నేను మోడీకి లెటర్ రాస్తే మధ్యలో ఈయన హడావిడి ఏంటంట.. ఏపీ డీజీపీ పై బాబు ఫైర్
posted on Aug 18, 2020 @ 6:11PM
ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పై దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రధాని మోడీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఫోన్ ట్యాపింగ్ పై తాను చేసిన ఆరోపణలపై వెనక్కి తగ్గరాదని, దీనిపై మరింత పోరాటం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిసైడ్ అయ్యారు. దీనిలో భాగంగా ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది వైసీపీకి ఎప్పట్నించో ఉన్న అలవాటని అయన విమర్శించారు. గతంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఫోన్ ను కూడా వైసీపీ ట్యాప్ చేసిందని అయన ఆరోపించారు.
అంతేకాకుండా ఏపీలో ఫోన్ల ట్యాపింగ్ పై చర్యలు తీసుకోవాలంటూ తాను ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తే, దాని పై ఏపీ డీజీపీ స్పందించడం విడ్డూరంగా ఉందని బాబు అన్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు కావాలంటూ డీజీపీ తనకు లేఖ రాయడం పట్ల చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై సాక్ష్యాలు కోరుతున్న డీజీపీ గతంలో తాను రాసిన లేఖలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. తాజాగా ఇప్పుడు డాక్టర్ల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని, రోగులతో ఫోన్ లో మాట్లాడాలన్నా డాక్టర్లు హడలిపోయే పరిస్థితి దాపురించిందని చంద్రబాబు వివరించారు.