూ.1.50 కోట్లు మంజూరు చేయగా, ఇటీవల ఐటీడీఏ ఇంజనీర్లు సీసీ, తారు రోడ్డు పనులు పూర్తి చేశారు.

 యూట్యూబర్ లోకల్ బాయ్ రిమాండ్ 

.విశాఖపట్నానికి చెందిన ప్రముఖ యూట్యూబర్ వాసుపల్లి నాని అలియాస్ ‘లోకల్ బాయ్’ నానిని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.  తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించవచ్చంటూ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను నాని తన యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్టు చేస్తున్నాడు. ఈ క్రమంలో నగరానికి చెందిన ఓ యువకుడు  ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లలో రూ. 2 కోట్ల వరకు పోగొట్టుకున్నాడు.  ఆ యువకుడు సైబర్ క్రైం పోలీసులు ఫిర్యాదు చేశాడు. మరోవైపు, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా నానిపై సీరియస్ అయ్యారు. ఆ వీడియోను తొలగించాలని ఆదేశించారు. శనివారం రాత్రి నానిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

జగన్ వచ్చారు.. వెళ్లారు!.. అటెండెన్స్ పడిపోయింది.. పనైపోయింది!

జగన్ అసెంబ్లీకి హాజరయ్యారు. తనతో పాటు తన పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలనూ వెంటపెట్టుకుని మరీ అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలోకి నాలుగో గేటులోంచి కారులో రావడం నుంచి లోపలకు వచ్చిన తరువాత  నినాదాల వరకూ అంతా ఆ పార్టీ ముందుగానే నిర్ణయించుకు వచ్చిన డ్రామాగానే పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. కేవలం అనర్హతా వేటు నుంచి తప్పించుకోవడానికే జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరౌతున్నారన్న పరిశీలకుల విశ్లేషణలు, తెలుగుదేశం, జనసేన నేతలు, క్యాడర్ విమర్శలను అక్షరసత్యాలు అన్న విషయాన్ని రుజువు చేసే విధంగానే జగన్ ఆయన పార్టీ ఎమ్మెల్యేల తీరు ఉంది. వైసీపీకి అసెంబ్లీలో కేవలం 11 మంది సభ్యులు ఉన్నారు.  సోమవారం సభకు హాజరైన వైసీపీ సభ్యులు సరిగ్గా 11 నిముషాలు మాత్రమే సభలో ఉన్నారు. ఉన్న ఆ కొద్ది సమయం కూడా తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ నినాదాలు చేస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయితే వారి ఆందోళనను, నినాదాలను సభలో కూటమి సభ్యలు ఎవరూ పట్టించుకోలేదు. సభా నాయకుడు చంద్రబాబు కూడా వారి చిరునవ్వులు చిందిస్తూ.. ఈ డ్రామాలన్నీ మాకు అర్ధమౌతున్నాయన్నట్లు కూర్చున్నారు. దీంతో చేసేదేం లేక జగన్ తన సభ్యులతో సహా అసెంబ్లీని బాయ్ కాట్ చేసి గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి వాకౌట్ చేశారు. జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరౌతున్నట్లు ఆ పార్టీ ప్రకటించిన మరుక్షణం నుంచీ, సర్వత్రా జగన్ హాజరు కేవలం తన శాసనసభా సభ్యత్వాన్ని కాపాడుకోవడానేనన్న భావన వ్యక్తమైంది. జగన్ తరహా అంతా అందితే జుట్టు, అందకుంటే కాళ్లు అన్న తరహాలోనే ఉంటుందంటూ రాజకీయవర్గాలలో గట్టిగా వినిపించింది. ఒక రోజు భాగ్యానికే తప్ప జగన్ అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనే అవకాశాలు లేవన్న విశ్లేషణలు వినిపించాయి. వాటికి అనుగుణంగానే అనర్హతా వేటు నుంచి తప్పించుకోవడం కోసమే వైసీపీ సభ్యలు సోమవారం (ఫిబ్రవరి 24) అసెంబ్లీకి వచ్చినట్లే వచ్చి వాకౌట్ చేశారు. మళ్లీ అరవై రోజుల వరకూ వారు అసెంబ్లీ వైపు కన్నెత్తి కూడా చూసే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు. అనర్హతా వేటు పడి.. ఉప ఎన్నికలు వస్తే ప్రస్తుతం ఉన్న 11 స్థానాలూ కూడా కోల్పోతామన్న భయంతోనే జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని సభకు వచ్చారని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి.  

ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి

ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు 'సోమవారం (ఫిబ్రవరి 24) న ప్రారంభమయ్యాయి. స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా ను నామానేట్ చేస్తూ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీర్మానం ప్రవేశ పెట్టారు. కాగా స్పీకర్ ఎన్నిక మధ్యాహ్నం తరువాత జరిగే అవకాశం ఉంది. దాదాపు 27 ఏళ్ల తరువాత ఢిల్లీ అసెంబ్లీలో తొలి సారిగా బీజేపీ అధికార పక్షంగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ  నుంచి ప్రారంభం కానున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తాను అసెంబ్లీ స్పీకర్గా నామినేట్ చేయడానికి సీఎం రేఖా గుప్తా తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ ఎన్నిక జరగనుంది. కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలో, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోనుంది.

అసెంబ్లీ బహిష్కరణ జగన్ యూటర్న్.. కారణమేంటంటే?

సింహం సింగిల్ గా వస్తుంది. పులివెందుల టైగర్. మాట తప్పడు, మడమ తిప్పడు.. ఇవీ జగన్ తనకు తానుగా తగిలించుకున్న భుజకీర్తులు. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ ప్రజల ముందు దీనంగా సెంటిమెంట్ పండించి, తండ్రిని కోల్పోయాను, బాబాయ్ హత్యకు గురయ్యారు.. కోడి కత్తితో తనపై హత్యాయత్నం జరిగిందంటూ జనాలను నమ్మింది 2019 ఎన్నికలలో ఓట్లు దండుకుని అధికార పగ్గాలు అందుకున్న జగన్.. ఆ తరువాత తన ఐదేళ్ల పాలనలో ప్రజలకు నరకం అంటే ఎలా ఉంటుందో చూపించారు. క్రమం తప్పకుండా బటన్లు నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి సోమ్ములు వేస్తున్నానని చెప్పుకుంటూనే.. మోయలేని పన్నుల భారం మోపి, చివరాఖరకు చెత్త మీద కూడా పన్ను వేసి జనం నడ్డి విరిచారు. తన ప్రభుత్వ విధానాలలో తప్పులను ఎత్తి చూపిన వారిని నానా రకాలుగా వేధించారు. కోవిడ్ సమయంలో వైద్యులకు కనీసం మాస్కులు కూడా సరఫరా చేయడం లేదని నిలదీసిన వైద్యుడిపై పిచ్చివాడన్న ముద్ర వేసి ఆయన చావుకు కారణమయ్యారు. ఇక ప్రత్యర్థి పార్టీల నేతలు, కార్యకర్తలపై దాడులు, వేధింపులు, కేసులు, అరెస్టుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నట్లుగా జగన్ పాలన సాగింది. సరే ఐదేళ్ల పాటు తమ ఆగ్రహాన్ని పంటి బిగువున భరించిన ఏపీ జనం.. 2024 ఎన్నికలలో జగన్ కు ఆయన స్థానం ఏమిటొ చూపారు. కనీసం ప్రతిపక్ష నేతగా కూడా  అర్హత లేదని ఆయన సహా ఆయన పార్టీకి కేవలం 11 అసెంబ్లీ స్థానాలను మాత్రమే ఇచ్చి బుద్ధి చెప్పారు. 2024 ఎన్నికలకు ముందు కూడా జగన్ గులకరాయి దాడి అంటూ సానుభూతి డ్రామాలకు తెరతీసినా జనం పట్టించుకోలేదు. అయితే అంతటి ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న తరువాత కూడా జగన్ తీరు మారలేదు.  తనకు 40 శాతం ఓట్లు వచ్చాయనీ, జనం తనను తిరస్కరించలేదనీ చెప్పుకున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ కారణంగానే ఘోర పరాజయం పాలయ్యానంటూ మరోసారి సెంటిమెంట్ ప్లే చేద్దామని చూశారు.  ఇవన్నీ పక్కన పెడితే.. జనం ‘ఛీ’దరించుకుని.. కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే పరిమితం చేసినా.. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి, తన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ హఠం చేస్తూ అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకు సైతం వెళ్లారు. గతంలో తాను అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా పోవడానికి ఓ ఐదుగురు  ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుంటే చాలు అంటూ అసెంబ్లీ వేదికగా తాను చేసిన ప్రసంగాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించి మరీ.. తనకు లేని, రాని ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీలో అడుగుపెట్టేది లేదని ప్రతిజ్ణ సైతం చేశారు. అయితే అసెంబ్లీ నిబంధలనలు తెలిసి వచ్చిన తరువాత.. ప్రతిపక్ష హోదా మాట దేవుడెరుగు.. ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోతుందని అవగతమైన తరువాత.. సింహం, పులి, మాట, మడమ వంటి మాటలన్నిటికీ చెల్లు చీటి పాడేసి అసెంబ్లీకి హాజరు కావడానికి రెడీ అయిపోయారు.  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం (ఫిబ్రవరి 24) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు 11 మందీ హాజరౌతారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ సమావేశాలకు జగన్ డుమ్మా కొడితే ఆయన శాసనసభ సభ్యత్వం రద్దు అవుతుందని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ క్లారిటీ ఇచ్చిన తరువాత.. ప్రతిపక్ష హోదా లేకపోయినా ఫరవాలేదు... ఉన్న శాసన సభ సభ్యత్వాన్ని కాపాడుకుంటే చాలన్న భావనకు జగన్ వచ్చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే జగన్ తన అడ్డాగా చెప్పుకునే కడప జిల్లాలలోనే ఇటీవలి ఎన్నికలలో వైసీపీ ఏడు అసెంబ్లీ స్థానాలలో  పరాజయం పాలైంది. సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా జగన్ మెజారిటీ గణనీయంగా తగ్గింది. దీంతో ఆయన ఇప్పుడు కూడా ప్రతిపక్ష హోదా కోసం మంకుపట్టుపట్టి అసెంబ్లీని బహిష్కరిస్తే ఏదో సామెత చెప్పిన చందంగా ప్రతిపక్ష హోదా రాకపోగా, ఉన్న శాసనసభ సభ్యత్వం కూడా పోతుందన్న క్లారిటీ రావడంతో దిమ్మదిరిగి బొమ్మ కనిపించినట్లైంది. దీంతో బుద్ధిగా కనీసం అటెండెన్స్ కోసమైనా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలన్న నిర్ణయానికి జగన్ వచ్చేశారు.  ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి జరుగుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు ఇవే.   ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. ఆయన ప్రసంగం తరువాత  సభ వాయిదా పడుతుంది. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించి సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ ఏ అంశాలు చర్చించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు.  ఈ నేపథ్యంలోనే గవర్నర్ ప్రసంగానికి హాజరు కావాలని  వైసీపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. సాధారణంగా అసెంబ్లీ జరుగుతూంటే అన్ని పార్టీల నేతలు .. తమ పార్టీ శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహిస్తాయి. అయితే జగన్ అలాంటిదేమీ నిర్వహించలేదు. తానేం చెబితే తన పార్టీ ఎమ్మెల్యేలు అది చేసి తీరాలన్నది జగన్ హుకుం.  అందుకే వైసీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి హారరౌతున్నారని సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో చెప్పేశారు. అంతే. ఇన్ని రోజులూ ఎందుకు హాజరు కాలేదు. కారణమేంటి అన్న ప్రశ్నలు ఇప్పడు వైసీపీ ఎమ్మెల్యేలలో వ్యక్తం అవుతున్నాయి. వాటిని బయటకు చెప్పే ధైర్యం, ఒక వేళ చెప్పినా సమాధానం దొరకుతుందన్న నమ్మకం వారిలో లేదు.  సరే అసెంబ్లీకి హాజరవ్వాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించారు. వైసీపీ ఎమ్మెల్యేలు 11 మందీ సభకు హాజరౌతారు. అయితే వారు సెషన్ మొత్తం సభకు వస్తారా? మొక్కుబడిగా గవర్నర్ ప్రసంగానికి హాజరై.. ఆ తరువాత మళ్లీ డుమ్మా కొట్టేస్తారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి.  కేవలంఅనర్హతా వేటు పడకుండా ఒక్క రోజు మాత్రం సభకు హాజరై ఆ తరువాత ఇక మళ్లీ ఇప్పట్లో అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

