ఊహాగాన సభలకు తెర.. కూటమి ఐక్యతపై క్లారిటీ ఇచ్చిన పవన్
posted on Feb 21, 2025 @ 9:52AM
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చిక్కుల్లో పడిందనీ, కూటమి పార్టీల మధ్య అగాధం ఏర్పడిందనీ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టేస్తూ.. చెలరేగిపోతున్న వైసీపీయుల ఊహాగాన సభలకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెర దించేశారు. తాను ఇటీవలి కాలంలో కొన్ని కార్యక్రమాలకు హాజరు కాకపోవడానికి కారణం తన అనారోగ్యమే తప్ప మరో కారణం లేదని కుండబద్దలు కొట్టేశారు. చంద్రబాబు ఫోన్ చేసినా పవన్ రెస్పాండ్ కాలేదనీ, కేబినెట్ భేటీకి సైతం డుమ్మా కొట్టేశారనీ వైసీపీ సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో పలు కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇవ్వాలంటూ తెలుగుదేశం శ్రేణుల నుంచి డిమాండ్ వచ్చిన క్షణం నుంచీ వైసీపీలో కూటమి పార్టీల మధ్య విభేదాలు అంటూ పుంఖాను పుంఖాలుగా కథనాలు వెలువడ్డాయి. జనసేన, తెలుగుదేశం మధ్య మైత్రికి బీటలు వారాయన్న విశ్లేషణలూ వెలువడ్డాయి. అయితే ఇరు పార్టీల అధినేతలూ కూడా లోకేష్ ప్రమేష్ విషయంలో నోరెత్తద్దంటూ తమతమ పార్టీల నేతలు, క్యాడర్ ను స్పష్టం చేశారు.
అలాగే తన కేబినెట్ సహచరులకు చంద్రబాబు ఇచ్చిన ర్యాంకింగ్ లలో పవన్ కల్యాణ్ నంబర్ 1గా లేకపోవడాన్ని ఎత్తి చూపుతూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ నానా హంగామా చేసింది. పవన్ ను తొక్కేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనీ, అందుకే పవన్ కల్యాణ్ బాబు ఫోన్ కు రెస్పాండ్ కాలేదనీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఇరువురూ కలిసి వెళ్లడం, అక్కడ ఇద్దరూ కలిసే పలువురు మంత్రులతో భేటీ కావడంతో వైసీపీ చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని తేటతెల్లమైంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా స్వయంగా కూటమి పార్టీలన్నీ సమన్వయంతోనే పని చేస్తున్నాయని విస్పష్టంగా ప్రకటించారు.
జగన్ పాలన కారణంగా అప్పుల కుప్పలా మారిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇటీవల తాను కొన్ని సమావేశాలకు హాజరు కాకపోవడానికి కారణం వెనునొప్పేనని, మరో కారణం లేదనీ క్లారిటీగా చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పని చేస్తోందనీ, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, వాటిని అధిగమించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు.