ఏడాది లోపే నిర్మాణం పూర్తిచేసేలా.. రిటైర్డ్ ఇంజనీర్ నియామకం
posted on Aug 18, 2020 @ 4:04PM
తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయాన్ని కట్టితీరాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే పలుమార్లు జరిగిన చర్చల్లో డిజైన్ ఖరారు చేశారు. ఏడాదిలోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. అందుకు అనుగుణంగానే త్వరితగతిన ఈ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వీలుగా రోడ్డు భవనాల శాఖలో కొత్త పోస్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ సూపర్ న్యూమరరీను సృష్టించారు. ఈ పోస్టులో రిటైర్డ్ ఇంజనీర్ ఎం. సత్యనారాయణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయం నిర్మాణం పూర్తి అయ్యే వరకు లేదా ఏడాది వరకు ఈ పోస్టులో ఆయన కొనసాగుతారు.
కొత్త సచివాలయ భవనిర్మాణ డిజైన్ ను ఆగస్టు 5న జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదించారు. గతంలో ఆరు అంతస్తుల్లో భవననిర్మాణం ఉండాలని అనుకున్నా స్పల్పమార్పులు చేస్తూ ఏడు అంతస్తుల్లో సచివాలయాన్ని నిర్మించేలా డిజైన్లో మార్పులు చేశారు. ఈ మేరకు అధికారులతో ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చర్చలు నిర్వహిస్తున్నారు.
జూలై 7 కూల్చివేత పనులను ప్రారంభించింది. కూల్చివేత సమయంలోనూ హైకోర్టు పలుమార్లు స్టే విధించినా ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కూల్చివేత పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయి. భవనాల శిధిలాల తొలగింపు ప్రక్రియ వేగవంతం చేశారు. త్వరలోనే టెండర్లను పిలిచి నిర్మాణం ప్రారంభిస్తారు.
నిర్మాణ వ్యయం ఐదు వందల కోట్లు
కొత్త సచివాలయ భవన నిర్మాణ అంచనా వ్యయం ఐదు వందల కోట్లు. అత్యంత ఆధునిక హంగులతో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవన సముదాయం నిర్మిస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్స్ కూడా అన్ని సౌకర్యాలతో ఉండనున్నాయి. ఆయా శాఖల మంత్రుల కార్యాలయాలతో పాటు కార్యదర్శుల కార్యాలయాలు, సెక్షన్ ఆఫీస్ లు, మీటింగ్ హాల్స్, వెయిటింగ్ హాల్స్, డైనింగ్, పార్కింగ్ సదుపాయాలతో కొత్త సచివాలయం నిర్మించనున్నారు.