నల్లగొండ జిల్లాలో ఇనుప యుగపు ఆనవాళ్లు `

పరిరక్షించాలంటున్న ప్లీచ్ ఇండియా సీఈవో శివనాగిరెడ్డి నల్లగొండ జిల్లాలో  గుడిపల్లి శివారులో దక్షిణ భారతదేశంలోనే అరుదైన ఇనుప యుగపు సమాధి గది (డాల్మెకి)ని గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. కొత్త తెలంగాణా చరిత్ర బృందం, గుడిపల్లి స్వచ్ఛంద సేవాసంస్థ సభ్యుడు బోయ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఆయన ఆదివారం (ఫిబ్రవరి 23)  గుడిపల్లి పరిసరాల్లో కొండగట్టులపై, పంట పొలాల్లో క్రీ.పూ. 2000-1000 సంవత్సరాల మధ్య కాలానికి చెందిన సమాధి గదులు, నిలువు రాళ్ల వద్ద జరిపిన విస్తృత పరిశోధనల్లో ఆసక్తికర పురావస్తు విశేషాలు వెలుగు చూశాయన్నారు.  ఊరి వెలుపల చీనీ తోటల్లో గల అనేక నిలువురాళ్లు (మరణించిన వారికి గుర్తుగా నిలిపే స్మారక శిలలు) ఒక్కొక్కటిగా కనుమరుగయ్యి ప్రస్తుతం రెండు మాత్రమే మిగిలి ఉన్నాయనీ, గుడిపల్లి ` శింగరాజుపల్లి రోడ్డుకు కుడివైపున గల ఎల్లమ్మ బండపై గల గూడు సమాధులు నిర్మాణ సామాగ్రి సేకరణలో భాగంగా కంకర రాళ్లౌతున్నాయని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిలువు రాయి ఏడడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పు, అడుగు మందంతో ఉన్నాయన్నారు. ఎల్లమ్మ బండపైగల ఇంకా మిలిగి ఉన్న ఒక గూడు సమాధి, నిర్మాణ పరంగా అరుదైనదని, అటూ ఇటూ గల రెండు రాతి వరుసలపై మామూలుగా నిలిపే దీర్ఘ చతురస్రాకారపు కప్పురాయి స్థానంలో, ఒక పెద్దగుండు రాతిని అమర్చారని, ఇలాంటి ఆధారం వెలుగు చూడటం తెలంగాణా రాష్ట్రంలోనే అరుదైన విషయమని శివనాగిరెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా పురాచరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలైన ఈ ఆనవాళ్లను కాపాడుకొని, ఇప్పటికి దాదాపు 4000 సంవత్సరాల చరిత్ర చిహ్నాలను భావితరాలకు అందించాలని గుడిపల్లి గ్రామస్తులకు శివనాగిరెడ్డి, శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొత్త తెలంగాణా చరిత్ర బృందం సభ్యులు, దేవరకొండ వారసత్వ కార్యకర్త, యూనస్‌ పర్హాన్‌, గుడిపల్లి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు బోయ శ్రీనివాసరెడ్డి, పడాల సైదులు పాల్గొన్నారని ఆయన చెప్పారు. ఇలా గూడు సమాధిపైన గుండురాతిని అమర్చిన విషయం చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకొందని, వీటిపై మరిన్ని పరిశోధనలు జరగాలని కొత్త తెలంగాణా చరిత్ర బృందం, కన్వీనర్‌, శ్రీరామోజు హరగోపాల్‌, కో`కన్వీనర్‌,   భద్రగిరీష్‌ అభిప్రాయపడినట్లు శివనాగిరెడ్డి చెప్పారు.

