కొత్త జిల్లాల ఏర్పాటుకు మరో అడుగుపడింది

ఆంధ్రప్రదేశ్‌ లో లోక్ సభ నియోజకవర్గాల ఆధారంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల కేబినెట్ సమావేశంలో జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. లోక్ సభ నియోజకవర్గాల సంఖ్య ఆధారంగా ఏపీలో 25 జిల్లాలు ఏర్పడనున్నాయి.    తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. ఈమేరకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు ఇచ్చారు.    ఏపీ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాల పునర్వవస్థీకరణ అధ్యయన కమిటీ ఏర్పాటు చేశారు. 25 జిల్లాల ఏర్పాటుపై కమిటీ అధ్యయనం చేస్తుంది. ఈ అధ్యయన కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో ఆరుగురు ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. మూడు నెలల్లోపు నివేదిక ఇవ్వాలని కమిటీకి గడువు విధిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మూడు రాజధానుల పై సుప్రీం కోర్టుకు జగన్ సర్కార్..!

హైకోర్టులోనూ, సుప్రీం కోర్టులోనూ ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న ఎపి ప్రభుత్వం తాజాగా మరో సారి సుప్రీం కోర్టు తలుపు తట్టనున్నట్లుగా తెలుస్తోంది. మూడు రాజ‌ధానుల బిల్లుకు గ‌వ‌ర్న‌ర్ ఆమోద‌ముద్ర పడగానే, దాని పై అమ‌రావ‌తి రైతులు హై కోర్టులో సవాల్ చేశారు. దీంతో ఈ బిల్లుల ఆమోదం పై స్టేటస్ కో విధిస్తు విశాఖప‌ట్నంకు ప్రభుత్వ కార్యాల‌యాలు త‌ర‌లించ‌కుండా హైకోర్టు ఆర్డ‌ర్ ఇచ్చింది.    తాజాగా దీనిపై మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ… అమ‌రావ‌తి రైతుల ఉద్య‌మం పూర్తిగా రాజ‌కీయ ప్రేరేపిత ఉద్య‌మ‌మ‌ని, అవ‌స‌రం అయితే హైకోర్టు నిర్ణ‌యంపై సుప్రీం కోర్టుకు వెళ్లే విష‌యం కూడా ఆలోచిస్తాం అంటూ కామెంట్ చేశారు. అంతే కాకుండా చంద్రబాబు తానొక్కడినే బాగుపడాలనే పెద్ద స్వార్ధపరుడని, అందుకే రాజధాని అమరావతిలోని ఉండాలని కోరుకుంటున్నారని అయన తీవ్ర విమ్మర్శలు చేసారు. ఐతే మంత్రి తాజా వ్యాఖ్యలతో రాష్ట్ర ప్ర‌భుత్వం హైకోర్టు స్టేటస్ కో పై సుప్రీంకు వెళ్లే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా పలువురు అనుమానిస్తున్నారు.   ఇది ఇలా ఉండగా ఇప్ప‌టికే ఎన్నిక‌ల అధికారి నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ స‌హా ప‌లు కేసుల్లో సుప్రీం కోర్టులో ఏపీ స‌ర్కార్ కు గ‌ట్టి ఎదురు దెబ్బ‌లు త‌గ‌ల‌గా... మళ్ళీ మూడు రాజ‌ధానుల బిల్లుపై ప్ర‌భుత్వం సుప్రీం కోర్టుకు వెళ్తే ఎలాంటి ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయి అన్న‌ది ఆస‌క్తిక‌రంగా తయారయింది.

ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబుపై హైకోర్టు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు

న్యాయస్థానాలను, న్యాయమూర్తులను ఉద్దేశించి ఇటీవల ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి న్యాయవాది లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఎమ్మెల్సీ రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థపై దాడి చేయడమేనని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ప్రణాళికాబద్ధంగా కోర్టులను విమర్శిస్తున్నారని, న్యాయస్థానాల ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతో కొందరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని  మండిపడ్డారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.   కాగా, మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటనను స్వాగతిస్తూ వైసీపీ నాయకులు తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం గుడ్డివానిచింత వద్ద సీఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రవీంద్రబాబు కోర్టులు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుని ఉద్దేశించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. "న్యాయస్థానాలు గానీ, జడ్జీలుగానీ, చంద్రబాబుగానీ, కేసులుగానీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వెంట్రుకని కూడా కదపలేవు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పండుల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. మరి ఇప్పుడు న్యాయవాది లక్ష్మీనారాయణ ఫిర్యాదుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎలా స్పందిస్తారో చూడాలి.

కరోనా కాలం కలిసోచ్చింది.. 'గీత పొగత్' అంతరంగం...!!

