దత్తపుత్రుడు జగన్.. హవ్వ షర్మిల అంత మాటనేశారేంటి?
posted on Feb 21, 2025 @ 11:25AM
మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుందన్నది నానుడి. ఎవరైనా సరే కర్మ ఫలం అనుభవించ కతప్పదంటారు. ఇప్పుడు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే సరిగ్గా అదే జరుగుతోందనిపించక మానదు. గతంలో అంటే జగన్ తాను అధికారంలో ఉన్న సమయంలో తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లు వ్యవహరించే వారు. నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా ప్రత్యర్థి పార్టీల నేతలను ఇష్టారీతిగా విమర్శలు గుప్పించే వారు. భాషను ఉపయోగించే విషయంలో జగన్ ఇసుమంతైనా మర్యాద పాటించిన దాఖలాలు లేవు.
ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ లపై అనుచిత భాషాప్రయోగం చేశారు. ఇక జనసేనాని వపన్ కల్యాణ్ విషయంలో అయితే చెప్పనే అవసరం లేదు. పవన్ కల్యాణ్ వివాహాలపైన ఆయన చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉండేవి. సరే ఇక పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఆయన ఎప్పుడూ దత్తపుత్రుడు అని సంబోధిస్తూ ఉండేవారు. చంద్రబాబు నాయుడికి మద్దతు పలుకుతున్నారు కనుక ఆయన చంద్రబాబు దత్తపుత్రులు అన్నది ఆయన భావన. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా జగన్ ప్రత్యర్థులను కించపరిచే వ్యాఖ్యలు చేయడానికి ఇసుమంతైనా వెనుకాడే వారు కాదు.
ఇప్పుడు ఆయన దత్తపుత్రుడు వ్యాఖ్య అయనకే ఎదురువచ్చి తగిలింది. సొంత సోదరి, ఏపీసీసీ చీఫ్ షర్మిల జగన్ ను దత్తపుత్రుడు అని సంబోధించింది. కౌపీన సంరక్షార్థం.. అంటే కేసుల నుంచి రక్షణ కోసం జగన్ బీజేపీకి, ప్రధాని మోడీకి దత్తపుత్రుడుగా మారిపోయారని షర్మిల విమర్శించారు. అధికారంలో ఉన్నంత కాలమూ జగన్ మోడీ దత్తపుత్రుడుగానే ఉన్నారన్న షర్మిల, ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా అలాగే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్‌ను కించపరిచేందుకు జగన్ చాలా తరచుగా ఉపయోగించిన దత్తపుత్రుడు అనే పదాన్నే ఇప్పుడు సొంత సోదరి షర్మిల జగన్ ను ఉద్దేశించి వాడారు. అందుకే అంటారు కర్మ ఎవరినీ వదలదని.