‘గ్రాడ్యుయేట్ ’గెలుపు ఎవరిది?
గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించబోయేది ఎవరు? 18 ఏళ్ల క్రితం గెలుపునకు దూరమైన తెలుగుదేశం ఇప్పుడు అధికారంలో ఉన్న సమయంలో తన సత్తా చూపిస్తుందా? శాసనమండలి గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా నిలబడిన రాజాకు ఎదురవుతున్న సవాళ్లు ఏంటి? సిట్టింగ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అధికార పార్టీని ఎలా మెలిక పెడుతున్నారు? నువ్వా నేనా అంటూ సాగుతున్న ప్రచారం ముగిసిపోయిన సందర్భంలో ఇక గెలుపు వాకిట ఎవరు నిలబడబోతున్నారు? కృష్ణ ,గుంటూరు జిల్లాలో హీట్ పెంచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సరళి ఎలా ఉండబోతుంది?
ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మరికొద్ది గంటల్లో జరగనున్నాయి. మంగళవారం (ఫిబ్రవరి25) సాయంత్రం నాలుగు గంటలతో ప్రచార గడువు కూడా ముగిసిపోయింది. గుంటూరు, కృష్ణాజిల్లాల పరిధిలో మొత్తం 33 అసెంబ్లీ స్థానాలు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలోకి వస్తాయి. గురువారం (ఫిబ్రవరి 27) ఉదయం 8 గంటల నుంచి, సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. అధికారులు గుంటూరు జిల్లాలో 483 పోలింగ్ స్టేషన్ల ను ఏర్పాటు చేశారు. వీటిలో 144 సమస్య సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. ఈ సమస్యత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక భద్రతను కల్పించనున్నారు.
ఈ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవడానికి, ఇద్దరు కీలక అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మొత్తం 25 మంది గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినా, అందరి చూపు మాత్రం , కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ,సిట్టింగ్ ఎమ్మెల్సీ, పిడిఎఫ్ అభ్యర్థి, కె ఎస్ లక్ష్మణరావు పైనే ఉంది. తెలుగుదేశం అధికారంలో ఉండగా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి అధికార పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. శాసనమండలి పునరుద్ధరణ జరిగిన తర్వాత తొలి ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించింది. కానీ ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ పార్టీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. ఆ రెండు ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థులే విజయం సాధించారు. కానీ ఇప్పుడు ఒకటి కాదు ,రెండు కాదు, మూడు పార్టీల భాగస్వామ్యంతో కూటమి అభ్యర్థిగా నిలబడిన తెలుగుదేశం అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ సిట్టింగ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావుకు ఝలక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాగా కొందరు వైసీపీ నేతలు కూడా పరోక్షంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు మద్దతు పలుకుతున్నారని తెలుస్తోంది. అయితే అధికారికంగా మాత్రం వైసీపీ కూటమి అభ్యర్థిని ఓడించాలని పిలుపునిచ్చింది. అలాగే కూటమి పార్టీల్లోని కొందరు నాయకులు పరోక్షంగా పిడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు కు మద్దతు పలుకుతున్నారన్న ప్రచారం ఉంది.ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం ఎవరిదన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.
2007లో ఉమ్మడి గుంటూరు కృష్ణ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి... ఆ ఎన్నికల్లో తెలుగుదేశం మద్దతుతో బరిలోకి దిగిన చిగురుపాటి వరప్రసాద్ విజయం సాధించారు. అయితే ఆయన లోకల్ విజయవాడ ఎమ్మెల్సీ గానే గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో 2013 లో తిరిగి చిగురుపాటి వరప్రసాద్ కు తెలుగుదేశం అధిష్టానం మరోసారి అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల్లో చిగురుపాటి వరప్రసాద్ ఓటమి పాలయ్యారు. ఆయనపై పిడిఎఫ్ అభ్యర్థి బొడ్డు నాగేశ్వరరావు విజయం సాధించారు.