ప్రపంచవ్యాప్తంగా జనజీవితాన్ని స్తంభించేలా చేసిన కరోనా వల్ల అనేక రంగాలు చతికిలాబడ్డాయి. కరోనా వల్ల టోక్యో నగరంలో ఈ సంవత్సరం జరగాల్సిన 'ఒలంపిక్స్ క్రీడలు' వచ్చే సంవత్సరానికి వాయిదా పడటంతో చాలా మంది క్రీడాకారులు నిరుత్సాహ పడ్డారు. కానీ ఒకరి విషయంలో మాత్రం అది అదృష్టంగానే భావించుకోవచ్చేమో...ఆ వ్యక్తే కామన్వెల్త్ క్రీడల్లో రేజ్లింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన గీత పొగత్. 2010లో జరిగిన కామన్ వెల్త్ గోమ్స్ లో మన దేశానికి మొట్టమొదటిసారి బంగారు పతకం ఆమె సాధించారు. ఒలంపిక్స్ కు ఎంపికైన తొలి మహిళా కుస్తీ క్రీడాకారిణి కూడా గీతానే. 2016లో ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకున్న గీత 2019లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ ఏడాది జరగాల్సిన ఒలంపిక్స్  కరోనా కారణంగా వాయిదా పడటంతో తనకు మేలే జరిగిందనంటున్నారు. కరోనా కాలం కలిసోచ్చింది అంటూ ఆమె 2021లో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో ఫిట్ నెస్ కోసం వర్కవుట్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక  ఇంటర్వ్యూలో ఆమె తన అంతరంగాన్ని ఇలా పంచుకున్నారు.   బాబు (అర్జున్) పుట్టి చూస్తుండగానే ఏడు నెలలు గడిచిపోయాయి. వాడి ఫోటోలను నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు చాలా రెస్పాన్స్ వచ్చింది. వాటిని చూస్తూంటే  ఆనందంగా ఉంది. ఒక రకంగా బాబు పుట్టాక  చాలా సంతోషంగా ఉన్నాను. జీవితంలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు టైం అంతా వాడితోనే... ప్రత్యేకమైన టైమింగ్ అంటూ ఏమీ ఉండవుకదా అందుకే నేను వాడి టైమింగ్ కు అనుగుణంగా మారాల్సి వస్తుంది. రాత్రివేళ కూడా చాలా సార్లు వాడు నిద్రలేస్తాడు. పాలు పట్టాలి ,బట్టలు మార్చాలి. అలా అన్నీ నేను చూసుకుంటున్నాను. వీటితో పాటు నా ఫిట్ నెస్ మీద కూడ దృష్టి పెట్టాల్సి ఉంది.   పెళ్లి చేసుకోవడం, అమ్మను కావడంతో నేను కుస్తీ మానేశాను అనుకుంటున్నారు. చాలామంది నెక్ట్స్ ఏంటీ అని అడుగుతుంటారు కూడా. అర్జున్ పుట్టాక మా ఇంట్లో వాళ్ళు కూడ ఇపుడు ఏం చేస్తావు అని అడుగుతున్నారు. నేను మాత్రం ఎప్పుడు  కుస్తీని వదిలేది లేదు.   అయితే 2020లో జరిగే పోటీల్లో పాల్గొన్నలేనేమో అని బాధపడ్డాను. అయితే  కరోనా కారణంగా  ఈ ఏడాది జరగాల్సి ఒలంపిక్స్  2021 లో జరగబోతున్నాయి. ఒక రకంగా మళ్ళీ నాకు పాల్గొనే అవకాశం వచ్చినట్లే అందుకే దీన్నీనేను అసలు వదులుకోను. కచ్చితంగా ఈ ఒలంపిక్స్ కి వెళ్తడంతో పాటు పతకాలు తేవడానికి నా వంతుగా ప్రయత్నిస్తాను. అందుకోసం ఇప్పటి నుంచే ఫిట్నెస్ మీద దృష్టి పెట్టి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. మా ఇంట్లో అందరూ కుస్తీ యోధులే.. నా భర్త కూడా రెజ్లరే కావడంతో నన్ను అర్థం చేసుకుని సహకరిస్తున్నారు. ఇక నాన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనే నా గురువు. మా సోదరి, ఫ్యామిలీ మెంబర్స్ నన్ను గమనిస్తూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు చేయగలవు, ఇంతకుముందు కన్నా ఇపుడే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నావు అంటూ ప్రోత్సహిస్తున్నారు. సాధించాలన్న తపన ఉంటే  చాలు ఎవరైనా చేస్తారు అంటూ వాళ్లందరూ  మోటివేట్ చేస్తున్నారు. అయితే నాన్నగారి గురించి ఒక విషయం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి. చాలా రోజుల తర్వాత  నాన్న మా ఇంటికి వచ్చారు.  రాగానే ఆయన  నన్ను అడిగిన మొదటి ప్రశ్న ఇప్పుడు ని బరువు ఎంత ఉంది? కుస్తీ చేయాలనే కోరిక ఉందా లేదా? తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు అని ప్రశ్నించారు.  నేను కాస్త బరువు చాలా పెరిగాను కాబట్టి నా బరువు తగ్గించి, మళ్ళీ ఎప్పటిలా కుస్తీ చేస్తాను అని చెప్పాను. దానికాయన అది చాలా కష్టం, ఇపుడు నువ్వింక ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది అన్నారు. అవును, నేను కష్టపడటానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి కష్టపడతాను, బరువు తగ్గిస్తానని చెప్పాను. ఎందుకంటే నాకు కుస్తీ తప్పించి ఇంకేమి కనిపించడం లేదు.   మా నాన్న చెప్పినట్లే నిజానికి  రెజ్లర్స్ కి  బరువు అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే  బరువును బట్టే మన క్యాటగిరి అనేది నిర్ణయించబడుతుంది. లాస్ట్ టైం నేను  57 కేజీల విభాగంలో పాల్గొన్నాను.  దాని తర్వాత కూడ నేను ఆడాను.  ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో కూడ 5 7 కేజీల విభాగంలో  ఆడాను. ఇపుడు జరగబోయే ఒలంపిక్స్ కి 62 కేజీల విభాగం అవసరం. ఈ మధ్య నా ఫోటోలను చూసి సోషల్ కొంతమంది నెగిటివ్ గా కూడా కామెంట్ చేశారు. నా హర్డ్ వర్క్ ను గమనించకుండా కామెంట్స్  చేయడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. అయితే వారి కామెంట్స్ కు బాధపడేతే అక్కడే ఆగిపోతాను. ఒకరకంగా ఇలాంటి నెగటివ్ విషయాలు కూడ నన్ను పాజిటివ్ గా మోటివేట్ చేస్తాయి. ఒక రకంగా వాళ్ళ   మీద జాలి కలుగుతుంది. ఇపుడు నేను ఓ బిడ్డకు తల్లి ని.  అమ్మఅయిన తర్వాత సహజంగానే శరీరంలో మార్పులు వస్తాయి. బరువు పెరుగుతారు. ఇవన్నీ సహజంగా జరిగేవే. అలా కాకుండా  మీరు ఇలా లావాపోయారేంటి? కుస్తీ వదిలేశారా? లావయితే ఇక కుస్తీ ఎలా చేయగలరు' అని నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారంటేనే తెలిసిపోతుంది వాళ్ళకి అంతగా అర్థం చేసుకునే శక్తి లేదని. అందుకే నేను వాళ్ళ మీద జాలి పడి వదిలేస్తాను. అమ్మ అయినంత మాత్రానా నాకు ఇష్టమైన కుస్తీని వదిలేయాలా  దాన్ని ఛాలెంజ్ గా కూడా తీసుకుంటాను. మళ్ళీ నేను ఫిట్ అవ్వడానికి సాధన చేస్తున్నాను.

చట్ట సభల నిర్ణయాల పై కోర్టుల జోక్యం సరికాదు.. స్పీకర్ తమ్మినేని

ఆంధ్రప్రదేశ్ ‌లో సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులకు సంబంధించి శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వికేంద్రీకరణ బిల్లులపై సభలో 11 గంటల పాటు చర్చించామన్నారు. ఇందులో ప్రతిపక్ష పార్టీకి రెండు గంటలకు పైగా చర్చించేందుకు సమయం ఇచ్చామన్నారు. అంతే కాకుండా టీడీపీకి ఉన్న సంఖ్యాబలం కంటే కూడా వారికి ఎక్కువ సమయం ఇచ్చామని అయన తెలిపారు. ఐతే ఈ బిల్లులపై అసలు చర్చ జరగలేదని టీడీపీ అనడం సరికాదని అయన అన్నారు. పార్లమెంట్, శాసనసభలలో తీసుకొన్న నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించేందుకు వీలు లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేంద్రం కూడ తేల్చి చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ తీసుకునే నిర్ణయాలపై కోర్టులు జోక్యం చేసుకోరాదని చెబుతూ, 1997 సంవత్సరంలో అప్పటి శాసన సభ స్పీకర్‌గా ఉన్న యనమల రామకృష్ణుడు రూలింగ్ ఇచ్చారని, మరి శాసనసభ తీసుకొనే నిర్ణయాలపై కోర్టులకు ఎలా వెళ్తారని ఆయన ప్రశ్నించారు..   ఇదే సందర్భంలో ప్రభుత్వం నుంచి ప్రతినిధులుగా వెళ్లిన మంత్రులను మండలిలోకి రాకూడదనడం ఎంతవరకు సమంజసమని తమ్మినేని టీడీపీని ప్రశ్నించారు. ప్రభుత్వం నుండి ప్రతినిధులుగా వెళ్లిన మంత్రులను మండలికి రాకూడదు అని కొందరు వ్యాఖ్యానించడం ఎంతవరకు కరెక్ట్ అని అయన అన్నారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులు సెలక్ట్ కమిటీలో ఉన్నాయంటూ కొందరు కోర్టుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని తమ్మినేని అన్నారు. అసలు సెలక్ట్ కమిటీనే ఏర్పాటు చేయనప్పుడు ఆ బిల్లులు పెండింగ్‌లో ఎలా ఉంటాయని ప్రశ్నించారు. సెలక్ట్ కమిటీకి పంపాలంటే ఓటింగ్ కచ్చితంగా జరగాలని, కానీ అలా జరగనప్పుడు సెలక్ట్ కమిటీ ఎలా ఏర్పాటు అవుతుందని ఆయన ప్రశ్నించారు. అసలు సెలక్ట్ కమిటీకి పంపాలని శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎందుకు అడగలేదని తమ్మినేని నిలదీశారు. రాజధానిని ఫ్రీ జోన్ గా చేస్తామని వికేంద్రీకరణ లక్ష్యంగా మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ప్రగతి భవన్ వద్ద ప్రొఫెసర్ కోదండరాం అరెస్ట్

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. "ముఖ్యమంత్రి మేలుకో ప్రజల ప్రాణాలు కాపాడు బతుకుదెరువు నిలబెట్టు" అనే నినాదంతో ప్రగతి భవన్ వద్ద నల్ల బెలూన్లతో నిరసనకు పిలునిచ్చిన ప్రొఫెసర్ కోదండరాం ను ప్రగతి భవన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రొఫెసర్ కోదండరాం తో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి , pow నేత సంధ్యతో పాటు మరికొందరిని కూడా అరెస్ట్ చేసి వేరు వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు.    ఐతే మీడియాతో మాట్లాదిన ప్రొఫెసర్ కోదండరాం ఇది కేవలం ఆరంభం మాత్రమే అని, త్వరలో ప్రతి ఇంటిపై నల్ల జెండా ఎగురవేసి నిరసన తెలియజేస్తామని అయన కెసిఆర్ ను హెచ్చరించారు. అమెరికాలో వైట్ హౌస్ ముందు కూడా నిరసన తెలియజేసే పరిస్థితి ఉందని, కానీ తెలంగాణాలో ఆపరిస్థితి లేదని అయన అన్నారు.

జేసీ ప్రభాకర్ రెడ్డికి మరో షాక్.. మళ్లీ అరెస్ట్ తప్పదా?

కడప జైలు నుంచి బెయిల్ పై నిన్న విడుదలైన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలకు మరో షాక్ తగిలింది. కడప సెంట్రల్ జైలు వద్ద కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ జేసీ ఫ్యామిలీతో పాటు 31 మంది టీడీపీ కార్యకర్తలపై కడప పోలీసులు కేసు నమోదు చేశారు.   జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌ రెడ్డిల విడుదల సందర్భంగా కడప సెంట్రల్ జైలు వద్దకు టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. జైలు నుంచి భారీ వాహనాల నడుమ తాడిపత్రికి బయల్దేరారు. అయితే, కోవిడ్ కారణంగా వాహన శ్రేణికి పోలీసులు అనుమతించలేదు. దీంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ జేసీ ఫ్యామిలీతో పాటు మరో 31 మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. అంతేకాదు, పోలీసులతో వాగ్వాదానికి దిగడంపై కూడా జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.    కాగా, అధికారంలో ఉన్న పార్టీ ఎవరిపైనైనా అక్రమ కేసులు పెట్టగలదని.. అరెస్టులు చేయాలనుకుంటే పెద్దగా కారణాలు అవసరం లేదని జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యానించిన కొద్ది గంటల్లోనే ఆయనపై మరో కేసు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు, జేసీ ప్రభాకర్‌రెడ్డిని మరోసారి అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

ఎమ్మెల్యే బామ్మర్ది అక్రమ తవ్వకాలు.. జేబుల్లోకి కోట్లు, జరిమానా లక్షలు!!