విరాటుడి విశ్వరూపం.. పాక్ పై టీమ్ ఇండియా ఘన విజయం

చాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా పాకిస్థాన్ ను చిత్తు చేసి లెక్క సరి చేసింది. ఈ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ తన విశ్వరూపం చూపించాడు. అలవోకగా సెంచరీ సాధించి భారత్ కు ఘన విజయాన్ని అందించాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా పాకిస్థాన్ పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  చాలా రోజుల తర్వాత కింగ్ కోహ్లీ  వన్డే సెంచరీ సాధించి ఫామ్ ను అందిపుచ్చుకున్నాడు.   ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 244 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా 42.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. పాక్ బ్యాటర్లలో  కెప్టెన్ రిజ్వాన్ 77 బంతుల్లో 46 పరుగులు, షకీల్ 76 బంతుల్లో 62 పరుగులు సాధించారు. భారత్ బౌలర్లలో కుల్‌దీప్ మూడు వికెట్లు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు దక్కించుకుకోగా, హర్షిత్ రాణా, జడేజా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు.  ఇక భారత్ బ్యాటర్లలో స్కిప్పర్ రోహిత్ వర్మ 20 పరుగులు చేయగా, శుభమన్ గిల్  శుభ్‌మన్ గిల్ 46, శ్రేయస్ అయ్యర్ 56 పరుగులు చేశారు. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ తొలి బంతి నుంచీ సాధికారికంగా ఆడాడు. 111 బంతుల్లో సెంచరీ చేసి నాటౌట్ గా నిలిచాడు. వికెట్ల మధ్య చిరుతలా పరుగెడుతూ సింగిల్స్ సాధించాడు. కోహ్లీ ఏడు ఫోర్లు సాధించాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 51వ సెంచరీ. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. 

అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు.. జగన్ తీరిక మారదా?

అందితే జుట్టు లేకుంటే కాళ్లు పట్టుకునే మనస్థత్వం మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిది. ఈ విష‌యం చాలాసార్లు రుజువైంది. తాజాగా మ‌రోసారి జ‌గ‌న్ అదే ఫార్ములాను అమ‌లు చేయ‌బోతున్నారు. ప్ర‌తిప‌క్ష హోదా ఇచ్చేవ‌ర‌కు అసెంబ్లీకి వెళ్ల‌నంటూ ఇన్నాళ్లు మొండిప‌ట్టు ప‌ట్టిన జ‌గ‌న్‌.. తన అసెంబ్లీ సభ్యత్వంపైనే అన‌ర్హ‌త వేటు పడే పరిస్థితి వచ్చే సరికి యూటర్న్ తీసుకోవడానికి రెడీ అయిపోయారు. అనర్హత వేటు పడితే పులివెందుల నియోజకవర్గం నుంచి మరో సారి గెలుస్తానన్న నమ్మకం జగన్ లో లేకపోవడం వల్లనే ఆయన అసెంబ్లీకి హాజరై ఆ వేటు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. జగన్ సిల్లీ ప్లాన్ చూసి వైసీపీ నేతలు సైతం చీదరించుకుంటున్న పరిస్థితి. వాస్త‌వానికి.. పార్టీలోని ముఖ్య‌నేత‌ల‌ను సైతం జ‌గ‌న్ రాజ‌కీయ అవ‌స‌రానికి వాడుకొని త‌రువాత ప‌క్క‌న‌పెట్టేసిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. ఈ క్ర‌మంలో వైసీపీకి వీరాభిమానులం, రాజ‌కీయాల్లో ఉన్నంత‌కాలం వైసీపీలోనే ఉంటాం అంటూ దీమాగా చెప్పిన‌ వారు సైతం..   ఆ పార్టీని వీడుతున్నారంటే.. ఆయన యూజ్ అండ్ త్రో పాలసీ అర్ధమౌతుంది.   మ‌రోవైపు.. త‌నపై తానే దాడులు చేయించుకొని ప్ర‌జ‌ల్లో సానుభూతి పొంద‌డంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని మించిన రాజ‌కీయ నేత దేశ రాజ‌కీయాల్లో ఎక్క‌డా క‌నిపించ‌రు.  బాబాయ్ హ‌త్య‌, కోడిక‌త్తి డ్రామాతోపాటు ఒక్క ఛాన్స్ ఫ్లీజ్ అంటూ 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్‌.. ఐదేళ్లు ఏపీ ప్ర‌జ‌ల‌కు న‌ర‌కం చూపించారు. వైసీపీ హ‌యాంలో పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల ప్ర‌జ‌లు ప‌నుల‌ కోసం ఇత‌ర రాష్ట్రాల‌కు వ‌ల‌స వెళ్లిన ప‌రిస్థితి. దీంతో 2024 ఎన్నిక‌ల్లో ఏపీలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఏక‌మై జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ నేత‌ల‌కు గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. ఫ‌లితంగా కేవ‌లం 11 సీట్ల‌లో మాత్ర‌మే వైసీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. అంటే..  ఏపీ ప్ర‌జ‌లు క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదాకు స‌రిప‌డా అసెంబ్లీ స్థానాల‌ను సైతం వైసీపీ పార్టీకి ఇవ్వ‌లేదు. కానీ, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం తనకు ప్రతిపక్ష నేత హోదా, తన పార్టీకి ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వాలంటూ అధికార పార్టీని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ వ‌స్తాన‌ని హఠం చేస్తున్నారు. ప్ర‌జ‌లే ఇవ్వ‌ని ప్ర‌తిప‌క్ష హోదాను జ‌గ‌న్, వైసీపీ నేత‌లు కోరుకుంటుండటం ప్ర‌జాతీర్పుపై వారికి ఎంత గౌర‌వం ఉందో తేట‌తెల్లం చేస్తుంది.  ఇటీవ‌ల.. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న‌ప్ప‌టికీ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి నానా ర‌భ‌స చేసిన జ‌గ‌న్‌.. ప్ర‌తిప‌క్ష నేత వ‌చ్చినా స‌రియైన భ‌ద్ర‌త ఇవ్వ‌రా అంటూ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించి తానో రాజకీయ జోకర్ గా నిరూపించుకున్నారు.   కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అసెంబ్లీ వ‌చ్చారు. ఆ త‌రువాత జ‌గ‌న్‌, మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు ఎవ‌రూ అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రుకాలేదు. ప‌లుసార్లు స‌మావేశాల‌కు హాజ‌రుకావాల‌ని స్పీక‌ర్‌, డిప్యూటీ స్పీక‌ర్ కోరిన‌ప్ప‌టికీ.. వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తేనే వ‌స్తామంటూ జ‌గ‌న్ వాదిస్తూ వ‌స్తున్నారు. అసెంబ్లీకి హాజరుకాని జగన్మోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేసేందుకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రెడీ అయ్యారు. అయితే, చేతనైంది చేసుకోండి అని జగన్ రెడ్డి కూడా ఇటీవల మీడియా స‌మావేశంలో అన్నారు . అయితే ఆయనదంతా అందితే జుట్టు .. అందకపోతే కాళ్లు పట్టుకునే మనస్థత్వం అని చాలా సార్లు రుజువు అయింది. ఇప్పుడు తనపై అనర్హతా వేటువేస్తే మ‌ళ్లీ  గెలవడం అసాధ్యం అని అర్థం కావడంతో ఆయన ఒక్కరోజు అసెంబ్లీకి హాజరవ్వాలని అనుకుంటున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.  వరుసగా మూడు సెషన్లు లేదా.. అరవై రోజుల్లో ఒక్క‌రోజైనా సభకు హాజరు కాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుంది.  అయితే, కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటైన ద‌గ్గ‌ర నుంచి జ‌గ‌న్ కేవ‌లం ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు మాత్ర‌మే అసెంబ్లీకి వ‌చ్చాడు. ఆ త‌రువాత జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు స‌మావేశాల‌కు హాజ‌రు కాలేదు. వచ్చే సమావేశాలకు హాజరు కాకపోతే వారిపై  అన‌ర్హ‌త వేటే వేసేందుకు అవ‌కాశం ఉంటుంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ ప్ర‌క్రియ‌ను పూర్తి చేస్తారు. సెలవు చీటీ స్పీకర్ కు రాసి పంపినా ఆయన ఆమోదించాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకు.. అనుకుంటున్నారేమో కానీ.. ఒక్కరోజు అసెంబ్లీకి పోతే పోలా అని జ‌గ‌న్‌ అనుకుంటున్నారు. గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యేందుకు జగన్ తోపాటు ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.  అలా ఒక్కరోజు హాజరైతే ఆ తర్వాత అరవై రోజుల పాటు అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఉండదని అనుకుంటున్నారు.   ఇది సాంకేతికంగా అనర్హత వేటు నుంచి తప్పించుకునే పద్ధతి మాత్రమే.  కానీ, ఇలా అడ్డగోలుగా అసెంబ్లీకి డుమ్మా కొడితే తర్వాత ప్రజలు ఎందుకు ఓట్లు వేస్తారు? అని వైసీపీ నేతలే అంటున్నారు. జగన్ తాజా   నిర్ణ‌యాన్ని వైసీపీ నేత‌లుసైతం స‌మ‌ర్ధించ‌డం లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి‌. ఇలా అయితే, వైసీపీ  మనుగ‌డ ఉండదన్న ఆందోళన వైసీపీ నేతలలో వ్యక్తమౌతోంది. 

