కేసీఆర్ సర్కార్ పై గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
posted on Aug 18, 2020 @ 2:33PM
తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. కరోనా నియంత్రణలో కేసీఆర్ సర్కార్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కార్ క్రియాశీలకంగా వ్యవహరించలేదని, కరోనా ఉధృతిని ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందని అన్నారు. కరోనా తీవ్రత, వ్యాప్తిపై ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ.. ఐదారు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలేదని గవర్నర్ పేర్కొన్నారు.
కరోనా బాధితులు ప్రభుత్వాస్పత్రుల్లో సదుపాయాలు లేక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారని అన్నారు. అన్ని వసతులు సమకూర్చామని ప్రభుత్వం చెబుతున్నా.. ప్రభుత్వాస్పత్రుల పట్ల రోగులు ఆసక్తి చూపట్లేదని తెలిపారు. సీఎం కేసీఆర్ తో సమావేశమైనప్పుడు ఈ విషయాలను గట్టిగానే చెప్పానని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు.
కేసీఆర్ సర్కార్ పై గవర్నర్ తమిళిసై తాజా వ్యాఖ్యలు చూస్తుంటే.. తెలంగాణలో బలపడటానికి బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తోంది. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా కేసీఆర్ ఆరేళ్ళ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు బండి సంజయ్ కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి దూకుడు పెంచారు. అవకాశం దొరికినప్పుడల్లా కేసీఆర్ పాలనా వైఫల్యాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తమిళిసై కూడా గవర్నర్ గా తన మార్క్ చూపిస్తూనే.. ఇప్పుడు ఏకంగా జాతీయ మీడియా సాక్షిగా కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని వ్యాఖ్యానించారు. చూస్తుంటే బీజేపీ అన్ని వైపుల నుండి కేసీఆర్ సర్కార్ ని గట్టిగానే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తోన్న బీజేపీ ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి.