జగన్ గారి పబ్లిసిటీ పిచ్చి తప్ప మహిళలకు న్యాయం ఎక్కడ?

వైఎస్ జగన్‌ పాలనలో గిరిజనులకు రక్షణ లేకుండాపోతోందంటూ టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. 15 నెలల పాలనలో 400 అత్యాచార ఘటనలు జరిగాయి. 21 రోజుల్లో న్యాయం ఎక్కడ? అని ప్రశ్నించారు. దిశ చట్టం, ఈ-రక్షా బంధన్ అంటూ వైఎస్ జగన్ గారి పబ్లిసిటీ పిచ్చి తప్ప క్షేత్రస్థాయిలో మహిళలకు న్యాయం జరగడం లేదని విమర్శించారు. కర్నూలు జిల్లాలో భర్త ముందే ఒక ఎస్టీ మహిళపై ముగ్గురు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. కేసు నమోదు చెయ్యడానికి గిరిజన సంఘాలు ఉద్యమం చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, బాధిత మహిళలకు జగన్ రెడ్డి గారి పాలనలో ఎంత అన్యాయం జరుగుతోందో అర్థం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారానికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి అని లోకేష్ డిమాండ్ చేశారు. కాగా, కర్నూలు జిల్లా వెలుగోడు మండలం జమ్మినగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు భర్తతో కలిసి గాలేరు వంతెన వద్ద నిద్రిస్తుండగా ముగ్గురు యువకులు ఆమె భర్తపై దాడిచేసి, ఆమెను ముళ్ల పొదల్లోకి ఈడ్చుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని గిరిజన సంఘం నాయకులు పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. ఈ కేసుపై పోలీసులు సరిగ్గా స్పందించలేదని బాధితురాలి భర్త, బంధువులు ఆరోపిస్తున్నారు.

అప్పుడు ప్రత్యేక హోదా.. ఇప్పుడు అమరావతి

ఆంధ్రప్రదేశ్ కి రాష్ట్ర విభజనతో ఏర్పడిన గాయానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదా అనే మందు వేస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ నిర్ణయాన్ని అప్పటి విపక్షాలు స్వాగతించాయి. బీజేపీ అయితే ఐదు కాదు పది సంవత్సరాలు ప్రత్యేకహోదా ఇవ్వాలని చెప్పింది. తీరా ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ప్రత్యేకహోదాపై మాట మార్చింది. ప్రత్యేకహోదా కంటే విలువైన ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పింది. అప్పుడు బీజేపీతో దోస్తీ చేస్తోన్న అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు కూడా ప్యాకేజీకి సరే అన్నారు. ప్యాకేజీతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. కానీ కొంతకాలానికి బీజేపీ ప్రభుత్వం ప్యాకేజీ విషయంలో మోసం చేసిందని ఆరోపిస్తూ.. హోదానే కావాలని పట్టుబట్టారు. బీజేపీతో దోస్తీ కూడా కట్ చేసుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.   ఇక ప్రస్తుత ఏపీ అధికార పార్టీ వైసీపీ అయితే.. ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేకహోదా తీసుకొస్తామని హామీ ఇచ్చింది. టీడీపీ కారణంగానే ఏపీకి హోదా రాలేదని, మెజారిటీ ఎంపీ స్థానాల్లో తమ పార్టీని గెలిపిస్తే.. కేంద్రం మెడలు వంచైనా హోదా సాధిస్తామని చెప్పింది. 2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లతో ఘన విజయం సాధించింది. కానీ ఎన్నికలకు ముందు కేంద్రం మెడలు వంచైనా హోదా సాధిస్తామని చెప్పిన వైసీపీ.. అధికారంలోకి వచ్చాక చేతులెత్తేసింది. హోదా ఇచ్చేవరకు కేంద్రాన్ని అడగటం తప్ప ఏం చేయలేమని, కేంద్రంలో బీజేపీకి పూర్తీ మెజారిటీ ఉంది కాబట్టి హోదాపై ఒత్తిడి తీసుకురాలేమని చెప్పుకొచ్చింది. ఇక జనసేన సంగతి సరేసరి. పాచిపోయిన లడ్డులు ఇచ్చారని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు అదే బీజేపీతో దోస్తీ చేస్తూ హోదా సంగతే మరిచారు. మొత్తానికి ఇలా అన్ని పార్టీలు కలిసి ప్రత్యేకహోదాని అటక ఎక్కించాయి. ఇప్పుడు అమరావతికి కూడా అదే పరిస్థితి తీసుకొస్తున్నాయి.   టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే అప్పటి ప్రతిపక్ష వైసీపీ స్వాగతించింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అయితే అసెంబ్లీ సాక్షిగా రాజధాని నిర్ణయాన్ని స్వాగతించి, రాజధాని కోసం కనీసం 30 వేల ఎకరాలైనా కావాలన్నారు. ఎన్నికల సమయంలో కూడా రాజధానిని అమరావతి నుంచి తరలించే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి.. మూడు రాజధానులను తెరదీశారు. అమరావతి రైతులు ఉద్యమిస్తున్నా లెక్క చేయకుండా మూడు రాజధానులకు శ్రీకారం చుట్టారు. దీంతో టీడీపీ అమరావతి రైతుల తరఫున గళం వినిపిస్తోంది. కానీ రాజధాని తరలింపుని అడ్డుకుంటామన్న భరోసాని మాత్రం కలిగించలేకపోతోంది. టీడీపీ బలంగా నిలబడి దీనినొక రాష్ట్ర స్థాయి ఉద్యమంలా చేస్తే తప్ప.. టీడీపీపై నమ్మకం కలిగే పరిస్థితి లేదు. ఇక బీజేపీ ని ప్రజలు నమ్మేపరిస్థితి లేదు. కేంద్రం కలగచేసుకోదు, కానీ రాష్ట్ర బీజేపీ మాత్రం అమరావతినే రాజధానిగా కోరుకుంటోందని చెప్పడం, గవర్నర్ మూడు రాజధానుల బిల్లు ఆమోదించడం.. ఇవన్నీ చూసి ప్రజలకు బీజేపీపై నమ్మకం పోతోంది. ఇక బీజేపీతో దోస్తీ చేస్తోన్న జనసేన పరిస్థితి కూడా అలాగే ఉంది. అమరావతి కోసం ఉద్యమిస్తామని చెప్తున్నా నమ్మకం కలగట్లేదు. చేతల్లో చూపిస్తేనే నమ్మే పరిస్థితి ఉంది. మరి అన్ని పార్టీలు కలిసి అమరావతిని కూడా ప్రత్యేకహోదా లాగా అటక ఎక్కిస్తాయో? లేక కనీసం ఒక్క పార్టీ అయినా బలంగా నిలబడి అమరావతి కోసం ఉద్యమిస్తాయో చూడాలి.

ఏపీలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా..

ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా ఇటు సామాన్యులను అటు ప్రజా ప్రతినిధులను కూడా కలవర పెడుతోంది. ఈ రోజు ఉదయం ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసిపి ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబుకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. కొద్దీ కాలంగా అనారోగ్యంగా ఉండటంతో ఒంగోలులోని రమేష్ సంఘమిత్ర ఆస్పత్రిలో రాంబాబు, ఆయన భార్య పరీక్షలు చేయించుకున్నారు. ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలింది. ఐతే అయన కుటుంబ సభ్యులకు మాత్రం నెగిటివ్ వచ్చింది.  ఐతే తాజాగా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన బంజారాహిల్స్ స్టార్ హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. దీంతో అయన కుటుంబ సభ్యులతోపాటు ప్రైమరీ కాంటాక్టులను కూడా పిలిపించి అందరికీ కరోనా టెస్టులు చేస్తున్నారు. ఇంతకు ముందు సామాన్యులకు ఎక్కువగా కరోనా సోకేది. ఐతే ఎపుడు సెక్యూరిటీ మధ్య ఉండే ప్రజా ప్రతినిధులకు కూడా కరోనా సోకుతోంది. దీంతో ఈ ఎమ్మెల్యేలను ఈ మధ్య కలిసిన వారిని కూడా టెస్ట్ చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు సూచిస్తున్నారు.

చంద్రుడిపై ఎకరం ధర ఎంతో తెలుసా..

చంద్రుడిపై ఇల్లు కట్టుకోని భూమి చూడాలనుందా మైనింగ్ చేసి హీలియం వెలికితీసి డబ్బులు సంపాదించే ఆలోచన ఉందా పరిశోధనా సంస్థలకు మీ స్థలం లీజుకు ఇవ్వాలని ఉందా ఈ ఆలోచనలు ఉంటే మీరు తక్షణమే చంద్రడిపై జాగ కొనాల్సిందే.. మరి అక్కడ ఎకర స్థలం ఎంతో తెలుసా.. అంతేకాదు రెండుకు మించి ఎకరాలు కొనేవారికి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ చంద్రుడిపై స్థలం సొంతం చేసుకున్న మొదటి బాలీవుడ్ హీరో. ఆస్ట్రేలియాలో ఉండే ఆయన అభిమాని ఒకరు షారూక్ బర్త్ డే గిఫ్ట్ గా చంద్రుడిపై ప్లాట్ కొని బహుమతిగా ఇచ్చారట. ఇక ఇటీవల మరణించిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా చంద్రుడిపై ప్లాట్ కొన్నారు. ముంబాయికి చెందిన మరో వ్యాపారి కూడా చంద్రుడిపై స్ఠలం కొన్నాడు. సుశాంత్ అభిమాని ఒకరు గత నెల చంద్రుడిపై జాగను సొంతం చేసుకున్నాడు.   ఎవరు అమ్ముతున్నారు.. భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహం చంద్రుడు. సూర్యమండలంలోని  ప్రధాన గ్రహల చుట్టూ తిరిగే ఉపగ్రహాలు 173 ఉన్నాయని శాస్త్రవేతలు చెబుతారు. వీటిలో అత్యధికంగా బృహస్పతి చుట్టూ 67,  శని  గ్రహం చుట్టూ 62 ఉపగ్రహాలు ఉన్నాయి. భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహం చంద్రుడిని చేరుకోవడానికి దశాబ్దాలుగా నాసా అంతరీక్ష నౌకలు పంపిస్తోంది. అనేక దేశాలు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటివరకు 12మంది చంద్రుడిపై కాలు మోపి ఆ తర్వాతి తరం వారు కాలనీలు కట్టుకోవడానికి వీలైన వాతావరణం కోసం అన్వేషణ కొనసాగించారు. సమీప భవిష్యత్ లో చంద్రుడిపై ఆవాసం ఏర్పాటు చేసుకోవడం సాధ్యం చేయాలన్న సంకల్పంతో చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 ప్రయోగాలు జరిగాయి. చాలా దేశాలు చంద్రుడిపై పాగా వేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి.  అంతరీక్షంలోని ఇతర గ్రహాలను నివాసయోగ్యంగా చేసుకోవాలన్న ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.  ఈ నేపథ్యంలో అంతరిక్ష వనరుల అన్వేషణ, వినియోగ చట్టం అమలులోకి వచ్చింది. కాలిఫోర్నియాకు చెందిన ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ ద్వారా అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ సంస్థ ఆఫీస్ న్యూయార్క్ లో ఉంది.   కాలనీలుగా.. చంద్రుడిపై మచ్చగా కనిపించే ప్రాంతంలో లూనా సోసైటీ ఇంటర్నేషనల్ కాలనీలుగా డివైడ్ చేసింది. వాటికి ఆకర్షణీయమైన పేర్లు కూడా పెట్టి ప్రత్యేక ఆఫర్లు ఇస్తూ ఎకరాల చొప్పున స్థలాన్ని విక్రయిస్తున్నారు. డ్రీమ్ సరస్సు,, ప్రశాంత సముద్రం, బే ఆఫ్ రెయిన్ బోస్ ఇలాంటి పేర్లతో కాలనీలుగా చంద్రుడిపై ఆవాసాలు ఏర్పర్చుకోవచ్చని సూచిస్తున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల వారు ఈ స్థలాలను ఇప్పటికే కొనుగోలు చేశారు.   ధర తక్కువే.. కొనుగోలు విధానమే కష్టం.. చంద్రుడిపై రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సులభతరం చేయడానికి 1999లో అంతర్జాతీయ లూనార్ రిజిస్ట్రీ లాండ్స్(ఐఎల్ఎల్ఆర్)ను రూపొందించారు. ఇది స్వతంత్య్ర సంస్థ. ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకు అంటార్కిటికా ఖండం మినహా మిగతా ఆరుఖండాల్లోని వ్యాపారవేత్తలు, సెలబ్రెటీలు, సంపన్నులు పన్నెండు న్నర లక్షల ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. లూనార్ సోసైటీలో సభ్యత్వం కోసం చెల్లించాల్సిన ఫీజుమొత్తాన్ని డాలర్ల రూపంలోనే చెల్లించాలి. స్థలం సొంతదారులకు పట్టాలను కూడా ఈ సంస్థ అందిస్తోంది. హ్యాపీనెస్ సరస్సు  సమీపంలో ఎకరం ధర 28.95 డాలర్లు. మూడు ఎకరాలు కొంటే 25శాతం, ఐదు ఎకరాలు కొంటే 33శాతం, పది ఎకరాలు కొంటే 173డాలర్లు మాత్రమే. అంటే పది ఎకరాలు కొనేవారికి 40శాతం రాయితీ ఇస్తున్నారు. ఈ ప్రాంతంలో టూరీజం, పరిశోధనలకు మంచి డిమాండ్ ఉంటుందని సంస్థ నిర్వహకులు ప్రకటిస్తున్నారు. ఏయో ప్రాంతాలు వేటికి బాగా పనికి వస్తాయో కూడా వివరిస్తున్నారు. అంతేకాదు ఆయా  ప్రాంతాల్లో ధరలు కూడా వేరువేరుగా ఉన్నాయి. చాలా మంది తమకు ఇష్టమైన వారికి బహుమతులుగా కొనిస్తున్నారట. మరికొన్ని దశాబ్దాల్లో అచ్చం మన భూమి మీద మాదిరిగానే చంద్రుడి మీద ఇల్లు కట్టుకుని "భూమి అమ్మ రావే.. బందరు లడ్డు తేవే" అని పాడుకునే రోజు వస్తుందేమో..!  