'వడ్డించే వాడు మనవాడైతే.. ఏ బంతిలో కూర్చున్నా పరవాలేదు' అన్నట్టుగా 'అధికారంలో ఉన్నది మన పార్టీ అయితే.. ఎలాగైనా సొమ్ము చేసుకోవచ్చు' అని కొందరు ఏపీ అధికార పార్టీకి చెందిన నేతలు రుజువు చేస్తున్నారు.   మైలవరం నియోజకవర్గ పరిధిలో పేదల ఇళ్ల స్థలాల కోసం లోతట్టు భూములు కొన్నారు. అయితే, వాటిని మెరక చేయాలన్న సాకుతో ఎమ్మెల్యే బామ్మర్ది.. ఎలాంటి అనుమతులు లేకుండానే దేవదాయ భూములు, అటవీశాఖ పరిధిలోని కొండలను నెల రోజులుగా తవ్వేస్తున్నారట. విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడి షాబాదలో ఇప్పటికే కోట్ల విలువచేసే అక్రమ తవ్వకాలు జరిగాయని సమాచారం. అలాగే, కొండపల్లి అటవీ భూముల్లో ఉన్న కొండల్ని తవ్వి గ్రావెల్‌ను తరలిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు, కొండపల్లి కపిలవాయి సత్రం దేవాలయ భూముల్లోనూ ఎటువంటి అనుమతులు లేకుండా 30 ఎకరాల్లో అక్రమ తవ్వకాలు జరుపుతున్నారట.    తవ్వకాలపై స్థానికులెవరైనా ప్రశ్నిస్తే.. మైలవరం నియోజకవర్గ పరిధిలో ఇళ్ల స్థలాల లే అవుట్లకు మట్టి అవసరమని, అందుకు మట్టిని తరలించాల్సి ఉందని ఎమ్మెల్యే బామ్మర్ది నమ్మబలుకుతున్నారట. గట్టిగా ఎవరైనా నిలదీస్తే బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని తెలుస్తోంది.   అటవీ భూముల్లో మట్టిని ఉచితంగా తరలించి ప్రభుత్వం నుంచి డబ్బును కాజేయడంతో పాటు తవ్విన గ్రావెల్‌ను బయట అమ్ముకుని కోట్ల రూపాయలు జేబులో వేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపినిస్తున్నాయి. అటవీ భూమిలోని మట్టిని తరలించడంపై ప్రతిపక్ష పార్టీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేసినా సరైన స్పందన లేదట. చివరికి ఎమ్మెల్యే బామ్మర్ది ఆగడాలపై సొంత పార్టీకి చెందిన స్థానిక నేతల నుంచే ఫిర్యాదులు వెళ్లడంతో అధికారులు జరిమానా విధించారని సమాచారం.    కొండపల్లి అటవీ క్వారీలో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై అటవీశాఖ, విజిలెన్స్‌ అధికారులు ఇటీవల దాడులు చేసి, అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. ఇప్పటివరకు సుమారు రూ.10 కోట్ల పైచిలుకు గ్రావెల్‌ ను తరలించారని అంచనా. కానీ, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అధికారులు కేవలం రూ.10 లక్షల జరిమానాతో సరిపెట్టారు. అటవీశాఖ చట్టం ప్రకారం అక్రమంగా తవ్వేసిన గ్రావెల్‌ విలువకు ఐదురెట్ల వరకు జరిమానా విధించవచ్చు.. కానీ అధికారులు రూ.10 లక్షలతో సరిపెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అధ్వానంగా ఏపీ ఆర్థిక పరిస్థితి.. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది!

ఏపీ ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది అంటూ మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెన్షన్ చెల్లింపులు ఆలస్యమవ్వడంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వానికి భంగపాటు తప్పదని హెచ్చరించారు.   "ఈ నెల పెన్షన్ ఒక వారం తర్వాత ఈ రోజు వచ్చింది. జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు, బడ్జెట్లో మొదటి కేటాయింపులు కాబట్టి ఒకరోజు అటు ఇటు గా చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఒక వారం పెన్షన్ చెల్లింపులు వాయిదా పడ్డాయి అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అర్ధాన్నం గా ఉన్నది అర్థమవుతున్నది." అని ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించారు.   "ఆదాయానికి పొంతన లేని వ్యయంతో ముందుకు పోయే ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అయినా ఇటువంటి భంగపాటు తప్పదు. ఒక నాలుగు రోజులు ముందా వెనక అంతే." అని ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. కాగా, ఏపీ ఆర్థిక పరిస్థితిపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాజధాని మార్పు అంశంపై స్పందించిన ఆయన.. రాష్ట్రంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని మార్పు సరికాదని హితవు పలికారు. అయినా ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిని మార్చుకుంటూ పోవడం సరికాదన్నారు.   ప్రస్తుతం ఐవైఆర్ కృష్ణారావు, రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సమయానికి జీతాలు, పెన్షన్లు చెల్లించలేని ప్రభుత్వం.. అసలు మూడు రాజధానులు ఎలా ఏర్పాటు చేస్తుంది? ముందు ముందు రాష్ట్రాన్ని ఎలా నడుపుతుంది? పథకాలను ఎలా అమలు చేస్తుంది? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

విజయవాడ దుర్గమ్మ గుడిలో కరోనాతో అర్చకుడి మృతి

దేశ వ్యాప్తంగా సామాన్యులను విఐపిలను కూడా కరోనా చుట్టేస్తోంది. ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలోని పలువురు అర్చకులు, సిబ్బందికి కరోనా రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా విజయవాడ కనకదుర్గ గుడి ఆలయంలోని సిబ్బంది, ఉన్నతాధికారులకు కూడా కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దుర్గ గుడి ఈవో సురేష్ బాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అదే విధంగా ఆలయంలో మరో 18 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఐతే ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అర్చకుడు రామకృష్ణ ఘనాపాటి కరోనా కారణంగా నిన్న కన్ను మూశారు. మూడు రోజుల క్రితం ఆయనకు కరోనా సోకినట్టు ఆలయ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన భార్య కూడా ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా ప్రస్తుతం ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆలయ కమిటీ నిర్ణయించింది.   ఇది ఇలా ఉండగా కరోనా కారణంగా నిన్న టీటీడీ అర్చకుడు శ్రీనివాసాచార్యులు కన్నుమూయడంతో తిరుమలలోని అర్చకులు విషాదంలో మునిగిపోయారు. దీంతో విధులు నిర్వహించేందుకు అర్చకుల్లో చాలామంది జంకుతున్నారు. శ్రీనివాసాచార్యులు చనిపోయారనే సంగతి తెలిసిన వెంటనే పలువురు అర్చకులు గోవింద నిలయంలో సమావేశమయ్యారు. తిరుమల ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రితో ఈ విషయం పై అర్చకుల చర్చలు జరిపారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో కళ్యాణోత్సవ సేవను ఈ నెల 31వరకు నిలిపి వేయాలని అర్చకుల ఆయనకు సూచించినట్టు తెలుస్తోంది.

