మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్
posted on Aug 19, 2020 @ 9:41AM
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన ప్రస్తుతం కడప జైల్లో ఉన్నారు. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4గా మార్చి నడుపుతున్నారనే కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్ రెడ్డి బెయిల్ మీద విడుదలై ఇంటికి వస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయన కోవిడ్ 19 నిబంధనలను ఉల్లంఘించారని, జనంతో భారీగా ర్యాలీ నిర్వహించారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఒక దళిత పోలీసు అధికారిని దూషించిన కేసులో ఆయనను కడప జైలుకు తరలించారు. అయితే తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా సోకిందని తెలియడంతో తాడిపత్రి, అనంతపురం ప్రాంతంలో పోలీసు బందోబస్తును పెంచారు.
ఇది ఇలా ఉండగా జేసీ ప్రభాకర్ రెడ్డిని ఉంచిన కడప జైలులోని ఖైదీలు, సిబ్బంది సహా మొత్తం 700 మంది నమూనాలను పరీక్షించగా, అందులో 303 మంది ఖైదీలు, 14 మంది సిబ్బంది, అధికారులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో కరోనా పాజిటివ్ వచ్చిన వారందరినీ వెంటనే ఐసోలేషన్ కేంద్రానికి తరలించామని, వారికి చికిత్సను అందిస్తున్నామని జైలు సూపరింటెండెంట్ నాయక్ వెల్లడించారు.