అప్పు తీర్చలేదని మహిళా రైతును ట్రాక్టర్ తో తొక్కించి చంపిన వైసీపీ నేత..

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అప్పు వసూలు కోసం వైసీపీ నేత ఒకరు అరాచకానికి పాల్పడ్డాడు. వడ్డీకి తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదన్న కోపంతో ఓ గిరిజన మహిళా రైతును ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశాడు ఆ దుర్మార్గుడు. గుంటూరు జిల్లా నకరికల్లు శివారులో ఉన్న శివాపురం తండాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం మేరకు...శివాపురం తండాకు చెందిన గిరిజన దంపతులు రమావత్ మంత్రూ నాయక్, మంత్రుభాయి (55) అటవీ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ రెండున్నర ఎకరాల అటవీ భూములపై వారు హక్కులు సాధించారు. ఐతే సాగు ఖర్చులు, కుటుంబ అవసరాల కోసం అదే మండలంలోని బోనముక్కల శ్రీనివాస రెడ్డి వద్ద రెండేళ్ల కిందట పొలం తాకట్టు పెట్టి రూ.3.80 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఐతే కొంత కాలంగా వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో వారు శ్రీనివాస్ రెడ్డి దగ్గరి తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేకపోయారు.   దీంతో గత కొన్ని నెలలుగా అప్పుగా ఇచ్చిన సొమ్మును వడ్డీతో పాటు చెల్లించాలని శ్రీనివాసరెడ్డి పట్టుబడుతున్నాడు. అంతే కాకుండా అప్పు చెల్లించనిదే తాకట్టు పెట్టిన భూమిలో అడుగుపెట్టొద్దని హుకుం జారీ చేశాడు. అప్పును కనుక చెల్లించకుంటే తాకట్టుపెట్టిన భూమిని కూడా స్వాధీనం చేసుకుంటానని హెచ్చరిస్తూ వచ్చాడు. ఐతే ఇప్పటికిప్పుడు మా వద్ద అంత డబ్బు లేదు కాబట్టి పొలం అమ్మి అప్పు తీరుస్తాం.. లేదంటే భూమి మీరు తీసుకుని మిగిలిన మొత్తం మాకివ్వండి అని ఆ గిరిజన దంపతులు వేడుకున్నా శ్రీనివాస్ రెడ్డి కనికరించలేదు. ఈ విషయంలో గిరిజన దంపతులకు, అప్పు ఇచ్చిన శ్రీనివాస రెడ్డికి మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో గిరిజన దంపతులు పొలం సాగుచేసేందుకు పొలాల్లోకి రాగా సమాచారం అందుకున్న శ్రీనివాస రెడ్డి ట్రాక్టర్‌తో వారి గ్రామానికి చేరుకుని అప్పు చెల్లించకుండా పొలంలో అడుగుపెడితే ఊరుకోనని హెచ్చరించాడు. ఈ విషయంలో గిరిజన దంపతులకు, శ్రీనివాస్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన శ్రీనివాస రెడ్డి ట్రాక్టర్‌తో మంత్రుభాయిని తొక్కించి వెళ్లిపోయాడు. దీంతో రక్తపు మడుగులో ఆ ముయ్యల రైతు అక్కడికక్కడే కన్నుమూసింది. ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదుచేసి ట్రాక్టర్‌తో పాటు పరారీలో ఉన్న శ్రీనివాస్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. మరో పక్క శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని గిరిజన సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.