అలా చేస్తే జగన్‌ ను సన్మానించి రాజకీయాల నుంచి తప్పుకుంటా: జేసీ ప్రభాకర్ రెడ్డి

వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో అరెస్ట్ అయ్యి కడప జైల్లో ఉన్న టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డితో పాటు ఆయన తనయుడు అస్మిత్‌ రెడ్డి జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. జైలులో కూడా కక్ష సాధింపు తీరుతోనే వ్యవహరించారని ఆరోపించారు. తనకు ఆహారం కూడా ఇవ్వకుండా జైలు అధికారులపై ఒత్తిడి చేశారని పేర్కొన్నారు.    అక్రమ రిజిస్ట్రేషన్ల విషయంలో తనపై ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు. వాహనాలు రిజిస్ట్రేషన్ చేసిన అధికారులను ప్రశ్నించాలని అన్నారు. తమను ఏజెంట్లు మోసం చేశారన్న ఆయన.. ఇంజిన్, చాయిస్ నెంబర్లు కొడితే వాహనం వివరాలు మొత్తం వస్తాయని.. తమ సంతకాలు ఉంటే ఉరి వేయమన్నానని గతంలో చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు.   రాజకీయాలు చేయాలనకునేవారు ఏదైనా చేస్తారన్నారు. అధికారంలో ఉన్న పార్టీ ఎవరిపైనైనా అక్రమ కేసులు పెట్టగలదని.. గతంలో ఎన్టీఆర్, ఇప్పుడు జగన్ తనను అరెస్ట్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ హయాంలో 11 రోజులు జైల్లో ఉన్నానని, ఇప్పుడు 54 రోజులు జైల్లో ఉంచారన్నారు. అరెస్టులు చేయాలనుకుంటే పెద్దగా కారణాలు అవసరం లేదన్నారు. అలాగే జైలు నుంచి విడుదలైన తర్వాత జరిగిన ర్యాలీలో తాను పోలీసులతో దురుసుగా ప్రవర్తించాననడం దారుణమన్నారు.   టీడీపీని వీడుతున్నారని జరుగుతున్న ప్రచారంపైనా జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. తాము విభజన తర్వాత కాంగ్రెస్ ద్రోహం చేయడంతో టీడీపీలోకి వచ్చామని,  టీడీపీలోనే కొనసాగుతామని తేల్చి చెప్పారు. ఎవరో ఏదో అనుకుంటే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, పార్టీ మారే ఆలోచన లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.   కాగా, మూడు రాజధానుల నిర్ణయంపై జేసీ ప్రభాకర్‌ రెడ్డి స్పందిస్తూ.. ఏపీ ప్రభుత్వం అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే తాను సీఎం జగన్‌ ను సన్మానించి రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు.

రవివర్మ చిత్రాలకు ప్రేరణ ఆమె

అంజనీబాయి మాల్పెకర్ (22 ఏప్రిల్ 1883 - 7 ఆగస్టు 1974) రవివర్మ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. మరి ఆయన చిత్రాల్లో కనిపించి ముగ్ధమనోహర సౌందర్యవతి నిజంగానే ఈ భూమి మీద ఉందా లేదా ఊహసుందరినా అన్న అనుమానం చాలామందికి వస్తుంది. అయితే అంజనీ బాయి మాల్పెకర్ ను చూసిన వారు ఆమె రవివర్మ చిత్రాలకు నమూన అని అంటారు.   సంగీత కళాకారిణిగానే ఎక్కువ మందికి తెలిసిన ఆమె రవివర్మ  కుంచెతో ప్రాణం పోసుకున్న  లేడీ ఇన్ ది మూన్లైట్", "లేడీ ప్లేయింగ్ స్వర్బాట్", "మోహిని" ,"ది హార్ట్‌బ్రోకెన్" తదితర చిత్రాలకు ప్రేరణ అని అతి తక్కువ మందికి తెలుసు.  పండిత్ అంజనీ బాయి మాల్పెకర్ ప్రముఖ భారతీయ సంప్రదాయ సంగీత గాత్ర కళాకారిణి. హిందూస్థానీ సంగీతంలో భెండిబజార్ గరానా శైలిలో ఆమె ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రముఖ సంగీత విధ్యాంసుడు  ఉస్తాద్ నజీర్ ఖాన్ శిష్యురాలు. గోవాలోని మాల్పేలో 22 ఏప్రిల్ 1883లో కొంకణి భాష మాట్లాడే గోవా సంగీత కారుల  కుటుంబంలో  అంజనీ జన్మించారు. ఆమె తాత గుజాబాయి,  తల్లి నబుబాయిలు  సంగీత  ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందినవారు. తన 8వ ఏట ఉస్తాద్ నజీర్ ఖాన్ వద్ద భెండి బజార్ గరానా శైలిలో సంగీత శిక్షణ తీసుకున్నారు. గురువుతో పాటు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అందుకున్న మొదటి మహిళగా ఆమె పేరు నమోదు చేసుకున్నారు. ఎనిమిదేండ్ల పాటు కఠోన సంగీత సాధన చేసిన ఆమె 1899లో తన 16వ ఏట ముంబైలో మొదటిసారి కచేరి చేశారు. అప్పటికి మహిళలు ప్రదర్శనలు ఇచ్చేవారు కాదు. కానీ అంజనీ మాత్రం  తన కచేరీల ద్వారా ఎంతో గౌరవం సాధించుకుంది.     1920 వరకు ఆమె సంగీత కెరీర్ చాలా బాగా సాగింది. అయితే ఆమె గురువు చనిపోవడంతో  ప్రజా ప్రదర్శనలకు దూరమైంది. అందమైన ఆమె రూపం కూడా ప్రదర్శనలకు దూరం కావడానికి ఒక కారణం. కచేరిలో  కొందరు ప్రేక్షకుల నుంచి వచ్చే వేధింపులు ఆమెను బాధించేవి.  దాంతో ఆమె కచేరిలు ఆపేసి 1923 నుంచి పూర్తిగా సంగీత శిక్షణకే సమయం కేటాయించేవారు. ఆమె వద్ద సంగీతం నేర్చుకున్న కుమార్ గాంధర్వ, కిషోర్ అమోంకర్ ప్రసిద్ధ సంగీత కళాకారుడిగా పేరు తెచ్చుకున్నారు.  అద్భుతమైన గాత్రంతో పాటు అపూర్వమైన అందం ఆమె సొంతం. ప్రముఖ చిత్రకారుడు ఎం.వి. ధురంధర్ ఆమె చిత్రాన్ని గీసినప్పుడు రవివర్మ చూసి అబ్బురపడ్డారట. తమ చిత్రాలు ఆమెను ప్రేరణగా తీసుకున్నారు. "లేడీ ఇన్ ది మూన్లైట్", "లేడీ ప్లేయింగ్ స్వర్బాట్", "మోహిని",  "ది హార్ట్‌బ్రోకెన్" తదితర చిత్రాలకు అంజనీ ప్రేరణగా నిలిచారు.