మెట్టు దిగి అసెంబ్లీకి వస్తున్న మాజీ సీఎం!

 ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని ఎంత హడావుడి చేస్తున్నారో అందరికీ తెలుసు. ఆఖరికి స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని కోర్టు మెట్లు కూడా ఎక్కారాయన. తనకు హోదా వచ్చే వరకు అసెంబ్లీ మెట్లెక్కనని  భీష్మించుకు కూర్చొన్నారు. అంతా తన ఇష్ట ప్రకారమే జరగాలని భావించే మాజీ సీఎంకు శాసనసభ నిభందనలు తెలిస్తే కాని తత్వం బోధ పడలేదు. ఏ శాసనసభ్యుడైనా స్పీకర్‌కు సరైన రీజన్ చూపించకుండా ఆరు నెలల పాటు అసెంబ్లీకి గైర్హాజరైతే అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్‌కి ఉంటుంది. అయితే స్పీకర్లు తమకు ఉన్న ఆ విచక్షనాధికారాల్ని పెద్దగా ఉపయోగించిన సందర్భాలు కనిపించవు. అయితే ఏపీలో స్పీకర్‌గా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణంరాజులను జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో వేధింపులకు గరి చేశారు. వారు ఎక్కడ తమ విచక్షణాధికారాలకు పని చెప్తారో అన్న భయంతో జగన్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం అసెంబ్లీకి రావడానికి రెడీ అయ్యారు. కేసీఆర్ కూడా తెలంగాణలో అనర్హత వేటు భయంతోనే బడ్జెట్ సమావేశాల రోజు అసెంబ్లీలో అటెండెన్స్ వేయించుకుని వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జగన్ కూడా అదే భయంతో బెట్టు మాని.. మెట్టు దిగుతున్నారు. జగన్ అసెంబ్లీకి వస్తున్నారు సోమవారం శాసనమండలిలోని వైసీపీ కార్యాలయంలో మీటింగ్‌ ఉంది.. సభ్యులంతా హాజరవ్వాలని బొత్స సత్యనారాయణ రాసిన లేఖతో జగన్ అసెంబ్లీ షెడ్యూల్ ఖరారైంది.