నాసా మెప్పు పొందిన  ఇద్దరు అమ్మాయిలు

అంగారక గ్రహానికి సమీపంలో ఆస్టరాయిడ్ గుర్తింపు ఆకాశంలో చుక్కలు చూస్తూ వాటి లెక్క తెలియక చాలామంది తికమక పడుతుంటారు. కొందరు మాత్రమే ఆ చుక్కల లెక్కలు తేల్చాలని సంకల్పం చెప్పుకుంటారు. అలాంటి కోవలోకి చెందిన వారే సూరత్ లోని ఇద్దరు బాలికలు.    ఈ ఇద్దరు అమ్మాయిలు అంగారక గ్రహానికి సమీపంగా ఉన్న గ్రహశకలాన్ని గుర్తించారు. వారు గుర్తించిన గ్రహశకలానికి నాసా హెచ్ఎల్ వీ 2514 (HLV2514)గా నామకరణం కూడా చేసింది. సూరత్ అమ్మాయిలేంటీ, నాసా నామకరణం ఎంటీ అంటూ తికమక పడుతున్నారా.. అసలు విషయం తెలిస్తే మీరు ఔరా ఎంత గొప్ప పనిచేశారు మన అమ్మాయిలు అని మెచ్చుకుంటారు.   గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఇద్దరు బాలికలు  వైదేహి వెకారియా సంజయ్‌భాయ్, రాధిక లఖాని ప్రఫుల్‌భాయ్. స్థానికంగా పిపి సవాని చైతన్య విద్యా సంస్థలో పదోతరగతి చదువుతున్నారు. ఇటీవల  రెండు నెలల పాటు ‘ఆల్‌ ఇండియా ఆస్టరాయిడ్‌ సెర్చ్‌ క్యాంపెయిన్‌ 2020’  క్యాంపెయిన్‌లో  వీరిద్దరూ పాల్గొన్నారు. టెక్సాస్‌లోని హార్డిన్ సిమన్స్ యూనివర్సిటీ సహకారంతో స్పేస్ ఇండియా, ఇంటర్నేషనల్ అస్ట్రానామికల్ సెర్చ్ కొలాబరేషన్(IASC)లు సంయుక్తంగా ఈ  క్యాంపెయిన్‌ను నిర్వహించాయి.    భారతీయ విద్యలో ఖగోళ శాస్త్రం, అంతరిక్ష శాస్త్రాలు ప్రాచుర్యం పొందాలని లక్ష్యంగా పెట్టుకున్న స్పేస్ ఇండియా అనేక పాఠశాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిశోధనలకు ఎంపిక చేస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైదేహి, రాధిక హవాయిలోని పాన్‌‌స్టార్స్ (పనోరమిక్ సర్వే టెలిస్కోప్ & రాపిడ్ రెస్పాన్స్ సిస్టమ్) అధునాతన టెలిస్కోప్ సాయంతో అంగారక గ్రహం సమీపంలో గ్రహశకలాన్ని గుర్తించారు. తాము కనిపెట్టిన ఈ కొత్త గ్రహశకలం చిత్రాలను తీయడానికి టెలిస్కోప్‌ను ఉపయోగించారు. ఈ టెలిస్కోప్ అధిక-స్థాయి సిసిడి కెమెరాలతో గ్రహశకలం చిత్రాలను తీస్తుంది. అంతరిక్షంలో ఉండే మందమైన వస్తువులను ఈ టెలిస్కోప్ గుర్తిస్తుంది.   'దాదాపు 20ఆబ్జక్ట్స్ ను జాగ్రత్తగా పరిశీలించాం. అందులో ఒకటి గ్రహశకలంగా గుర్తించబడింది'. అంటున్నారు ఈ ఇద్దరు అమ్మాయిలు. వారిద్దరూ గ్రహశకలాన్ని కనుగొన్నారనే  విషయాన్ని  నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) నే ప్రకటించింది. అంతేకాదు  ఈ గ్రహశకలానికిHLV2514 గా నామకరణం చేసింది. ఈ సరికొత్త గ్రహశకలం సమీప భవిష్యత్తులో భూమిని దాటే అవకాశం ఉందని,  అయితే దీనికి కొన్ని సంవత్సరాల సమయం పట్టవచ్చు  అని గ్లోబల్ స్పేస్ ఆర్గనైజేషన్ స్పష్టం చేసింది.

56 శాతం మంది అమరావతికే ఓటేశారు

ఎన్నికలకు ముందు ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని చెప్పిన వైసీపీ.. అధికారంలోకి వచ్చాక మాత్రం మూడు రాజధానులకు తెరదీసింది. అమరావతి రైతులు ఉద్యమించినా, విపక్షాలు వ్యతిరేకరించినా మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కార్ వెనకడుగు వేయట్లేదు. తాజాగా మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో.. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు మూడు రాజధానుల చుట్టూనే తిరుగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నామని, మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు కూడా స్వాగతిస్తున్నారని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. అయితే విపక్షాలు మాత్రం.. అభివృద్ధి వికేంద్రీకరణ వేరు, రాజధాని వికేంద్రీకరణ వేరు.. ముందు రాష్ట్రానికి ఓ మంచి రాజధాని ఉంటేనే.. మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేసుకోగలమని చెబుతున్నాయి. అంతేకాదు, వైసీపీ టీడీపీ పార్టీలు.. ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ప్రజాతీర్పుకి వెళ్లాలంటూ ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. రాజధాని విషయంలో అధికార, విపక్షాల వాదనలు ఇలా ఉన్నాయి. మరి ప్రజల అభిప్రాయం ఎలా ఉంది?. అది తెలుసుకోవడం కోసమే తెలుగువన్ యూట్యూబ్ ఛానెల్ ఆన్ లైన్ పోల్ నిర్వహించింది. "ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల నిర్ణయం సరైనదని మీరు భావిస్తున్నారా?" అని అడగగా 96 వేల మందికి పైగా స్పందించారు. అందులో 56 శాతం మంది మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించగా.. 38 శాతం మంది మాత్రం మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్ధించారు. ఇక మిగిలిన ఆరు శాతం మంది చెప్పలేం అన్నారు. దాదాపు లక్ష మంది పాల్గొన్న ఈ పోల్ లో సగం మందికి పైగా అంటే 56 శాతం మంది మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అంటే ఎక్కువ శాతం మంది ప్రజలు అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారని అర్థమవుతోంది.

మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్యను కబళించిన కరోనా..

తెలంగాణలో ఎందరో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వారి కుటుంబ సభ్యులు కరోనా బారినపడి చికిత్స పొంది క్షేమంగా బయటపడుతున్న సంగతి తెలిసిందే. ఐతే తాజాగా భద్రాచలం నియోజకవర్గంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి... ప్రజలకు సేవలు అందించిన కమ్యూనిస్ట్ నేత మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (59) కరోనా వైరస్ సోకడంతో కన్నుమూశారు. గత 10 రోజులుగా జ్వరంతో బాధపడుతూ స్వగ్రామమైన సున్నంవారిగూడెంలో చికిత్స తీసుకున్నా కోలుకోక పోవడంతో కుటుంబ సభ్యులు ఆయనకు కరోనా టెస్ట్ చేయించగా పాజిటివ్ అని తేలడంతో వెంటనే విజయవాడ లోని ఒక ప్రయివేట్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అయన కన్నుమూసారు. తమలో ఒకడిగా ఉంటూ సేవలందించిన తమ నాయకుడు కన్ను మూయడంతో ఆదివాసీలు తల్లడిల్లుతున్నారు. అందర్నీ చాలా ఆప్యాయంగా పలకరించి, చాలా నిరాడంబరంగా జీవించే ఆయనను చివరికి ఇలా కరోనా బలి తీసుకుంటుందని ఊహించలేదని వారంతా కన్నీరు మున్నీరవుతున్నారు. భద్రాచలం నియోజ‌క‌వ‌ర్గం నుంచి 1999, 2004, 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన రాజయ్య.. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రంపచోడవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎప్పుడూ ప్రజల నేతగా.. ప్రజలతోనే ఉంటూ వచ్చిన అయన ముఖ్యంగా ఆదివాసీల తరపున చాల పోరాటాలు చేశారు. ఎక్కడ గిరిజనులకు అన్యాయం జరుగుతున్నా రాజయ్య ముందు నిలిచి పోరాడారు. మరి కొద్ది సేపట్లో అయన స్వగ్రామం సున్నంవారిగూడెంలో రాజయ్య అంత్యక్రియలు జరగనున్నాయి.

జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు 48 గంటల డెడ్ లైన్

జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిపై మళ్లీ ఎన్నికలకు వెళదామని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తాజాగా అమరావతి విషయం పై స్పందిస్తూ సిఎం జగన్‌కు తాము 48 గంటల సమయం ఇస్తున్నామని.. అమరావతి అంశంపై అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు జరపాలని అయన డిమాండ్ చేశారు.  2014 లో అసెంబ్లీలోను.. అలాగే మొన్న 2019 ఎన్నికల ముందు అమరావతే రాజధాని అని మాట్లాడిన జగన్ తో సహా వైసీపీ నేతలకు ఇప్పుడేమైందని అయన ప్రశ్నించారు. రాజధాని అనేది తన ఒక్కడి సమస్య కాదని, ఇది 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం అని అయన స్పష్టం చేశారు.  " 2014 లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎంతో బాధపడ్డాం. దీంతో కాంగ్రెస్ పార్టీకి అపుడు ప్రజలు కూడా గట్టిగా బుద్ధి చెప్పారు. ఐతే ఇప్పుడు వైసీపీ కూడా అదే రీతిలో ఇష్టానుసారం వ్యవహరిస్తోంది. అసలు ఎన్నికలకు ముందు మీరేం చెప్పారు, ఎన్నికల తర్వాత మీరేం చేస్తున్నారు అని అయన వైసిపి నాయకులను నిలదీశారు. ఎన్నికల ముందు ప్రజలకు రాజధాని గురించి ఏమీ చెప్పకుండా మభ్యపెట్టి,. ఎన్నికల తర్వాత మూడు రాజధానులు చేస్తామంటూ వైసిపి నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని బాబు దుయ్యబట్టారు.  ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేసే అధికారం మీకు లేదని సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు తాము 48 గంటలు సమయం ఇస్తున్నామని ఒక వేళ మీ నిర్ణయానికి ప్రజల్లో మద్దతు ఉందని భావిస్తే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళదాం. మీరు గనుక గెలిస్తే అమరావతి అంశం పై ఇక మేం మాట్లాడం. అంతే కాకుండా ఈ అంశంలో మీరు ఏంచేసినా మేం నోరెత్తం. కానీ ప్రజలకు చెప్పకుండా ఇలా కీలకమైన రాజధానిపై నిర్ణయం తీసుకుంటే మాత్రం అది నమ్మించి మోసం చేసినట్టవుతుంది అని అయన స్పష్టం చేసారు .  మాట తప్పం మడమ తిప్పం అని చెప్పుకునే మీరు 2014 సెప్టెంబరు 4న ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఏం చెప్పారు? "అధ్యక్షా, విజయవాడలో రాజధాని ఏర్పాటు చేయడాన్ని మేం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కారణం ఏంటంటే, మన రాష్ట్రం 13 జిల్లాల చిన్నరాష్ట్రంగా మారింది. ఇంత చిన్న రాష్ట్రంలో ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి మధ్య చిచ్చుపెట్టడం ఇష్టంలేక, రాజధాని నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. రాజధాని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోండి కానీ కనీసం 30 వేల ఎకరాలైనా ఉండేట్టు చూడండి" అని మీరే కదా చెప్పింది.. మరి ఇప్పుడేమైనా మనది పెద్ద రాష్ట్రంగా మారిపోయిందా? ఈరోజు ఏమొచ్చిందని రాజధానిపై నిర్ణయం తీసుకున్నారు? మీ ఈ నిర్ణయం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం కాదా?" అంటూ చంద్రబాబు సీఎం జగన్ ను ప్రశ్నించారు.

రాణి రుద్రమ ఆదర్శంగా పోరాడండి.. అమరావతి మహిళలకు వైసిపి ఎంపీ పిలుపు

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి మహిళలు 200 రోజులకు పైగా దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వైసిపి ఎంపీ రఘురామకృష్ణం రాజు వీరిని ఉద్దేశించి మాట్లాడుతూ రాజధానిని కాపాడుకునే ఈ ఉద్యమంలో మహిళలే ముందుండి నడపాలన్నారు. రాజధాని ప్రాంత మహిళలు నాయకత్వానికి ప్రతీకలైన రాణిరుద్రమ, ఝాన్సీ లక్ష్మి బాయి వంటి వీరనారీమణుల స్ఫూర్తిగా పోరాటం చేయాలనీ ఆయన పిలుపునిచ్చారు. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో రాజధాని రైతులను దగా చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని అయన ఆరోపించారు.  సి ఆర్ డి ఎ ద్వారా రైతులకు వచ్చిన అధికారాలని కాలరాసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని..తాజాగా ప్రభుత్వం చేసిన కొత్త చట్ట సవరణ ద్వారా రైతులకు దక్కేది గుండుసున్నానే అని అయన ఆరోపించారు. పరిపాలన వికేంద్రీకరణ పేరుతొ మూడు రాజధానులు అనేది కేవలం కంటితుడుపు మాత్రమేనని కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని విభజన చట్టంలో కూడా స్పష్టంగా ఉందని అయన పేర్కొన్నారు. సెక్షన్ 94(3) ద్వారా ఒకే రాజధానిలో రాజ్ భవన్ ,హైకోర్టు, అసెంబ్లీ వంటి భవనాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసిందని అయన తెలిపారు. రైతులకు న్యాయం చేయాలి అంటే దాదాపు లక్ష కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది ఐతే దానికి బదులు కేవలం 4, 5 వేల కోట్లతో అమరావతి రాజధాని పూర్తిచేయవచ్చని అయన తెలిపారు.  ఇదే సమయంలో కృష్ణా గుంటూరు జిల్లాల టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని పవన్ కళ్యాణ్ చేసిన డిమాండ్ పై సంధిస్తూ.. రాజీనామా చేయడం కంటే రాజీలేని రాజకీయ పోరాటం చేయడం అవసరమని పవన్ కళ్యాణ్ గుర్తిం చాలని అయన అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన బీటెక్ రవి కి ఆ ఆలోచన మానుకొని ప్రత్యక్ష పోరాటానికి దిగాలని అని సూచించారు. అంతే కాకుండా సీఎం జగన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ "ముఖ్యమంత్రి గారూ ! సాక్షి ని కాకుండా మనస్సాక్షిని నమ్మండి…" ఈ విషయంలో రిఫరెండం పెట్టి ప్రజల ఆలోచన తెలుసుకోండి. మీరు ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య పెన్షన్ 250 రూపాయలు పెంచేందుకే మన దగ్గర డబ్బు లేనప్పుడు వేల కోట్లతో మూడు రాజధానుల నిర్మాణం ఎలా సాధ్యం అవుతుంది ? అని అయన జగన్ ను ప్రశ్నించారు.  కేవలం సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఓట్లు వస్తాయని భ్రమ పడి.. ప్రజాభీష్టాన్ని నిర్లక్ష్యం చేయవద్దని ఆయన హితవు పలికారు. విలువలకు కట్టుబడి నన్ను రాజీనామా చేయాలని కోరుతున్న వైసీపీ నేతలు అదే విలువల కోసం రాజీనామా చేయడానికి మీరు కూడా సిద్ధమా ? అని అయన ప్రశ్నించారు. పార్టీ ఎమ్మెల్యేలు అందరూ వారి వారి నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితి తెలుసుకుని ముఖ్యమంత్రికి వివరిస్తే ఆయన మనసు కరుగుతుంద ని తాను నమ్ముతున్నానని అయన అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కోసం ముందే మాట ఇచ్చినట్టుగా నాలుగు జోన్లు ఏర్పాటు చేయాలనీ అలా కాకుండా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే అభివృద్ధి ఎలా సాధ్యమని అయన ప్రశ్నించారు. 151 స్థానాలు గెలుచుకున్న మీరు రాజీనామా చేసి ప్రజల వద్దకు రిఫరెండం కోసం వెళ్తే 175 కు 175 మీరే గెలుచుకోవచ్చు అని ఐతే ఇది ప్రభుత్వానికి తాను ఇచ్చే సూచన మాత్రమేనని వైసిపి పార్టీకి కాదని అన్నారు ఇదే సమయంలో అమరావతి రైతులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఆదర్శంగా తీసుకొని పోరాడాలని అయన సూచించారు. తనకు సెక్యూరిటీ వచ్చిన తర్వాత అమరావతి వెళ్లి రైతుల వెనుక ఉండి పోరాటం చేస్తానని అయన తెలిపారు .