ఢిల్లీలో కూర్చుని ఏపీ తలరాతను శాసిస్తున్న తెలుగు బీజేపీ నేత..!

ఢిల్లీ నుండి కథ నడిపించే ఆ బీజేపీ నాయకుడు మన తెలుగువాడే. కానీ రాష్ట్రంలో కనిపించేది తక్కువే కానీ టీవీ డిబేట్లలో మాత్రం ప్రముఖంగా కనిపిస్తుంటారు. మరీ ముఖ్యంగా ఏపీ బీజేపీ నాయకులు ఏపీకి అనుకూలంగా ఏదైనా మాట్లాడగానే టీవీ స్క్రీన్ల పైన ఢిల్లీ నుండి ప్రత్యక్షం అవుతారు. అబ్బే ఆ నాయకులు తొందర పడ్డారు, వారి వ్యాఖ్యలతో అసలు పార్టీకి సంబంధం లేదు అని ఖండించి పారేస్తారు. ఢిల్లీ స్థాయిలో తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి రాష్ట్రానికి ఏదైనా మంచి చేసి పేరు తెచ్చుకునే అవకాశం ఉన్నా ఏమాత్రం పట్టించుకోరు సరికదా.. ఎక్కడైనా కూసింత మేలు జరుగుతుందంటే వెంటనే వాలిపోయి దానిని కూడా చెడకొట్టడం అయన స్పెషాలిటీ.   ఒక రకంగా ఢిల్లీలో ఏపీ బీజేపీకి ఆయనే వాయిస్ అన్నంతగా బిల్డప్ ఇస్తారు. కాని ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధిలా వ్యవహారం చేసేస్తూ ఉంటారు. ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా ఉండగా ఆయనను సాగనంపే వరకు నిద్రపోలేదని పార్టీ వర్గాలే చెపుతాయి. అంతే కాకుండా సీఎం జగన్ కు కొంత అనుకూలంగా ఉంటారనే పేరున్న సోము వీర్రాజును ఆయనే తెచ్చి పెట్టారని పార్టీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు పార్టీ అధికార ప్రతినిధులను, మీడియాలో చర్చలకు హాజరయ్యేవారిని అయన తన కనుసన్నలలో శాసిస్తున్నారని కూడా వినిపిస్తోంది. మరి కొంత మంది బడా నాయకుల పై ఆయనకు గుర్రుగా ఉన్నా ప్రస్తుతం ఏమీ చేయలేక ఆగిపోయారు కాని లేదంటే వాళ్లకు కూడా చుక్కలు చూపించేవారని తెలుస్తోంది.   ఏపీలోని గత ప్రభుత్వం పై ప్రతి రోజు ఉన్నవి లేనివి కూడా చెప్పి ఆ విధంగా అలుపెరుగని పోరాటం చేసి టీడీపీ అడ్రస్ గల్లంతు చేసిన ఈయన ప్రస్తుతం సొంత పార్టీ నేతల మీదే విరుచుకు పడుతున్నారు. కొంతమంది రాష్ట్ర బిజెపి నేతలు పార్టీ ప్రతిష్టను బజారున పడేస్తున్నారని నానా యాగీ చేస్తున్న అయన నిజంగా ఏపీ బీజేపీ అభివృద్ధి కోరుకుంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చ పెట్టి వారి పై చర్య తీసుకోవాలి గానీ ఇలా బయటకు వచ్చి సొంత పార్టీ నేతల పై విరుచుకు పడితే పార్టీ ప్రతిష్ట ఏమౌతుందో పాపం అయన ఆలోచిస్తున్నట్టు లేదు. అసలు రాష్ట్ర ప్రజలకు ఏదైనా కూసింత మంచి చేస్తే ఆయనను, అయన పార్టీని కూడా గుర్తించి ప్రజలు గౌరవిస్తారు. ఐతే రాష్ట్ర భవిష్యత్తు దెబ్బ తినే విధంగా వ్యవహరిస్తే ప్రజల మనస్సులో వేరే విధంగా గుర్తుండి పోయే అవకాశం ఉందని తెలుసుకోలేనంత అమాయకుడు మాత్రం కాదు. తాజాగా రాజధాని బిల్లులు న్యాయపరీక్షకు నిలబడవని గొప్ప గొప్ప న్యాయ నిపుణులు వాదిస్తుంటే.. అబ్బే అవేవీ నిజం కాదని ముందుగానే తేల్చేసిన మహానునుభావుడు ఈయన.   తాజాగా టీవీ డిబేట్లలోపాల్గొంటున్న కొంతమంది బీజేపీ ప్రతినిధుల పై అయన తన ప్రతాపం చూపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టీవీ చర్చలలో ఎవరైనా న్యాయం వైపు మాట్లాడితే చాలు వారికీ షోకాజ్ నోటీసులు ఇప్పించడంతో అయన హింస భరించలేక కొంత మంది బీజేపీని కూడా వీడడం జరిగింది. మొత్తంగా ఏపీని అభివృద్ధి చెందనీయకుండా అడ్డగోలుగా వాదించటం అలవాటైన ఆ నేత అటు రాష్ట్రాన్ని ఇటు పార్టీని కూడా నాశనం చేసే పనిలో ఉన్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

