వల్లభనేని వంశీ అరెస్టు ఓకే.. కొడాలి నాని వంతెప్పుడు?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని అరెస్టు వార్త గురువారం (ఫిబ్రవరి 13) ఉదయమే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన ముందస్తు బెయిలు కోర్టులో పెండింగ్ లో ఉండగా ఎలా అరెస్టయ్యారన్న అనుమానాలు వ్యక్తమైనా, గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో కాకుండా మరో కేసులో వల్లభనేని వంశీ అరెస్టయ్యాడని తెలియడంతో ఆ కేసేమిటా అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అయ్యింది. అనుమానాలన్నీ వల్లభనేని అరెస్టు వార్త వాస్తవం కాదేమోనన్న సంశయంతోనే తప్ప ఆయన అరెస్టుకు నిరసనగా కాదని, ఆ తరువాత ఆయన అరెస్టుపై జనస్పందన చూసిన తరువాత అర్ధమైంది.
ఇంతకీ వల్లభనేని వంశీ గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి జరిగిందంటూ ఫిర్యాదు చేసిన తెలుగుదేశం కార్యాలయంలో డీటీపీ ఆపరేటర్ గా పని చేసిన సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో పోలీసులు వంశీని హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసిన వల్లభనేని వంశీ, ఆ కేసు వెనక్కు తీసుకోవాలని బెదరించారన్నది పోలీసుల అభియోగం. ఈ విషయంలో వల్లభనేని వంశీ అడ్డంగా దొరికిపోయాడు. దాడి కేసులో ఫిర్యాదు ఉపసంహరణకు సత్యవర్ధన్ ను వంశీ స్వయంగా కారులో తీసుకువచ్చిన ఫుటేజీలు ఉన్నాయి. దీంతో క్షణం ఆలస్యం చేయకుండా పోలీసులు వంశీని అరెస్టు చేశారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక ప్రశ్న వినిపిస్తోంది. వల్లభనేని వంశీ అరెస్టు సరే.. మరి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని వంతు ఎప్పుడన్నదే ఆ ప్రశ్న. ఈ ప్రశ్న ఉత్పన్నం కావడానికి కారణం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఈ ఇరువురికీ ఓ ప్రత్యేకత ఉంది. ఇద్దరూ మంత్రి మిత్రులు. ఇద్దరి రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది. అంతకు ముందు ఇద్దరూ తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలు. కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ కు మంచి మిత్రులు. ఇద్దరూ కూడా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో పని చేశారు. కొడాలి నాని గుడివాడ నియోజకవర్గం నుంచి 2004లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
వల్లభనేని వంశీ 2009లో విజయవాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. కొడాలి నాని మాత్రం 2009లో కూడా గుడివాడ నుంచే పోటీలో నిలిచి తెలుగుదేశం తరఫున విజయం సాధించారు. ఆ తరువాత రాష్ట్ర విభజన జరిగింది. 2014 ఎన్నికలు వచ్చే సరికి కొడాలి నాని తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ గూటికి చేరారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా గుడివాడ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. వంశీ మాత్రం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. 2014 ఎన్నికలలో గన్నవరం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికలో కూడా అదే జరిగింది. కొడాలి నాని గుడివాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. గన్నవరం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా వల్లభనేని వంశి గెలుపొందారు. ఇరువురూ పార్టీలు వేరైనా మంచి మిత్రులుగా కొనసాగారు. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలై.. రాష్ట్రంలో వైసీపీ అధికార పగ్గాలు చేపట్టింది. దీంతో వల్లభనేని వంశి జగన్ కు మద్దతు తెలుపుతూ వైసీపీ గూటికి చేరారు. కొడాలి నాని జగన్ తొలి కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్నారు.
అప్పటి వరకు వేరే పార్టీలో ఉంటున్నా.. కొనసాగిన వంశీ, నానిల స్నేహబంధం, వంశీ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరడంతో మరింత గట్టి పడింది. వాస్తవానికి కొడాలి నాని ప్రభావంతోనే వంశీ వైసీపీ గూటికి చేరారు. ఆ తరువాత వల్లభనేని వంశీ, కొడాలి నాని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ టార్గెట్ గా ఇష్టారీతిగా విమర్శలు వ్యాఖ్యలూ చేస్తూ పెట్రేగి పోయారు. లోకేష్ పై అయితే ఆయన వ్యక్తత్వ హననమే లక్ష్యమన్నట్లుగా విమర్శలు, వ్యాఖ్యలూ చేశారు. అక్కడితో ఆగకుండా చంద్రబాబు భువనేశ్వరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆ తరువాత 2024 ఎన్నికలో వైసీపీ ఘోరంగా ఓడిపోయి అధికారాన్ని కోల్పోయింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబుబు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచీ విరిద్దరినీ అరెస్టు చేయాలి అన్న డిమాండ్ తెలుగుదేశం వర్గాల నుంచే కాకుండా, వీరి దాష్టికాల కారణంగా బాధితులుగా మారిన ప్రజల నుంచి కూడా గట్టిగా వినిపించింది. అయినా గత ఎనిమిది నెలలుగా అదిగో, ఇదిగో అనడం తప్ప వీరి అరెస్టు జరగలేదు. ఒక దశలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేతకాని తనం వల్లనే కొడాలి నాని, వల్లభనేని వంశీ స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని తెలుగుదేశం శ్రేణుల నుంచే విమర్శలు వినవచ్చాయి. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిద్దరి మీద కేసులు తెరపైకి తెచ్చారు. అయితే అరెస్టు మాత్రం చేయలేదు. ఈ నేపథ్యంలోనే వల్లభనేని అరెస్టు పట్ల తెలుగుదేశం వర్గాలలోనే కాకుండా గన్నవరం నియోజకవర్గ ప్రజలలో కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో వల్లభనేని వంశీ అరెస్టు సరు.. కొడాలి నాని వంతెప్పుడు అన్న ప్రశ్నలూ వినవస్తున్నాయి.