ఆ తర్వాత 2019లో సాధారణ ఎన్నికలకు నెల ముందు పట్టబద్రులు ఎన్నికలు వచ్చాయి.. ఈ ఎన్నికల్లో సైతం పిడిఎఫ్ అభ్యర్థి, విజయం సాధించారు... ఆ ఎన్నికల్లో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పోటీ చేసి విజయం సాధించారు.. అలా వరుసగా రెండుసార్లు పిడిఎఫ్ అభ్యర్థులు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విజయాలు సాధించారు. ఇప్పుడు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని పీడీఎఫ్ భావిస్తోంది.
అయితే తెలుగుదేశం ప్రస్తుతం అధికారంలో ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని 33 అసెంబ్లీ స్థానాల్లో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ఈసారి ఎలాగైనా పిడిఎఫ్ అభ్యర్థికి షాక్ ఇవ్వాలన్న పట్టుదలతో ఉంది. తెలుగుదేశం కూటమి అభ్యర్థి ఆల పాటి రాజేంద్రప్రసాద్ విస్తృతంగా క్యాంపెయిన్ చేశారు. దాదాపు అన్ని నియోజకవర్గాలనూ చుట్టేశారు. మాజీ మంత్రిగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం ఉన్న ఆలపాటికి మామూలుగా అయితే ఎన్నికల లెక్కలు వేయటం పెద్ద సమస్య కాదు, మాస్ పల్స్ ఎలా పట్టుకోవాలో తెలిసిన నాయకుడిగా ఆలపాటి రాజాకుపేరు ఉంది. అయితే ఇక్కడ జరుగుతుంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో వారు ఎవరికి ఓటు వేస్తారన్నది ఇతమిథ్థంగా చెప్పడం అంత సులువు కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మరో వైపు పిడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకుల్ని కలుపుకొని ఇంటింటికి తిరిగి గ్రాడ్యుయేట్ ఓట్లు అభ్యర్థి స్తు న్నారు. ఈ నేపథ్యంలో పోరు హోరాహోరీగా ఉందన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో కూడా వినిపిస్తోంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు లోని విజయం సాధించాలని ఆలోచనతో అభ్యర్థులు ఉంటే, ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, రెండవ ప్రాధాన్యత ఓటు వరకు ఫలితాలు వచ్చే అవకాశం లేదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సాధారణ ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు భిన్నంగా జరుగుతాయి. తొలి ప్రాధాన్యత ఓటు కోసమే అభ్యర్థులు ప్రయత్నిస్తుంటారు.
ప్రస్తుతం గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ అభ్యర్థుల ఓటర్ల లిస్టు పరిశీలిస్తే మూడు లక్షల 47 వేల వరకు ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లలో ఎవరు ఎక్కువ శాతం ఓట్లు దక్కించుకుంటారనే దానిపై ఈ విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. కానీ తొలి ప్రాధాన్యత ఓటులో 51 శాతం మించి అభ్యర్థి ఓట్లు దక్కించుకుంటేనే మొదటి ప్రాధాన్యత ఓట్ల తో విజయం సాధించే అవకాశం ఉంటుంది.
ఓటర్ల జాబితా పరిశీలిస్తే 2,06,456 మంది పురుష గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు వినియోగించు కోబోతున్నారు. అలాగే 1,40, 615 మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తంగా మూడు లక్షల3, 47,116 మంది ఓటర్లు పాల్గొనాల్సి ఉంది ....అయితే శివరాత్రి,తో పాటు , ఇప్పటివరకు ఉపాధ్యా యులకు ప్రైవేట్ స్కూళ్లకు పూర్తిస్థాయిలో సెలవుల విషయంలో క్లారిటీ లేకపోవడంతో గందరగోళం నెలకొని ఉంది,... ఉపాధ్యాయులకు పోలింగ్ రోజు సెలవు ఇవ్వకపోతే ప్రభుత్వ స్కూళ్లలో నుండి టీచర్లు ఓటింగ్కు హాజరయ్యే అవకాశం ఉండదు ఫలితంగా ఓటింగ్ పర్సంటేజ్ పూర్తిగా పడిపోయే అవకాశం ఉంది. ఈ ప్రభావం ఫలితంపై ఉంటుందనడంలో సందేహం లేదు. కేవలం 55 నుండి 65 % మంది ఓటర్లు మాత్రమే పోలింగ్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలలో ఎవరు విజయం సాధిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.