పెద్దల సభలోకి లోకనాయకుడు.. క్లారిటీ ఇచ్చిన కమల్

మక్కల్ నిది మయ్యమ్ పార్టీ అధినేత, విశ్వనటుడు కమల్ హాసన్‌ను అధికార డీఏంకే పార్టీ రాజ్యసభకు పంపనుంది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం ఎం కె స్టాలిన్.. ఇప్పటికే తన కేబినెట్ మంత్రి ద్వారా కమల్ హాసన్‌కు సమాచారం పంపారు. ఈ ఏడాది జులైలో డీఏంకే పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్‌ను పెద్దల సభకు పంపేందుకు డీఏంకే సన్నాహాలు చేస్తోంది. గత ఏడాది మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో డీఏంకేతో మక్కల్ నిది మయ్యమ్ పొత్తు పెట్టుకొంది. అయితే ఆ ఎన్నికల్లో కోయంబత్తురు నుంచి కమల్ హాసన్ బరిలో నిలవాలని భావించారు.  కోయంబత్తురు నియోకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. కానీ ఈ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై బరిలోకి దిగారు. దీంతో డీఏంకే అధినేత, సీఎం ఎం.కె. స్టాలిన్ సలహా, సూచనలతో కమల్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. మరోవైపు తమిళ ప్రముఖ నటుడు విజయ్ సైతం తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించారు. ఆయన సైతం ప్రజల మధ్యకు వెళ్తున్నారు. అందులో భాగంగా వివిధ సమయాల్లో పలు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు. ఇంకోవైపు 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ వ్యూహాత్మకంగా అడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో డీఏంకే పార్టీ అధినేత, సీఎం ఎం.కె.స్టాలిన్ తనదైన శైలిలో ప్రణాళికలు రచిస్తున్నారు. అందులోభాగంగా కమల్ హాసన్‌ను రాజ్యసభకు పంపడం ద్వారా చిత్ర పరిశ్రమకు తమ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందనే బలమైన సంకేతాలను ప్రజల్లోకి పంపేందుకు డీఏంకే ఈ నిర్ణయం తీసుకుందని పరీశీలకులు విశ్లేషిస్తున్నారు. తాను రాజ్యసభకు వెళ్తున్న విషయాన్ని లోకనాయకుడు తాజాగా నిర్ధారించారు.  ఎంఎన్‌ఎం 8వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా చెన్నైలోని పార్టీ హెడ్‌క్వార్టర్స్‌లో జెండాను ఆవిష్కంచి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన కమల్ హసన్ తాను రాజ్యసభకు వెడుతున్న విషయాన్ని ధృవీకరించారు. ఈ సందర్భంగా తన పొలిటికల్‌ కెరీర్‌పై కమల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి చాలా ఆలస్యంగా వచ్చానని, 20 ఏళ్ల ముందే రాజకీయాల్లోకి వచ్చి ఉంటే ఇప్పుడు తన ప్రసంగం, స్థానం వేరేలా ఉండేవని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది పార్లమెంట్‌లో మన పార్టీ గొంతు వినిపించబోతోందని ఆయన చేసిన  వ్యాఖ్యలతో  కమల్‌ హాసన్‌ రాజ్యసభలో అడుగుపెట్టనున్నట్లు ఇటీవల జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరినట్లు అయింది.