చేనేతకు చేయూతనిద్దాం

చేనేత వృత్తి కాదు ఒక నినాదం.. మనం ధరించే వస్త్రం ఒక స్ఫూర్తి.. స్వదేశీ నినాదానికి ప్రతీక.. నలుమూలల ఎగిరే ఆత్మ గౌరవ పతాక..   అగ్గిపెట్టే ఇమిడిపోయే ఆరుగజాల చీరను నేసిన కళానైపుణ్యం నేతన్నది. ప్రపంచానికి  మగ్గంపై నేసిన అద్భుతాలను పరిచయం చేసిన ఘనత భారతీయ నేతన్న సొంతం.   స్వదేశీ ఉద్యమ చిహ్నంగా చరఖా నిలిచిపోయింది. స్వతంత్య్ర ఉద్యమానికి ఖద్దరు ఇంధనమై ముందుకు సాగింది.   మన దేశంలో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నది చేనేత రంగమే. దాదాపు కోటి 30లక్షల మందికి ప్రత్యేకంగా, దాదాపు తొమ్మది కోట్ల మందిరి పరోక్షంగా జీవనోపాధి కల్పిస్తోంది.    చేనేత రంగంలో జాతీయ స్థాయిలో వేగంగా అభివృద్ధి సాధించడానికి 1983లో భారత ప్రభుత్వం జాతీయ చేనేత అభివృద్ధి కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసింది.  చేనేతరంగ ప్రయోజనాల కోసం, అన్ని రకాల నూలును కొనడం, నిల్వచేయడం, మార్కెటింగ్‌ వంటి కార్యకలాపాలను ఈ కార్పొరేషన్‌ చేపడుతుంది. చేనేత రంగానికి అవసరమైన రంగులు, రసాయనాలు, ముడిపదార్థాలను సబ్సిడీ ధరలపై అందించడం, చేనేత రంగంలో సాంకేతికతను పెంచండం ఈ కార్పొరేషన్‌ ప్రధాన లక్ష్యాలు.    ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న చేనేత వస్త్రాల్లో  95శాతం మన దేశంలో ఉత్పత్తి అవుతుంది.  ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీ ’జాతీయ చేనేత దినోత్సవంగా పాటించాలని  ఐదేండ్ల కిందట కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.   7 ఆగస్టు 1905లో కోల్ కత్తా లోని టౌన్ హాల్ లో మొదటిసారి స్వదేశీ ఉద్యమానికి నాంది పలికారు. అదే స్ఫూర్తిలో 110 ఏండ్ల తర్వాత 7 ఆగస్టు 2015న చెన్నైలో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న భారత  ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వదేశీ వస్త్రాలనే వాడాలని పిలుపునిచ్చారు.  దాంతో గత ఐదేండ్లుగా ఆగస్టు 7న ‘జాతీయ చేనేత దినోత్సవం’గా పాటిస్తున్నారు. అయితే ప్రజల్లో చేనేత వస్త్రాలపై అవగాహన పెంచేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించాలన్న నియమం పెట్టారు. చేనేతకు చేయూతనిచ్చి ఆత్మగౌరవ పతాకగా మార్చడానికి అనేక చర్యలు తీసుకున్నారు.  ఆధునికతను జోడించి మగ్గాలపై అనేక ప్రయోగాలు చేస్తూ  తమ ఉనికిని కాపాడుకునే  ప్రయత్నం చేస్తున్నారు. అయితే విదేశీ వస్త్రాలపై మోజులో ప్రజలు చేనేతను నిర్లక్ష్యం చేస్తున్నారు. దళారీల కారణంగా అప్పులపాలైన నేతన్నల ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు.  ప్రజలంతా చేయిచేయి కలిపి చేనేతకు చేయూత నివ్వాలని ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలు కోరుతున్నాయి.

ట్రంప్ గారి వ్యాక్సిన్ వచ్చేది అప్పుడేనట..

ప్రపంచం మొత్తం కరోనా తో సతమతమౌతూ వ్యాక్సిన్ ఎపుడు వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా దీని పై స్పందించారు. కరోనా కు రోజులు దగ్గర పడుతున్నాయని, నవంబర్ 3 నాటికి ఈ వైరస్ ను అంతం చేసే వ్యాక్సిన్ అమెరికా చేతిలో ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. గురువారం నాడు ఓ రేడియో కార్యక్రమం ద్వారా మాట్లాడిన ఆయన, అమెరికా తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ సమాచారాన్ని చైనా దొంగిలించిందా అనే విషయం పై స్పందిస్తూ తాను ఆ విషయాన్ని చెప్పలేనని ఐతే అది చైనాకు సాధ్యమయ్యే పనేనని నమ్ముతున్నానని అయన వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ తయారీలో అమెరికా సంస్థలు ముందంజలో ఉన్నాయని ఆయన అన్నారు.   ఐతే అమెరికాలో ప్రెసిడెంట్ ఎన్నికలు కూడా నవంబర్ 3నే జరగనున్న నేపథ్యంలో నవంబర్ తొలివారంలోనే వ్యాక్సిన్ యూఎస్ వద్ద ఉంటుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికలను ఉద్దేశించి చేసారని అయన ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తోంది. ఇది ఇలా ఉండగా ఇప్పటి వరకు అమెరికాలో కరోనా కేసుల సంఖ్య దాదాపు 50 లక్షలకు చేరుకోగా, 1.61 లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు.

కరోనాతో టీటీడీ అర్చకుడి కన్నుమూత

ఏపీలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రతి రోజు దాదాపు 10 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. అక్కడ ఇక్కడ అని లేకుండా అన్ని ప్రాంతాలను కరోనా చుట్టేస్తోంది. ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రం తిరుమల కొండపై కూడా కరోనా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పలువురు అర్చకులు కరోనా బారిన పడ్డారు. ఐతే వీరిలో కొందరు కోలుకోగా తాజాగా కరోనా రక్కసి కారణంగా అర్చకుడు ఎన్వీ శ్రీనివాసాచార్యులు కన్నుమూశారు. ఆయన వయసు 45 సంవత్సరాలు. నాలుగు రోజుల క్రితం ఆయన కరోనా సోకగా తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. అయన వాస్తవానికి తిరుపతిలోని గోవిందరాజుల స్వామి ఆలయంలో అర్చకులుగా ఉన్నారు. ఐతే డిప్యుటేషన్ పై తిరుమలకు వచ్చారు.

