డాక్టర్ సునీతపై కృష్ణారెడ్డిది తప్పుడు ఫిర్యాదు.. దర్యాప్తులో నిగ్గు తేల్చిన పోలీసులు!
posted on Feb 21, 2025 9:28AM
2019 ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్ వివేకానందరరెడ్డి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న ఆయన కుమార్తె డాక్టర్ సునీతకు అడుగడుగునా అడ్డంకులే ఎదురయ్యాయి. స్వయంగా జగన్ కూడా ఆమెను ఆ కేసు విషయం వదిలేయాలని స్పష్టంగా చెప్పారు. కన్న తండ్రి హత్య వెనుక ఉన్నది సొంత కుమార్తె అంటూ అభాండాలు వేశారు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అయితే సునీత మాత్రం తన తండ్రి హంతకులను చట్టం ప్రకారం శిక్షించాలంటూ అలుపెరుగని న్యాయపోరాటం నెరిపారు. ఇంకా పోరు సాగిస్తున్నారు.
గత ఐదేళ్లుగా వైఎస్ వివేకా హత్య కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. వివేకా గొడ్డలి పోటుతో చనిపోతే.. గుండే పోటు అంటూ ప్రకటనలు గుప్పించిన వాళ్లు, ఆ తరువాత నరాసుర రక్త చరిత్ర అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. అయితే ఎవరైతే హత్య వెనుక ఉన్నది చంద్రబాబు అంటూ ఆరోపణలు చేశారో వాళ్లే ఇప్పుడు వివేకా హత్య కేసులో నిందితులుగా, అనుమానితులుగా ఉన్నారు. అప్పట్లో నారాసుర రక్త చరిత్ర అంటూ ఆరోపణలు గుప్పించిన వారే ఇప్పుడు వివేకా హత్య కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్నారు. నిందితులుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అరెస్టయ్యారు. బెయిలుపై తిరుగుతున్న వారూ ఉన్నారు. ముందస్తు బెయిలుతో అరెస్టులను తప్పించుకుంటున్నారు.
అసలు వివేకా హత్య కేసు దర్యాప్తు ఇంత కాలంగా ఎందుకు సాగుతోంది? అన్న విషయంలో కూడా సందేహాలు నివృత్తి అయిపోయాయి. హత్య లో పాత్రధారులు, సూత్రధారులు ఎవరు అన్న విషయం కోర్టులో ఇంకా పూర్తిగా తేలకపోయినా.. ప్రజలలో మాత్రం ఒక క్లారిటీ వచ్చేసింది. రాష్ట్రంలో అందరికీ వివేకా హత్య మోటో ఏమిటి? చేసిందెవరు? చేయించిందెవరు? అన్నవిషయంలో ఇప్పుడిక ఎలాంటి సందేహాలూ లేవు. అసలీ కేసు ఇంత వరకూ రావడానికీ.. ఒక లాజికల్ ఎండ్ దిశగా సాగడానికి మాత్రం నిస్సందేహంగా వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీతే కారణమని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. తన తండ్రి హంతకులు, వారి వెనుకనున్న ముసుగువీరుల సంగతి తేల్చాలంటూ డాక్టర్ సునీత చేసిన, చేస్తున్న న్యాయ పోరాటం చారిత్రాత్మకం. వ్యవస్థలను మేనేజ్ చేయడంలోనూ, నిర్వీర్యం చేయడంలోనూ అధికార వైసీపీ చేయగలిగినంతా చేసింది. కేసు దర్యాప్తు వేగాన్ని మందగించేలా చేయడానికి చేయగలిగినంతా చేసింది. విపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తును డిమాండ్ చేసిన జగన్.. అధికారంలోకి రాగానే కేంద్రదర్యాప్తు సంస్థ అవసరం లేదన్నారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. కేసును నిర్వీర్యం చేయడానికి తన అధికారాన్ని జగన్ ఎంతగా దుర్వినియోగం చేశారో అర్ధమౌతుంది.
చివరాఖరికి దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి పీఏ చేతే సునీతపై ఆరోపణలు చేయించారు. హత్య వెనుక డాక్టర్ సునీత, ఆమె భర్త ఉన్నారని ఫిర్యాదులు చేయించారు. ఇప్పుడు ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలని తేటతెల్లమైపోయింది. వైఎస్ వివేకానంద పీఏ కృష్ణారెడ్డి డాక్టర్ సునీతపై చేసిన ఆరోపణలన్నీ తప్పుడు ఆరోపణలేనని పోలీసులు నిర్ధారించారు. వివేకా హత్య కేసులో వైసీపీ నేతల పేర్లు చెప్పాలనీ తనను డాక్టర్ సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి తనను బెదరించారనీ, అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్ కొట్టారంటూ కృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దానిపై దర్యాప్తు చేసిన పోలీసులు కృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు తప్పుడుదని తేల్చారు. దీంతో కృష్ణారెడ్డి తప్పుడు ఫిర్యాదు చేశారంటూ పోలీసులు పులివెందుల కోర్టకు నివేదిక సమర్పించారు. అలాగే తప్పుడు ఫిర్యాదు చేసిన కృష్ణారెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.