ముందు మీ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించండి పవన్.. ఎమ్మెల్సీ స్ట్రాంగ్ కౌంటర్

ఏపీలో మూడు రాజధానుల అంశం పై రచ్చ మాములుగా లేదు. ఈ విషయం పై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసిపి, టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే తాజాగా ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత బీటెక్ రవి స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కు అయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మొన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినఅయన ఈరోజు అమరావతికి చేరుకొని అక్కడ అదేక్ష చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడు రాజధానులను నిరసిస్తూ తాను ఇప్పటికే శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించానని అంతే కాకుండా ఛైర్మన్ ఫార్మాట్లో రాజీనామా చేస్తున్నానని అయన తెలిపారు. రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటున్నారని ఐతే ముందుగా జనసేన ఎమ్మెల్యేతో రాజీనామా చేయించాలని అయన అన్నారు. అంతే కాకుండా అమరావతి విషయంలో పవన్ స్టాండ్ ఏమిటో కూడా స్పష్టం చేయాలని అయన డిమాండ్ చేశారు.

టీడీపీ టార్గెట్‌గా వైసిపి బీజేపీ కలిసి భారీ స్కెచ్..

కొద్దిరోజుల క్రితం వరకు ఎపి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నాను తప్పించి సోము వీర్రాజును కొత్త అధ్యక్షుడిగా నియమించిన నాటి నుండి ఏపీలో పరిణామాలు వేగంగా మారిపోతూ వచ్చాయి. మరీ ముఖ్యంగా సేము వీర్రాజు నియామకం పై రాష్ట్ర బీజేపీ శ్రేణుల కంటే కూడా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఇక అప్పటి నుండి అనూహ్య పర్ణిమలు ఒక దాని తరువాత ఒకటి చోటు చేసుకుంటున్నాయి. ఒక పక్క వీర్రాజు గారు బీజేపీ అధికార పగ్గాలు చేపడుతూ ఉండగా మరో పక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మళ్ళీ బాధ్యతలు అప్పగించడానికి ససేమిరా అన్న జగన్ సర్కార్ హఠాత్తుగా ఆయనను తిరిగి ఎన్నికల కమీషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. దీంతో నిమ్మగడ్డ ఎస్ యి సి గా బాధ్యతలు స్వీకరించారు కూడా. దీంతో మీడియా మొత్తం ఈ రెండు ఘటనల ను కవర్ చేస్తూ బిజీగా ఉండగా మరో పక్క గవర్నర్ మూడు రాజధానులకు ఆమోదముద్ర వేశారు. ఈ పరిణామం తో వైసీపీ శ్రేణులు తమ పంతం నెగ్గించుకుని సంబరాలు చేసుకుంటుంటే మరో పక్క ఈ పరిణామాన్ని ఏమాత్రం ఊహించని టీడీపీ శ్రేణులు పూర్తిగా డీలా పడ్డాయి.  ఈ వరుస ఘటనలను, పరిస్థితులను నిశితంగా పరిశీలించిన విశ్లేషకులు మాత్రం గవర్నర్ మూడు రాజధానులకు ఆమోదముద్ర వేయడం పై ఏమాత్రం ఆశర్య పోవాల్సిన అవసరం లేదంటున్నారు. అంతే కాకుండా ప్రస్తుతం ఎపిలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి సీఎం జగన్ మోహన్ రెడ్డికి కేంద్రం నుంచి స్పష్టమైన హామీ ఉందని వారు విశ్లేషిస్తున్నారు. ఈ మూడు రాజధానుల అంశం గురించి కేంద్రానికి ముందుగానే తెలుసునని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే బీజేపీతో పొత్తుకు ముందు అమరావతి విషయంలో అయన తీవ్ర స్థాయిలో జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. బీజేపీ తో పొత్తు పెట్టుకున్న తరువాత కూడా రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతుల పోరాటంలో తోడుగా ఉంటానని పవన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా అమరావతి ని తరలించకుండా చూడాలని షరతుతోనే బీజేపీతో పొత్తు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఐతే ప్రస్తుతం కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేల రాజీనామా కోరడం కొందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది ఐతే ఇది కూడా కేంద్రం పొలిటికల్ జిమ్మిక్ లో భాగమేనని విశ్లేషకుల వాదన.  ఇది ఇలా ఉండగా హై కోర్టును తరలించడం అంత తేలికైన విషయం కాదు. దీనికి అటు కేంద్ర ప్రభుత్వం లోని నిమిద శాకాహాలతో పాటు.. సుప్రీమ్ కోర్టు అనుమతి కూడా అవసరమే. దీంతో ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం అనుమతి లేకుండా సీఎం జగన్ అంత ధైర్యంగా అడుగులు వేసే అవకాశం అసలు లేదని విశ్లేషకుల అంచనా. దీనికి తోడు తాము ఏ పని చేసినా కేంద్ర పెద్దలకు చెప్పే చేస్తున్నామని స్వయంగా వైసిపిలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయి రెడ్డి చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. ఈ దెబ్బతో రాష్ట్రంలో టీడీపీని నామరూపాలు లేకుండా చేయడమే వైసిపి, బీజేపీ లక్ష్యమని.. ఐతే తెలిసి కానీ తెలియక కానీ పవన్ కూడా ఇందులో భాగస్వామి అయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు.

మూడు రాజధానుల వ్యవహారంలో కొత్త ట్విస్ట్.. హైకోర్టులో పిటిషన్

ఏపీలో మూడు రాజధానుల బిల్లు గవర్నర్ ఆమోదం పొందడంతో తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా సీఆర్డీఏ రద్దు, రాజధాని వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడంతో పాటు ప్రభుత్వం ఈ విషయంలో గెజిట్‌ను జారీ చేసింది. దీంతో రాజధాని రైతు పరిరక్షణ సమితి దీన్ని తీవ్రంగా తప్పుబట్టుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు రాజధాని రైతు పరిరక్షణ సమితి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజ్ భవన్, సీఎం కార్యాలయం, సచివాలయాలను అమరావతి నుంచి తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఐతే ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ జరపనుంది.  మరో పక్క ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులకు జులై 31న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేయడంతో ఇకపై విశాఖపట్నం అధికారికంగా పరిపాలనా రాజధాని కానుంది. కర్నూలుకు హైకోర్టు తరలివెళ్లనుంది. దీంతో అమరావతి కేవలం శాసన రాజధాని గా మిగలనుంది. దీంతో ఆగస్టు 15 వరకు అన్ని కార్యాలయాలను విశాఖకు తరలించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అంతే కాకుండా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా విశాఖలో జరిపే అవకాశముందని సమాచారం. దీంతో ఇటు ప్రతిపక్షాలు అటు రాజధాని రైతు పరిరక్షణ సమితి ఓ వైపు నిరసనలు వ్యక్తం చూస్తూనే.. మరోవైపు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఐతే ప్రభుత్వం మాత్రం అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేస్తోంది.

విశాఖ పై పవన్ కళ్యాణ్‌కు కసి అందుకే.. రోజా సెన్సేషనల్ కామెంట్స్

మూడు రాజధానుల బిల్లు ఆమోదానికి వ్యతిరేకంగా కృష్ణా, గుంటూరు జిల్లాల వైసిపి, టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా న్యాయ నిపుణుల సలహాతో దీని పై పోరాటం చేస్తానని అయన ప్రకటించారు. తాజాగా పవన్ వ్యాఖ్యల పై స్పందించిన వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 2019 లో జరిగిన ఎన్నికలలో పవన్ కల్యాణ్ ను గాజువాక ప్రజలు చిత్తుగా ఓడించారని, అందుకే విశాఖపై పవన్ కల్యాణ్ అంట కసి పెంచుకున్నారా అని ఆమె అన్నారు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నా రోజా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. ఇదే సందర్భంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేవలం తన ఆస్తుల విలువ పెంచుకునేందుకే మూడు రాజధానులకు వైతిరేకంగా పని చేస్తున్నారని ఆమె విమర్శించారు. ప్రస్తుతం చంద్రబాబు మాయమాటల నమ్మే పరిస్థితిలో ఎపి ప్రజలు లేరని ఆమె అన్నారు. రక్షాబంధన్ సందర్భంగా జగనన్న ఉన్నాడనే భరోసాతో మహిళలు భద్రతగా, గౌరవంగా బయటకు వస్తున్నారని ఈ భరోసా ఇలాగే మరో 30, 40 ఏళ్లు ఉండాలని కోరుకుంటున్నానని రోజా అన్నారు. ఇదే సందర్భంగా "మా అన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాఖీ శుభాకాంక్షలు తెలుపుతున్నాని అన్నారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా రాష్ట్రంలోని మహిళలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం శుభపరిణామం" అని రోజా అన్నారు.

కరోనా కోరల్లో బాల్యం చిక్కకుండా

శతాబ్దాల తరబడి భారతదేశంలో పురుడుపోసుకున్న బాలకార్మిక వ్యవస్థ ఆంగ్లేయుల కాలంలో విజృంభించింది. ఆ తర్వాత దేశానికి స్వాతంత్య్రం రాగానే అనేక చట్టాలు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు రూపొందించారు. రాజ్యాంగ పరంగా నిర్భంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టారు. అయితే చట్టాలను చేసిన పాలకవర్గం వాటిని అమలు చేయడంలో శ్రద్ధ చూపించలేదు. ఫలితంగా  బాలల బంగారు భవిష్యత్ సమయం చిక్కినప్పుడల్లా ఫ్యాక్టరీల ఇసుప చక్రాల మధ్య, వస్తువుల తయారీ పరిశ్రమల్లో యంత్రాల మధ్య నలిగిపోతున్నే ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా బాల్యాన్ని కాలనాగులా కాసేందుకు కాపు కాస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నో స్వచ్చంధ సంస్థలు పోలీసు వ్యవస్థ బాలకార్మిక వ్యవస్థ బలోపేతంగా కాకుండా విసృత్తమైన చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా లాక్ డౌన్ తో దేశం లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితి బాలకార్మిక వ్యవస్థ ను బలోపేతచేస్తుంది. లాక్ డౌన్ అనంతరం ఆర్థికంగా నిలదొక్కునే ప్రయత్నంలో చాలా కుటుంబాల్లో  బాలలు పలకా పట్టాల్సిన చేతులతో పనిముట్లు పడుతున్నారు. ప్రమాదకరమైన పరిశ్రమల్లోనూ చేరుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్ది బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని అనేక స్వచ్చంధ సంస్థలు కోరుతున్నాయి. కరోనా నేపథ్యంలో పెరగనున్న బాలకార్మిక వ్యవస్థపై కైలాష్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ దేశవ్యా ప్తంగా సర్వే నిర్వహించింది.  దేశవ్యాప్తంగా బాల కార్మికవ్యవస్థ, మాన వ అక్రమరవాణ, కార్మిక చట్టాల ఉల్లంఘన అంశాలపై 50మందికి పెగా ఎన్‌జిఒలు, వందలాది మంది ప్రతిస్పం దనను ఆధారంగా చేసుకుని ఈ సర్వే నివేదికను సత్యార్థి ఫౌండేషన్ రూపొందించింది. సర్వేలో 89 శాతం ఎక్జిఒ లు, ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.  ఈ నివేదికలోని వివరాల్లోకి వెళ్లితే .. లాక్ డౌన్ ఎత్తి వేసిన అనంత రం బాలకార్మిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు పిల్లల అక్రమరవాణా పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమైంది.  లైంగిక దోపిడి కోసం పిల్లల అక్ర మరవాణా పెరిగే ప్రమాదం ఉందని ఈ సంస్థ పేర్కొంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే తీరుగా లే దు.  ఆయా రాష్ట్రాల పరిస్థితులు, మౌలికసదుపాయాలు, ప్రభుత్వ అవగాహన కార్యక్రమాలను బట్టి కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ సమస్య ఉంది. కరోనా కారణంగా ఆయా రాష్ట్రాల్లో బాలల అక్రమ రవాణా పెరిగే అవకాశాలున్నాయి. కార్మిక చట్టాలు దుర్వినియోగం అయ్యే ప్రమా దం కూడా ఉందని ఈ నివేదికలో ఆందోళన వ్యక్తం చేశా రు.  ఈ పరిస్థితి అరికట్టాలంటే  గ్రామస్థాయిలో ఎక్కుగా నిఘావ్యవస్థ పెంచాలని, చట్టా న్ని అమలు చేసే సంస్థలు అప్రమత్తంగా ఉండాలని సామాజిక కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు.  లాక్ డౌన్ అనంతరం బాల్యవివాహాలు కూడా పెరిగే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.  పరిస్థితులను చక్కదిద్ది బాల్యాన్ని పరిశ్రమల్లో బందీ కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే అన్నారు.  గ్రామస్థాయిలో నిఘావ్యవస్థ  రూపొందించి చట్టాలను బలోపేతం చేయా ల్సిన అవసరం ఉందని కైలాష్ సత్యార్థి చిల్డ్రన్ ఫౌండేషన్ అభిప్రాయ పడింది. గ్రామస్థాయిలో గ్రామ పంచాయి తీలు పిల్లలను పనుల్లోకి వెళ్లకుండా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అలాగే మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు తమవంతు కృషి చేస్తూ బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు కృషి చేయాలన్నారు.  వ్యాపార కార్యకలాపాలు, వస్తువుల తయారీ కంపెనీల్లో బాలకార్మికులు పనులు చేయకుండా చూడాల్సిన బాధ్య తస్థానిక అధికారులతో పాటు పౌరులపై కూడా ఉంది.  స్వచ్ఛంద సంస్థల కృషితో రక్షిం చబడిన పిల్లలను వారి వయోపరిమితుల ఆధారంగా విద్యారంగం వైపు మళ్లించాలనీ, రక్షించబడిన పిల్లల కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం అందించాలన్నారు. గ్రామాల్లో అక్రమ రవాణా నియంత్రించడానికి పాఠశాలలు, సంఘాలు, స్థానిక పరిపాలన సంస్థలు కలిసి కట్టుగా కృషి చేయాలి.  అవగాహన కార్యక్రమాలను, ప్రచారాలను నిర్వహించి అక్రమరవాణాను అరికట్టాలని ఫౌండేషన్ అభిప్రాయపడింది.  ప్రధానంగా అక్రమరవా ణాకు సంబంధించి ఝార్ఖండ్, బీహార్, వెస్ట్బంగాల్, అస్సాం తదితర ప్రాంతాలను ఫౌండేషన్ తన నివేదికలో విశ్లేషించింది. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రధానం గా అక్రమ తరలింపు అంశంలో రైల్వే సహకారం అనివా ర్యంగా గుర్తించాలి. గ్రామీణ ప్రాంతాల నుంచి అధికంగా అక్రమంగా బాలల రవాణా జరిగే ప్రమాదం ఉందని పేర్కొంది.  బాలకార్మిక వ్యవస్థను అడ్డుకోవడానికి ప్రజల్లో అవగాహన కల్పించేలా అనేక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.  ఆపరేషన్ ముస్కాన్.. బడిలో పాఠాలు చదువుకోవల్సిన బాల్యం యంత్రాల రణగొణధ్వునుల మధ్య జీవిత పాఠాలు నేర్చుకోవలిరావడం బాధాకరం. అయితే బాలకార్మికులను గుర్తించి వారి ఇండ్లకు చేర్చడం, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం కోసం ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని తెలంగాణ పోలీసులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫ్యాక్టరీల పై దాడులు నిర్వహించి బాలకార్మికులను పని బాట నుంచి తప్పిస్తున్నారు. మానవ అక్రమ రవాణాపై, బాలకార్మికులపై సమాచారం ఉంటే తక్షణం పోలీసులకు తెలియచేయాలని అధికారులు ప్రజలను కోరారు.

ఆగని శానిటైజర్ మరణాలు.. తాజాగా వైఎస్సాఆర్ కడప జిల్లాలో...

ఏపీలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్నసంగతి తెలిసిందే. తాజాగా నిన్న ఒక్క రోజు 67 మంది కరోనా బారిన పది మృత్యు వాత పడ్డారు. తాజాగా దీనికి తోడు మధ్యమ దొరకక మత్తు కోసం శానిటైజర్ తాగిన వారి మరణాలు కలకం రేపుతున్నాయి. మొన్న ప్రకాశం జిల్లా కురిచేడులో జరిగిన ఘటనను మరవక ముందే కడపలో మరో ఘోరం చోటు చేసుంకుంది. వైఎస్సాఆర్ కడప జిల్లాలో పెండ్లిమర్రిలో శానిటైజర్ తాగి ముగ్గురు మరణించారు. వారిని ఓబులేశు, భీమయ్య, చెన్నకేశవులుగా గుర్తించారు. ఐతే వీరు శానిటైజర్ తాగిన విషయాన్ని కుటుంబ సభ్యులు దాచి పెట్టడమే కాకుండా చివరకు వారు మరణించిన విషయాన్ని కూడా బయట పెట్టలేదు. దీంతో గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు కూడా చేశారు. కురిచేడు ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో పోలీసుల కేసులకు భయపడి వారు ఈ విషయం బయటకు రానీయలేదని తెలుస్తోంది. ఐతే వారు అనారోగ్యంతో చనిపోయారని చెప్పి రహస్యంగా అంత్యక్రియలు చేసినప్పటికీ ఆ నోటా ఈ నోటా పడి విషయం పోలీసుల వరకు వెళ్లింది. తాజగా ఇదే గ్రామంలో మరో 10 మంది శానిటైజర్ తాగినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ ఘటనపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అంటే కాకుండా పోలీసులు గ్రామానికి వెల్లి పూర్తీ వివరాలు సేకరిస్తున్నారు. శానిటైజర్ తాగిన వారు తమంతట తాము బయటకు వస్తే వారికీ మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని పోలీసులు చెప్పారు. ఇప్పటికే ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్లు తాగడంతో 15 మంది మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా రెక్కాడితే కానీ డొక్కాడని పేద కూలీలే కావడం మరో విషాదం.