అమరావతిపై క్లారిటీ అడిగిన నేతపై వేటు వేసిన ఏపీ బీజేపీ

సోము వీర్రాజుకు ఏపీ బీజేపీలో ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. తాజాగా ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి అయన దూకుడు మరింత పెంచారు. హైకమాండ్ ఎటువంటి ఆదేశాలు ఇస్తుందో వాటిని పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ పాటించాలని లేకపోతే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఇందులో ఎటువంటి మొహమాటం ఉండదని అయన స్పష్టం చేస్తున్నారు.   తాజాగా ఏపీలో మూడు రాజధానుల నిర్ణయం విషయంలో మొదటి నుండి అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అని దానికి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదని ఐతే పార్టీపరంగా మాత్రం మేము అమరావతికి మద్దతు తెలుపుతామని సోము వీర్రాజు చెప్పడం తెలిసిందే. ఈ విషయం ఇలా ఉండగానే ఏపీ రాజధాని అంశంపై బీజేపీ నేత, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు డాక్టర్ ఓ వి రమణ "మూడుముక్కలాట తో నష్టపోతున్న బీజేపీ" అంటూ ఇటీవల ఓ ప్రముఖ తెలుగు దిన పత్రికలో వ్యాసం రాశారు. దీంతో ఆగ్రహించిన సోము వీర్రాజు ఆ వ్యాసం పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుందని ప్రకటించి ఓవీ రమణ ని పార్టీ నుంచి సస్పెండ్ చేసారు   ఐతే ఆ వ్యాసంలో డాక్టర్ రమణ రాసింది ఏంటంటే కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడు గా ఉన్న సమయం వరకు అమరావతి రాజధాని కి బీజేపీ అనుకూలంగా ఉందని దీక్షలు చేశారు మీడియా సమావేశాలు పెట్టి భారీ డైలాగులు వేశారు. అయితే అధ్యక్షుడు మారిపోగానే.. రాష్ట్ర రాజధాని అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో లేదని, అదే సమయంలో పార్టీ వేరు కేంద్ర ప్రభుత్వం వేరని కొత్తగా వ్యాఖ్యానాలు చేస్తున్నారని ఆ వ్యాసంలో పేర్కొన్నారు. ఇదే సమయంలో అమరావతి ప్రజల తరుఫున పోరాడతామని కొత్త అధ్యక్షులు చెపుతున్నారని పేర్కొన్నారు. దీంతో రాజధాని పై స్పష్టత లేని బీజేపీ పైన ప్రజలలో ఉన్న నమ్మకం పూర్తిగా పోతోందని దానితో పాటు బీజేపీ కార్యకర్తలు కూడా అయోమయం లో పడ్డారని అందులో పేర్కొన్నారు. తాజాగా ఆ ప్రాంత రైతులు పోరాటం చేస్తున్నదే రాజధాని కోసం అయినప్పుడు, మరి రాష్ట్ర బీజేపీ మద్దతు దేనికి ఇస్తున్నట్లు? ఈ గందరగోళం వల్ల విలువలతో కూడిన బీజేపీ ని ప్రజలు శంకించే పరిస్థితి ఏర్పడిందని ఓ వి రమణ ఆ వ్యాసంలో ఏపీ బీజేపీని సూటిగా ప్రశ్నించారు. దీంతో సోము వీర్రాజు వెంటనే రమణ ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు.

బాలికపై వైసీపీ యువకులు అత్యాచారయత్నం.. వీళ్లకు ఇంత ధైర్యం ఇచ్చింది ఎవరు?

రాజమండ్రి రూరల్ లో 10ఏళ్ల ముస్లిం మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారయత్నం చేశారు. అత్యాచారయత్నం చేసింది వైసీపీకి చెందినవారిగా గుర్తించారు. అయితే వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించడంతో తల్లిదండ్రులు కామ్ గా ఉన్నారు. ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాలని వేధింపులకు గురిచేస్తుండడం, చంపేస్తామని బెదిరిస్తుండడంతో తమను సీఎం జగనే కాపాలంటూ వేడుకుంటున్నారు.   కాగా, ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. "రాజమండ్రి రూరల్ లో అభం శుభం తెలీని 10 ఏళ్ల ముస్లిం మైనర్ బాలికపై ముగ్గురు వైసీపీ యువకుల అత్యాచారాయత్నాన్ని ఖండిస్తున్నాం. పైగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరింపులా? ఈ అరాచక మూకలకు ఇంత ధైర్యం ఇచ్చింది ఎవరు?" అని ప్రశ్నిస్తూ.. బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియోని చంద్రబాబు పోస్ట్ చేశారు. "16ఏళ్ల దళిత మైనర్ బాలికపై 12మంది గ్యాంగ్ రేప్ చేసి పోలీస్ స్టేషన్ ముందే వదిలేసిన దుర్ఘటన కళ్లముందే ఉంది. కర్నూలులో గిరిజన మహిళను భర్త కళ్లముందే అతిదారుణంగా గ్యాంగ్ రేప్ చేశారు. దిశచట్టం అసలు అమల్లో ఉందా? ఇప్పటికైనా పోలీసులు నిద్రమత్తు వీడి నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలి." అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

అమరావతికి అయోధ్యకు పోలికా.. ఏపీ మంత్రి సెన్సేషనల్ కామెంట్స్

ఏపీలో అమరావతి అంశం పై రచ్చ మాములుగా లేదు. ఈ విషయంలో టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఏపీ మంత్రి పేర్ని నాని తాజాగా కౌంటర్ ఇచ్చారు. అయోధ్యతో అమరావతిని పోల్చడాన్ని ఈ సందర్భంగా ఆయన తప్పుబట్టారు. అయోధ్యతో అమరావతికి ఎక్కడా అసలు పోలికే లేదని ఆయన వ్యాఖ్యానించారు.   అయోధ్య పుణ్యభూమి అని ఐతే అమరావతి మాత్రం పాపాలపుట్ట అని మంత్రి అన్నారు. అంతే కాదు అమరావతి పవిత్రస్థలం కాదు.. పాపాల పుట్ట అనే విషయం ప్రధాని నరేంద్రమోదీకి కూడా అర్థమైందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పోలవరం చంద్రబాబుకు ఏటీఎంలా మారిందని గతంలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారని అయన గుర్తు చేసారు.   అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయడానికి చంద్రబాబు ఎలాంటి విధానాన్ని అవలంభించారో అందరికీ తెలుసని పేర్ని నాని ఎద్దేవా చేసారు. కేవలం డబ్బులు లెక్కపెట్టడం మాత్రమే తెలిసిన నారాయణ చెబితేనే రాజధానిని అమరావతిలో పెట్టారని ఆయన ఎద్దేవా చేశారు.   ఎప్పుడూ టీవీల్లో కనిపించకపోతే చంద్రబాబుకు తోచదని పేర్ని నాని విమర్శించారు. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చంద్రబాబు చేసిన డిమాండ్‌పై మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో స్పందించారు. కనీసం ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్‌కు కూడా దిగని చంద్రబాబు తమకు సవాళ్లు విసరడమేమిటని అయన వ్యాఖ్యానించారు.