పిల్ల సజ్జలకు జైలేనా?
posted on Feb 22, 2025 8:09AM
వైసీపీ హయాంలో సకల శాఖల మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగింది. ఒక విధంగా చెప్పాలంటే ఆయనే డిఫాక్టో సీఎంగా రాజ్యమేలారు. జగన్ మాటలను ఆయన తన నోటితో వినిపించారు. ఆయన ఆదేశాలను తన చేతులతో అమలు చేశారు. జగన్ హయాంలో కేబినెట్ అన్నది నామమాత్రమే అయిపోయింది. మంత్రివర్గ శాఖల సమీక్షలు కూడా సజ్జలే చేశారు. మంత్రులకు బదులుగా మీడియా ముందుకూ ఆయనే వచ్చే వారు. ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకునే సజ్జల రామకృష్ణారెడ్డి తన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డికి వైసీపీ సోషల్ మీడియా వింగ్ బాధ్యతలను అప్పగించారు.
పిల్ల సజ్జల చేతికి వైసీపీ సోషల్ మీడియా వింగ్ పగ్గాలు వచ్చిన క్షణం నుంచి ఆయన పేనుకు పెత్తనం ఇస్తే.. అన్నట్లుగా చెలరేగిపోయారు. పేనుకు పెత్తనం ఇస్తే.. అన్న సామెత చందంగా వ్యవహ రించారు. తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీలోని మహిళా నేతలు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులపై అత్యంత దారుణమైన, అసభ్యకరమైన పోస్లులతో రెచ్చిపోయారు. సజ్జల భార్గవ రెడ్డి హయాంలో వైసీపీ సోషల్ మీడియా వెర్రి పుంతలు తొక్కింది. సరే వైసీపీ ఘోర పరాజయంలో ఆ పార్టీ సోషల్ మీడియా పాత్ర కూడా గణనీయంగానే ఉందనడంలో సందేహం లేదు. వైసీపీ పరాజయం తరువాత సజ్జల భార్గవ్ రెడ్డిని కేసుల నుంచి తప్పించేందుకు ఆయన తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి చేయగలిగినంతా చేశారు. పార్టీ ఓటమి పాలు కాగానే చడీ చప్పుడూ లేకుండా ఆయనను సోషల్ మీడియా పదవి నుంచి తప్పించి.. రాష్ట్రం దాటించేశారు. ఫోన్ లో కూడా అందుబాటులో లేకుండా చేశారు. ఎన్ని చేసినా చేసినా కర్మ ఫలం అనుభవించాల్సిందేగా?
సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారంలో తనపై నమోదైన కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు కోసం పిల్ల సజ్జల ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సజ్జల భార్గవ్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ పై హైకోర్టు శుక్రవారం ( ఫిబ్రవరి 21) విచారించింది. ఆ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలను గమనిస్తే పిల్ల సజ్జలకు యాంటిసిపేటరీ బెయిలు లభించడం అనేమానమే అని న్యాయనిపుణులు చెబుతున్నారు. పిల్ల సజ్జల కటకటాలు లెక్కించక తప్పదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. నెటిజనులు సైతం పిల్ల సజ్జలకు బెయిలా? జైలా అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. పిల్ల సజ్జల యాంటిసిపేటరీ బెయిలు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా వేదికగా వస్తున్న అసభ్యకర పోస్టులను కట్టడి చేయాల్సిందేనని కుండబద్దలు కొట్టింది. వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగేలా అసభ్య పోస్టులు పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అలాగే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల నిరోధానికి చర్యల వివరాలను తమకు నివేదించాలని ఆదేశించింది.
పిల్ల సజ్జల యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను వ్యతిరేకిస్తూ పోలీసుల తరఫున వాదనలు వినిపించిన పీపీ లక్ష్మీనారాయణ తప్పుడు పోస్టులు పెట్టేందుకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యాలయంలో 400 మందికి పైగా పని చేశారని తెలిపారు. ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన పోస్టులు, ఫొటోలను వివిధ గ్రూపుల్లో పోస్టు చేసేవారని దానికి డబ్బులు చెల్లించేవారని నివేదించారు. అలాగే నచ్చని వ్యక్తిని, వర్గాన్ని వదిలిపెట్టకుండా ఇష్టారీతిగా చెలరేగిపోయారని, న్యాయమూర్తులను, చివరికి దేవుడిని సైతం వదిలిపెట్టలేదని పేర్కొన్నారు. పిటిషనర్లు నిరక్షరాస్యులు కాదని, బాగా చదువుకున్న వారేనని పేర్కొన్నారు. వ్యక్తిత్వ హననం, ప్రతిష్ఠలను దెబ్బతీయడం, అపకీర్తి పాలు చేయడం, బెదిరించడంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారని తెలిపారు. వాదనల తరువాత హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.