గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం!?
posted on Feb 21, 2025 @ 12:10PM
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. రాజకీయాలతో ఏ మాత్రం పరిచయం ఉన్నవారికైనా ఈ పేరు సుపరిచితం. బీజేపీని మించిన కరుడుగట్టిన హిందూ వాదిగా, తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఆయన నిత్యం ప్రయత్నిస్తుంటారు. గోషామహల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా వరుసగా ఎన్నికౌతూ వస్తున్నారు. అటువంటి రాజాసింగ్ ను గతంలో బీజేపీ ఒక సారి సస్పెండ్ చేసింది కూడా. అయితే గత ఎన్నికలకు ముందు అనివార్యంగా ఆయనపై సస్పెన్షన్ ను ఎత్తివేసి గోషామహల్ నుంచి పార్టీ టికెట్ ఇచ్చి మరీ పోటీకి దింపింది. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే.. ఆయన వివాదాలతో సహవాసం చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారని చెప్పడానికే.
తాజాగా రాజాసింగ్ సోషల్ మీడియా ఖాతాపై మెటా నిషేధం విధించింది. ద్వేషపూరిత ప్రసంగాలు, మతపరమైన ప్రదర్శనలకు సంబంధించి ఆయన పోస్టు చేసిన వీడియోలను తొలగించింది. రాజాసింగ్ 2024వ సంవత్సరంలో ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో విద్వేష పూరిత ప్రసంగాలు చేశారని ఇండియా హేట్ ల్యాబ్ నివేదిక వెల్లడించింది రాజాసింగ్ పాల్గొన్న రాజకీయ ర్యాలీలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, మతపరమైన ఊరేగింపులు, నిరసన ప్రదర్శనలు, జాతీయ వాద ర్యాలీల వీడియోలను అధ్యయనం చేసి అవి ద్వేషపూరితమైనవని నిర్ధారించింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను ఐటీ దిగ్గజ సంస్థ మెటా తొలగించింది. ప్రమాదకరమైన వ్యక్తులు, సంస్థల ఖాతాలను మెటా స్తంభింప చేసి, వారి పోస్టులను తొలగిస్తుంటుంది. ఫేస్‌బుక్ లో రాజాసింగ్ కు చెందిన 495 ద్వేషపూరిత ప్రసంగ వీడియోలు, యూట్యూబ్ 211 వీడియోలను మెటా తొలగించింది. '